Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 38


    "వేషంచూస్తే రాజకుమారుడిలా వున్నావు. యే వూరు మనది" అని అడిగిందామె నడుమున చేయిపెట్టుకుని.
    సమాధానంగా తను నవ్వాడు.
    "నవ్వులపాలెంనించి వచ్చావా నాయనా? మనదే వూరంటే నవ్వుతావెందుకూ? వూఁ వూఁ చెప్పు" అంటూ మీదికి వచ్చిందామె.
    "నన్నెందుకు పిల్చారు?" అంటూ అడిగాడు తను.
    "ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు" ఆమె గదుముతోంది.
    "ఎందుకు చెప్పాలి?" తను యెదురుప్రశ్న  వేశాడు.
    "ఈ రాజ్యం మాది కాబట్టి నువ్వు మా రాజ్యంలోంచి పోతున్నావు కాబట్టి" అందామె.
    "మీరు రాచకన్యలన్నమాట."
    "అవును" అందామె ఠీవి వొలకపోస్తూ.
    "పరాయి మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త నమ్రతగా, వినయ విధేయతలతో మాట్లాడాలని తెలియదా మీకు అలా మీది మీదికి వస్తావెందుకూ?"
    "వినయ విధేయతలు వుండవలసింది మావంటి రాచకన్యలకు కాదు. నీలాంటి సామాన్య పౌరుడికి. తెలుసుకో" ఆమె దబాయిస్తోంది.
    "అసలు మీరు రాచకన్యలంటే నాకు నమ్మబుద్ధి కావటంలేదు" అన్నాడు తను.
    "నీకెట్లా తెలుస్తుంది? యెన్నడయినా రాచవాళ్ళని చూచిన ముఖాల కయితే తెలుస్తుంది" అని యెగతాళి పట్టించిందా అమ్మాయి.
    ఆ మాట వింటూనే బొబ్బిలిపంజా కత్తిమీదికి పోయింది. రెండో అమ్మాయి అది గ్రహించింది కాబోలు ముందుకి వచ్చింది.
    "క్షమించండి యిది వుత్తి గడుగ్గాయి. అలాగే మాటలు దొర్లిస్తుంది. మీరు యేమీ అనుకోకండి మీరు పరాయిదేశం నించి వచ్చి మా రాజ్యంలో కాలుపెట్టారు కాబట్టి మా అతిధులే అనుకుంటాము. ఆ కన్పించే వూరే కశింకోట. మా తండ్రి రామరాయుడువారు కశింకోట ప్రభువు. ఆ దూకుడుగా మాట్లాడుతున్న పిల్ల నా చెల్లెలు జగ్గమాంబ నా పేరు మల్లమ్మ" అంటూ యెంతో ఒద్దికగా చెప్పింది మల్లమ్మ.
    అందాకా యీ పీడా వదిలించుకుని త్వరగా వెళ్ళిపోవాలని అనుకుంటున్న తనకి యింక అక్కడనించి కదలబుద్ధి కాలేదు.
    సూర్యకిరణం తునిగి భూమిమీద నిలబడినట్లుగా వుంది మల్లమ్మ. ఆమె అందం అతనిని ఆకర్షించింది. ఆమె మాటలు తనకు నచ్చాయి.
    "చీకటి పడుతూవుంటే యింకా యింతదూరం వచ్చారెందుకూ?" అని అడిగాడతను ఆమె ముఖంలోకి చూస్తూ.
    "రోజూ గుర్రపుస్వారీ చెయ్యటం మాకు అలవాటు" అందామె చూపులు దించుకుని.
    "కత్తిపట్టటంకూడా వచ్చు. చూస్తావా ఒక చూపు" అని రెచ్చకొట్టింది జగ్గమ్మ.
    మళ్ళీ బెబ్బులి పంజా కత్తిమీదికి పోయింది.
    "ఊరుకో చెల్లీ, పరాయివాళ్ళతో పరాచికం యెందుకూ? వారు యెంత తొందరపనిమీద పోతున్నారో పోనివ్వు" అంది మల్లమ్మ.
    "మా అక్క చెప్పింది కాబట్టి నాతో యుద్ధంచేసే అదృష్టం నీకు దక్కకుండా పోయింది యింతకీ నీ ప్రాణాలు గట్టివిలే! వెళ్ళు నాయనా" అంది జగ్గమ్మ తన సహజమయిన ధోరణిలో.
    మరొక సందర్భంలో అయితే అలా మాట్లాడినవాళ్ళు పులిపంజాలో పడే పిండి అయేవాళ్ళు. కాని మల్లమ్మ ముఖంచూస్తూ అలా చెయ్యాలని అనిపించలేదు.
    వెంటనే గుర్రం యెక్కి తన దారిన తాను వచ్చేశాడు. "నేను బొబ్బిలినించి వచ్చాను" అని చెప్తే జగ్గమ్మ అలా మాట్లాడచు కాని అట్లా మాట్లాడటమే ఆ పిల్లకు అలంకారం అనిపించింది.
    "మీరు పరాయిదేశంనించి వచ్చి మా రాజ్యంలో కాలుపెట్టారు కాబట్టి మా అతిధులే! అనుకుంటాము" అంటున్న మల్లమ్మ రూపమే తనను అప్పటినించి యిప్పటివరకూ తనను కవ్విస్తోంది.
    అవును తను ఆమెకు అతిథి. ఆమె ఆతిధ్యం ఆ క్షణానికి కాని, ఆ సంఘటనకి కాని పరిమితమైపోయేది కాదు.
    ఒక జీవితకాలం ఆమె అతిధి కావాలని అనిపించింది. ఆమెను తన అతిధిగా జీవితంలోకి ఆహ్వానించాలని అనిపించింది.
    తన ప్రయత్నాలు ఫలించినాయి. లగ్ననిశ్చయం చేసుకుందుకు మామయ్యలిద్దరూ వెళ్ళారు. మహామంత్రి యినుగంటి నరసారాయుడు తన మంత్రిగా కాక మామయ్యగా కశింకోట వెళ్ళాడు. అవుసరమయితే ఆయన అక్కడ మంత్రిగా తన తెలివితేటల్ని. అద్బుతమయిన ప్రజ్ఞనీ చూపుతాడు. ఆయన వెళ్ళటం అంటూ జరిగితే ఆ పని ఫలప్రదం కాక పోవడమంటూ వుండదు. లగ్ననిశ్చయం చేసుకుని ఆయన తిరిగివస్తూ వుండాలి, అని ఆలోచిస్తున్నాడు గోపాలకృష్ణ రంగారావు.
    ఆయన ఆలోచనలు మరికొంతసేపు అలాగే సాగినాయి. అలికిడి అయితే తలయెత్తి చూచాడు తను. మామలిద్దరూ నవ్వుముఖాలతో యెదురుగా నిలబడి వున్నారు. చివాలున లేచి నిలబడ్డాడు రంగారావు.
    సమయం చూచుకుని పావురం స్వేచ్చాలోకానికి యెగిరిపోయింది.
    "మామయ్యగారూ వెళ్ళినపని యేమయింది?" అని అడిగాడు. సమాధానంగా ధర్మరాయుడు తలపాగలో దాచిన తాటిఆకు తీసి  అందించాడు. అది చదువుతూ గోపాలకృష్ణ రంగారావు పులకించిపోయినాడు.
    "కల్యాణమస్తు" అని ఆశీర్వదించారు యిద్దరూ.
    "రంగారావుగారూ! మీరు నాకన్నా చిన్నవారు. అయినా నామీద కన్న మీమీద యెక్కువ బాధ్యతలున్నాయి. బొబ్బిలిరాజ్యాన్ని పరాసువాళ్ళ ఆకలిచూపునించి, విజయరామరాజు అసూయాగ్రస్తమైన చూపునించీ రక్షించవలసిన బాధ్యత నీమీద వుంది. బొబ్బిలిరక్తం నేలపాలు కాకుండా యీ బాధ్యతని నిర్వహించుకోవాలి. అందుకు మల్లమ్మతోడు యెంతయినా అవుసరం. బొబ్బిలికి కానున్న రాణి మల్లమ్మను చూచి నేను యెంత పొంగిపోయాననుకున్నావు. ఆమె మహాదేవిగా యీ నేలమీద కాలుపెట్టటం మనం చేసుకున్న పుణ్యమే!" అంటూ తన అభిప్రాయాన్ని అందించాడు సరసరాయుడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS