మురళీధర్ రామయ్య వంక తీవ్రంగా చూడాలని ప్రయత్నించాడు, కానీ అతని చూపుల్లో తీవ్రత లేదు.
రామయ్య చాలాకాలంగా మురళీధర్ ప్రాపకం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వం నుంచి పాతిక లక్షల రూపాయలకు రావలసిన గ్రాంటుకు సంబంధించిన పేపర్స్ మురళీధర్ దగ్గర చిక్కడిపోయాయి. అందులో చాలా లోపాల నతడు పట్టుకున్నాడు. ఆ గ్రాంటు ఇంచుమించు నిలిచి పోయినట్లే. అయితే రామయ్య ఆశాజీవి. ఆ ఆశే లేకపోతే అతను ధనవంతుడై యుండేవాడు కాదు. మురళీధర్ ప్రస్తుత పరిస్థితులు అతనికి తెలిశాయి. ఎంత నిజాయితీ పరుణ్ణి అయినా బలహీన క్షణాల్లో లొంగదీసుకో వచ్చునన్న సత్యాన్నతనికి అనుభవం నేర్పింది.
రామయ్యే మళ్ళీ, "మీకు మూడు రోజులే గడువుందనుకుంటాను. చేయి దాటి పొతే మళ్ళీ ఇంత చౌకలో అంత మంచి ఇల్లు దొరకదట గదా!" అన్నాడు.
మురళీధర్ పుంజుకుని, "ఎవరు చెప్పారు మీకీ సంగతులన్నీ" అన్నాడు.
"ఎవరు చెబితే ఏం లెండి, నేను సాయపడగలనా, లేదా అన్నది మీరు తేల్చాలి."
మురళీధర్ ఒక్క క్షణం అలోచించి, "రామయ్య గారూ, నాకొక పాతికవేలు అప్పు కావాలి. రెండు వారాల్లో తప్పకుండా తిరిగిచ్చేస్తాను , యివ్వగలరా?" అన్నాడు.
రామయ్య సూటిగా మురళీధర్ కళ్ళలోకి చూసి. "తిరిగివ్వడం గురించి నాకు బాధ లేదు. ఒక ప్రయోజనాన్నాశించి అప్పుడుగుతున్నారు మీరు. అప్పివ్వడంలో ఏదైనా ప్రయోజనాన్నాశించడం నా తప్పవదు గదా" అన్నాడు.
"మీరు కోరిన వడ్డీ ఇస్తాను" అన్నాడు మురళీధర్ ఆశగా.
"నేను వడ్డీ వ్యాపరస్తుడ్ని కాదు. ఆ మాటకొస్తే అప్పు లివ్వడం నాకు నచ్చదు. సాధారణంగా నేను పెద్దపెద్ద మొత్తాలు బహుమతి రూపంలో ఇచ్చుకుంటూ వుంటాను. నా స్వభావమే అంత, నా లాభాలకు కారణమైన వాళ్ళందరికీ ఎంతో కొంత ముట్ట చెప్పాలనుకునే సోషలిస్టు మనస్తత్వం నాది."
మురళీధర్ ఆ మాటలన్నీ మౌనంగా విని ఆలోచిస్తూ కూర్చుండి పోయాడు. అయిదు నిముషాల అనంతరం, "ఏ ప్రయిజనాన్ని ఆశించకుండా నాకు మీ రప్పివ్వగలరా?" అనడిగాడు.
"ఇవ్వలేను" అన్నాడు రామయ్య.
'అయితే , మీరిక వెళ్ళవచ్చు" అన్నాడు మురళీధర్.
రామయ్య లేచి నిలబడి మరోసారి వినయంగా మురళీధర్ కు నమస్కరించి, "రేపు మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాను. ఒకోసారి ఆడవాళ్ళు మనకంటే తెలివిగా ప్రవర్తిస్తారు. ఈరోజు నేనన్న మాటలు ఇంటి దగ్గర ఆడవాళ్ళతో కూడా చర్చించండి. నాదగ్గరిప్పుడూ రెడీ గా క్యాషుంటుంది. ఎటొచ్చీ రేపటి కయితే మీకింక రెండ్రోజులే టైముంటుంది" అన్నాడు.
మురళీధర్ కళ్ళు మూసుకుని "మీరు రేపు రావడం అనవసరం. ఇది నా నిర్ణయం. దీన్ని దేవుడు కూడా మార్చలేడు" అన్నాడు.
రామయ్య సమాధాన మివ్వకుండా వెళ్ళిపోయాడు.
మురళీధర్ తల పట్టుకున్నాడు. అతనకిప్పుడు చాలా ఆందోళనగా వుంది. ఎన్నడూ లేనిది తన మనసిప్పుడు బలహీనంగా మారిపోయింది. రామయ్య విషయంలో తను చాలా ఖచ్చితంగా వ్యవహరించేశాడు. అతని గ్రాన్తుకు సంబంధించిన విషయంలో నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాడు. అటువంటిది తన మనసు ఊగిసలాడుతుంది. ఒక ప్రజా కంటకుడికి సహాయపడకూడదన్న నిర్ణయం తీసుకుందుకు కనీసం కొన్ని నిముషాలు పట్టింది.
8
"నాకు చాలా భయంగా వుంది ఉమా. నేనిప్పుడు చాలా బలహీన క్షణాల్లో వున్నాను. ఏదైనా ఒక క్షణంలో డబ్బు కోసం ఎటువంటి నేరం చేయడాని కైనా వేనుకాడనేమో అనుపిస్తోంది" అన్నాడు మురళీధర్. ఆరోజు ఆఫీసులో జరిగినది భార్యకు చెపుతూ.
ఉమ అంతా విని అతని తలలో వేళ్ళు పెట్టి, "ఏ పరిస్థితులలోనూ మీరు నేరం చేయరు, చేయలేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా రామయ్యను వెళ్ళిపొమ్మని చెప్పగలిగారంటే అది మీ గొప్ప మనసుకు సాక్ష్యం" అంది.
"లేదు ఉమా, అ రామయ్య రేపు వస్తాడు. ఈ రోజు వ్యవహరించినంత ఖచ్చితంగా రేపు వ్యవహరించలేనేమోనని నాకు చాలా భయంగా వుంది."
ఉమ ఒక్క క్షణం అలోచించి, "ఒక పని చేయండి. కనీసం రెండు మూడు రోజులు ఆఫీసుకు సెలవు పెట్టండి. ఇంటి దగ్గరుంటే మీమీద అంత ఒత్తిడి వుండదు"అంది.
"కానీ, డబ్బునేలా పుట్టించేది?" అన్నాడు మురళీధర్.
"దాని గురించి మీరేక్కువగా ఆలోచించకండి. మనకు యోగముంటే డబ్బులే వెతుక్కుంటూ వస్తుంది. లేదూ మనదగ్గర డబ్బున్నప్పుడే ఇల్లు కొనుక్కుందాం" అంది ఉమ.
ఇంతలో ఇంటివారబ్బాయి అక్కడికి వచ్చి, "మా నాన్నగారు మిమ్మల్ని పిలుస్తున్నారండీ" అన్నాడు.
"అవునండీ, చెప్పడం మరిచాను. ఈరోజు రాత్రి వాళ్ళురెడుతున్నారు" అంది ఉమ.
ఇంటివాళ్ళురు కెళ్ళినపుడు తాళాలు మురళీధర్ ఇంట్లో యిచ్చి వెడతారు. మధ్యమధ్యలో ఇల్లు కాస్త తుడిపిస్తుండడానికి , అన్నీ చూస్తుండడానికి! ఫోన్ వున్న చిన్న హాలు మాత్రం మురళీధర్ సౌకర్యార్ధం తలుపులు తీసే వుంచుతారు. తలుపులు తీసివుంచితే, ఆ హాల్లోంచి మురళీధర్ డ్రాయింగ్ రూం లోకి సరాసరి దారి!
ఇంటాయన వీళ్ళను పిలిచినందుకే రాత్రి పదకొండు గంటలకు వాళ్ళ ప్రయాణం. మళ్ళీ ఇరవై రోజులు గడిచేక వస్తారు. ఇంటావిడ ఉమకోసారి అన్నీ చూపించి చెప్పింది. ఇంటాయన దొంగలభయాన్ని వివరించి చెప్పాడు.
వాళ్ళతో మాట్లాడుతుండగానే మురళీధర్ కు ఫోన్ వచ్చింది భానోజీరావు దగ్గర్నుంచి. డబ్బు గురించి ఇంప్రూవ్ మెంట్స్ అడిగి, తను మరోసారి ఫోన్ చేసి కనుకున్నానని, డబ్బు అనుకున్న తేదీకి సర్దుబాటు చేయక తప్పదని చెప్పాడతను. అతనిప్పుడు బయల్దేరి మురళీధర్ ఇంటికే వస్తున్నాడు. డబ్బు ప్రయత్నాల్లో ఇక్కడికైనా వెళ్ళాడేమో తెలుసుకోవడం కోసం ఫోన్ చేశాడతను.
మరో అరగంటలో భానోజీరావు మురళీధర్ యింట్లో వున్నాడు.
"నేనాఫీసులో మూడ్రోజులు సెలవు పెట్టేయ దల్చుకున్నాను" అన్నాడు మురళీధర్.
"ఎందుకని ?"
"నేనిప్పుడు బలహీన క్షణాల్లో వున్నాను. మనిషిని నేరానికి పురికోల్పేసి క్షణాలే. ఆఫీసులో లంచానికి లొంగుతానేమోనని భయం. నాకు డబ్బవసరమని చాలా మందికి తెలిసింది. అవకాశా న్నుపయోగించుకుందుకు ప్రయత్నిస్తున్నాడు" అన్నాడు మురళీధర్.
భానోజీరావు అసహనంగా మిత్రుని వంక చూశాడు. 'అనుక్షణం ఇలా భయపడడం నాకు నచ్చలేదురా, బలమైన వ్యక్తిత్వాన్నేర్పరచుకోవాలి. నేరం చేస్తానేమో నని ప్రతీ క్షణం బాధపడతావు తప్పితే, ఇంతవరకూ ఒక్క నేరమయినా చేయలేదని గుర్తుంచుకోవేం? బలహీన క్షణాల్లోనే కాదు, ఏ పరిస్థితుల్లోనూ నువ్వు నేరం చేయలేవు. ఇది మిత్రుడిగా మాత్రమే కాదు, ఒక పోలీస్ ఇన్ స్పెక్టరు గా కూడా నా అభిప్రాయం."
"నీ అభిప్రాయానికి నా థాంక్స్. కానీ ఇంతవరకూ నేను నేరం చేయవలసిన అవసరం రాలేదు. అవసరాలే మనిషిని నేరానికి పురిగోల్పుతాయి."
"ఇప్పుడు మాత్రం అంత అవసరమే మొచ్చిందంట?"
"ఇల్లు కొనడం గురించి నేనెంత తపించి పోతున్నారో నీకు తెలియదు. అది నా జీవితాశయం. అందుకిప్పుడొక బంగారం లాంటి అవకాశ మొచ్చింది. దీన్ని చేతులారా జార విడుచుకోవడం నాకిష్టం లేదు."
"మరీ అంత సెంటిమెంటు పనికి రాదురా, యెప్పటికి మరి ఇల్లు కొనలేకపోతావా?"
'అది కాదురా, ఇల్లు కొనాలన్న ఆశయం నాది, నా ఆశయాలకు సరిపడ్డ ఇల్లుంది. ఆ ఇంటి ఖరీదు సరసంగా వుంది. ఆ ఖరీదుకు కొనగల స్తోమతు నాకుంది, ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఇల్లు కొనలేకపోయానంటే, ఏదో అపశ్రుతిలా ధ్వనిస్తుంది. అపశకునం లా తోస్తుంది."
'అపశ్రుతులూ, అపశకునాలు మనిషి కల్పించుకున్నవి. నాకు తెలిసినంత వరకూ నీ అంత అదృష్ట వంతుడు లేడు. చల్లని సంసారం. చక్కని సంతానం."
మురళీధర్ భాధగా నవ్వి, "ఏదో పాటలో విన్నట్లు ఆడది కోరుకునే వరాలు రెండూ అవి. మగవాడికి సంబంచించినంతవరకూ ఈ చల్లని సంసారానికి , చక్కని సంతానానికీ ఒక రమ్యహర్మ్యం కూడా ఏర్పరచవలసిన బాధ్యత వుంది" అన్నాడు.
వేడివేడి పకోడీలతో వచ్చింది ఉమ. అంతా వాటిని తిన్నారు.
తర్వాత భానోజీరావు , మురళీధర్ కలిసి నలుగురైదుగురు వడ్డీ వ్యాపారస్తుల్ని కలిశేరు. అందరూ కూడా పెద్దపెద్ద హమీలూ కావాలన్నారు.
9
విషయమంతా విని, "అయితే ఇంకా డబ్బు దొరకలేదన్న మాట. నేననుకున్నాట్లే. గవర్నమెంటప్పివ్వక పొతే, మనకు డబ్బిచ్చే వాళ్ళెవ్వరుంటారని" అన్నాడు రామారావు.
"ఏదో ఉపాయం నువ్వే చెప్పాలి" అన్నాడు మురళీధర్.
