Previous Page Next Page 
మారిన విలువలు పేజి 38

 

    "అప్పన్న అల్లుడు తన భూమిని అమ్మిన సొమ్ము వ్యాపారం లో పెట్టాలని చూస్తున్నాడు. నేను ఇక్కడి కొట్టు అయివేజుగా పెట్టి కొంత సొమ్ము అప్పు తీసుకొన్నాను. ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తాం. అక్కడ మాణిక్యం మొగుడు ఉంటాడు. ఇక్కడ అప్పన్న ఉంటాడు. నేను ఇటూ అటూ తిరుగుతుంటాను" అన్నాడు.
    ఈ మధ్యనే తన చేతి కింద ఇంకో కుర్రాడికి తర్ఫీదు ఇస్తున్నానని చెప్పేడు. ధైర్యంగా జీవితంలోకి చొచ్చుకు పోతున్న తమ్ముడు, అభివృద్ధి లోకి వస్తున్నాడని జానకి సంతోషించింది.
    అంతలోనే ఈ రూపుతో ప్రకాశం తెల్లవారకుండా రావడం చూసి హడలిపోయింది. అప్పుచేసిన సొమ్ము దొంగలేత్తుకు పోయారా? అప్పన్న అల్లుడు కానీ మోసం చేశాడా? ఆరోగ్యం తిన్నగా లేదా? లేక ఏ కారణం చేతనైనా , పుస్తకాల వ్యాపారం మూసి వెయవలసి వచ్చిందా? ప్రకాశం ఈ రూపులో రావడానికేమిటి కారణం? ఈ సమయంలో ఎందుకిలా వచ్చేడు? ప్రకాశాన్ని చూసిన క్షణంలో జానకి మనసులో మసలిన భావాలు ఇవన్నీ.
    "ఏరా, ప్రకాశం! ఏమిటిలా వచ్చేవు? ఏం జరిగింది?" అన్నది అత్రతగా.
    "అన్నయ్యా వాళ్ళూ ఊరువదిలి ఎప్పుడు వెళ్ళి పోయేరు?" అన్నాడు ప్రకాశం ఆమె ఆత్రత గమనించకుండా.
    "ఎవరు? అన్నయ్య వాళ్ళూనా? అంటే అమ్మ , వదిన.... అంతా.... ఎక్కడికి వెళ్ళి పోయేరు?" ఎదురు ప్రశ్న వేసింది జానకి.
    "నాకు తెలియకనేగా నిన్ను అడుగుతున్నది? వాల్తేరులో బుక్ స్టాల్ తెరవబోతున్నాం అని ఆ మధ్య నీతో చెప్పెను కదూ? ఆ పని మీద పది రోజులై నేను అక్కడే ఉన్నాను. ఈ ఉదయం బండిలో వచ్చెను. దారిలోనే కదా, ఓసారి వదిన్ని పలకరించి పోదామని అటు వెళ్ళెను. ఇంటికి తాళం పెట్టి ఉంది. ఏదైనా ఊరికి కాని వెళ్ళేరా అనుకొన్నాను. ఎదురింటి వారి నడిగితే, "నీకు తెలియదా, ప్రకాశం? మీ అన్నయ్య కి నరసన్న పేట బదిలీ అయిపొయింది. మీవాళ్ళంతా నాలుగు రోజుల క్రితమే వెళ్ళిపోయేరు'-- అన్నారు. నీక్కాని తెలుసేమో కనుక్కుందామని ఇటు వచ్చెను" అన్నాడు ప్రకాశం.
    "ఇప్పుడు నువ్వు చెప్పేవరకు నాకూ తెలియదురా" అన్నది జానకి.
    ఆమెకు ప్రకాశం ద్వారానే ఆ కబురు తెలిసింది. మాటమాత్రం చెప్పకుండా అన్నయ్య ఊరు విడిచి పోవడం అన్యాయమనిపించింది ఆమెకు. ప్రకాశం దగ్గర అడ్రసు తీసుకొని అన్నకు ఉత్తరం వ్రాసింది. వారం రోజులకు సూర్యారావు దగ్గిరి నుండి జవాబు వచ్చింది.
    "మీ మీద నాకు కోపం లేదు . జానకీ!మీ అంతటి వారు మీరయేరు. ఇంక నా అవసరం మీకు లేదు. ఇంకా మిమ్మల్ని పట్టుకొని వెళ్ళాడడంలో అర్ధం లేదు. అభ్యుదయభావాలతో కొత్త దారుల వెంట ముందు ముందుకు తోసుకు పోవాలని పరుగులు తీస్తున్నారు మీరు.
    "పుట్టి పెరిగిన సంఘాన్ని, రక్తంలో జీర్ణించిన అలవాట్లను తోసి రాజగలిగిగే సమర్ధత నాలో లేక, వాటి మధ్యనే నా జీవితం ఒడుదుడుగులు లేక సాగి పోగలదనే నమ్మకంతో నేనీ చోటును వదలలేని వ్యామోహం పెంచుకోన్నాను.
    "మన మధ్య ఈదూరం రోజురోజుకూ పెరుగుతుందే కాని, తరిగే మార్గం లేదు. మానసికంగా ఏర్పడిన ఈ దూరాన్ని అంగీకరించాలంటే బౌతికంగా కూడా కాస్త దూరంగా ఉండడం మంచిదనిపించి ఇక్కడికి వచ్చేసెను. అంతకన్నా ఏం లేదు" అని వ్రాసేడు.
    అటు తరువాత జానకి ఒకటి , రెండు ఉత్తరాలు అన్నకు వ్రాసినా అతని నుంచి జవాబు లేదు. తనకు వ్రాయవలసింది ఇంకేం మిగిలి లేదని అన్న అభిప్రాయం గా భావించింది జానకి.
    అప్పుడప్పుడు ప్రకాశానికి ఉత్తరాలు వస్తుండేవి. ఆ వార్తలు జానకికి చేరవేసేవాడు ప్రకాశం.
    "వదినకి ఒంట్లో సరిగా లేదుట. అమ్మకి వాతం నొప్పులు. మంచం మీంచి లేవకుండా ఉందిట."
    "అన్నయ్య పనికి మెచ్చి అక్కడ ఆఫీసులో రెండు ఇంక్రిమెంట్లు ఇచ్చేరుట. వదిన మళ్ళా నెల తప్పిందట.'
    "ఇంట్లో దొంగలు పడి చిన్నా పెద్దా నూరు రూపాయల సొమ్ము తీసుకు పోయేరుట."
    "పాపకి వారం రోజులై పక్కలు వెచ్చగా ఉంటున్నాయి అని రాసేడు అన్నయ్య. మందు వాడుతున్నరుట."
    ఇలా ప్రతిసారి ఏదో ఒక సంగతి మోసుకు వచ్చేవాడు ప్రకాశం.
    విని బాధపడడం , వీలైనప్పుడు ప్రకాశం ద్వారా ఏ పదో, పాతికో పంపడం మినహా జానకి చెయ్యగలిగింది ఏమీ లేకపోయింది. ఆ సహాయం కూడా అట్టే సార్లు సాధ్యపడలేదు. ఒక్కొక్కసారి శాంత కాలేకీ ఫీజుకు ప్రకాశాన్నే అడగవలసి వచ్చేది.
    "ఇందులో బిడియపడిందికి ఏం లేదు, అక్కా! శాంతకి నీవెంతో , నేనూ అంతే. నేనూ ఇల్లూ, వాకిలీ లేని మగాడిని కాబట్టి, నా దగ్గర ఉంచుకోలేక పోయాను. నీకు అవకాశం ఉంది, దగ్గర ఉంచుకొన్నావు. డబ్బు విషయంలో ఇద్దరికీ సమమైన బాధ్యతే ఉంది" అనేవాడు.
    కాలం గడుస్తున్నా శాంత పట్ల విశ్వాసం పెంచుకోలేకపోయింది జానకి. చదువు తన జీవితానికి ఎంత అవసరమో శాంత గ్రహించినట్లు లేదు. పుస్తకాలు ముందర వేసుకు కూర్చుని కలలో తేలిపోతుండేది.
    "కలలకి జీవితాన్ని ముందుకి నడపగలిగే శక్తి లేదమ్మా, శాంతా! బతుకులో నమ్మకంగా అడుగు ముందుకు పడాలంటే, పాదాలకి గట్టి నేల తగలాలి. గాలిలో ఏర్పరచుకొన్న బాట తేలిపోతుంది. పునాది లేని మార్గం కూలిపోతుంది. నీ జీవన గతికి పునాది ఈ చదువు . దాని పై నువ్వు చూపే శ్రద్ధ నీకు ముందు దారి చూపే దీపం. ఆ దీపం పట్టుకు నడిచి గమ్యం చేరుకో. చీకటిలో కళ్ళు పొడుచుకుంటూ , ముందుకు పోకు. ఏ కొండైనా అడ్డం రావచ్చు. ఏ అగాధం లో కైనా జారిపడగలవు" అని బోధపరిచేది జానకి.
    ఆమె చేబుతున్నంతసేపు అతి శ్రద్దగా వినేది శాంత.
    'అక్కకి, చిన్న పిల్లలకి బోధపరచడం బాగా అలవాటై పోయింది. నన్ను ఓ పాపగానే భావించి మాట్లాడుతుంది. ఆపాటి నాకు తెలియదూ? నా చదువు నేను చూసుకోలేనూ?" అనుకొనేది.

                         *    *    *    *
    శాంత చదువు తనకొక సమస్యగా నిలుస్తుందని జానకి ఎప్పుడూ భావించలేదు. శాంతకు తగినంత తెలివి తేటలు ఉన్నాయనీ, అవి రాణించేందుకు అవకాశం కల్పిస్తే జీవితంలో ముందుకు పోగలదనీ అభిప్రాయపడింది. ఇప్పటికీ ఆమెకు చెల్లెలి తెలివి తేటల పట్ల నమ్మకం తరగలేదు. దానికి శ్రద్ధ జత కాలేదనే ఆమె బాధ.
    శాంత పరీక్ష పాసైతే అటు తరవాత ఏం చెయ్యాలి? అదృష్టం బాగులేక పరీక్ష పొతే ఏం చేయ్యాలి? రాత్రి, పగలు జానకిని దిగదీస్తున్న సమస్యలివి.
    "నువ్వింత ఆత్రత పడిందికి ఇందులో ఏమీ లేదు , జానకీ! శాంత పరీక్ష తప్పక పాసవుతుంది. బియస్సీ పాసైన పిల్లకి ఉద్యోగం దొరక్క పోదు. ఆ విషయం నేను చూస్తాను. నువ్వు మరేం కంగారు పడకు" అనేది అనసూయమ్మ.
    శాంత పరీక్ష పొతే తిరిగి సంవత్సరం పాటు చదివించగలిగే పరిస్థితులు కనిపించలేదు జానకికి. గోవిందబాబు వెళ్ళిపోయిన దగ్గరి నుంచి బాలవిహార్ కార్యక్రమం అస్తవ్యస్తంగా ఉంటున్నది. అతని స్థానంలో వచ్చిన వ్యక్తీ అహంభావి. అదుపులో పెట్టుకోలేని ఆవేశం కలవాడు.
    "అయన కొత్తగా వచ్చేడు. ఆయనకి తెలియని విషయాల్లో నువ్వు సహాయపడుతుండు" అనేది అనసూయమ్మ.
    జానకి ఏ మాట చెప్పబోయినా పురుగును విదిలించి నట్లు తొలగ దోసేవాడు అతడు.
    "ఈ ఆఫీసులో చిన్న, పెద్ద విలువలు లేనట్లు ఉన్నాయి. ఎవరి స్తానాల్లో వారు ఉండి పనులు చేసుకోవడం అలవాటు లేదు లాగుంది. అన్నిటికి తగుదునమ్మా అని అందరూ బయలుదేరుతారు" అనేవాడు.
    రోజుకు పాతిక సార్లన్నా, జానకి తన చేతి కింద పని చేస్తున్న సెక్రటరీ అనీ, తన ఆజ్ఞను పాలించడం ఒక్కటే ఆమె పని అనీ, అంతకు మించి బాలవిహార్ వ్యవహారాల్లో వేలుపెడితే తను సహించేది లేదనీ-- ఆమెకు జ్ఞాపకం చేస్తుండేవాడు.
    చిన్న చిన్న విషయాలకు అనసూయమ్మ వరకు వెళ్ళనవసరం లేకుండా , తనంతట తనే నిర్ణయాలు తీసుకొని ఆచరణ లో పెట్టడం జానకి అలవాటు. గోవిందబాబు వచ్చిన తరవాత కూడా అ అలవాటుకు ఆటంకం కలగలేదు


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS