"ఎలా?"
"అతడి చెల్లెల్నే అందు కుపయోగించుగో , ఎలాగో మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకో. పెళ్ళికి ముందే శారీరక సంబంధం ఏర్పరచుకో అటు పైన పెళ్ళి చేసుకోనని అప్పుడు శ్రీహరి నువ్వు చెప్పినట్లు వింటాడు" అన్నాడు శోధన్.
'అది సరేకానీ ...." అన్నా డానందరావు అనుమానంగా --" ఈ పనికి నన్నే ఎందుకెన్నుకున్నట్లు?"
"ఎందుకేమిటి? నువ్వు శ్రీహరికి నచ్చావు ...." అన్నాడు శోధన్ నవ్వుతూ.
2
ఆరంభం లోనే ఆనందరావు చిన్న పొరపాటు చేశాడు. అతడు శ్రీహరిని కలుసుకుని దేశాన్నేలే నాయకులు కూడా అవినీతికి లోనవుతున్న ఈ దేశంలో -- సామాన్యులు నీతి, అవినీతి అంటూ ప్రాకులాడరాదని ఓ చిన్న ఉపన్యాసమిచ్చి -- "నీకు నీతిపైన మోజుండవచ్చు , కానీ నీ చెల్లెలి కోసం కొన్నాళ్ళు నాకు సహకరిస్తే నేను సుఖంగా జీవించడాని కవసరమైనంత డబ్బు సంపాదించుకుంటాను ....' అని చెప్పాడు.
దీనికి శ్రీహరి మండి పడలేదు. తాపీగానే అతడు చెప్పిన మాటలు ఆనందరావులో మంటలు పుట్టించాయి.
దేశాన్నేలే నాయకులు స్వార్ధ పరులు కావచ్చు. కానీ దేశం ముందుకు పోతూనే వుంది. మన మంచితనాన్నితరుల స్వార్ధానికి ముడి పెట్టకుండా వున్నంత కాలం -- మనం దేశాన్ని వెనక్కు లాగడం లేదన్న తృప్తి వుంటుంది.
నీతిగా బ్రతకడంలో వున్న తృప్తి -- అవినీతికి లోనయ్యే వరకూ తెలియదు. ఒకసారి అవినీతికి లోనైన వాడు క్రమంగా అధ్హపాతాళానికి పతనమై పోతాడు.
ఒకసారి అవినీతికి పాల్పడి పది లక్షలు సంపాదిన్చుకున్నాక -- తర్వాత మడి కట్టుకుని కుర్చుందుకు వీలుపడదు. చిన్న తప్పుతో ప్రారంభించినవాడు పెద్ద తప్పుతో అంతమవుతాడు.
దీప్తిని వివాహం చేసుకునేవాడికి ధన కాంక్ష వుండకూడదు. అందువల్ల చెల్లెలి కోసం డబ్బు సంపాదించమన్న ప్రసక్తి లేనే లేదు. ఏ రూపేణా అయితేనేం -- ధన సంపాదన భార్య ద్వారా సాధించా లనుకునే వాళ్ళంటే శ్రీహరికి అసహ్యం.
అన్నింటి కంటే ఆఖరున అతడు --" నువ్వంటే నా కభిమానముంది. ఎవరి మాటలో వినడం వల్ల నీ బుద్ది తప్పు దారులు తొక్కుతోంది. తప్పితే స్వతహాగా నువ్వు మంచి వాడివి. అందుకే నిన్ను క్షమించాను. ఇంకొకసారిలాంటి ప్రసక్తి తెచ్చావంటే నిన్ను పోలీసుల కప్పగించగలను" అన్నాడు.
ఆనందరావు బాగా దెబ్బతిన్నాడు. శోధన్ కు జరిగింది చెబితే -- "నువ్వలా ఎందుకు చేశావు ....అతడిప్పుడు నీ మీద అనుమానం కలిగిందంటే నిన్ను దరిదాపులక్కూడా రానివ్వడు...." అని మందలించాడు.
శోధన్ సలహా మేరకు ఆనందరావు శ్రీహరిని కలుసుకుని -- "నువ్వెలాంటి వాడివో నని పరీక్షించాను తప్పితే నాకు డబ్బు మీద వ్యామోహం లేదు. అన్నింటికీ మించి విలువయినది నీ స్నేహం. దాన్ని వదులుకోలేను....' అన్నాడు.
శ్రీహరి నవ్వి -- "నువ్వు నిజంగానే నన్ను పరీక్షించి వుంటావని నమ్ముతున్నాను. ఒకవేళ అబద్దమే అయినప్పటికీ - అప్పటి నీ ప్రవర్తనకు సిగ్గుపడి -- ఆ అబద్దం చెప్పావని అనుకుంటున్నాను ....' అన్నాడు.
"చాలా తెలివైనవాడు ...." అనుకున్నాడు ఆనందరావు.
అ తర్వాత నుంచి అతడు పొరపాటున కూడా శ్రీహరి వద్ద అవినీతి ప్రస్తావన తీసుకుని రాలేదు. అతడట్నించి నరుక్కురావడం మొదలుపెట్టాడు.
దీప్తికి ఆనందరావు నచ్చినట్లే వున్నాడు. ఆమె అతడితో ఎంతో ఉత్సాహంగా మాట్లాడేది. ఎంతసేపటికీ చిరాకు పడేది కాదు.
ఇద్దరూ అప్పుడప్పుడూ పార్కులకూ. నది ఒడ్డుకూ వెళ్ళి వస్తుండేవారు. శ్రీహరి అమెకా స్వేచ్చ నివ్వడమే కాక -- 'ఆడపిల్లను అదుపు చేయాలను కోవడం -- అవమానించడమే అవుతుంది --" అనేవాడు.
ఏకాంతంలో వాళ్ళు ప్రణయం గురించి ,మాట్లాడుకునే వారు కాదు. దీప్తికి అన్నగారంటే ఆరాధన. అతడి గురించి ఏ మాటలు చెప్పినా ఆమె కళ్ళలో మెరుపు కనపడేది.
"శ్రీహరి సామాన్యుడు కాడు. తలచుకుంటే అతడు బంగాళా లో వుండగలడు. కార్లలో తిరగ్గలడు. దాసదాసీజనాల సేవ లందుకోగలడు...కానీ అతడు నీతికి నిలబడి సామాన్య జీవితం గడుపుతున్నాడు...." అని మెచ్చుకున్నాడు ఆనందరావు.
"మీరు చెప్పింది నిజమే కానీ ఈ మాటలు నా దగ్గరైతే అన్నారు కానీ అన్నయ్య దగ్గర నోద్దు ...." అంది దీప్తి.
"ఎందుకని ?" అన్నాడు ఆనందరావాశ్చర్యంగా .
"అవినీతిని గర్హించాలి శిక్షించాలి. అది అన్నయ్య అనుమతిస్తాడు. నీతిని పాటించడం సామాన్యుడికర్తవ్యం . నీతిని అభినందిస్తే అది నీతికే అవమానమంటాడన్నయ్య" అని -- "మనిషి బ్రతకడానికి గాలి పీలుస్తాడు. దాహానికి నీళ్ళు తాగుతాడు. వాటిని మనం విశేషంగా చెప్పుకుంటున్నామా.... నీతి విషయమూ అంతే నంటాడన్నయ్యా...." అంది దీప్తి.
ఆనందరావు కు మతి పోయినట్లయింది. ఆమె చెప్పే ప్రతి మాటా అతడిని అంతులేని నిరాశకు గురి చేస్తోంది . ఎలాంటి మనిషి దొరికాడు తనకు? అవతల లక్షల్లో ఆదాయం.... ఇవతల శ్రీహరి .... ఒక్క శ్రీహరి కారణంగా ఆ ఆదాయమంతా ఆగిపోతోంది.
'అవునవును.....నాకు తట్టనేలేదు....' అన్నాదానందరావు.
దీప్తిని సంపదల వైపూ, సౌఖ్యాల వైపూ మళ్ళించాలని అతడు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి.
చివరికతడు శోధన్ చెప్పిన ఆఖరి ఉపాయం ప్రయోగించాలనుకున్నాడు.
3
ఆరోజు ఉన్న పళంగా ఆఫీసుకు సెలవు పెట్టి శ్రీహరి యింటికి వెళ్ళాడు ఆనందరావు.
అప్పుడు దీప్తి మాత్రమే యింట్లో ఉంది. శ్రీహరి ఆఫీసుకు వెళ్ళాడు.
"మీరా?" అంది దీప్తి ఆశ్చర్యంగా.
"నీతో మాట్లాడాలని వచ్చాను...."
'అర్జంటా?"
"ఏం?" అన్నాడు ఆనందరావు.
"ఏమీ లేదు, అవతల స్నానాని కన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చాను. మీరు కాసేపు కూర్చోగలరా ?"
"ష్యూర్ ..." అన్నాడు ఆనందరావు వుత్సాహంగా.
అతడు ఇండియా టుడే మాగజైన్ చూస్తూ కూర్చున్నాడు. ఈలోగా దీప్తి స్నానం చేసి వచ్చింది.
దీప్తి తలంటుకుని వచ్చింది. డ్రైయర్ తో అరబెట్టుకుందేమో జుత్తు పాయలు పాయలుగా విడి ఎగురుతోంది. ఆమె జడ వేసుకోలేదు. వదులు వదులుగా వదిలేసింది. నుదుట ఎర్రని బొట్టు. లేత గులాబీ రంగు చీర. అదేరంగు జాకెట్.
మనిషి దేవతలాగుంది.
"ఈ లోకంలో అందం ఆడదానిదే ....' అనుకున్నాడు ఆనందరామెను చూస్తూ.
'చెప్పండి ...." అందామె అతడి కెదురుగా కూర్చుని.
"నువ్వంటే నాకెంతో యిష్టం ...." అన్నాడు ఆనందరావు.
"థాంక్స్ !" అంది దీప్తి.
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను.....' అన్నాడు ఆనందరావు.
"థాంక్స్!' అంది దీప్తి.
"ఉత్త థాంక్సేనా?"
"మరేం చెప్పాలి ...." అంది దీప్తి అమాయకంగా.
"నేను నీ గురించిన నా అభిప్రాయాలు చెప్పాను. నువ్వూ నా గురించిన నీ అభిప్రాయాలు చెప్పాలి...." అన్నాడు ఆనందరావు.
"అన్నయ్యనడిగి చెబుతాను...." అంది దీప్తి.
"నేనంటే నీ కిష్టం లేదా?"
"అన్నయ్య నడగాలి ...."
"నేనంటే నీకు ప్రేమ లేదా ?"
"అన్నయ్య నడగాలి ...."
ఆనందరావు చిరాకును మనసులోనే అణచుకుని -- "నీకంటూ అభిప్రాయాలుండవా ?" అన్నాడు.
"ఉన్నాయి కానీ అన్నయ్యనడిగి కానీ చెప్పలేను...."
"ఎందుకని ?"
"ఎన్నో విషయాలపై నా కెన్నో అభిప్రాయాలుండేవి. వాటిని అన్నయ్యకు చెప్పేదాన్ని. కొన్నింటితో అన్నయ్య అంగీకరించేవాడు. కొన్నిటిని ఖండించేవాడు. నేను గ్రహించినదేమిటంటే అన్నయ్య అభిప్రాయాల్లో తప్పుండదు. అన్నయ్య అభిప్రాయాలతో సరిపోయినప్పుడే నా అభిప్రాయాలు రైటవుతాయి....అప్పట్నించీ నాకే అభిప్రాయమేర్పడినా అన్నయ్య నడక్కుండా ఇతరులకు చెప్పడం మానేశాను. అంటే ఏ విషయం లోనైనా అన్నయ్య అభిప్రాయమే నా అభిప్రాయం. మీ గురించి నేనేమనుకుంటున్నానో తెలుసుకోవాలనుకుంటే అన్నయ్య నడగండి -- చెబుతాడు. నానుంచే వినాలనుకుంటే - ముందు నన్నన్నయ్యతో మాట్లాడనివ్వండి అప్పుడు చెబుతాను ....'
"ప్రతిదానికీ అన్నయ్య అన్నయ్యంటే ....రేపు పెళ్ళైతే ఎలా?"
దీప్తి నవ్వి -- "ఎవరైనా మొక్కకే నీళ్ళు పోస్తారు. చెట్టు తన నీరు తనే సంపాదించుకుంటుంది. పెళ్ళైన అడ పిల్ల చెట్టు వంటిదని అన్నయ్య అభిప్రాయం....." అంది.
"అన్నయ్య ....అన్నయ్య....' అని మనసులో విసుక్కుని-- "ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను....' అన్నాడు.
