Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 37


                      విషవలయంలోప్రియురాళ్ళు


    "నీ సౌందర్యం అపురూపం-"అన్నాడతడు సునందతో.
    "నీ ప్రేమమాత్రం అపురూపంకాదు-" అంది సునంద.
    "ఎందుకని?"
    "అపురూప సౌందర్యానికి అపురూపమైన కానుక నిచ్చేవా?"
    "అపురూప సౌందర్యానికి తగ్గ కానుక నూహించడమే ఒక సమస్య-" అన్నాడతడు బాధగా.
    "మనసుంటే ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారముంటుంది-" అంది సునంద.
    "సునందా! నా మనసు నీకు తెలుసు..." అన్నాడతడు దీనంగా.
    "మోహన్! పోనీ నాకేం కావాలో నేను చెబుతాను. తేగలవా?"
    "అయ్యో-సునందా! నీ కోసం సప్త సముద్రాలూ ఈదగలను. పాతాళంలోకి చొచ్చుకుపోగలను...." అన్నాడు మోహన్.
    "అవేమీ చేయనక్కర్లేదు. నీ స్నేహితురాలు లీలను మోసగించు-" అంది సునంద.
    "లీల నీకెలా తెలుసు?"
    "లీల నాకేకాదు-ఎందరికో ప్రత్యేకంగా తెలుసు. కారణం చెప్పుకో!" అంది సునంద.
    మోహన్ కాసేపాలోచించి-"ఏమో-నాకు తెలియదు-" అన్నాడు.
    "చూడగానే కళ్ళు చెదిరే ఆమె వజ్రాలహారం...."
    "అవునవును. అది లేకుండా లీల ఎక్కడికీ కదలదు."
    "ఆ వజ్రాలహారం లీల ప్రత్యేకాభిమానాన్ని పొందింది. కారణం నీకు తెలుసా?"
    మోహన్ తల అడ్డంగా ఊపాడు.
    "లీల అందానికి మెచ్చి ఆమె ప్రియుడిచ్చిన అపురూప మైన కానుక అది! ఆమెకులాగే నేనూ నా ప్రియుడి గురించి చెప్పుకోవాలనుకుంటున్నాను. తప్పా?"
    "అయితే లీలను నేను మోసం చేయడమెందుకు?"
    "ఆ వజ్రాలహారం నువ్వు నాకు తెచ్సివ్వాలి...."
    "అదేనా-అలాంటిదా?"
    "అదే"
    "అదే ఎందుకు?"
    "ఒకటి-లీలమెడలో ఆహారం చూస్తే నా వంటిమీద తేళ్ళూ జెర్రిలూ పాకుతున్నాయి. రెండు-లీల ముందెలాంటి మగాడైనా చిత్తేనట. ఆమె దగ్గిర చిత్తుకాకుండా నువ్వా హారం నాకు తెచ్చివ్వగలిగితే-అది నా అహానికి విజయం. మూడు-లీలకు ప్రమాదకరమైన వ్యక్తుల రక్షణ వుంది. అంటే లీలను మోసగించే వ్యక్తి ప్రమాదాన్నే సవాలు చేసినట్లు. అందుకు అపురూపమైన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ నీలో ఉందని నాకు ఋజువుకావాలి-"
    "సరే-నీ కోరిక తీరుస్తాను-" అన్నాడు మోహన్.

                                      2

    అందంగా అలంకరించబడిన ఆ గదిలో అద్దం ముందు నిలబడి తన అందానికి మెరుగులు దిద్దుకుంటోంది లీల. అప్పుడామెను అద్దంలో తన వెనుకగా మోహన్ కనిపించాడు.
    "అరే-మోహన్-నువ్వా?" అందామె.
    "గుర్తుపట్టావా?" అని నవ్వాడు మోహన్.
    "మరిచిపోవలసిందే-నిన్ను చూసి నెల్లాళ్ళు దాటిందేమో-"
    "నెలకాదు. అయిదు వారాలు..." సరిచేశా డతడు.
    "ఇన్నాళ్ళూ ఏమైపోయావ్?"
    "ఏమవుతాను? ప్రేమలో పడ్డాను...."
    లీల కళ్ళలో అసూయ కనబడింది..... "ప్రేమలో పడ్డావా? నా ఆకర్షణను మరిచిపోయావా?"
    "లేదు నా మనసు కొత్తదనాన్ని కోరింది...."
    "నన్ను మించిన కొత్తదనం నీకెక్కడ కనపడింది?"
    "సునంద తెలుసా నీకు?"
    "తెలియదు-"
    "తెలిసుండదులే-తెలిస్తే నీ గర్వం కాస్త అణిగేది."
    లీల ముఖం ఎర్రబడింది-"నా పాదాల దగ్గిరపడుందే నీలో గర్వం పెరిగింది. ఆ సునంద ఎవరో జాణ అయుండాలి-"
    "లీలా-మగాడికి గర్వమే అందనుమంటుంది సునంద."
    లీల చిరాగ్గా-"అయితే యిక్కడికెందు కొచ్చావ్?" అంది.        
    "ఒకరోజున యీ యింట్లో మనమిద్దరమే ఉన్నాం. నువ్వు యాభైవేల రూపాయలు లెక్కపెట్టి బీరువాలో ఉంచావు. అప్పటికి మన పరిచయం వయసు రెండు రోజులు. గుర్తుందా?" అన్నాడు మోహన్.
    లీల గుర్తుచేసుకుంది.
    
                                 *    *    *

    "నేనెలాంటి వాడినో నీకు తెలియదు. ఇప్పుడు నేను నిన్ను గాయపరచి డబ్బు తీసుకుని పారిపోతే ఏం చేస్తావు?" అన్నాడు మోహన్.
    లీల నవ్వి-"యాభై వేలకోసం ఏ మగవాడూ నన్ను గాయపర్చాలనుకోడు. నేను విలువైన మనిషిని నా కంటే నీకు డబ్బెక్కువకాదని నాకు తెలుసు-" అంది.
    "ఒకవేళ నేన్ నిన్ననుభవించేక డబ్బు తీసుకుని పారిపోయాననుకో-అప్పుడేం చేస్తావ్?"    
    "నువ్వు నీ తల్లిని మోసం చేయగలవు. కానీ నన్ను     మోసగించలేవు. నాతో అనుభవం నీలో కృతజ్ఞతను పెంచుతుంది. ఆ కృతజ్ఞత నిన్ను నాకు బానిసను చేయడం తప్పనిసరి-" అంది లీల సమ్మోహనంగా నవ్వుతూ ఆ నవ్వులోనే చెప్పలేనంత నమ్మకముంది.
    "నువ్వు ఓ తరహా మగాళ్ళతో పరిచయం పెట్టుకున్నావు. వారికి స్త్రీ సౌందర్యం, స్త్రీ సుఖం-ఈ రెండే ముఖ్యంకావచ్చు. అంతా అలాగే ఉంటారనుకుంటే అది నీ పొరపాటు. కొందరికి డబ్బు తర్వాతే ఏదైనా మరి కొందరికి తిండి తర్వాతే ఏదైనా-అలాంటివాళ్ళచేత నువ్వు మోసపోతావు...." అన్నాడు మోహన్.
    "ఆ భయం నాకు లేదు. ఎందరో ప్రియులు నాకెన్నో కానుక లిస్తూంటారు. అవి నా దగ్గరకు చేరాక నన్నువదల లేవు. నా యింటికి కాపలా మనుషులవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఇంటికి తాళంకూడా పెట్టను. ఈ యింట్లోంచి పూచికపుల్ల కదిలిందంటే-కదిలించిన వ్యక్తి మృత్యువు నాహ్వానించినట్లే భావించాలి-"
    "ఉదాహరణ లున్నాయా?"
    "ఉన్నాయి కానీ చెప్పను...."
    "అయితే కనీసం నీ ప్రేమ, ఆకర్షణ విఫలమయ్యాయని నువ్వొప్పుకోక తప్పదు-" అన్నాడు మోహన్.
    "లేదు-" అంది లీల-"ఇంతవరకూ నా యింట్లో రెండేరెండు చోరీలు జరిగాయి. ఇద్దరూ స్త్రీలే!"
    "నువ్వు నన్ను సవాలు చేస్తున్నావు...."
    "లేదు-హెచ్చరిస్తున్నాను...." అంది లీల.
    "నీ హెచ్చరిక నేను లెక్కచేయకపోతే?"
    "డియర్ మోహన్! ఎందుకీ అసందర్భపు సంభాషణ కాలం వృధాచేయకు. నువ్వు చటుక్కున చేయిపట్టుకుని లోపలకు లాగకపోతే-కాలుజారి పట్టాల క్రిందకు పోవలసినదాన్ని. అమూల్యమైన నా ప్రాణాలు రక్షించి నందుకు - నిన్ను నేనే అమూల్య కానుకగా సమర్పించుకోవాలనుకున్నాను. లేకుంటే నా పరిచయం అరుదైనది. ఆ అరుదైన అనుభవాన్ని నీలో ఇముడ్చుకుని-నువ్వు హాయిగా వుండు. నా హెచ్చరికను నిర్లక్ష్యం చేయకు...."
    "నీ హెచ్చరికను నిర్లక్ష్యం చేయాలని లేదు. కానీ సవాలును వదలాలని లేదు-"
    "అయితే నీ కర్మ-నీ క్కావాలంటే బీరువాలోని యాభై వేలూ తీసుకుని వెళ్ళు. ఆ తర్వాతేం జరిగినా-నేను కూడా నిన్ను రక్షించలేను. అందుకే ముందుగా చెబుతున్నాను" అంది లీల.
    "ప్రస్తుతానికి నీ ఆకర్షణేమీ తెలుసుకుంటాను. సవాలు సంగతి తర్వాత చూస్తాను-...." అన్నాడు మోహన్.
    "ఈ యింట్లో దొంగతనం చేయాలంటే నీ కెప్పుడూ అడ్డులేదు. కానీ ఆ తర్వాత నువ్వుండవు. గుర్తుంచుకో" అంది లీల.

                                   *    *    *    

    "గుర్తుంది-" అంది లీల.
    "ఇప్పుడు నేను దొంగతనం చేయడానికి వచ్చాను..." అన్నాడు మోహన్ గంభీరంగా.
    "అంటే?" అంది లీల తెల్లబోయి.
    "ప్రస్తుతం నేను సునంద ఆకర్షణలో ఉన్నాను. ఆ ఆకర్షణ నీ ఆకర్షణకంటే గొప్పది. ఆమె నీ మెడలోని వజ్రాల హారాన్ని కోరింది...."
    లీల నవ్వి-"నువ్వు సునంద ఆకర్షణలో లేవు. ప్రమాదాన్ని సవాలుచేసే ఆకర్షణలో ఉన్నావు-...." అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS