"నాయకుడితో నువ్వెలా మాట్లాడగలిగావు?" అన్నాడు కులభూషణ్.
"నాయకుడికి తెలుగు వచ్చు -" అన్నాడు వేదాంతం.
"సుబ్బారావు మనకిక్కడేదో జబ్బు సమస్య ఉందని చెప్పాడు?" అన్నాడు కులభూషణ్.
'అవును -- అందుకే మాంత్రికుడు పూజలో ఉన్నాడు-"
"మంత్రాలకు జబ్బులు తగ్గవు. నేనోసారి రోగుల్ని చూస్తాను--" అన్నాడు కులభూషణ్.
"వద్దు. మీకు సమయం లేదు -" అన్నాడు నాయకుడు.
"నేను డాక్టర్ని -- రోగుల్ని మంత్రాలకు వదిలిపెట్టి పోలేను-"
"కానీ.....?" అని వేదాంతం ఏదో అనబోయాడు.
"ఇంకా మనకు రేపటి దాకా టైముంది గదా !" అన్నాడు కులభూషణ్.
"మాంత్రికుడు పూజ ముందే అయిపోతే ఆశ్చర్యం లేదు. పూజ అయిపోయిందంటే మీ పనీ అయిపోతుంది...' అన్నాడు నాయకుడు.
వేదాంతం వివరించాడు.
మాంత్రికుడు కళ్ళు తెరిచే సమయానికి ఆటవిక ప్రాంతంలో నాగరికులున్నారేమో చూడమంటాడు. ఆ సమయానికి ఎవరుంటే వారిని దేవతకు బలివ్వక తప్పదుట.
'అదేమీ చిత్రమో! మాంత్రికుడు ఎప్పుడు పూజకు వెళ్ళినా నాగరికుడు మాకు దొరుకుతూనే ఉంటాడు " అన్నాడు నాయకుడు.
"మీరు తరచుగా నరబలులిస్తారా?' అన్నాడు వేదాంతం.
"ఏడాదికోసారి తప్పని సరి -' అన్నాడు నాయకుడు.
కులభూషణ్ మరోసారి తను రోగుల్ని చూసి తీరాలని చెప్పాడు.
అతణ్ణి వారించడానికి నాయకుడు చాలా ప్రయత్నించాడు.
"మే దేవతే నన్నిక్కడకు పంపింది. నేను మీకు సాయపడాలి" అన్నాడు కులభూషణ్ మొండిగా.
"మీ యిష్టం-" అన్నాడు నాయకుడు విసుగ్గా.
ఆ అడవిలో అంత చక్కటి గ్రామముంటుందని ఎవరూ ఊహించలేరు.
నేలంతా చక్కగా చదును చేయబడి ఉంది.
ఒక విధమైన అడవి గడ్డితో నేయబడ్డ గుడిసెలు -- చూడ్డానికి చిత్రకారుడి బొమ్మల్లా ఎంతో అందంగా ఉన్నాయి.
వారు నాగరికతకు దూరంగా జీవిస్తుండవచ్చు. కానీ నాగరికులకు లాంటి సదుపాయాలు చాలా ఉన్నాయి.
వారికి స్విమ్మింగ్ పూలు, ప్లే గ్రౌండ్స్, ట్రయినింగ్ స్కూళ్ళు ఉన్నాయి. ఎటొచ్చీ వారి ఆటలు వేరు. వారి శిక్షణ వేరు.
ఆటవికులు గ్రామం చిన్నది కూడా. జనాభా రెండు వేల వరకూ ఉంటుంది. నాగరికులకు సాధ్యపడని క్రమశిక్షణతో వారక్కడ జీవిస్తున్నారు.
వృద్దులక్కడ పని చేయరు. వారికి గ్రామంలో గౌరవ స్థానముంటుంది. తమ అనుభవాలను ట్రయినింగ్ స్కూల్స్ ద్వారా యువతరానికి పంచి పెడతారు.
వారందరూ ఒక విధమైన అడవి నారతో చేసిన దుస్తులు మొల చుట్టూ కట్టుకుంటారు. స్త్రీలు వివాహితలైతే తప్ప వక్ష స్థలం కప్పుకోరు. వివాహిత స్త్రీలు -- ఆకులతో తయారు చేసిన మాలను చాతీ చుట్టూ కట్టుకుంటారు.
వారు విల్లు వదలడంలో నేర్పరులు. మల్ల విద్యలో అసమాన ప్రావీణ్యం సంపాదించారు. ఇవి కాక వారికి మాత్రమే తెలిసిన ప్రత్యేక విద్యలు కొన్ని ఉన్నాయి. అది అద్భుతమైనవి. పులి, సింహం వంటి క్రూర జంతువులను చంపరు. చంపకుండా లొంగదీసుకోగల విద్యలవి. సాధారణంగా వారు క్రూర జంతువులను చంపరు. వాటిలో విరోధం వచ్చినప్పుడు తమ విద్యలతో వాటిని లొంగదీసి గ్రామానికి తెచ్చి పెంపుడు జంతువులుగా మార్చి తిరిగి అడవిలో వదిలి పెడతారు. సాధు జంతువులను - ఆహారానికి అవసరమైతే తప్ప చంపరు. ఆ విధంగా వారక్కడ జంతువులతో సహజీవనంచేస్తున్నారు.
ప్రతి రెండు సంవత్సరాలకూ నాయకుడి ఎన్నిక జరుగుతుంది. బలవంతుడే వారి నాయకుడు . ఎన్నికలలో బలపరీక్ష జరుగుతుంది. అందరినీ అన్ని విధాల ఓడించగలవాడు నాయకుదవుతాడు.
ఒకసారి నాయకుడైనవాడు-- రెండు సంవత్సరాలకొకసారి తన నాయకత్వం సవాలు చేసే వారెవరైనా ఉంటే తెలుసుకోవాలి. ఎవరైనా సవాలు చేస్తే తప్ప నాయకుడి ఎన్నిక మరోసారి జరుగదు. అయితే ప్రజా సంరక్షణలో నాయకుడు విఫలమైతే -- నాయకుడు మరోసారి ఎన్నిక జరపాలి. విఫలమైన అతడి కంటే సమర్ధుడు లేడని ఉజువౌతేనే నాయకుడు పదవిలో కొనసాగుతాడు. కొత్త నాయకుడెన్నికయితే - రెండు సంవత్సరాల పాటు పాతనాయకుడతడికి సలహాదారుగా ఉండాలి.
అక్కడ పార్టీలు లేవు. రాజకీయాలు లేవు. ప్రజలకు తమ సంరక్షణ చూసుకునే నాయకుడు కావాలి. ప్రజా క్షేమమే నాయకుడు ధ్యేయం.
నేరస్తుల కిక్కడ కారాగారాలు లేవు.
నాయకుడి మాట వారికి శిలాశాసనం.
అక్కడ జరిగే నేరాలు స్వల్పం. దొంగతనాలు అరుదు. ఎవడైనా దొంగతనం చేస్తే -- ఎవడి సొమ్ము దొంగిలించాడో వాడిని దొంగ నాయకుడు శాసించి నంత కాలం సేవించుకోవాలి.
ఎక్కువగా నేరాలు -- స్త్రీ సంబంధమైనవి.
అక్కడ ప్రణయానికి హద్దులు లేవు. వివాహిత కాని స్త్రీ బిడ్డలను కనవచ్చు. స్త్రీ పురుషులు తమకు నచ్చిన వారితో యధేచ్చగా వ్యవహరించవచ్చు.
అయితే వారిలో వివాహ వ్యవస్థ అయింది. ఇష్టపడిన స్త్రీ పురుషులు నాయకుడి అనుమతితో దంపతులుగా జీవించవచ్చు. గ్రామంలో వివాహిత స్త్రీకి ప్రత్యెక గౌరవముంది. ఒకసారి దంపతులైనవారు శాశ్వతంగా కలిసి జీవించాలి తప్ప విడిపోకూడదు.
వివాహితస్త్రీలు ఇంటి పట్టునే ఉండి వంట పనులు చేస్తారు. వారెవరికీ సేవలు చేయరు. సేవా కార్యక్రమం అవివాహిత స్త్రీలది.
వివాహితులైనాక దంపతులలో ఎవరూ పరసంపర్కాన్ని కోరకూడదు. అలా చేస్తే శిక్షలు కఠినంగా వుంటాయి. నేర విచారణ నాయకుడు చేస్తాడు. నేర నిర్ణయం కూడా ఆయడిదే!
పురుషుడు తప్పు చేస్తే అతడు అడవిలో పది రోజుల పాటు సంచరించి రావాలి. అతడి నెవరూ రక్షించ కూడదు. అతడి కెవరూ సాయపడకూడదు. బ్రతికుంటే తిరిగి గ్రామంలోకి వస్తాడు.
ఆడది తప్పు చేస్తే -- ఆమెను పునీతురాలీని చేయడానికి మాంత్రికుడి వద్దకు పంపుతారు. మాంత్రికుడి పద్దతులు క్రూరంగా ఉంటాయి. ఏ స్త్రీ కూడా తను మాంత్రికుడి పాలవకూడదనే అనుకుంటుంది.
అతడు వాతలు పెడతాడు. కర్రతో కొడతాడు. గోళ్ళతో రక్కుతాడు. పళ్ళతో కరుస్తాడు. ఇవన్నీ దేవత పేరు మీద జరుగుతాయి.
అయినా అప్పుడప్పుడు తప్పులు జరుగుతూనే ఉంటాయి. అడవి మృగాలకూ, మాంత్రికుడికీ చేతి నిండా పని!
ఆ గ్రామాన్ని నాయకుడి తర్వాత మాంత్రికుడే శాసించగలడు. అతడికి వైద్యం తెలుసు. అడవి మూలికల మందుకు వాడుతాడు. అయితే అతడి వైద్యం దేవత పేరుతొ జరుగుతుంది. బ్రతికిన వాడిపై దేవత కరుణ ప్రసరించినట్లు లెక్క!
మంత్రికుడైన వాడికి సేవ కోసం నలుగురు యువతులుంటారు. వారు మాంత్రికుడిని తప్ప చరించకూడదు. వారి ద్వారా తమ కన్న బిడ్డల్లో ఒకరిని ఎన్నుకుని భావి మాంత్రికుడిగా శిక్షణ ఇస్తాడు మాంత్రికుడు. మాంత్రికుడెప్పటి కప్పుడు అవివాహిత స్త్ర్రీల నుండి తనక్కావలసిన కొత్త యువతులనెన్నుకుని పాత యువతులను విడిచి పెడుతుండవచ్చు. అయితే నలుగురికి మించి సేవకు నియమించబడరు.
ప్రస్తుతం మాంత్రికుడు పూజలో ఉన్నాడు.
గ్రామంలో ప్రాణభీతి!
కులభూషణ్ రోగులను పరీక్షించాడు.
తన మందుల సంచీ విప్పాడు.
గ్రామానికి నీటి సరఫరా జరిగే బావుల్లో కొన్ని మందులు చల్లించాడు. త్వరగా వైద్యం ప్రారంభించాడు.
కులభూషణ్ వైద్యం వెంట వెంటనే గుణం చూపిస్తోంది. అందువల్ల ఆటవికుల్లో నమ్మకం పెరుగుతోంది.
తలనొప్పి, వంటి నొప్పి, జ్వరం వగైరాలు క్షణాల మీద తగ్గించగల మందులుంటాయని ఆటవికులకు తెలియదు. వారికి ఆశ్చర్యంగా ఉంది.
నలుగురు ఆటవిక యువకులు చకచకా అతడికి సాయపడుతున్నారు.
ఆరోజేలా గడిచిందో కూడా కులభూషణ్ కి తెలియదు.
తొలిసారిగా మిత్రుడి లోని డాక్టర్ని చూసిన వేదాంతం తెల్లబోతున్నాడు.
ఎవరి కోసం?
ఆ ఆటవికుల్లో ఏ ఒక్కరూ అతడికేమీ కారు.
మరి - ఎవరి కోసం అతడీ విధంగా కృషి చేస్తున్నాడు?
ఆరోజు గడిచింది.
మంత్రికుడింకా పూజలోంచి లేవలేదు.
కులభూషణ్ ఇతరులకా వ్యాధి సోకకుండా యేవో మందు లిస్తున్నాడు. ఆరోజు సాయంత్రం అయ్యేసరికి -- ఊరందరికీ అతడి మందులందాయి.
"ఇన్ని మందు లెక్కడివి?" ముందుగా ఇలా జరుగుతుందని ఊహించావా?" అన్నాడు వేదాంతం ఆశ్చర్యంగా.
