Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 37


    అది పెద్దహాలు కోటలకు దర్బారు హాలు వున్నట్లుగానే అంతఃపురం గదుల మధ్యకూడా ఒక హాలుంటుంది. అక్కడ అంతఃపురంలోని ఆడవాళ్ళ సమావేశాలు జరుగుతాయి. అంతఃపురంలోకి రాదగిన వ్యక్తులు వచ్చినప్పుడు అక్కడే కూర్చుంటారు. ముగ్గురూ ఆ హాలులో కూర్చున్నారు.
    "జగ్గమ్మా, అక్కయ్యను రమ్మను" అని చెప్పి పంపాడు రామరాయులు. నరసారాయుడు విజయనగరం గురించీ, విజయరామరాజు కొన్నాళ్ళు యింగ్లీషువాళ్ళతోటీ, కొన్నాళ్ళు పరాసు (ఫ్రెంచి) వాళ్ళతో స్నేహంచేస్తూ అనుసరిస్తున్న ద్వంద్వనీతిని గురించి మాట్లాడుతున్నాడు నరసారాయుడు.
    "విజయరామరాజుకు పరాయి దేశస్తుల తోటి స్నేహం లావుఅయింది, అతడు విదేశీయుడు కనుక (కళింగరాజ్యం అవతలి వారంతా వారి దృష్టిలో విదేశీయులే) విదేశీయుల్ని ప్రేమించగలుగుతున్నాడు. వాళ్ళు వ్యాపారులు. వ్యాపారంకోసం వేలమైళ్ళు వెతుక్కుంతూ వచ్చినవాళ్ళు. విజయరామరాజు అనుసరించే ద్వంద్వనీతి వాళ్ళకూ తెలుసు, యితని స్నేహాలు యెప్పుడో కళింగరాజ్యపతనానికి దారితీస్తాయి. కాబట్టి యిక్కడ విజయనగరం చుట్టుప్రక్కలవున్నా చిన్నరాజులంతా కలిసికట్టుగా నిలబడాలి. మనమధ్య వున్న తాత్కాలిక వైషమ్యలను మర్చిపోవాలి" అని రామరాయులకు నూరిపోస్తున్నాడు యినుగంటి నరసారాయుడు మహామంత్రి.
    రామరాయుడు మహామంత్రి మాటల్ని శ్రద్దగా వింటూ ఆయన ముందు చూపుగల ఆలోచనల్ని అర్ధం చేసుకుందుకు ప్రయత్నిస్తున్నాడు.
    ఆ ఘట్టం జరుగుతూ వుండగా మల్లమ్మ ఆ గదిలో కాలుపెట్టింది. నరసరాయుడు ఆలోచనలో మునిగి వుండి మాటలమధ్య ఆమె రాకడ గమనించలేదు.
    "విజయరామరాజు తన సైన్యంతో యీపాటికి యెప్పుడో బొబ్బిలిని కబళించేవాడు. చుట్టుప్రక్కల టెక్కలి, రాజాం, పిఠాపురం ప్రభువులంతా స్వదేశీ వుద్యమంలో వున్నారు. బొబ్బిలితో యుద్దానికి వస్తే వాళ్ళంతా అలజడి చేస్తారు అందునిమ్చి చిన్నదే అయినా బొబ్బిలిమీదికి అతడు రాలేదు. అదీకాక బొబ్బిలివీరుల పరాక్రమం యేమిటో అతడెరుగు" అంటున్నాడు నరసారాయుడు.
    "చెప్పాలంటే చరిత్ర పునరావృతం అవుతోంది. యిది ఔత్తరాహులయిన ఆర్యజాతికి, దాక్షిణాత్యులయిన ద్రావిడులకీ మధ్య జరుగుతున్న పోరాటం చరిత్రలో యిలా యెన్నోసార్లు  జరిగింది" అన్నాడు మళ్ళీ.
    ఆ మాట అంటూ వుండగా మల్లమ్మదేవి వంగి ఆయన పాదాలను తాకి లేచింది. ఆయన త్వరగా పెళ్ళి కావాలని ఆశీర్వదించాడు.
    మల్లమ్మదేవికి పెళ్ళి ముచ్చట గుర్తురాలేదు.
    "బాబయ్యగారూ! విజయరామరాజు విచిత్ర ప్రవర్తనకు విదేశీయుడు కావటమే కారణం అయితే అతడిని మనమధ్య యెందుకు వుండనివ్వాలి" అని నరసారాయుడిని వుద్దేశించి అడిగింది.
    "నూరేళ్ళు వర్ధిల్లు తల్లీ! నువ్వు సరిగ్గా బొబ్బిలివారింటికి రాదగిన ఆడపిల్లవు" అన్నాడు నరసారాయుడు.
    ధర్మారాయుడు "అవును నిజం" అన్నాడు.
    తండ్రి హృదయం ఆనందంతో పొంగిపోయింది. కొడుకులు లేని కొరత తీరిపోయినట్లు అయింది. ముప్పెరగా ముంచుకువచ్చిన అనందానికి ఆ తండ్రి పరవశించిపోయినాడు.
    "విజయనగరం వారికి అంగబలమూ, ఆర్ధికబలమూ వున్నాయి" అంటూ వివరించాడు నరసారాయుడు.
    వారికీ అంగబలం వుంటే మనకు సంఘబలం వుంది. వారికి ఆర్ధిక బలం వుంటే మన కళింగులకు నైతికబలం వుంది. వాళ్ళకంటే మనం తక్కువ అని యెందుకు అనుకోవాలి బాబయ్యగారూ!" అని అడిగింది మల్లమ్మ నెమ్మది అయిన స్వరంతో, వినయ విధేయతలతో.
    ఆమె వినయ విధేయతల వెనుక, నెమ్మది అయిన ఆ కంఠస్వరం వెనుక చెలరేగుతున్న మంటల్నీ, దృఢంగా నాటుకుపోయి విశాలంగా విస్తరించిన అన్యాయమనే చెట్టుని పెరికివేయకలిగిన తీవ్ర ప్రభంజనాన్ని చూచాడు నరసారాయుడు. గోపాలకృష్ణరంగారావు సరి అయిన జోడిని యెన్నుకున్నాడని మనసులో యెంతో సంతోషించాడు.
    "చాలు తల్లీ! నేను గోపాలకృష్ణ రంగారావుకు కాబోయే భార్యను చూడాలని వచ్చాను. ఒక గొప్ప వీరవనితను చూచాను. నీవు బొబ్బిలి వీరుల మధ్యకు రాణీపదవితో వస్తున్నావు. నీ రాణీతనం బొబ్బిలి వీరులకు వుత్తేజకరం అవుతుంది." అని ఆశీర్వదించి లేచాడాయన.
    ఆయనవెంట ధర్మారాయుడూ, ఆ వెంట రామారాయుడూ కూడా లేచారు వూరి పొలిమేరల వరకూ వెంట వెళ్ళి ఒక నీటిమడుగు దగ్గర తాను ఆగిపోయినాడు రామరాయుడు అవును యిది ఒక జాతినేర్చిన రీతి. యిది ఒక సాంప్రదాయం యిది ఒక అర్ధవంతమయిన ఆచారం.
    సంధ్య చీకట్లు అలుముకునేవేళ: చుక్కలు యింకా నిక్కి నిక్కి చూస్తూ వుండగా ఆ పెళ్ళిపెద్దలు యిద్దరూ బొబ్బిలి రాచనగరులో కాలు పెట్టారు. గోపాలకృష్ణ రంగారావు యేకాంతంలో కూర్చుని ఆలోచనలలో మునిగి వున్నాడు. అతడు పెంచే పావురాల జంటలో పెంటి పావురం చచ్చిపోయింది. మగపావురం బిక్కు బిక్కుమంటోంది. దానికి జంట కోసం వెతకాలి.
    అతడు మగ పావురాల్ని చేతులమధ్య పట్టుకుని నెమ్మదిగా దువ్వుతూ ఆలోచిస్తున్నాడు. పావురం కువ కువ లాడుతోంది.
    జంటకోసమే దాని కువ కువలు.
    గోపాలకృష్ణ రంగారావుకు మల్లమ్మ గుర్తువచ్చింది. మల్లమ్మను ఆయన యిదివరకే ఒకసారి చూచాడు. అప్పటికి తానింకా రంగారావు కాలేదు. యెక్కడనించో వస్తూవుంటే చీకటిపడేవేళ అయింది దారిలో ఎలాగయినా ఆ రాత్రికే బొబ్బిలి చేరాలన్న ఆదుర్దాతో వస్తున్నాడు.
    కశింకోట దాటి అడవిలోకి వచ్చాక ముందు రెండు గుర్రాలు పరుగెడుతూ కన్పించినాయి. బొబ్బిలివారి గుర్రానికి ముందు మరొక గుర్రం వెళ్ళటమా? తన గుర్రాన్ని అదలించి క్షణాల మీద ఆ రెండు గుర్రాలనూ దాటి ముందుకుపోయాడు రెండోగుర్రం దాటుతూ వుండగా ఆగు అన్న కేక విన్పించింది ఆ కేక ఆడవారి గొంతులా వుంది. దారిమీద లగ్నం చేసిన చూపులు ప్రక్కకు త్రిప్పిచూచాడు తను. గుర్రాలమీద వున్న ఆ యిద్దరూ ఆడవాళ్ళే. అందులో ఒకామె చేయెత్తి తనను పిలుస్తోంది. తను గుర్రాన్ని ఆపి క్రిందికి దూకాడు. ఆమెకూడా గుర్రందిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS