ఒక్కక్షణం అలోచించి, "బాపిరాజు గారిని కలిశావా?" అన్నాడు రామారావు.
"ఏమిటి మావయ్యనా" అన్నాడు మురళీధర్ నమ్మలేనట్లు.
"అవున్రా, ఆయన్ను కలిశావా అనడుగుతున్నాను."
'ఆయననే వాడొకడున్నాడనీ , నాకు అప్పిస్తాడని కనీసం ఊహలో కూడా స్పురించలేదు" అన్నాడు మురళీధర్ నిస్పృహగా.
"ప్రయత్నలోపం ముండకూడదు ఏ వ్యవహారం లోనూ, ఏ పుట్టలో ఏ పాముందో యెవరు చూడొచ్చారు?" అన్నాడు రామారావు.
"నాయనా, మావయ్య ఇల్లు నిజంగానే ఒక పుట్ట. ఆ పుట్టలో వున్న పాము బాపిరాజు మావయ్య. అందులో అడుగుపెడితే దొరికేది ఇంత విషం మాత్రమే. కాటు వేయడం తప్ప వేరే చేతకాదు మావయ్యకి."
"మీ మావయ్య సంగతి నాకు తెలియక కాదు, కానీ అయన మీ కుటుంబానికి ఎన్నో విధాలుగా ద్రోహం చేసి వున్నాడు. ఇప్పుడు నువ్వు యిల్లు కొనుక్కోవడం కోసం యింటింటికి తిరగవలసిన అగత్యం అయన కారణంగానే కదా పట్టింది. అందువల్ల అయన మనసులో ఏదో మూల పాపం చేశానన్న చింత ఉండిఉండవచ్చు. నువ్వయన్నప్పడగ్గానే అడిగిన క్షణం మంచిదైతే ఆ పాపచింత కదిలి, అయన మనసు కరిగి, కనీసం వడ్డీ పుచ్చుకునయినా అప్పియ్యవచ్చు. చెప్పలేము. లాయరుగా నాకు చాలా మనస్తత్వాలతో పరిచయముంది" అన్నాడు రామారావు.
"బాపిరాజు గారంటే ఒకసారి నువ్వు పదిరూపాయ లాయన చందా ఇచ్చారని జోక్ చేశావు, ఆయనేనా?" అన్నాడు భానోజీరావు ఏదో ఆలోచిస్తూ.
"ఆహా , చాలా తొందరగా గుర్తు చేసుకున్నావురా ట్యూబ్ లైటు" అన్నాడు రామారావు.
'అబ్బే! అదికాదు ఆ జోక్ వేసిన మనిషే అయన దగ్గర కప్పుకేళ్ళమని ఎలా చెబుతున్నాడా అని ఆలోచిస్తున్నాను" అన్నాడు భానోజీరావు.
"కాస్త ఆలస్యంగానే అయినా తెలివిగానే మాట్లాడేవు గానీ, ఈ సలహా నేను అపధర్మంగా యిచ్చాను. దేవుడికి దణ్ణం పెట్టి ఊరుకోవడం కంటే నయమే గదా" అన్నాడు రామారావు.
"దేవుడికి దణ్ణం పెట్టి ఊరుకోవడం కంటే నయమే కావచ్చు కానీ, మావయ్య దగ్గరకు వెళ్ళేముందు దేవుడికి దణ్ణం పెట్టుకు వెళ్ళడం చాలా అవసరం. కానీ దేవుడికి మావయ్యను మార్చగల శక్తి వుందని అనుకోను" అన్నాడు మురళీధర్.
"పోనీ, ఫోన్ చేయరాదూ" అన్నాడు రామారావు.
మురళీధర్ ఫోన్ చేశాడు. నెంబరు ఎంగేజయింది.
"చూశావా , ఇలాంటి వార్త మావయ్య దగ్గరకు తీసుకువెళ్ళడం ఫోను కి కూడా ఇష్టం లేదు. ఎంగేజయుంది" అన్నాడు మురళీధర్.
"ఎడిశావు లే, అయిదు నిముషా లాగి మళ్ళీ ప్రయత్నించు. మీ మావయ్య తో అంతకంటే యొక్క సేపు ఎవడు మాట్లాడుతాడులే?" అన్నాడు రామారావు.
మురళీధర్ కాస్సేపాగి మళ్ళీ నంబరు డయల్ చేశాడు. ఫోన్ రింగవుతోంది.
"హలో !" అవతల నించి కంఠం వినిపించింది.
"ఎవరది మావయ్యేనా?" అన్నాడు మురళీధర్.
'అయాం మిస్టర్ బాపిరాజు. మావయ్యంటే నా కర్ధం కావడం లేదు."
"నేను మురళిని మావయ్యా" అన్నాడు మురళీధర్.
"అరే- నువ్వా ఏమిటి విశేషం?"
"ఇద్దరూ కాసేపు పిచ్చా పాటి మాట్లాడుకున్నాక నెమ్మదిగా అసలు విషయం లోకి వచ్చి తానిప్పుడు ప్రస్తుతం ఎదుర్కుంటున్న డబ్బు సమస్య విషయం ప్రస్తావించి, ఈ పరిస్థితుల్లో తాన్నాదుకోగలిగినవాళ్ళెవరూ లేరన్నాడు.
"బాగానే వుంది కానీ, మేనల్లుడివని నమ్మి నీకు ఏ హామీ లేకుండా పాతికవేలిచ్చా ననుకో, నువ్వు తప్పకుండా ఆ బాకీ తీరుస్తావు. కానీ , ఈ విషయం బయటకు పొక్కకుండా మానదు. అప్పుడు బంధుత్వం కలుపుకుంటూ చాలామంది నా దగ్గరికొచ్చి అప్పుడగుతారు. ఇవ్వకపోతే బంధువుల్లో నిస్థూరం. ఇస్తే కొంప గుల్ల. కాబట్టి, హామీగా యేమైనా విలువైనదుంటే చూడు."
"విలువైనదేముంది నాదగ్గర. ఏ హామీ లేకపోవడం వల్లనే గదా నీ దగ్గరకొచ్చింది! నా కిప్పుడున్న విలువైన వస్తువు స్నేహమొక్కటే! ఇద్దరు ప్రాణ స్నేహితులున్నారు. వాళ్ళ దగ్గర అభిమానమే కానీ, డబ్బు లేదు. మరి....
అవతల ఫోన్ లో ఒక్క నిముషం సేపు మాట రాలేదు. తర్వాత "వాళ్ళెం చేస్తున్నారు?" అన్న ప్రశ్న వినిపించింది, మురళీధర్ చెప్పాడు.
"సరే, ఐతే రేపు ఉదయం పదిగంటల ప్రాంతంలో వాళ్ళను వెంట బెట్టుకుని నా దగ్గరకు రా. అన్నీ అప్పుడు మాట్లాడుకుందాం."
అవతల ఫోన్ క్లిక్ మంది. మురళీధర్ మిత్రులకు వివరాలన్నీ చెప్పాడు.
10
"అరే మీ వ్రేలికి ఉంగరం లేదే"అంది ఉమ.
మురళీధర్ కంగారుపడ్డాడు. 'అది కాస్త వదులైంది ఉమా, చిన్నదారం కట్టాలి దానికి. బహుశా బెడ్రూం లో పడి వుంటుంది. ఎందుకంటె నేను స్నానం చేసి తల దువ్వుకునే ముందు నా వ్రేలికే వుందది."
ఉమ బెడ్రూం లోకి పరుగెత్తి వెళ్ళింది. అయిదు నిమిషాలు వెతికినా కనబడలేదుంగరం.
"అది నాకు జయప్రదమైన ఉంగరం. " అనుకున్నాడు మురళీధర్. టైమిప్పుడే తొమ్మిదిన్నర కావస్తోంది. మిత్రులు ముగ్గురూ సిదివిడిగా బస్సులో బయల్దేరి బాపిరాజు ఇంటి ముంచు కలుసుకోవాలనుకున్నారు. ఆ కారణంగా హడావుడి పడుతున్నాడు మురళీధర్.
'సరేలే ఉమా, బస్సు టైమవుతోంది. నేను వెళ్లొస్తాను. దొరికితే జాగ్రత్తగా దాచి ఉంచు" అని కేకపెట్టి బయల్దేరి వెళ్ళిపోయాడు మురళీధర్.
సుమారు పది గంటల ప్రాంతంలో మిత్రులు ముగ్గురూ అనుకున్న ప్రకారం బాపిరాజు ఇంటి ముందు కలుసుకున్నారు.
"ఏ కార్యాని కైనా ముగ్గురు బయల్దేర కూడదంటారు" అన్నాడు రామారావు సాలోచనగా.
"మనం ముగ్గురం కలిసి బయల్దేరలేదుగా. విడివిడిగా ఇక్కడికి వచ్చి కలుసుకున్నాం" అన్నాడు మురళీధర్.
ముగ్గురూ బాపిరాజు ఇంట్లో ప్రవేశించారు. కాలింగ్ బెల్ మ్రోగించగానే బాపిరాజే స్వయంగా తలుపు తీసి, "వచ్చారా- రండి , కూర్చోండి" అన్నాడు.
ముగ్గురూ సోఫాల్లో కూర్చున్నారు. బాపిరాజు ముఖంలో ఏవిధమైన భావాలూ కనబడడం లేదు. మనిషి ముక్తసరిగా వున్నాడు. మిత్రుల ముగ్గురూ యిబ్బందిగా సోఫాల్లో కదులుతూ ఒకరి వంక ఒకరు చూసుకుంటూన్నారు.
"ఎలా వుంటోంది మావయ్యా ఒంట్లో" అన్నాడు మురళీధర్.
"తిండి లేక జబ్బు చేయడానికి పేదవాడిని కాను, జబ్బు చేస్తే వైద్యం చేయించుకోలేని మధ్యతరగతి వాణ్ణీ కాను. నా ఆరోగ్యానికేం ?" అన్నాడు బాపిరాజు.
ఆ జవాబుకు మిత్రులు ముగ్గురు కూడా షాక్ తిన్నారు.
బాపిరాజు లేచి నిలబడి, "ఉండండి, టీ తీసుకొస్తాను" అన్నాడు నెమ్మదిగా నడుచుకుంటూ లోపలకు వెళ్ళాడు.
బాపిరాజు మనోభిప్రాయమేమిటో అర్ధం కాక మిత్రులు ముగ్గురూ మధనపడుతున్నారు. వాటం చూస్తె వచ్చిన పని సానుకులపడేలా లేదు.
ఒక ట్రేలో టీ కప్పులతో బాపిరాజు తిరిగి వచ్చాడు. "నా ఇంట్లో నౌకర్లుండరు. డబ్బు సంపాదించడం మాత్రమే కాక దాన్ని సక్రమంగా ఖర్చు పెట్టడం తెలిసిన నాబోటి గాడి దగ్గరే లక్ష్మీ వుంటుంది" అంటూ ముగ్గురికీ టీ ఇచ్చాడు. తను టీ తీసుకోలేదు.
"నువ్వు తీసుకోవా మావయ్యా" అనడిగాడు మురళీధర్.
"ముందు మీరు తీసుకోండి. అయేక చెబుతాను అన్నాడు బాపిరాజు.
ముగ్గురూ టీ తాగడమయ్యేక "నాతొ రండి" అన్నాడు బాపిరాజు. ముగ్గురూ ఆయన్ననుసరించారు. అయన నెమ్మదిగా వాళ్ళను డైనింగ్ రూం లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ అందమైన డైనింగ్ టేబిల్ మీద నాలుగు వెండి కంచాలున్నాయి. వాటికి పక్కన వెండి గ్లాసుల్లో మంచినీళ్ళున్నాయి.
"నాతొ సరిసమాన మైనవారికీ పదిగంటల సమయంలో నేనిచ్చే ఆతిధ్యం సాధారణంగా ఇలా వుంటుంది. అల్పులకి హల్లో టీ నీళ్ళే!" అన్నాడు బాపిరాజు.
భానోజీరావు ముఖం ఎర్రబడింది. మురళీధర్ పిడికిళ్ళు బిగిశాయి. రామారావు ఇద్దరికీ కాస్త శాంతపరిచాడు. "ఇంకా మీరు చెప్పదల్చుకున్నదేమైనా వుందా?" అనడిగాడు రామారావు.
"ఉంది. చాలా వుంది. ఒకప్పుడు నా మేనల్లుడు మురళీధర్ నాకంటే చాలా ఉచ్చదశలో వుండేవాడు. కానీ, వాడి నాన్న మహాదాత. అడిగిన వారికి లేదనలేడు. నోటు మీద కంటే మాట మీద నమ్మకం . ఫలితమేమిటి? ఆస్తి, హారతీ కర్పురంగా హరించుకు పోయింది. ఈనాడు వీడు నన్నడిగే స్టేజికి దిగిపోయాడు. ఏ హామీ చూపలేని వాడికి, ఎందుకూ కొరగాని వాడికి చూస్తూ చూస్తూ పాతికవేలు అప్పివ్వడానికి నేను మురళీధర్ బాబులా చవటను కాను, మహాలక్ష్మీ భర్తను. మురళీధర్ తండ్రి డబ్బును తృణప్రాయంగా చూడగలగదానికి కారణం వేరే లేదు. అతనా డబ్బును వారసత్వంగా పొందాడు. తప్పితే, కష్టపడి సంపాదించలేదు. నాకులా కష్టపడి , తెలివి తేటలుపయోగించి డబ్బు సంపాదించినవాడు, డబ్బుని తేలిక చేయలేడు."
