Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 37


                                  15
    మురళీ కళ్యాణి భోజనాలు ముగించు కుని గదిలోకి వెళ్లి పడుకున్నారు. ఇద్దరికీ చాలాసేపు నిద్దర పట్టలేదు..... సాయంకాలం అంతా అడపా తడపా సన్నటి జల్లుగా పడిన వాన ఇప్పుడు కుంభ సృష్టిగా కురుస్తోంది-- కళ్ళు మిరిమిట్లు గోలిపేలా , ఆకాశం ఆ చివర నుండి ఈ చివరి దాకా మెరుపులూ గుండెలు జలదరించేలా భయంకరంగా గర్జిస్తున్నట్లు వురుములు వాతావరణం అంతా భీభత్సం గా వుంది.
    'నాకేమిటో భయం వేస్తోందండీ.' బల్లిలా భర్త గుండెలకి అంటుకు పోతూ అంది కళ్యాణి.
    'ఉరుములు, మెరుపులూ వానా చూసి పసివాళ్ళ లా జడుసు కుంటావా.' అనురాగమూ వాత్సల్యము తొణికిలాడుతుండగా కళ్యాణి నుదుట ముద్దు పెట్టుకుని వెన్ను నిమిరాడు మురళీ.
    'ఆహా అది కాదు -- ఇవాళ మనస్సు అసలే ఎలాగో వుంది- అలాంటప్పుడు బైట కూడ ఇలా ప్రళయం ముంచు కొచ్చినట్లుగా వుంటే ఇంకా దిగులుగా ఏమిటో భయంగా వుంటుంది-- శాంత క్కయ్య కేలా వుంటుందో-- ' గదిలో వెలుగుతున్న చిన్న బల్బు గబుక్కున ఆరిపోయింది.
    కిటికీ లో నుంచి కనిపించే వీధి దీపపు వెలుగు కూడా కనబడ కుండా పోయి ఇంటా బయటా కూడా గాడాంధ కారం అలుముకు పోయింది.
    'ఇదేమిటి ? నేను సరిగ్గా అక్కయ్య ని తలుచుకుంటుంటే ఇలా అయింది.....అంది కళ్యాణి కించగా.
    'బాగుంది వరస-- ఈ వానకి గాలికి ఏ చెట్టు కొమ్మో విరిగి ఎలక్ర్తిక్ వైర్ల మీద పడి వుంటుంది. కరెంటు పోయింది-- దానికేవో అర్ధాలు తియ్యటం ఏమిటి? కళ్ళు మూసుకు పడుకుని నిద్ర పట్టించుకో-- ఇంకేమీ ఆలోచించకు.' కళ్ళ మీదకు వస్తున్న నిద్ర మత్తు తోనే మందలింపు గా అని నిద్రలోకి జారిపోయాడు మురళీ.
    కళ్యాణి కి మాత్రం వెంటనే నిద్ర పట్టలేదు-- రాత్రిలో చాలా భాగం ఆలోచనలతోనే గడిపి ఏ తెల్ల వారగట్లో ఓ కోడి కునుకు తీసి లేచింది. నిద్ర లేకపోవటం వల్ల కళ్ళు మండుతున్నాయి, తలనొప్పి గా వుంది. అలాగే బద్దకంగా పనులలో జొరబడి పోయిన కళ్యాణి పై నుంచి ఒక్కసారి ఘోల్లు మన్న ఏడుపు వినిపించి గుండెలు పట్టుకు పోయినట్లు అలాగే నిలబడి పోయింది.
    'సందేహం లేదు. ఆ ఏడుపు మణి వాళ్ళదే, అవును వాళ్ళదే.' అని ఆమె అనుకుంటుండగానే మురళీ గబుక్కున లేచి మేడ మీదకి పరుగు పెట్టాడు. అతని వెనకే కళ్యాణి ఆ వెనక ప్రక్క వాటా వాళ్ళు అంతా పైకి జేరారు. అప్పటికే మేడ మీద మరో వాటాలో వుంటున్న మెహతా వాళ్ల కుటుంబం గోపాలరావు ఇంట్లోకి వచ్చేశారు ఖంగారుగా.
    ఆ అందరూ వినగలిగింది ఒక్కటే ఖబురు. శాంత ఆ ఉదయమే కళ్ళు మూసింది.
    పిల్లల్ని కౌగలించుకుని గుండెలు కుమిలి పోయేలా ఏడుస్తున్న గోపాలరావు ని చూస్తుంటే ఆ క్షణం లో అందరి మనస్సులూ జాలితో నిండి పోయి అందరి కళ్ళలోనూ సానుబూతి సంతాపాలతో కూడిన కన్నీరు ఉబికి వచ్చింది. అయితే అందరి మనస్సులలోనూ ఏ మూల నుంచో ' ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం -- చేజేతులా చేసుకున్నదే కదా?' అనే భావం ఒక్కసారి అలా తొంగి చూసింది.
    కళ్యాణి మాత్రం తన స్వంత తోబుట్టువు పోయినట్లే విలపించింది. 'ఎంత పని చేశావు అక్కయ్యా.....ఏడుగురు బిడ్డల్ని కని పెంచిన నీకు ఈ ఒక్క బిడ్డా బరువయి పోయిందా.....దానిని ఈ లోకంలోకి రాకుండా చెయ్యాలని నీ కెందు కింత పట్టుదల వచ్చింది? ఇంక ముందు నుండి జాగ్రత్తగా వుంటే సరిపోయేది కదా! ఈ గర్భం నిలవకుండా చెయ్యాలనే ప్రయత్నంలో నువ్వు నీ ప్రాణాలనే పోగొట్టుకున్నావు కదా.....నీ ఆరోగ్యం బొత్తిగా బాగుండలేదు. ఈ కానుపు కి తట్టుకునే శక్తి లేదు అనుకున్నప్పుడు ముందే తగిన జాగ్రత్తలు తీసుకో అక్కర్లేదా?' అనేక విధాల తలుచుకుంటూ బాధపడింది కళ్యాణి -- పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఓదార్చింది.
    ఆ కుటుంబాన్ని ఆ యింట్లో వుండే మిగిలిన మూడు కుటుంబాలు అనేక విధాల ఆదుకున్నారు. వో నాలుగైదు రోజులు--
    తరువాత అటు శాంత వేపు వాళ్ళూ ఇటు గోపాలరావు వేపు వాళ్ళూ కొంత మంది వచ్చారు. వాళ్ళిద్దరి తల్లి దండ్రులూ లేరిప్పుడు--
    ఆ వచ్చినవాళ్ళు వో వారం పదిరోజులుండి తిరిగి వెళ్ళిపోతూ మరీ చిన్నపిల్లలనయినా తమతో తీసుకు వెడతాం అన్నారు.
    'ఉహు-- నా బిడ్డలంతా నా కళ్ళ ముందు వుండాల్సిందే నేను వాళ్ళని ఎక్కడికీ పంపించను .' అన్నాడతను.
    'ఇల్లు చూడటానికి ఆడదిక్కు కావాలిగా మళ్లీ పెళ్లి చేసుకో' అని సలహా ఇచ్చిన వాళ్ళు కూడా లేకపోలేదు-- అతని వయస్సు ఇంకా ముప్పై అయిదు ఏళ్ళు.
    'నా పాట్లేవో నేను పడతాను. నాకు మీ ఎవరి సహాయమూ అక్కర్లేదు-- దయచేసి సలహాలు మాత్రం ఇవ్వకండి' అన్నాడతను తీక్షణంగా--
    ఆ తరువాత ఎవరి దారిన వాళ్ళు వెళ్లి పోయారు-- కొన్నాళ్ళ పాటయినా ఇక్కడ వుండి వీళ్ళ బాగోగులు చూడగలిగే వీలు ఎవ్వరికీ లేదు. ఎవరి సంసారాలు ఇబ్బందులు వాళ్ళ కున్నాయి.
    'హోటలు నుంచి తెప్పించు కుందాం' అన్నాడు గోపాలరావు కొన్నాళ్ళ పాటయినా అలా జరగనివ్వాలనే వుద్దేశ్యంతో.

                             
    'ఎందుకు నాన్నా నేను వండుతాను. నేనింక స్కూలు కి వెళ్ళను. ఇంట్లోనే చదువు కుంటాను. నేను లేకపోతె చిన్న తమ్ముళ్ళ ని ఎవరు చూస్తారు.' అంది మణి -- ఆడుతూ పాడుతూ గడపాల్సిన పసివయస్సులో ఇలా మాట్లాడ గలుగుతున్న ఆ పిల్లకి ఏం సమాధానం చెప్పాలో అతనికి తోచలేదు. కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటూ ఆ పిల్ల తల నిమురుతూ వుండి పోయాడు--
    పదేళ్ళ మణి ఇప్పుడు ఆ యింటికి ఆధారం అయింది. గోపాలరావు కూడా ఆఫీసు వేళలో తప్ప మిగతా కాలం అంతా ఇంట్లోనే వుంటూ మణి కి సాయం చేస్తూ ఆ పిల్లకి చదువు చెప్తూ , పిల్లలని ఆడిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.

                           *    *    *    *
    కళ్యాణికి నెలలు నిండాయి --
    బరువుగా భారంగా ఇంట్లో తిరుగుతున్న కళ్యాణి ని చూస్తుంటే మురళీ కి అనిపిస్తుండేది. 'ఈ సమయంలో పెద్ద వాళ్ళెవర యినా దగ్గర వుండి అన్నీ సమర్ధించుకో గలిగితే ఎంత బాగుంటుంది? మాకంత అదృష్టం ఎక్కడిది? వాళ్ళ అమ్మ సంగతి సరే మా అమ్మ వచ్చి ఇలాంటి స్థితిలో వున్న కోడల్ని కాలు క్రింద పెట్టనీయ కుండా ఎంతో గారంగా అపురూపంగా చూసుకుని ఆ తరువాత మనవడ్ని కోడల్నీ చూసి మురిసిపోతూ సంతోషంగా ఇంటికి  వెళ్ళ గలిగితే ఎంత బాగుండేది.....పోనీ ఇలాంటి పరిస్థితి అని వాళ్ళని వ్రాస్తేనో.....అనుకుంటుండగానే అతనిలో పౌరుషం తల ఎత్తెది. 'నీకూ మాకూ ఇంక ఎలాంటి సంబంధమూ లేదు' అని నాన్నగారు ఆనాడే వ్రాసి పడేసినా పౌరుషానికి పోకుండా నేను డబ్బు పంపించాను. మళ్లీ ఉత్తరం వ్రాశాను-- దానికి జరిగిందేమిటి? డబ్బు తిప్పి పంపేశారు. ఉత్తరానికి సమాధానమే లేదు....నామీద ఏదో శత్రుత్వం పూనినట్లు నన్ను వేలి వేసినట్లు వాళ్ళు అంత ఇదిగా వుంటుంటే నాకు మాత్రం రోషం రాదా ఏమిటి? అందుకే నేనూ వాళ్ళని పట్టుకుని పాకులాడటం మానేశాను-- మమతలూ, అభిమానాలూ అనేవి రెండు వేపుల నుంచీ రావాలి గానీ ఒకరు విసిరి కొడుతుంటే రెండవ వాళ్ళు ఎంత కని వాళ్ళ చుట్టూ తిరుగుతారు' అందుకే మీకిలా మనవడో, మనవరాలో పుట్ట బోతున్నారు అన్న విషయం కూడా ముందుగా వ్రాయాలనిపించ లేదు-- ప్రసవం అయాక ఆ శుభవార్త ఏకంగా వ్రాస్తాను-- అపుడు వ్రాయాలనిపిస్తేనే-- వ్రాయక పోయినా ముంచుకు పోయేదేమీ ;లేదు-- మమ్మల్ని గురించి తెలుసు కోవాలని అక్కడెవరూ తహతహ లాడిపోవడం లేదు.' కళ్యాణి కూడా అదే విషయం గురించి అలోచిస్తుండేది.
    'అందరు ఆడవాళ్ళ లా పురిటికి పుట్టింటికి వెళ్ళ గలిగే అదృష్టం నాకు లేదు-- పోనీ అమ్మ నయినా పిలుచుకుని కొద్ది రోజులు నా దగ్గర వుంచు కోగాలిగితే'' అనిపించేది ఒక్కోసారి. కాని మరు నిమిషం లోనే ఏదో భయం ఎన్నో అనుమానాలు తల ఎత్తేవి....ఆ యింటి వాతావరణం తో విసిగిపోయి ఎవగింపుతో పారిపోయి వచ్చిన నేను మళ్లీ ఆ మనుష్యులని యిక్కడికి ఆహ్వానించి నా యింట్లో స్థానం ఇవ్వటమా ఆమె వునికిని నేను భరించ గలనా-- పదిమంది లో పరువుగా బ్రతుకుతున్న మేము ఆమె రాకతో నలుగురిలో తల ఎత్తుకొలేని స్థితికి వస్తామేమో-- నువ్వు రావాలమ్మ అని నేను ఒక్క కార్డు ముక్క వ్రాసి పడేస్తే చాలు , అమ్మ రెక్కలు కట్టుకు వచ్చి వాలినట్లే వస్తుంది. నేను వుద్యోగంలో చేరానని వ్రాస్తే సంతోషంగా సమాధానం వ్రాసింది. నేను పెళ్లి చేసుకున్నాను అని వ్రాస్తే బోలెడు సంబరపడుతూ వుత్తరం నిండా మాకిద్దరికీ ఆశీర్వాదాలు గుప్పించటం తప్ప మరోమాట వ్రాయటం చేత కాదన్నట్లు వుత్తరం నిండా రకరకాల  దీవెనలే వ్రాసేసింది. నేను తల్లిని కాబోతున్నాను అని వ్రాస్తే మురిసిపోతూ 'నాకు మనవడు కావాలి కళ్యాణి-- వాడిని చూడటానికి నేను తప్పకుండా వస్తాను. నువ్వు రమ్మని పిలవకపోయినా నాకేం బాధ లేదు. పౌరుషం అంతకన్నా లేదు. నా అంతట నేను నా మానవడని చూసుకోటానికి వస్తే నువ్వూ మీ ఆయనా కలిసి నన్ను గుమ్మం లో నుంచే వెళ్ళ గోట్టలేరు -- నాకు తెలుసు'' అంటూ ఏమేమిటో మరీ చాదస్తంగా , మితిమీరిన సంతోషంలో వ్రాసింది. అలాంటి అమ్మని కొన్నాళ్ళు నా యింట్లో వుంచు కోవాలంటే నే నా మనస్సు ఎదురు తిరుగుతుంది-- నాకు తెలుసు -- నేనే యిలా అనుకుంటున్నప్పుడు వారికి ఎంత మాత్రం ఇష్టం వుండదు.' అనుకుని బరువుగా నిట్టురుస్తుండేది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS