Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 37

 

    "ఏమిటది?"
    "పెళ్ళికి ముందు నీతో అనుభవం పంచుకోవాలనిపించింది...." అనేసి తన ధైర్యానికి తనే ఆశ్చర్యపోయాడు ఆనందరావు.
    దీప్తి అతడి వంక అదోలా చూస్తోంది.
    ఆమె తన వంక గ్రుడ్లురిమి చూస్తోందనీ -- తనను తూర్పారపడుతుందనీ భావించాడతడు. అందుకే -- "నువ్వు నన్ను తిట్టకూడదు. అన్నయ్య నడిగి అప్పుడు తిట్టాలి ...." అన్నాడు. తను చాలా తెలివిగా మాట్లాడేననే అనుకున్నాడతను.
    దీప్తీ తాపీగా -- "రైటే చెప్పారు. మీరన్న మాటలు అన్నయ్యకు చెబుతాను. అన్నయ్యేలా చెబితే అలా చేస్తాను " అంది.
    ఆనందరావు తెల్లబోయాడు. శ్రీహరి లాగే దీప్తి కూడా అసాధారణ యువతి అని అతడు గ్రహించాడు.
    "సరే -- నీ పద్దతి నీది. నేనిప్పుడు నిన్ను బలవంతం చేస్తాను. అన్నయ్య నడగలేదు కాబట్టి నువ్వు అరవకూడదు. ప్రతిఘటించకూడదు ...." అన్నాడతడు.
    దీప్తి ముఖం ఎర్రబడింది-- "అన్నయ్య నడక్కుండా నేను కొన్ని పనులు చేశాను. మీరు తెలుసుకోవడం మంచిది...."
    "చెప్పు...."
    "దొడ్లో పాము కనబడింది. అది బస్సు మంటూ నా మీదకు లేచింది. అప్పుడు నా చేతిలో కర్ర వుంది. దాంతో పాముని చంపేశాను. తర్వాత అన్నయ్యకు చెప్పాను. అన్నయ్య నన్ను మెచ్చుకున్నాడు."
    ఆనందరావు ఉలిక్కిపడ్డాడు."
    "తర్వాత నడి బజార్లో ఒకడు నా చేతిలోంచి పర్సు లాక్కుని పరుగెడుతుంటే కేకలు వేసి పరుగెత్తి వాడి నందుకున్నాను. నేను తన్నకపోయినా పదిమందీ వాడిని తన్నారు. నా పర్సు నాకు దక్కింది. ఒక్క పైసా కూడా పోలేదు....అప్పుడూ అన్నయ్య నన్ను మెచ్చుకున్నాడు...."
    ఆనందరావు కంగారు పడుతూనే ...."ఇంకా ...." అన్నాడు.
    "ఇప్పుడేదో బలవంతం అన్నారు కదా .... అదేంటో చూసి అప్పుడు చెబుతాను ....' అంది దీప్తి.
    "ఇప్పుడే చెప్పొచ్చుగా...."
    "అవసరమైనవి తప్ప చెప్పకూడదని అన్నయ్య చెప్పాడు. మీరు నన్ను బలవంతం చెయ్యరని నా నమ్మకం. తప్పు చేయబోయేవాడు తను తప్పు చేస్తానని చెప్పి చేయడని అన్నయ్యన్నాడు...."
    ఆనందరావుక్కోపం వచ్చింది -" నా గురించి నువ్వే మనుకుంటున్నావో తెలియదు. నేను సరదాగా మాటలు అనలేదు." అంటూ లేచి ఆమెను సమీపించి చేయి పట్టుకుని లేపాడు.
    ఆమె లేచింది , నిలబడింది.
    అతడి చేయి ఆమె చేతిలో వుంది. ఆమె ఒక్క క్షణం ఆగింది. అతడా స్పర్శ లోని ఆనందాన్ననుభవిస్తున్నాడు.
    ఆమె ఒక్కసారి అతణ్ణి ముందుకు లాగింది. తనామే పై పడుతున్నానని ఆనందరావనుకున్నాడు. కానీ ఆమె పక్కకు తప్పుకోవడంతో నేలకరిచాడతడు.
    ఆ తర్వాత ఆమె అతడిని పుట్ బాల్ ను చేసి ఆడింది. అతడికి వళ్ళంతా నొప్పులు, దెబ్బలు....
    "ఇందాకా నీకు చెప్పని విశేషమిదే! ఒకసారి ఓ రౌడీ నా చేయి పట్టుకుంటే ఇదే పని చేశాను. పాముల్ని కొట్టడానికి కర్రలున్నట్లే -- మనుషుల్లో పాముల్లాంటి వాళ్ళున్నప్పుడుపయోగ పడుతుందని అన్నయ్య నాకు కరాటే నేర్పించాడు --" అంది దీప్తి.
    ఆనందరావు కు వళ్ళంతా హూనమై పోయింది. లేచి నిలబడడానికే అతనికి చాలాసేపు పట్టింది.
    "ఇంతటితో నిన్ను వదిలి పెట్టను. నీతో రాక్షసుడున్నాడు. అందుకు శిక్ష అనుభవించాలి. అతివ పై అత్యాచారం చేయబోయావని నీకు జైలు శిక్ష పడుతుంది. అన్నయ్యకు తెలిసిన పోలీసాఫీసురున్నాడు ....ప్రస్తుతానికి వెళ్ళు...."
    ఆనందరావక్కడినుంచి పారిపోయాడనే చెప్పాలి.

                                     4

    శోధన్ అతడిని తిట్టని తిట్టు లేదు. నువ్వు మునగడమే కాక నమ్ముకున్న వాళ్ళను కూడా నట్టేట్లో ముంచేస్తానని  తిట్టాడు. అలాంటి వాడు జైల్లో మగ్గి చావడమే మేలన్నాడు.
    ఆడపిల్లను మానభంగం చేయబోయి -- తనే భంగ పడ్డ మగవాడిగా ఆనందరావు చరిత్ర పేపర్లలో కెక్కుతుంది. అతడు ఉద్యోగం ఊడుతుంది. పరువు గంగపాలవుతుంది . ఇంతకాలం వున్న చిరుద్యోగ సుఖజీవితం కూడా పోయి భవిష్యత్తు లో శూన్యంధకారం మిగుల్తుంది.
    "నేను చచ్చిపోతాను ....." అన్నాడు ఆనందరావు.
    "నిజంగా చావాలని నీకుంటే ముందు పగతీర్చుకో. శ్రీహరిని, చంపేసేయ్. దీప్తిని మానభంగం చెయ్. అప్పుడు నువ్వు చచ్చినా ఆ చావుకో అర్ధముంటుంది. ..." అన్నాడు  శోధన్.
    'అలాంటి పనులు నావల్ల కాదు. చచ్చి మరో జన్మెత్తితే ఏమో చెప్పలేను...." అన్నాడు ఆనందరావు.
    "పోనీ ఆ పనే చేయి...."
    "అంటే ముందు నేను చావాలి ... ఒక్క నిముషం .... నువ్విక్కడే వుండు ...." అని బయటకు వెళ్ళాడు ఆనందరావు.
    శోధన్ చిరాగ్గా అక్కడే కూర్చున్నాడు. ఓ అరగంటలో వచ్చాడానందరావు. లోపలకు వస్తూనే --" ఇవి నిద్ర మాత్రలు....కొనుక్కుని వచ్చాను ...." అన్నాడు.
    "నిజంగా నువ్వు చద్దమనుకుంటున్నావా ?" అన్నాడు శోధన్.
    "అవును...."
    "అయితే ఆ మాత్రలన్నీ వేసుకుని చావు....చచ్చే ముందు చీటీ కూడా రాసిపెట్టు " అని వెళ్ళిపోయాడు శోధన్. అతడక్కడి నుంచి తిన్నగా ఓ నగర ప్రముఖుడింటికి వెళ్ళి మొత్తం జరిగినదంతా చెప్పాడు.
    నగర ప్రముఖుడుత్సహంగా -- "వెరీ గుడ్ ! ఈ దెబ్బతో శ్రీహరి ఫినిష్ !" అన్నాడు.
    "అదెలా?"
    "ఆనందరావు చస్తాడు. పేరున్న డాక్టరు చేత పరీక్ష చేయించు. అయన చచ్చినట్లు సర్టిఫికెట్ ఇస్తాడు. ఆ తర్వాత మన డాక్టరు రంగంలోకి దిగుతాడు...."
    "మన డాక్టర్ అంటే ?"
    "డాక్టర్ రంగారావు. ఆయనో గొప్ప ఇంజక్షన్ కనిపెట్టాడు. మనిషి చచ్చేక కూడా ఒకటి రెండు గంటలు తిరిగి బ్రతికించగలదది. ఆ సమయంలో ఆ హతుడు తానెమైనా పూర్తీ చేయాలనుకున్న పనులు చేసుకోగలదు. తనకున్న జీవితకాలం పరిమితమని అతడికి తెలుస్తుంది. అందువల్ల పుట్టిన తెగింపుతో అతడి కసాధ్యమైనదేమీ వుండదు .. ఆనందరావుకు శ్రీహరి మీద ద్వేషమూ, దీప్తి పై కసి ఏర్పడి ఉంటాయి. అన్న ఎదుట చెల్లెలికి మానభంగం . అదే శ్రీహరిని సగానికి సగం చంపేస్తుంది. ఆ మిగతా సగం కూడా ఆనందరావే చూసుకుంటాడు....' అన్నాడు నగర ప్రముఖుడు.
    "మనిషి చచ్చి బ్రతకడమా?" అన్నాడు శోధన్ ఆశ్చర్యంగా.
    "ఇందులో ఆశ్చర్య మేమీ లేదు. విదేశాల్లో మరణవాగ్మూలం ఇవ్వకుండా పోయిన వాళ్ళను, విల్లు వ్రాయని వాళ్ళనూ ఈ విధంగా బ్రతికించదానికి కొన్ని ప్రయత్నాలూ జయప్రదంగా జరిగాయి. మన డాక్టరు వాళ్ళకంటే ఓ మెట్టు పైకి వెళ్ళాడు. అక్కడ మనిషికి మాట్లాడగలగడం మాత్రమే జరుగుతుంది. ఇక్కడ మనిషి నర్మల్ గా లేచి తిరుగుతాడు. ఎటొచ్చీ రెండు గంటలకు మించి బ్రతకడు. కనీసం గంటైనా బ్రతికి తీరుతాడు....' అన్నాడు నగర ప్రముఖుడు.
    
                                      5
    "నువ్వు చచ్చి బ్రతికావు." అన్నాడు శోధన్ ఆనందరావు లో తిరిగి చలనం రావడమూ, అతడు కళ్ళు తెరవడమూ శోధన్ కాశ్చార్యం గా వుంది. ఎందుకంటె సరిగ్గా అరగంటకు ముందు -- నగర ప్రముఖుడు పంపిన ఓ గొప్ప డాక్టరు అతడు మరణించినట్లు దృవపరిఛి పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పి వెళ్ళాడు. ఆ విధంగా అయన కాగితం రాసిచ్చాడు కూడా.
    డాక్టరు రంగారావు ఇంజక్షన్ చేసి -- "సరిగ్గా అరగంటలో ఇతడి శరీరంలో చలనం పుడుతుంది --" అనేసి వెళ్ళిపోయాడు.
    సరిగ్గా అలాగే జరిగింది.
    జరిగినదంతా విని ఆనందరావు కూడా ఆశ్చర్య పడ్డాడు.
    "చూడు -- నీ కిప్పుడు ఎదురులేదు. ప్రపంచమంటే భయం లేదు. అవునా?' అన్నాడు శోధన్.
    'అవును...." అన్నాడు ఆనందరావు ఉత్సాహంగా.
    "ఈ పిస్టల్ దగ్గరుంచుకో . శ్రీహరి , దీప్తి - వాళ్ళిద్దర్నీ నువ్వేం చేయాలనుకుంటే అది చేయి. నీ జీవిత లక్ష్యం నెరవేర్చుకో. ఆ తృప్తితో హాయిగా కళ్ళు మూస్తావు. అది నీ అదృష్టం...."
    "నాకేమిటోలా వుంది. చాలా ఉత్సాహంగా వుంది. కొత్త జీవితం నాలో సంతోషాన్ని నింపుతోంది. శోధన్ ... నీకు చాలా థాంక్స్ !" అన్నాడు ఆనందరావు.
    "అవన్నీ తర్వాత ...ఇప్పుడు ప్రతిక్షణమూ నీ కెంతో విలువైనదీ. ఈ విలువైన క్షణాలను థాంక్స్ చెప్పడానికీ, విలాసా కబుర్లకూ వృధా చేయకు. వెళ్ళు నీ జీవిత లక్ష్యం నెరవేర్చుకో ....' అన్నాడు శోధన్.
    "అవును నా ముందున్నవి విలువైన క్షణాలు. ఒక్కటి కూడా వృధా చేసుకోకూడదు....." అన్నాడు ఆనందరావు. అతడి కనులలో దృడ నిశ్చయం కనబడుతోంది.
    ఆనందరావు బయల్దేరగానే శోధన్ పోలీస్ స్టేషను కు  వెళ్ళాడు. ఆనందరావు ఆత్మహత్య చేసుకున్న విషయమతడు పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయవలసి వుంది.

                                       6
    దీప్తి నెమ్మదిగా -- "అతడు మళ్ళీ మనింటికి రాడు అంది.
    "అలాగని నేననుకోను. మనుషుల్లో మంచి తనముండి తీరాలన్నది నా నమ్మకం. ఆనందరావు స్వతహాగా దుర్మార్గుడు కాదు ఇతరుల ప్రభావం, తన దురాశా - అతడినీ విధంగా మార్చాయి. ఏదో ఒకరోజున అతడు పశ్చాత్తాప పడతాడు. అప్పుడు మన వద్దకు వస్తాడు ...." అన్నాడు శ్రీహరి.
    అతడింకా ఏదో అనాల్సిందే ...ఈలోగా ఎవరో తలుపు తట్టారు.
    దీప్తి వెళ్ళి తలుపు తీసి -- మీరా?" అంది.
    ఆనందరావు జేబులోంచి పిస్టల్ తీసి -- "నీకు తెలిసిన ఆనందరావు చచ్చిపోయాడు. నువ్వు చూస్తున్నవాడు కొత్త ఆనందరావు. లోపలికి నడు ...." అన్నాడు.
    అతడు తలుపులు మూసేసరికి శ్రీహరి అక్కడకు వచ్చాడు. ఆనందరావు చేతిలోని పిస్టల్ చూసి -- "ఏమిటి దంతా " అన్నాడు.
    ఆనందరావు క్లుప్తంగా తనెలా చనిపోయాడో, ఎలా బ్రతికాడో చెప్పి - నేనిప్పుడేవరికీ భయపడను. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఏం కావాలంటే అది సాధించగలను. అయితే నాకున్న సమయం బహు కొద్ది .ఇప్పుడు నాకు మిగిలిన ప్రతిక్షణమూ విలువైనది. అవి ఉపయోగించుకోవాలని వచ్చాను...." అన్నాడు.
    "దీప్తికి మానభంగం నీకు ప్రాణ భంగం -- ఇందుకే నేను బ్రతికింది...." మళ్ళీ అన్నాడానందరావదోలా నవ్వుతూ.
    ఆ అన్నా చెల్లెళ్ళీద్దరికీ నోటమాట రాలేదు. వాళ్ళిద్దరూ అతడినీ అతడి చేతిలోని పిస్టల్ నూ భయం భయంగా చూడసాగారు. అతడి మాటలు నిజమని వారు నమ్మలేదు.
    "ప్లీజ్ అలా చూడవద్దు....." అన్నాడు ఆనందరావు - "దీప్తి చేతిలోని పరాభవం నాలో పరివర్తన తీసుకొచ్చింది. మీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ భాగవత్ప్వరూపులు. మీ ముందు భగవంతుడికి కూడా ఓటమి తప్పదు. నేనోడిపోయానంటే ఆశ్చర్యం లేదు. కానీ మీ యిద్దరి కాళ్ళ మీదా పడి క్షమార్పణ వేడుకోవాలన్న కోరిక నాలో మిగిలిపోయింది. అయితే మిమ్మల్ని కలుసుకునే ధైర్యం చేయలేకపోయాను. బ్రతికుండగా నా కోరిక తీరదనుకున్నాను. కానీ నా కోరిక తీరడం కోసమే మళ్ళీ బ్రతికినట్లున్నాను. నన్ను తప్పు దారిన నడిపించిన శోధన్ ని అంతం చేయాలన్న ఆవేశం కూడా నాకు తిరిగి బ్రతగ్గానే కలిగింది. కానీ నాకు మిగిలిన విలువైన క్షణాలు కొత్తనేరం చేయడానికి కాక -- పాత నేరాలకు ప్రాయశ్చిత్తం చేసుకుందుకుపయోగించాలనుకుని మీ దగ్గరకు వచ్చాను...."
    ఆనందరావు పిస్టల్ విసిరేసి శ్రీహరి కాళ్ళ మీద పడ్డాడు. అతడు మ్రాన్పడి చూస్తుండగా లేచి తిరిగి దీప్తి కాళ్ళ మీద పడ్డాడు.
    ఆ తర్వాత అతడు మరి లేవలేదు.
    ఆనందరావు చనిపోయాడని అర్ధం కావడానికి వారిద్దరికీ ఎంతో సేపు పట్టలేదు. ఇద్దరి కిద్దరూ ఉన్న పళంగా పోలీస్ స్టేషన్ కు పరుగెత్తారు.
    జరిగిన విశేషం వార్తా పత్రికల్లో మొదటి పేజీల కెక్కింది. ఆ సంచలన వార్తా గురించి మన కనవసరం. ఈ సంఘటన గురించి శ్రీహరి చెల్లెలితో -- "జీవితంలో ప్రతి క్షణం విలువైనది. తెలియని వాడకవి వృధా చేసుకుంటాడు. ఆనందరావు జీవితంలోనూ అంతే జరిగింది. జీవితంలో అతడు - చచ్చి బ్రతికిన ఆ కాసిని క్షణాలను మాత్రమే సక్రమంగా ఉపయోగించుకోగలిగాడు. ఎవరికే క్షణంలో చావు రాసి పెట్టి ఉందొ తెలియదు. అందుకని ఆనందరావు కధను మనం హెచ్చరికగా తీసుకుని -- ప్రతి క్షణాన్ని అపురూపంగా చూసుకుంటూ సక్రమంగా ఉపయోగించుకోవాలి." అని చెప్పిన విశేషాన్ని మాత్రం -- మన మందరం హెచ్చరికగా తీసుకోవలసి ఉంటుంది.

                                       ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS