ఇవన్నీ అమలులోనికి రావడం పదేళ్ళయిన వెనుక.అందాకా నా మేనమామను, నా స్నేహితుడైన డాక్టరు సుబ్బారావుగారిని, తెనాలిలో పెద్ద వకీలైన వెంకట్రామయ్యగారిని ట్రస్టీలు చేసి ఆస్థి పెంచవలసిందని ఆ దస్తావేజులో వ్రాసి, ఎవరకీ తెలియకుండా రిజిష్టరుచేసి, మిగిలిన తొమ్మిదివేల ఆరువందల రూపాయలు చేతితో పట్టుకొని కాశీ మా అమ్మతో వెళ్ళిపోయాను.
మా అమ్మగారికి పుట్టింటివారూ, మా అమ్మమ్మ ఇచ్చిన ఆస్తి పన్నెండెకరాల సుక్షేత్రమైన మాగాణి ఉంది. ఆ రోజులలో సాలుకు పది పన్నెండు వందల ఆదాయం వచ్చేది.
కాశీ వెళ్ళాము. మా అమ్మ ఏమీ అనలేదు. నే నేది చెబితే అదే నన్నది. కాశీలో ఊరుచివర ఒక చిన్న బంగాళా నలభై రూపాయలకు అద్దెకు తీసుకున్నాను. మా బంగాళా విజయనగర భవనానికి కొద్ది దూరంలో ఉంది. నాకు స్నేహితు లవసరం లేదు. నాకు చుట్టాలు అక్కర్ లేదు. నాకు పుస్తకాలు వద్దు, కళ వద్దు, నాకు భగవంతుడు వద్దు. భక్తి అక్కరలేదు. భగవంతుడు? ఎవ్వరీ భగవంతుడు? ఎక్కడ? పరమాత్ముడట! దీనజన రక్షకుడట! కరుణామయుడట! ఆపద్భాంధవుడట!
హ్హా హ్హా! ఏమివెఱ్ఱి మనవాళ్ళకు? భగవంతు డెవడు? మనందరిపై ఓ పెద్ద అధికారా? ఇప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడే కష్టపెడితే అనుకోవచ్చు. ఎప్పుడో కొన్ని జన్మలక్రింద చేసిన తప్పుకు ఇప్పుడా మనల్ని శిక్షించడం? ఎంతమంది అలాంటి అధికారులు? ముస్లింలకు ఒకరు, క్రైస్తవులకు ఒకరు, బౌద్దులకు ఇంకొకరు, హిందువులకు కోటిమంది! ఎందుకీ పాడు దేవతలు, దెయ్యాలు.
దేవతలు వేరు, దేవుళ్ళు వేరు. వేదాంతుల దేవుడు ఎమీ చెయ్యలేని బ్రహ్మపదార్ధము! మన కర్మ మనమే అనుభవించవలసి వస్తే మనకు తెలిసే అనుభవించే శిక్ష కర్ధం ఉంటుంది. ఒకణ్ణి చంపితే చంపినవాణ్ణి ఉరి తీస్తారు. అదీ శిక్ష. దొంగతనం చేస్తే ఖైదు వేస్తారు. అనంతమైన కాలంలో, సృష్టిలో కోటి కోటి సంవత్సరాలు పురుగైతేనేమి, పుడకైతే నేమిటి?
నా దేవిని బ్రతికించలేని దేవుళ్ళు నా కెందుకు? నిజమైన ఆనందం చూచి ఓర్వలేని దద్దమ్మలు లోకాలను ఏలుతున్నారు. మనుష్యునికి మూఢత్వ మెందుకు? ఎందుకీ లక్షల కొలది గుళ్ళు గోపురాలు? క్షేత్రాలూ తీర్థాలూ? ఎందు కీ మొక్కుబళ్ళు. నిలువుదోపిళ్ళు? యాత్రలెందుకు? పవిత్ర నదుల స్నానాలట! స్నానాలు మురుగు గుంటలలో చేయకూడదా?
నా హృదయంలోని నీరసాలు పోయాయి. నా దేవుళ్ళు నా శకుంతలతోనే పోయారు. వాళ్ళమీద యుద్ధం ప్రకటించాను. నాకు వాళ్ళతో నిమిత్తం ఏమిటి? భక్తట! ఓహో! మెదళ్ళలో రాళ్ళు పొదిగించుకుని, భక్తిని బయలుదేరే చచ్చుదద్దమ్మలకు బుద్ది చెప్తా! ప్రపంచములో న్యాయం మోక్షంకోసం కాదు. నా పళ్ళు బిగించి, నా గుప్పిళ్ళు ముడిచి దేవుళ్ళ రాజు విశ్వేశ్వరుడి మీద మొదటి యుద్ధం ప్రారంభించాను.
18
శకుంతలాదేవీ! నీవు నాకు లేకపోయినావు. ఎక్కడకు పోయినావు? ఎక్కడకు పోయావు దేవీ? నిన్ను గాఢంగా కౌగిలించుకొన్నప్పుడు నా కెంత ఆనందం కలిగేది? ఎంత విచిత్రానందం! ఎన్నిరకాల కౌగిలింతలు చూపావు నాకు? ఒక రోజున వెనుకనుంచి వచ్చి కన్నులు మూశావు.నా కన్నులు కప్పిన ఆ పూవుల మెత్తదనాన్ని కర్కశం చేసానా నేను? అవి చేతులా దేవీ? పరిజాతాపహరణంలోని పద్యాలకు స్నిగ్దత్వం, లాలిత్యం నేర్పే అద్భుతరూపాలు కావా? నా వీపుమీద వాలిన నీ ఉరోజస్పర్శామృతము నా వంటికి వివశత్వం కలిగించలేదా? నా మెడచుట్టూ చేతులు చుట్టావా శకుంతలా?
ఒకనాడు నిద్రపోయినట్లు నటించి, నేను నీ మీద వాలినప్పుడు నా కన్నులు మూసి, నా తల నిమిరి, నా నొసట ముద్దాడినావా? అది వట్టి చుంబననమా, జీవితం కూలంకుషంగా కదిపివేసే పరమవర ప్రసాదంగాని, నేను సోఫామీద కూర్చొని బొమ్మల పుస్తకం వకటి చూస్తూవుంటే, నా వళ్లోవాలి వదిగిపోయి, నా హృదయాన నీ మో మద్దుకొని, నా విశాలవక్షంలో నీ మోము తిప్పుతూ పుణికినావే! ఆనాడు నేనేమైపోయాను? ఆనందమే క్షీరమైతే, ఆ క్షీరం మథించిన నవనీతం కడుపార సేవించిన శ్రీక్రిష్ణుణ్ణేనా నేను!
శకుంతలరాజ్ఞీ! నా హృదయం నీ హృదయంలో గాఢంగా అదుముకొని నిధ్రపోయేదానవు. నిద్రలోనై నా అటు తిరగడానికి వీలులేకపోయేది. నీవు కదలక చిన్న పాపవలె గాఢనిద్ర పోయేదానవు. నేను కొంచెం కదిలితే, ఆ నిద్దర్లోనే నన్ను అల్లుకునేదానవు.
నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎన్ని యుగాలు చూచినా తృప్తి తీరుతుందా దేవీ? ఆ కళ్ళ అందాలు వర్ణించగలనా? కాటుకకళ్ళు ఎంత వెడల్పు అవి. ఆ వెడల్పుకు తగిన కనీనికలు, ఆ కనీనికలలో ఎంత లోతులు. ఎంత గాఢ నీలాలు? అరమూతలతో చెన్నారే ఆ కళ్ళు దూరాననుండి మాత్రం దర్శింప గలిగేవాణ్ని. కన్నులు నావైపు తిప్పి నా శకుంతల నన్ను చుస్తే నేను ఎదురు చూడలేక పోయేవాణ్ణి. ఆమె కన్నులు బొమ్మలలో వేయగలిగిన చిత్రకారుడు లేడు. మొలేరాంకాని, అజంతా చిత్రకారులు కాని ప్రయత్నించినా వాని అందాలలో ఒక అంశమాత్రం చిత్రించగలరో లేదో!
మా ఆనందంలో దేహవాంఛ లేదనను. నాకు పూర్తిగా ఉంది. కాని దేహాతీతమైన ఏదో మహత్తరానందము నన్నా రోజులలో ముంచెత్తేది. నాలోని ప్రతిఅణువు పులకరించిపోయేది. ఆమెపై కామవాంఛ లేకుండానే నే నామే ఎదుట ఉంటేనే చాలనిపించేది. ఆమె దేహసౌందర్యము తనినోవ చూచి ఆ అనుభూతి మత్తతలో మైమరచేవాణ్ని. ఆమె నాయెదుటే అలంకరించుకోవాలి, ఆమె సిగ్గుతో కుంగిపోయేది. '' ఈ లాటి వేళలలో మీరు నాకు కొత్తఅని కాదండీ'' అని శకుంతల అనేది. ఆమెకు సిగ్గు మాత్రమే! నిలువుటద్దం ఎదుట ఆమెనూ, గ్రీకు వీనసు విగ్రహాన్నీ నిలుచుండబెట్టితే వీనస్సే తేలిపోయేది.
ఆమె చెవులు, భుజాలు, నడుం, జఘనము, పాదద్వయం ఊహించుకోలేని పరమమూర్తిత్వంలోని దివ్యశ్రుతులే! ఇవన్నీ నాకు సన్నిహితంగాలేని ఒక క్షణం లేదు. రాత్రిళ్ళు నాకు నిద్రలేదు. నా ప్రక్కలోని సర్వలోక నిధి ఏది? ఆమె నా ప్రక్కనే ఉందనుకొని, గుండె నీరయి, నీరసపడి, కన్నీరు మున్నీరై వెక్కి వెక్కి ఏడ్వలేక, అసురుసురయిపోతూ ఉండే వాణ్ని. ఎవరు నా దుఃఖము తీర్చేది? నా శకుంతలే నా దుఃఖము తీర్చగలదు! మనుష్యులు మరల బ్రతికివస్తారా? ఆమె దేవతై నా దగ్గరకు రాకూడదా? ఆమె ఆత్మ నా కౌగిలింతలో ఇనుమకూడదా?
