'అడవి ప్రాంతాల వచ్చే విష జ్వరాల గురించి నాకు తెలుసు. అడవి ప్రాంతాలలో మనం చిక్కుబడిపోతే అవసరపడతాయని బాగా ఎక్కువగానే మందులు, ఇంజక్షన్స్ మనకోసం తెచ్చాను- అవి ఈ విధంగా ఉపయోగపడ్డాయి --" అన్నాడు కులభూషణ్.
"ఏదేమైనా మన అదృష్టం బాగుంది. ఆటవికులు దృష్టిలో నువ్విప్పుడు దేవుడివి--" అన్నాడు వేదాంతం.
గ్రామానికి గ్రామం రక్షించబడినా మాంత్రికుడింకా పూజలోంచి లేవలేదని నాయకుడు కంగారు పడ్డాడు. మూడో రోజు పూర్తయినా అతడు పూజ లోంచి లేవకపోవడం అరుదు.
నాయకుడు కలవరపడుతుండగా -- మాంత్రికుడి శిష్యుడొకడు వచ్చి -- దేవత మాంత్రికుడి మీద చూపుతోంది. అయన పరిస్థితి బాగోలేదు. మిమ్మల్ని బలిస్తే తప్ప అయన మాకు దక్కడు-"{ అన్నాడు నాయకుడు వేదాంతంతో.
వేదాంతం కలవరపడ్డాడు.
కులభూషణ్ తడబడకుండా "మీ మాంత్రికుడు చాలా గొప్పవాడు. అయన పూజా ఫలితంగానే మేమిక్కడికి వచ్చాం. అంతా దేవత కరుణ. మేము దేవత మనుషులమే. అని రుజువు చేయడానికి--- ఆమె మాంత్రికుడి కే విషజ్వరం తెప్పించింది. నేనాయన్ను బ్రతికిస్తాను. బ్రతికించక పొతే మీరు మమ్మల్ని బలివ్వచ్చు--' అన్నాడు.
అతడి గుండె నిబ్బరానికి వేదాంతం ఆశ్చర్యపోయాడు.
కులభూషణ్ మాంత్రికుణ్ణి కలుసుకున్నాడు. నాయకుడి ద్వారా తన మాటలు చెప్పించాడు.
తన పూజా ఫలితంగా వారక్కడకు వచ్చేరనగానే మాంత్రికుడి కెంతో తృప్తి కలిగింది.
కులభూషణ్ మాంత్రికుడికీ వైద్యం చేశాడు. వెంటనే కొంత గుణం కనబడింది. మర్నాటికి మాంత్రికుడు కూడా మామూలు మనిషయ్యాడు.
దేవత పంపిన మనిషిగా కులభూషణ్ కక్కడెంతో గౌరవం లభించింది.
మాంత్రికుడు వారిని విశేషంగా గౌరవించాడు.
"నువ్వు సామన్యుడివి కాదు. దేవతల మనిషివి. అప్పుడొక దేవతతో ఆకాశంలోంచి దిగావు. ఇప్పుడొక దేవతను భూమ్మీంచి తెచ్చావు --' అంటూ నాయకుడు వేదాంతానికి మోకరిల్లాడు.
కులభూషణ్ నాయకుడి మాటలకాశ్చర్యపడ్డాడు.
వేదాంతం నవ్వి ఊర్కున్నాడు.
"మిమ్మల్ని మేమెలా సేవించుకోము?" అన్నాడు మాంత్రికుడు. ఆ మాటలను నాయకుడనువదించి వారికి చెప్పాడు.
"బయటి ప్రపంచంలో ఎందరో మనుషులు మరోరకం విష జ్వరంతో బాధపడుతున్నారు. మీకెప్పుడా రోగం వచ్చినా మేము వచ్చి కాపాడతాం. మాకు పనికి వచ్చే మొక్కలు కొన్నిక్కడ ఉన్నాయి.... వాటిని తీసుకుని వెడతాం....' అన్నాడు కులభూషణ్.
"నువ్వప్పుడు తీసుకెళ్ళిన మొక్కేనా ?" అన్నాడు నాయకుడు.
వేదాంతం తలాడించాడు.
నాయకుడు, మాంత్రికుడు వారినో ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు.
'అవును -- ఇక్కడి నుంచే -- నేనా మొక్కను తీసుకున్నాను" అన్నాడు వేదాంతం సంతోషంగా.
అక్కడ సుమారు రెండువందల చతురపు గజాల ఆవరణలో ఒకేరకం మొక్కలున్నాయి.
కులభూషణ్ కూడా వాటిని గుర్తు పట్టాడు.
అప్పటికప్పుడు ఓ పది మొక్కలను జాగ్రత్తగా మట్టితో పాటు తవ్వి బయటకు తీయడం జరిగింది.
"ఇవన్నీ ఒకే రకం మొక్కలవునో కాదో పరీక్షించాలి. చూడ్డానికొక్కలా కనబడుతున్నా ఇవి వివిధ జాతులకు చెందినవయుండాలని నా అనుమానం"-- అన్నాడు కులభూషణ్.
మొక్కలు చిన్నవైనా గుబురుగా అకులున్నాయి. ఒకో మొక్కకు వందేసి అకులుంటాయి. ఆటవికులు వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేసి మిత్రులిద్దరూ మోసుకుని పోయేందుకు వీలుగా ఇచ్చారు.
అయితే వారు వెంటనే బయలుదేరలేదు.
కులభూషణ్ ఆ మొక్కలను తాజాగా ఉండే కొన్ని సులభ పద్దతులను ఆటవికుల నుంచి నేర్చుకున్నాడు. ఆ పద్దతులేలా పని చేస్తున్నది చూడ్డానికి మరో నాలుగు రోజులు వారక్కడున్నారు.
ఆ నాలుగు రోజుల్లోనూ భూషణ్ అక్కడ విషజ్వరం చాయలు లేకుండా చేశాడు.
అక్కణ్నుంచి బయల్దేరే ముందు వారికి ఘనమైన వీడ్కోలు లభించింది. నాయకుడు వారితో -- "మీకోసం ఏమైనా చేయాలనుంది . ఏం చేయగలను?" అన్నాడు.
"మా బాష మీ వారందరికీ నేర్పించు -" అన్నాడు కులభూషణ్.
"ఎందుకు" అన్నాడు నాయకుడు.
"నాగరికులతో సంబంధ బాంధవ్యాలు మీకు మేలు చేస్తాయి " అన్నాడు కులభూషణ్.
నాయకుడు నవ్వి -- ఒకప్పుడు మీ భాష -- మా బాష ఒక్కటే! అంటే - ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాగరిక ప్రపంచపు వాసన గిట్టక మా పూర్వీకులు కొందరిక్కడికి పారిపోయి వచ్చి నేలవేర్పర్చుకున్నారు. నాగరికులలో వుండే లోపాలనన్నీ సవరిస్తూ కొత్త జీవితం ప్రారంభించారు. నాగరికులతో సంబంధ బందావ్యాలు భాషలో రూపుదిద్దుకుంటుంది. పాత బాష క్రమంగా నాయకులకు మాత్రమే పరిమితమయింది-" అన్నాడు.
"నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండడం వల్ల మీరు నాగరికులు సాధించిన ప్రగతికి దూరంగా ఉండి పోతున్నారు. ఆ ప్రయోజనాలు పొందలేక పోతున్నారు-' అన్నాడు కులభూషణ్.
"మితిమీరిన నాగరికతతో అనాగరికత ఉంటుందని మా ఆటవిక ప్రపంచపు సామెత చెబుతుంది. అనాగారికులకు నాగరికత మేలు చేస్తుంది. నాగరికులకు నాగరికత అనాగరికత వైపు తరుముతుంది. ఇది మా నమ్మకం. మా జీవితం మాకు బాగుంది. ఈ విషయమై మాకింకేమీ చెప్పకండి -" అన్నాడు నాయకుడు.
మిత్రులిద్దరూ ఇంకేమీ మాట్లాడలేదు.
గ్రామ ప్రాంతాల విడిచిపెట్టాడానికి నాయకుడు వారి కూడా ఓక అటవికుడిని పంపించాడు.
మిత్రులిద్దరూ తిరుగు ప్రయాణమై గ్రామం చేరుకున్నారు. ఆటవికుడు వారి వద్ద సెలవు తీసుకున్నాడు.
మిత్రులు సుబ్బారావింటికి వెళ్ళారు.
"క్షేమంగా వచ్చారా నాయనా!" అంటూ సుబ్బారావు తల్లి వారిని ఆప్యాయంగా పలకరించింది.
కులభూషణ్ సుబ్బారావు తండ్రి చేత తన కూడా ఉన్న మొక్క ఆకులూ తినిపించాడు. తినగానే ఆయనలో కొంత మార్పు వచ్చింది.
మరో రెండు రోజులు వారా ఇంట్లో ఉండిపోయారు.
ఆ రెండు రోజుల్లోనూ సుబ్బారావు తండ్రి పూర్తిగా కోలుకున్నాడు. అయన శరీరం బక్కచిక్కి ఉంది కాని ఆయనలో ఇప్పుడు కొత్త ఉత్సాహం వచ్చింది.
ఆ ఇంట్లో మిత్రులను దేవతల్లా చూశారు.
తను ఆరోగ్యాన్ని పొందడం సుబ్బారావు తండ్రికే ఆశ్చర్యంగా ఉంది.
వేదాంతం కులభూషణ్ ని అభినందించాడు.
కులభూషణ్ చాలా సంతోషంగా ఉన్నాడు.
"బ్లడ్ క్యాన్సరునే కాదు -- ఏ క్యాన్సరు నైనా క్షణాలలో నాశనం చేయగల విశేషం నాకు తెలిసింది. క్యాన్సర్ కు వ్యతిరేకంగా నేనూ ధనుష్టంకారం చేస్తాను." అన్నాడతడు.
"ముసలాయన జబ్బెమిటి?" అన్నాడు వేదాంతం.
"బ్లడ్ క్యాన్సర్ కాకపోవచ్చు కానీ -- అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితి ఆయనది. క్యాన్సర్ బాగా ముదిరిపోయింది. ఈ ప్రపంచంలో మనకు తెలిసిన ఏ వైద్యమూ అయన ప్రాణాలను రక్షించలేదు. వేదాంతం -- ఎలా కనుగోన్నవో కానీ - చాలా గొప్ప అద్భుతాన్నే పట్టావు. నేను నీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి "- అన్నాడు కులభూషణ్.
"నాకు సంబంధించి అంతా భగవంతుడి దయ!" అన్నాడు వేదాంతం.
వారిద్దరూ అక్కణ్ణించి బయల్దేరారు.
సుబ్బారావు బస్ స్టాప్ దాకా వచ్చాడు.
"త్వరలోనే ఈ గ్రామానికి గానేయ్య బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుంది " అన్నాడు వేదాంతం సుబ్బారావుతో.
'అదెలా సాధ్యం?' అన్నాడు సుబ్బారావు ఆశ్చర్యంగా.
"నా మిత్రుడు రోగాల్ని నాశనం చేస్తాడు. నేను రోగ క్రిముల్ని నాశనం చేస్తాను. చూస్తుండు -- అద్భుతాలు జరుగుతాయి --" అన్నాడు వేదాంతం.
***
