9
చిదానందస్వామి హత్య ఇన్ స్పెక్టర్ చౌదరికి మరో చిక్కు సమస్యగా తయారయింది.
ఆశ్రమంలో స్వామి చచ్చిపడివున్నాడు. ఆయనమీద అంత కసి ఏమిటోకానీ స్వామి ముఖం పచ్చడి అయిపోయింది. హత్య జగ్గయ్యచేసినట్లా, లక్ష్మీనారాయణ చేయించినట్లూ బలమైన ఆధారాలున్నప్పటికీ ఆశ్రమంలో మరో ఆధారం దొరికింది.
అది ఒక టేపు రికార్డరు. అందులో రవి అనబడే వ్యక్తి రమ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లూ ఆ అమ్మాయిని చిదానందస్వామి ముద్దు పెట్టుకున్నట్లూ ఆ కారణాన రవి చిదానందస్వామి ముఖం బద్దలుకొట్టి చంపాలన్నట్లూ-ఓ సంభాషణ వున్నది. చిదానందస్వామి రవి, రమ--ఒకటి కావడానికి ఎంతగానో సహకరించినా రవికి ఆస్వామి మీద సదభిప్రాయం లేదని ఆ సంభాషణలో స్పష్టమవుతున్నది.
ఆ గొంతు తన అల్లుడిదని లక్ష్మీనారాయణ అన్నాడు.
అయితే ఆ సంభాషణను ఎవరు టేపు చేశారు?
రమ టేపుచేసి వుండాలి. అందువల్ల ఆమె ఆశించే ప్రయోజనమేమిటి? బహుశా మున్ముందురవిని బ్లాక్ మెయిల్ చేయడానికి ఉపయోగించుకోవాలని ఆమె అనుకుని వుండవచ్చు. అయితే ఆమె అతడిని ప్రేమించివుండదు.
ఇప్పుడు రవి, రమ-ఇద్దరూ మాయమయ్యారు. అందులో ఎవరినడిగినా రమ గురించిచెప్పలేకపోయారు. అక్కడ మొత్తం ఎనమండుగురు అమ్మాయిలున్నారు. అంతా వయసులోనే వున్నారు. కానీ వారిలో రమ అన్న పేరుగల వారెవ్వరూలేరు. వారిలో ఎవ్వరిని ప్రశ్నించినా ఏ విధమైన ప్రయోజనమూ లేక పోయింది.
"ఈ హత్య నా అల్లుడే చేసి వుండాలి. వాడు ముందుగా పథకంవేసుకుని స్వామిని చంపాలనుకుని ఆ తర్వాత హత్యా నేరం నామీదకు వచ్చే విధంగా ఏర్పాట్లుచేశాడు. నా అదృష్టంకొద్దీ ఈ టేపురికార్డరు దొరికింది కానీ లేని పక్షంలో నా పని ఏమయ్యేది?" అని లక్ష్మీనారాయణ వాపోయాడు.
రవి ఫోటోలు దేశాలోని అన్ని వార్తాసంస్థలకూ, పోలీసు స్టేషన్ లకూ పంపబడ్డాయి. రోజులు గడుస్తున్నా అతడి గురించిన ఆచూకీ తెలియడంలేదు.
చిదానందస్వామికి యెందరో ప్రముఖులు భక్తులుగా వుంటున్నారు. హంతకుణ్ణి పట్టుకొనడంలో జరిగే జాప్యం గురించీ చౌదరిమీద ఒత్తిడి రాసాగింది. చౌదరికి కేసు ఒక అంగుళం కూడా ముందుకు వెళ్ళడానికి లేకుండా వున్నది.
ఆ సమయంలో అతడికి దైవంలా రంగారావు కనబడ్డాడు.
"చిదానందస్వామి నిజంగా మహామహిమాన్వితుడు. ఆయన తాకిన గ్లాసు మా యింట వారంరోజులున్నది కదా-నన్ను పీడించిన చిక్కు సమస్య తొలగిపోయింది. ఆయన వద్దకు వెళ్ళి పాదాభివందనం చేసివద్ధామనుకున్నాను కానీ ఈలోగా ఆయన హత్యచేయబడ్డాడు. ఆయనే చెప్పాడు కదా-తన ఆయువును కరిగించి పదిమందికీ సాయపడుతున్నానని! ఇప్పటికాయన ఆయువు కరిగిపోయి వుంటుంది-" అన్నాడు రంగారావు.
"ఇప్పుడు నా ఆయువు కరుగుతున్నది-" అన్నాడు చౌదరి.
"దిగులు పడకండి-మీకు సాయపడాలనే వచ్చాను" అన్నాడు రంగారావు.
"ఎలా?" అన్నాడు చౌదరి.
"చూడండి చిదానందస్వామి తాకిన గ్లాసుకూ మామూలు గ్లాసుకూ వున్న తేడా ఏమిటి? ఆయన తాకిన గ్లాసుమీద ఆయన వెలిముద్రలుంటాయి. మహిమ అంతా ఆ వేలిముద్రలదే అయుండాలి. అందుకే ఆ గ్లాసుమీది వేలిముద్రలు నేను జాగ్రత్తగా ఫోటో తీయించాను. ఓ కాపీ మీ కిస్తాను. మీ పూజామందిరంలో వుంచి-వారం రోజులపాటు పూజచేయండి-" అన్నాడు రంగారావు. అతడు చౌదరికి ఓ ఫోటో అందించాడు.
చౌదరి ఆ ఫోటో అందుకుని-"ఇలాంటి దేదో చేస్తే తప్ప ణ కష్టాలు తీరేలా లేవు-" అన్నాడు. ఉన్నట్లుండి అతడికో అనుమానం వచ్చింది - "చిదానందస్వామి తాకిన గ్లాసును ఆ తర్వాత రాజారావు తాకాడు. మీరు తాకారు. దీనిమీద ఎందరివో వేలిముద్రలు పడివుండాలి. అసలాయన వేలి'ముద్రలింతవరకూ వున్నాయని నమ్మకమేమిటి? ఇవి చిదానందస్వామి వేలిముద్రలు అవునో కాదో!" అన్నాడు.
"రాజారావుగారు, నేను కూడా గ్లాసు అంచులనే తాకాము. అందువల్ల మా వేలిముద్రలు గ్లాసుమీద పడే అవకాశంలేదు. స్వామికి మంచినీళ్ళిచ్చే ముందు రాజారావుగారు శుభ్రంగా గ్లాసును తుడిచారు. ఈ గ్లాసు మీద ఒక్క స్వామిని తప్ప ఇంకెవరి వేలిముద్రలుండడానికి వీలులేదు-" అన్నాడు రంగారావు.
"అయినా నా తెలివిగానీ-ఇవి చిదానందస్వామి వేలి'ముద్రలైనదీ కానిదీ తెలుసుకొనడం నాకు క్షణాల మీద పని-" అన్నాడు చౌదరి.
చౌదరి క్షణాలమీదనే రియాక్టయ్యాడు. హతుడి వేలిముద్రలతో పోల్చడం జరిగింది. అయితే రెండూ ఒకటి కాదు.
"నేను చెప్పానుగా!" అన్నాడు చౌదరి విజయగర్వంతో.
"సరే-అయితే ఆది రాజారావు గారి గ్లాసు, దాని మీద వారింటివాళ్ళవో, వారి పనిమనుషులవో తప్ప ఇంకెవరి వేలిముద్రలూ వుండవు. గ్లాసుమీద వేలిముద్రలుస్పష్టంగా వున్నాయి. ఈ వేలిముద్రలెవరివో తేల్చాలి-" అన్నాడు రంగారావు.
చౌదరీ అదీ చేశాడు. ఆ వేలిముద్రలెవరివో తెలియలేదు.
"చూశారా-" అన్నాడు రంగారావు విజయగర్వంతో.
"నా కేసు తేలక నేను చస్తున్నాను. ఈ కొత్త కేసు సంగతి తర్వాత చూస్తాను-" అన్నాడు చౌదరి కాస్త చిరాగ్గా.
"అదికాదు. ఈ వేలిముద్రలు చిదానందస్వామిని. అందులో సందేహం లేదు. వీటిని పూజించండి..." అన్నాడు రంగారావు.
"అయితే మరి....?" అన్నాడు చౌదరి-ఉన్నట్లుండి అతడి బుర్రలో ఏదో మెరిసింది- "ఈ వేలిముద్రలు చిదానందస్వామివి కాకపోతే - హతుడు చిదానందస్వామి కాదా?"
దీనికి రంగారావు ఉలిక్కిపడ్డాడు. ఇంతసేపూ అతడాకోణంలో ఆలోచించడమేలేదు. తనవద్దనున్న వేలిముద్రలు చిదానందస్వామివని ఋజువు చేయాలన్నదే అతడి తాపత్రయం.
చౌదరి తలపట్టుకుని కూర్చున్నాడు.
ఇది సాధ్యమా?
హతుడు చిదానందస్వామి కాడా? అయితే ఎవరు?
చౌదరి మొత్తం కథనంతా తలలోకి తెచ్చుకున్నాడు. అన్నింటినీ తార్కికంగా ఆలోచిస్తున్నాడు.
"ఈ చిక్కుముడి విప్పగలిగినది రమ అనే అమ్మాయి. ఆ అమ్మాయి ఆశ్రమంలోనే వున్నది. ఎందుకంటే ఆశ్రమంలో మొత్తం ఎనమండుగురు అమ్మాయిలుండాలి. ఎవరూ తప్పిపోలేదంటున్నారు. రమ ఆ ఎనమండుగురిలోనూ ఒకతె అయుండాలి. చిదానందస్వామి ఆమెను రమ అనే పేరుతో-రవికి పరిచయం చేసివుండాలి. ఆ రమను ఎలా కనుగొనడం?" అతడు ఆలోచిస్తున్నట్లుగానే పైకి అన్నాడు. అప్పుడతడికి ఉపాయం స్ఫురించింది.
టేపురికార్డర్లో రమ గొంతు వున్నది. ఆశ్రమవాసులైన ఆడవారిలో ఆ గొంతును గుర్తుపట్టడం కష్టంకాదు.
10
ఇన్ స్పెక్టర్ చౌదరి రంగంలోకి దిగాడు. ఆ ఎనమండుగురి ఆడవారి గొంతులనూ టేపు చేశాడు. రమ దొరికిపోయింది. ముందామే నిజాన్ని ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఎలాంటివారినైనా ఒప్పించగల శక్తి చౌదరికున్నది.
రమ చెప్పిన కథ విని చౌదరి తెల్లబోయాడు.
రమ ఆశ్రమంలో చేరినాక చిదానందస్వామికి ఐహిక వాంఛలు బయల్దేరాయి. ఆయన రమను వివాహం చేసుకుని పదిమందిలో హాయిగా జీవించదల్చుకున్నాడు. అయితే ఎలా? ఆశ్రమాన్ని వదిలి పారిపోతే ఆయన గురించి పోలీసుల వేట ప్రారంభమవుతుంది. ఆశ్రమంలో డబ్బంతా ఆయన అధీనంలో వున్నది. అది చేజిక్కించుకుని గౌరవంగా బయటపడడానికి మార్గం కోసం ఆయన అన్వేషిస్తున్నాడు. అప్పుడాయనకు రవిబాబు దొరికాడు.
రవిబాబు ఒడ్డూ, పొడుగూ, అంగసౌష్టవంలో-అన్నివిధాలా స్వామీజీలా వుంటాడు. రవిబాబు సమస్య కూడా స్వామికి పనికివచ్చింది. ఆయన వెంటనే పథకం వేసి రమను రవిబాబుపై ప్రయోగించాడు. ఆమె పేరు, అతడి ఉనికి, వారి కలయిక అన్నీ రహస్యంగా జరిగి పోయాయి. అతనిని తన స్థానంలో పెట్టి చంపటమే స్వామీజీ పథకం.
చిదానందస్వామి తన పథకాన్ని పకడ్బందీగా రూపొందించుకున్నాడు. రవిబాబును రెచ్చగొట్టించే బాధ్యత రమపైన పడింది. ఆ సంభాషణ టేపు అయింది. చనిపోయినవాడి ముఖం గుర్తు తెలియకుండా చేయడానికి ఆ సంభాషణ చిదానందస్వామికి ఉపయోగపడింది.
ఆయన అనుకున్న ప్రకారం రావిబాబును హత్యచేసి తనలాగా వేషం మార్చి ఆశ్రమంలోని డబ్బును తీసుకుని వెళ్ళిపోయాడు. ముందాయన రమను కూడా తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. అయితే కొంతకాలంపాటు ఆమె ఆశ్రమంలో వుండకపోతే తామిద్దరం పట్టుబడిపోవచ్చునని భయపడి చివరి క్షణాల్లో ఉద్దేశ్యం మార్చుకున్నాడు. కొన్నాళ్ళగి ఆయన ధనవంతుడిలా ఆశ్రమానికి వచ్చి రమను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ ఈలోగా పోలీసులు చనిపోయింది స్వామికాదని తెలుసుకోవడం జరిగింది.
"అది స్వామివారి వేలిముద్రల మహిమ!" అన్నాడు చౌదరి-"తన వేలిముద్రలు భక్తుల కెన్నడూ సాయపడుతూనే ఉంటాయని ఆయన గ్రహించలేదేమో!"
చిదానందస్వామిని పట్టుకొనడానికి పోలీసులు రమను ఉపయోగించదల్చుకొనడంవల్ల మొత్తం కథ రహస్యంగా వుంచబడింది.
సరిగ్గా నెల్లాళ్ళ అనంతరం ఆయన పట్టుబడ్డాడు.
-:అయిపోయింది:-
