Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 37


    "నీ బాబాయిది తప్పుకానప్పుడు నాది మాత్రం తప్పెందుకవుతుంది?"
    "ఎందుకంటే-బాబాయి నా కోసం పెళ్ళిచేసుకోలేదు. తన సుఖంకోసం ఎవరితోటి అక్రమ సంబంధం ఏర్పరచుకోలేదు. న్యాయమైన పద్ధతిలో తన కోర్కె తీర్చుకున్నాడు...."
    "న్యాయమైన పద్ధతి....." అని వెటకారంగా నవ్వాడు విజయ్.
    "అవును- నా అభిప్రాయంలో అది న్యాయమైన పద్ధతే...కానీ నువ్వు స్మగ్లరుతో వ్యవహారంలో ఉండి శివరాజు కెమేరాలో చిక్కడ్డావు. బాగా డబ్బు సంపాదించాలన్న అత్యాశ కాకపోతే నీకు స్మగ్లింగ్ అవసరమేమిటి?"
    "పెళ్ళి చేసుకోనివాడికి వ్యభిచారంలాగే-డబ్బు కావాలనుకున్నవాడికి స్మగ్లింగ్ అవసరం. నువ్వు నన్ను ప్రేమించావంటే డబ్బును చూసికాదా?"
    చంప నిట్టూర్చి-"అదంతా చెప్పలేను. నాకు నువ్వంటే ఎంతో యిష్టం. నీ రూపురేఖలు, నీ నడక, నీ పర్సనాలిటీ-నాలో ఏదో సంచలనాన్ని కలిగిస్తుంది. నువ్వేం చేసినా వండ్రఫుల్ అనిపిస్తుంది. నాకు అడ్వెంచరస్ స్పిరిట్ ఉన్న మగాళ్ళంటే ఆకర్షణ అకుకుంటాను. అటుపైన నాకు వైభవోపేతంగా జీవించాలని ఉంది. బాబాయి నా కోసం డబ్బు నిలవేస్తూ నన్ను సింపుల్ గా పెంచాడు.....ఇలా ఎన్నో కారణాలు జతపడ్డాయనుకుంటాను...." అంది.
    "నిజం చెబుతున్నాను, నాకు నీ అందం, అవయవాల పొందిక నచ్చింది. రోజుకొక్కసారైనా నువ్వు నా కలలో కొస్తావు-" అన్నాడు విజయ్.
    "కలలోనైనా సరే నన్ను తాకితే నే నొప్పుకోను. గుర్తుంచుకో....."
    "మరి నీకు అడ్వెంచరస్ స్పిరిట్ ఉంటే యిష్టమన్నావు. ఇప్పుడే అడ్వెంచర్ చేయనా?"
    "నీ కంతగా అడ్వెంచరస్ స్పిరిట్ ఉంటే-శివ రాజుని నువ్వే చంపొచ్చుగా-" అంది చంప.
    "అయాం సారీ చంపా!" అన్నాడు విజయ్ వెంటనే.
    అతడికి తెలుసు ప్రవీణ్ చంపను ప్రేమిస్తున్నాడు. చంప తనను ప్రేమిస్తోంది. శివరాజును హత్య చేయడానికి ప్రవీణ్ ని పురమాయించడం ద్వారా-ఆమెకు రెండు ప్రయోజనాలు. ఒకటి శివరాజుని వదుల్చుకోవడం రెండు ప్రవీణ్ ని వదుల్చుకోవడం.
    రెండో ప్రయోజనం గురించి చంప బాధపడుతోంది.
    ఒక అమాయకుడురికంబ మెక్కడం ఆమె కిష్టంలేదు.
    "విజయ్! నీ కంటే అడ్వెంచరస్ స్పిరిటున్న ప్రవీణ్-ఎందుకో నన్నాకర్షించలేకపోయాడు, అతణ్ణి మన పని కుపయోగించుకున్నాక-ఎలాగో అలా కాపాడాలి-" అంది చంప.
    "తప్పకుండా! ఇప్పుడే నేను నీకు మాటిస్తున్నాను-" అన్నాడు విజయ్. అయితే మాటమీద నిలబడాలన్న పట్టింపతడికి లేదని చంపకు అనుమానముంది.
    
                                   3

    రాత్రి తొమ్మిదిగంటలకు వంటాయన కోటయ్య మధుసూదన్ కీ, చంపకూ భోజనం వడ్డించాడు,
    "ఈ రోజు చాలా ఆలస్యంగా వచ్చేవమ్మా!" అన్నాడు మధుసూదన్ ఆప్యాయంగా.
    "అనుకోకుమా ఆలస్యమైపోయింది-" అంది చంప.
    "శ్యామలరావుగారింటికి వెళ్ళి టైపిన్ స్టిట్యూట్ కి ఫోన్ చేశాను. నువ్వు వెళ్ళిపోయావన్నారు...." అన్నాడు మధుసూదన్.
    "సంగీతం స్కూలుకి ఫోన్ చేయలేదా?" అంది చంపనవ్వుతూ.
    "లేదు అక్కడంత సేపుండవని నాకు తెలుసు....."
    "బాబాయ్-నీకు నా మీద నమ్మకంలేదా?"
    "ఎందుకు లేదమ్మా? అందుకేకదా?-ఆలస్యంగా ఎందుకొచ్చావూ-అనడిగాను. ఏమయ్యావోనని కంగారుపడ్డాను...."
    ఇద్దరూ భోజనాలు చేశాక మధుసూదన్ ఆమెను తన గదిలోకి పిలిచి-"నీతో ముఖ్య విషయం మాట్లాడాలమ్మా-" అన్నాడు.
    "చెప్పు బాబాయ్-" అంది చంప.
    "నేను విజయ్ గురించి వాకబుచేశాను. అతడు జులాయి మనిషి. చాలా ప్రమాదకరమైన వ్యక్తి కూడా!"
    చంప మాట్లాడలేదు.
    "అనుభవంమీద చెబుతున్నాను. ఈ కళ్ళతో ప్రపంచాన్ని చూసి ఎన్నో తెలుసుకున్నాను. వయసు చాలా ప్రమాదకరమైనది. అందులోనూ ఆడపిల్ల వయసులో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తెరమీద నటుల్ని చూశావు. కానీ ఈ వయసులో నీ చుట్టూ తిరిగే వారందరూ మహానటులు. వారి నటన ఎంత గొప్పగా ఉంటుందంటే-వారి నిజ స్వరూపాన్ని కళ్ళారా చూసినా అది నిజంకాదని సరిపెట్టుకోవాలని పిస్తుంది. విజయ్ చాలా ప్రమాదకారి. నా మాట నమ్ము...."
    "అయితే ఏం చేయను బాబాయ్?"
    "నేను నీ కోసం వెతికి వెతికి ఎన్నుకున్న ప్రవీణ్ ని పెళ్ళిచేసుకో. అతడెంతో మంచివాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అతడి జీతం తక్కువ కావచ్చు కానీ మనకున్న దాంతో హాయిగా బ్రతకొచ్చు. మీ యిద్దరూ సుఖంగా కాపురం చేసుకుంటూంటే చూస్తూ సంతోషించాలని నా కోరిక. అందుకే నేను నీ కతన్ని పరిచయం చేశాను. నిర్ణయం నీకే వదిలిపెట్టాలని-అతడికి నా మనసులోని ఉద్దేశ్యం తెలియనివ్వలేదు. నువ్వు నా మాటకు విలువియ్యి-" అన్నాడు మధుసూదన్.
    "ప్రవీణ్ నర్దం చేసుకుందుకు ప్రయత్నిస్తున్నాను. నా అడ్వెంచరస్ స్పిరిట్ కీ అతడి మనస్తత్వానికీ సరిపోవడం లేదు...."
    "పోనీ విజయ్ తో ఎలా సరిపోయిందో చెప్పు!"
    చంప చెబుతూంటే ఆమె కళ్ళలో మెరుపు.
    విజయ్ కు కారుంది. తనే ఆ కారును డ్రైవ్ చేస్తుంది. ఊళ్ళో తనంత స్పీడుగా డ్రైవ్ చేసేవారు లేరని చెప్పుకోవాలి. విజయ్ కి దురలవాట్లున్నాయి. తానతడి చేత అవి మానిపించి అతన్నదుపులోకి తీసుకుంటుంది. విజయ్ నేరస్థులతో చేతులుకలిపి నేరాలు చేస్తున్నాడు. తను విజయ్ మనసు మార్చి నేరస్థులకు వ్యతిరేకంగా మార్చుతుంది. నేరస్థులలో శత్రుత్వం కారణంగా జీవితం నిండా అడ్వెంచర్.....
    విజయ్ నేరాలు చేస్తున్నా, దురలవాట్లకు గురైనా, స్వార్ధపరుడికిలా అగుపిస్తున్నా అతడి మనసు మంచిది. ఆ మంచితనది. అతడికి ప్రేమించే హృదయముంది. ఆ ప్రేమ తనది.
    "ఇదంతా సినిమాల ప్రభావం, నిజజీవితంలో మనుషులు-సినిమా హీరోల్లా ఉండదు. సినిమా హీరోలే నిజజీవితంలో అలాగుండరు....."
    "అమితాబ్ బచన్ హిట్ పిక్చర్సెన్నింట్లోనో విజయ్ పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు మంచితనాన్నీ, జయాన్నీ సూచిస్తుంది...." అంది చంప.
    మధుసూదన్ నిట్టూర్చి-"సాఫీగా నడిచిపోతున్న నీ జీవితంలోకి నేరస్థులనెందుకమ్మా ఆహ్వానిస్తావు?" అన్నాడు.
    "బాబాయ్-పరిస్థితుల ప్రభావంవల్ల కొందరు నేరస్థులవుతారు. అలాంటి పరిస్థితులే ఎదురైతే అందరూ నేరస్థులే' అవుతారు ఉదాహరణకు ప్రవీణ్ నే తీసుకో నన్ను తృప్తిపరచడంకోసం అతడు హత్య చేయడానికైనా సిద్దంగా ఉన్నాడు-" అంది చంప.
    "నేను నమ్మను...."
    "చరిత కథ అతడికి చెప్పాను. అతడు శివరాజును చంపుతానన్నాడు"
    మధుసూదన్ ముఖం అదోలాగైపోయింది. అతడు నిట్టూర్చి-"నేనూ నేరస్థున్నేనని గుర్తు చేస్తున్నావుకదూ!" అన్నాడు.
    "విజయ్ నేరస్థుడనుకొని నేను నిన్ను నేరస్థుడని ఎందుకనుకుంటాను?"
    "ఆ కథ నీ దాకా రాకూడదని ఎంతో తాపత్రయ పడ్డాను. కానీ కుదరలేదు. విజయ్ నిన్ను నాకు వ్యతిరేకంగా మార్చాలని ఈ కథ నీకు చెప్పాడు తప్ప - అది మన సంబంధ బాంధవ్యాలమీద ఎలాంటి దెబ్బతీస్తుందో పట్టించుకోలేదు. తండ్రీ కూతుళ్ళమధ్య-కొన్ని విషయాలు రహస్యంగా ఉంచడమే మంచిది...." అన్నాడు మధుసూదన్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS