ఒక సంవత్సరం క్రితం శివరాజు మధుసూదన్ కి కొన్ని ఫోటోలు చూపించాడు. ఆ ఫోటోలలో మధుసూదన్. ఓ యువతి ఉన్నారు. వారిద్దరికీ శారీరక సంబంధమున్నదనడానికి తిరుగులేని ఋజు నా ఫోటోలు.
"ఏమిటీ ఫోటోలు?" అన్నాడు మధుసూదన్.
"మీ యిద్దరికీ అయిదేళ్ళ క్రితం సంబంధమేర్పడింది. ఈమె పేరు చరిత. ఈమె కిప్ప్పుడు నాలుగు సంవత్సరాల కొడుకున్నాడు. ఆమెకు వేరే ఆధారమేమీ లేదు. నువ్వు తనని పెళ్ళిచేసుకుందుకు నిరాకరించేవట అసహాయులకూ, అనాధలకూ, ఆడపిల్లలకూ నేనెప్పుడూ సాయపడతాను-" అన్నాడు శివరాజు.
"ఈమె నన్ను పెళ్ళి చేసుకోమని అడగలేదు...."
"ఇప్పుడడుగుతోంది...."
"అప్పుడే అడగాల్సింది. నేనామె జోలికి వెళ్ళి ఉండేవాణ్ణి కాదు...."
"ఈ ఫోటోలు మీ యిద్దరికీ పెళ్ళిచేస్తాయి....."
మధుసూదన్ ఒప్పుకోలేదు.
"లేకపోతే నెలకు వెయ్యిరూపాయలు-ఆమెకు భరణంగా యిచ్చుకో-"
మధుసూదన్ అందుకూ అంగీకరించలేదు.
"అయితే మనం కోర్టులో కలుసుకుంటాం...."
మధుసూదన్ ఈ విషయం గొడవగా మారుతుందని భయపడ్డాడు.
"అవ్వాకావాలి, బువ్వాకావాలంటే ఎలా కుదుర్తుంది?" అని విసుక్కున్నాడు శివరాజు.
"నేను పేదవాన్ని నెలనెలా డబ్బిచ్చుకోలేను-"
"పోనీ ఒక్కసారి యాభైవేలిచ్చుకోగలవా?"
"యాభైవేలా?" మధుసూదన్ చంప భవిష్యత్తు గురించి ఆలోచించాడు.
"అంతకంటే ఎక్కువే వస్తుందామె కోర్టుకి వెడితే!"
"ఆలోచించుకుందుకు వ్యవధికావాలి...." అన్నాడు మధుసూదన్.
"వారంరోజులు గడువు. గుర్తుంచుకో-వారం రోజులే!"
మధుసూదన్ కి చరిత యిల్లు గుర్తుంది. అతడు ముందామెను కలుసుకున్నాడు. ఆమెను నానామాటలూ అన్నాడు.
చరిత మౌనంగా అన్నీ విని - "శివరాజుమీద కోపాన్ని మీరు నా మీద చూపిస్తున్నారు-" అంది.
"నీ స్వార్ధమే శివరాజునిందుకు పురిగొల్పింది...."
"నా స్వార్ధం సంగతి మరిచిపోండి. శివరాజుని మీరేం చేయగలరు?"
"నేను వాడినేం చేయగలను? అసహాయున్ని....."
"మగాడిగా మీరు అసహాయులు. అదీ శివరాజు గొప్పతనం. నేను ఆడదాన్ని. నా అసహాయతను గుర్తించరేం?" అంది చరిత.
అంతవరకూ మధుసూదన్ విషయాన్నా కోణం నుంచి చూడలేదు.
"ఇందులో నీ అసహాయత ఏముంది?"
"పదేళ్ళప్పుడు శివరాజు నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు. ప్రయివేటుగా చదువు చెప్పించాడు. పదహారేళ్ళు రాగానే నా వయసును పెద్ద మనుషులపై ప్రయోగించసాగాడు. ఓ కంపెనీలో స్టెనోగా నాకుద్యోగ మిప్పించాడు. ఇప్పుడు నాకు పాతికేళ్ళు నేను అందరికిలా హాయిగా జీవించాలనుకుంటున్నాను. శివరాజందుకంగీకరించలేదు.
మిమ్మల్ని నేను మోసం చేయను. మీకు పిల్లలులేరు. నాలుగేళ్ళ కొడుకని శివరాజంటున్నది ఎవరో కూడా నాకు తెలియదు. కానీ అలాంటి కుర్రాన్ని తెచ్చి- నా కొడుకని శివరాజు చెప్పమంటే చెప్పేస్తాను. మీరు నన్ను మోసం చేశారని చెప్పమంటే చెప్పేస్తాను. శివరాజుని నేనెదిరించలేను. మనమంతా ఈ సృష్టిలో భగవంతుడాడించే ఆటబొమ్మలం. నేను శివరాజు చేతిలో ఆటబొమ్మని"- అని చెప్పింది చరిత.
మధుసూదన్ కామె పరిస్థితి అర్ధమయింది. తన నుంచి డబ్బు కోరుతున్నది శివరాజే కానీ చరితకాదు. కానీ ఏమిటి చేయడం?
తనే శివరాజుని చంపేయాలని అతడనుకున్నాడు. అందువల్ల తనకు తాత్కాలికంగా ప్రమాదం తప్పుతుంది. చరితకు కూడా మేలు జరుగుతుంది.
కానీ చంప?
చంప జీవితంలో స్థిరపడాలి. ఆమె సుఖంగా కాపురం చేసుకుంటూంటే అది తను కళ్ళారా చూసి సంతోషించాలి. తను శివరాజును చంపితే-పట్టుబడి ఉరికంబ మెక్కితే-చంప ఏమైపోతుంది?
"శివరాజు పాపాత్ముడు, దుర్మార్గుడు వాడినేదో ఒకరోజున ఎవరో ఒకరు చంపకపోరు. అంతవరకూ వేచి ఉండడం మినహాగా నేను చేయగలిగిందీ లేదు-" అనుకుని ఊరుకున్నాడు మధుసూదన్ అప్పట్నించీ నెల నెలా శివరాజు కాయన వెయ్యిరూపాయలు సమర్పించుకుంటున్నాడు.
"ఇదంతా నీకెలా తెలిసింది?" అన్నాడు ప్రవీణ్.
"తెలియడంలో ఆశ్చర్యమేముంది?" అంది చంప.
"ఆశ్చర్యమే! నీ బాబాయి నీ కిలాంటి కథ చెబుతాడనుకోను-"
"నాకీ కథ బాబాయి చెప్పలేదు-"
"మరెవరు చెప్పారు?"
"ప్రస్తుతానికి చెప్పలేను....." అంది చంప.
ప్రవీణ్ ఆమెనింకేమీ అడగలేదు. తను లేచి నిలబడి "నా ప్రేమను నిరూపించుకుంటాను. శివరాజును చంపేస్తాను-" అన్నాడతడు.
2
"మెనీ మెనీ థాంక్స్ చంపా!" అంటూ వెనక్కు వాలాడు సోఫాలో విజయ్.
"నాకు థాంక్స్ చెప్పి లాభంలేదు. నీ అదృష్టం బాగుండాలంతే-" అంది చంప.
"నీవు నా తరఫున కృషి చేయడమే నా అదృష్టం బాగుండాలంతే-" అంది చంప.
"నీవు నా తరఫున కృషి చేయడమే నా అదృష్టం. ఇంకా వేరే అదృష్టమేముంది!" అన్నాడు విజయ్.
చంప సాలోచనగా - "పాపం-నీ కారణంగా నేను ప్రవీణ్ కన్యాయం చేస్తున్నానేమో ననిపిస్తోంది-" అంది.
"డియర్ చంపా! ఇలాంటి సున్నిత మనస్తత్వం ఆడదానికి తగదు. ఆడదాని అందమంతా స్వార్ధంలో ఉంది. తనకోసం తనవారి కోసం ఏమైనా చేయగల ఆడది-ఏ కుటుంబ విజయానికైనా మూలకారణం....."
"నిజమే కావచ్చు కానీ" అంది చంప.
"డియర్ చంపా! నీలో పసితనం పోలేదు. కమాన్ గివ్ మీ యే స్వీట్ కిస్...." అన్నాడు విజయ్.
"ఇలా మాట్లాడితే నాకు నచ్చదని చెప్పాను-"అంది చంప లేచి నిలబడి.
"అయాం వెరీసారీ! నువ్వు అన్నింట్లోనూ మరీ స్ట్రిక్టు. పెళ్ళయ్యేదాకా వాయిదా వెయ్యడానికి నా వల్ల కాకుండా ఉంది. ప్లీజ్ కాస్త మోడ్రన్ గా మారు..." అన్నాడు విజయ్.
"నాకు సంప్రదాయమంటే యిష్టం. పెళ్ళి అయ్యే దాకా నువ్వు నన్ను తాకనైనా తాకకూడదు. అంతే!" అంది చంప.
"నీ రూల్సన్నీ నాకు తెలుసులే. నాకు నిన్ను తాకే అదృష్టమెప్పటికి కలుగుతుందో?" అంటూ వాపోయాడు విజయ్.
"నీకు నేను సహకరిస్తున్నాను. అది తప్పో ఒప్పో నాకే తెలియదు-" అంది చంప.
"శివరాజువంటి వాణ్ణి అంతం చేయడం చాలా అవసరం. అందుకు నీకు బోలెడు పుణ్యం వస్తుంది....."
"నిజమే-మధుసూదన్ బాబాయి నేడిపించినవాడు బాగుపడడు...." అంది చంప.
"వాడు నీ బాబాయినేకాదు. నన్నూ ఏడిపిస్తున్నాడు. నన్నేడిపించినవాడూ బాగుపడడు-" అన్నాడు విజయ్.
"బాబాయికీ నీకూ తేడా ఉంది...."
"ఎందుకుండదూ-ఆయన తండ్రివంటివాడు, నేను నీకు ప్రియుణ్ణి కాబోయే భర్తను....."
"నేను చెబుతున్నదా తేడా కాదు...."
"మరింకేమిటి?"
"బాబాయి చేసింది తప్పుకాదు. నువ్వు తప్పుచేశావు."
