Previous Page Next Page 
మారిన విలువలు పేజి 37

 

    ఆ సాయంకాలం బజారుకు వెళ్ళి పాపకోసం రెండు ఫ్రాకులు , తువ్వాళ్ళు కొన్నది. వదినకు బత్తాయి పళ్ళు కొన్నది.
    జానకి వెళ్ళేసరికి సూర్యారావు ఇంట్లో లేడు. సుందరమ్మ వంట ఇంట్లో పని చూసుకొంటున్నది. మెల్లగా కొట్టు గది తలుపు తోసుకొని లోపలికి వెళ్ళింది జానకి. గదిలో చిన్న దీపం వెలుగుతున్నది. ఆ వెలుగులో పాలిపోయినట్లున్న వదిన్ని, పక్కలో ఇటు, అటు కదులుతూ తల్లి పాల కోసం తడుముకుంటున్న నెత్తురు ముద్దా లాంటి పాపను చూసింది.
    అలికిడి  విని కళ్ళు విప్పింది కనకం. ఎదురుగా జానకి.
    "ఎవరు? జానకీ! వచ్చేవా? నువ్వేనా?" అన్నది మెల్లగా.
    "నేనే, వదినా! ప్రకాశం చెప్పేడు. నిన్నూ, పాపనీ చూద్దామని వచ్చెను" అన్నది చేతిలో కాగితం సంచి మంచం కొసకు పెడుతూ.
    "దగ్గిరగా రాబోకు. ఇంకా పురిటి స్నానం కాలేదు."
    "మరేం ఫరవాలేదు. వదినా, కావాలంటే ఇంటికి పోయి స్నానం చేస్తాను. నిన్నూ, పాపనీ చూద్దామని వచ్చి, దూరంగా కూర్చుని పోయేదా?" అన్నది జానకి పాపను చేతిలోకి తీసుకొంటూ.
    కనకం లేచి కూర్చుంది. "ఇదేమిటి?" అన్నది ఆ పొట్లం చూసి.
    "పాపకి తువ్వాళ్ళు, ఫ్రాకులు, నీకు పళ్ళు."
    "ఎందుకమ్మా ఇవన్నీ? నువ్వు భరిస్తున్న ఖర్చులు చాలకనా?"
    "నా సరదా, వదినా! అంతకన్నా మరేం లేదు" అన్నది జానకి.
    అరగంట పైగా వదినా మరదళ్ళు ఆప్యాయంగా మాట్లాడుకొన్నారు. అక్కడి, ఇక్కడి సంగతులు చెప్పుకొన్నారు.
    "అన్నయ్య సెలవులో ఉన్నాడుట కదా? ఇంట్లో లేడెం?' అని ప్రశ్నించింది జానకి.
    "ఈ రోజుతో సెలవు సరి. ఇప్పుడే అలా వెళ్ళొస్తానని గుమ్మం కదిలేరు. మీరు వెళ్ళినప్పటి నుండి ఎక్కడికీ వెళ్ళలేదు. ఇంట్లోకి ఏమైనా అవసరం అయితే , అత్తయ్య ఇరుగుపొరుగు పిల్లల చేత  తెప్పిస్తున్నారు." అన్నది కనకం.
    "మరి నే వెళ్ళొస్తాను, వదినా!" అంటూ లేచింది జానకి.
    "మీ అమ్మని చూసేవా? మీ అన్నయ్య వచ్చే వరకూ ఉండవూ?"
    "లేదు, ఇంకోసారి వస్తాను" అంటూ గుమ్మం దాటింది జానకి.
    సూర్యారావు వీధి లోంచి తిరిగి వచ్చేడు. నట్టింట్లో తల్లితో ఏదో చెబుతున్నాడు. ఒక్కసారి అటువెళ్ళి చూసిరానా-- అనుకొంది జానకి. మనసు మార్చుకొని గుమ్మం దిగింది.
    జానకి ఇటు రాగానే సూర్యారావు భార్య దగ్గరికి వెళ్ళేడు. జానకి పాపకు తెచ్చిన బట్టల్ని తీసి చూస్తున్నది కనకం.
    "ఇవేమిటి? ఎవరు తెచ్చేరు?" ప్రకాశం తెచ్చి ఉంటాడనుకొంటూనే భార్యను ప్రశ్నించేడు సూర్యారావు.
    "జానకి తెచ్చింది" అన్నాది కనకం , భర్త ముఖం లోనికి చూస్తూ.
    "ఏదీ! ఎప్పుడొచ్చింది?"
    "మీరోచ్చే ముందరే వెళ్ళింది. గుమ్మంలో మీకు తారసపడలేదా?"
    జానకి ఇంటికి వచ్చి కూడా తనతో మాట్లాడకుండా వెళ్ళిపోవడం సూర్యరావుకు కోపం తెప్పించింది. అభిప్రాయభేదంతో ఏదో మాట అన్నంత మాత్రాన ఇలా ముఖం తప్పించుకు పోతుందా? రక్తసంబంధం , అభిమానాలు అంటారే. ఇంతేనా వాటి విలువ? ఈ నాటి బాంధవ్యాలన్నీ ఏరు దాటగానే తెప్ప తగలేసే రకమేనా? రెక్కలు వచ్చిన పక్షులు గూటిని వదిలి పోయినట్లు, ఒక ఇంట్లో పుట్టి, పెరిగిన వాళ్ళు అవకాశం దొరకగానే తమకు తోచిన దారులు పట్టుకు పోవడమేనా?
    తనతో మాట్లాడడం ఇష్టం లేని వాళ్ళు తన ఇంటి కెందుకు రావాలి? వీళ్ళకు ఇంత డబ్బు పెట్టి, చాకిరి చేసిన తను చెడ్డా, వదిన గారు మంచీనా? తనతో లేని బాంధవ్యం తన భార్యతో మాత్రం ఎందుకు ఉండాలి?
    "ఎందుకు పుచ్చుకున్నావు? తీసుకు పొమ్మనలేక పోయావా?" భార్యను గద్దించేడు.
    "అదేమిటండి! అన్ని ఖర్చుల్లో ఉండి కూడా అభిమానంగా జానకి తెస్తే...."
    "అది ఊరు వాడి సొమ్ముతో అభిమానంగా తెస్తే, నువ్వు ఆప్యాయంగా పుచ్చుకున్నావా? దానికి సిగ్గు లేకపోతె నీక్కూడా లేకుండా పోవాలా?' కోపంతో పళ్ళు పటపట కోరికెడు సూర్యారావు.
    "ఛీ...ఛీ! ఏం మాటన్నారండీ! జానకి అటువంటి పిల్ల కాదు. ' కనకం భర్తను వారించింది.
    "జానకీ అలాటి పిల్ల కాదు; శాంతా అలాటి పిల్ల కాదు. లోకులకు నోరు సలిపి నీ ఆడపడుచులపై అపనిందలు ప్రచారం చేస్తున్నారు. రెండు నెలలై ఈ గోల వినలేక ఇంట్లో కూర్చుని చెవులు మూసుకోన్నాను. పిల్లి కళ్ళు మూసుకోన్నంత మాత్రన ఊరు చీకటి అవుతుందా? ఈరోజు వీధిలోకి పొతే, "ఏమిటయ్యా ఆ అప్పచేల్లెలు కి బుద్ది చెప్పి ఇంటికి తెచ్చుకొనేది బదులు , వాడితో తిరగమని ఇంకో దాన్ని కూడా పంపేవా?" అని అంతా నిలదీస్తుంటే ఏం చెప్పాలి?"
    "ఇంక ఈ ఊళ్ళో నే బ్రతకలేను. కనకం. వీళ్ళందరికి దూరంగా ఎక్కడికో దగ్గిరికి పోవాలి. అప్పటికి కాని నా ప్రాణానికి సుఖం లేదు." ఆవేశంగా కేకలు వేస్తూ తలుపు తెరచుకుని బయటికి వచ్చేడు సూర్యారావు.
    గుమ్మం దిగి నాలుగడుగులు నడిచిన జానకి ఆ విధంగా తను వెళ్ళిపోవడం బాగుండలేదనుకొంది. ఇంటికి వచ్చి అన్నను , తల్లిని చూడకుండా పోవడం మిగలిన ఏ కాస్త అభిమానాన్నై నా చేజేతులా తెంపుకొన్నట్లే అవుతుందని భావించింది. వెంటనే వెను తిరిగి అడుగులు వేసింది. ఆమె గుమ్మం ఎక్కబోతుంటే విసురుగా వస్తున్న సూర్యారావు మాటలు వినిపించేయి. అడుగులు వాటంతట అవే ఆగిపోయేయి. 'అయింది కద వచ్చిన పని! ఇంక 'పద' అన్నది మనసు.
    కాలాన్ని గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలలో కొలుస్తారు. జీవితాన్ని అనుభవాలు, సంఘటనలు, సుఖ దుఃఖాలతో కొలుస్తారు. ఒక సంవత్సరం గడిచి పోయిందంటే, ఆ సమయంలో గడిచిపోయిన మంచి, చెడు సంఘటనలే జీవిత గమనాన్ని కొలిచి చూసే మైలు రాళ్ళుగా ఉంటాయి.

                               
    కొందరి బ్రతుకులు ఎంత ముందుకు పోయినా వాటి నిడివిని కాలపరిమితిని తెలిపే కొలత లేకుండా ముందుకు పోతాయి. వారి జీవన భ్రమణం లో నిన్నకు, గడిచి నేటికి బేధం ఉండదు. గడిచిన ఏడుకు, రాబోయే ఏడుకు వ్యత్యాసం కాని, ఆ నడుమ కాలంలో పెరిగిన మనో వికాశం కాని ఉండదు.
    మరి కొందరు బ్రతుకులో అడుగుకు ఆమడ దూరంగా ప్రయాణిస్తూ దారి పొడుగునా అనుభవాల ఆనవాళ్ళూ నిలుపుకొంటూ, జీవితంలో కొంతదూరం ప్రయాణించేక, గడిచిన కాలంలో ఎంత దూరం నడిచేనూ అని వెనుదిరిగి చూసుకొంటారు.
    శాంతంగా కూర్చుని గతించిన రోజుల్ని జ్ఞప్తికి తెచ్చుకోడం లో ఎంతో మేలు ఉంటుంది. ఆవేశం లో తమ్ము తాము మరిచిన సమయాల్లో చేసిన పనులను ఆడిన మాటలను అటు తరువాత నిర్మలంగా ఆలోచించుకొంటే ఈమాట అన్నది , ఆ పనులు చేసింది తామేనా అని ఆశ్చర్య పోవలసి వస్తుంది.
    ఆత్మవిమర్శ అందరికీ అవసరమే. తమ లోటు పాట్లను తెలుసుకొని, సరిదిద్దుకోవాలనే సత్సంకల్పం కలిగిన వారికి ఇటువంటి మానసిక చర్చ ఎంతైనా అవసరం.
    గతబల సేతు బంధనం వల్ల లాభం లేకపోవచ్చు కాని, గతించిన విషయాలను పునశ్చరణ చేసుకోవడం వల్ల లాభం పొందవచ్చు. 'తను' అన్న వ్యక్తిని ఎదురుగా నిలిపి పరీక్షించగలిగినప్పుడే మంచిచెడ్డల నిర్ణయాలు న్యాయబద్దంగా జరుగుతాయి. అటువంటి అనుకూల వాతావరణం ఏర్పడాలంటే ఆ సంఘటన జరిగిన కాలానికి, విచారణ జరుగుతున్న సమయానికి మధ్య తగినంత వ్యవధి ఉండాలి. అప్పుడే ఒక మనిషి నిష్పాక్షికంగా తన గురించి తమ న్యాయ నిర్ణయం చేసుకొనే అవకాశం కలుగుతుంది. తమ లోటు పాట్లను ఇతరులు ముఖ మెదురుగా ఎత్తి చూపితే ఎవరికైనా కోపం వస్తుంది. అదే తమకు తాముగా తెలుసుకొంటే వాటిని సరిదిద్దుకొనే అవకాశం ఉంటుంది.
    ఈకారణం గానే కాకపోయినా, గడిచిన జీవితంలోని మంచి చెడ్డలను నెమరు వేసుకొనే అలవాటు చాలా మందికి ఉంటుంది. జానకి కూడా ఆ జాబితాలోకి చేరిందే. ఎప్పటికప్పుడు ఆలోచనకు చెల్లు బెట్టడం అన్నది ఆమె తత్త్వం కాదు. వాటిలో తిరుగుతూ ఇటు, అటు తిప్పి చూస్తుంది. గడిచిన రోజులు కళ్ళ ముందు కదులుతుంటే అందులో తన రూపం చూసుకొంటున్నది జానకి.
    జానకి వదినగారిని చూసివచ్చిన పది రోజుల వరకు ప్రకాశం రాలేదు. ఆ రావడం కూడా వేళకాని వేళలో వచ్చేడు. అప్పటికి జానకి ఇంకా పక్క మీంచి లేవలేదు. అలవాటైన అడుగుల ధ్వని, తలుపు తట్టిన చప్పుడు విని, గోవిందబాబు కాని తిరిగి వచ్చేరా అనుకొంది. ఏ కారణం వల్లనైనా అతడు తిరిగి వచ్చినా, ఈ సమయంలో తన ఇంటి తలుపు తట్టవలసిన అవసరం ఏముంటుందని ఆలోచించింది. తరుచుగా వచ్చే రెండో వ్యక్తీ ప్రకాశం. కాని ప్రకాశం ఎప్పుడూ ఇటువంటి సమయంలో రాడు. మరి ఎవరు వచ్చి ఉంటారు? 'ఇంత ఉదయాన్నే నాతొ ఏం పని?' జానకి లేచి తలుపు తెరిచే లోపునే అటునుండి మాట వినిపించింది.
    "అక్కా, నేనే... తలుపు తియ్యి."
    అది ప్రకాశం గొంతుక. జానకి గడియ తీసి పక్కకు తప్పుకోంది. నిద్రలేమి చే ఎర్రబారిన కళ్ళు, చెదిరిన జుట్టు, నలిగిన బట్టలు - ప్రకాశాన్ని చూసి జానకి కంగారు పడింది.
    అంతకు పూర్వం నెల రోజుల క్రిందట వాల్తేరు లో ఓకే బుక్ స్టాల్ తెరవబోతున్నాం అన్నాడు ప్రకాశం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS