'ఈ జనాభా పెరుగుదల ఇప్పుడు ప్రపంచానికే వో సమస్య అయిపొయింది కదా -- ఇప్పుడు పెరుగుతున్న రేటుని జనాభా పెరగటం జరిగితే మరికొన్ని సంవత్సరాలలో ఈ భూమి మీద ప్రజలు నివసించటం కూడా సాధ్యం కానంతగా క్రిక్కిరిసి పోవచ్చు.
ప్రజలు అందరూ సజకరిస్తేనే ఈ సమస్యకి పరిష్కారం జరుగుతుంది -- లేకపోతె ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు వేసినా ఎంత డబ్బు ఖర్చు చేసి ఈ విషయం ప్రచారం చేసినా అంతా వృధాయే --' అంది కళ్యాణి.
'అదేమరి. అసలు ఎవరికి వారు ఒక్క విషయం గ్రహించు కోవాలి 'పరిమిత సంతానంతో కుటుంబంతో శాంతి సౌఖ్యం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ లభ్యం అవుతాయి. అది సాధించటం మన చేతిలోనే వుంది అని, ఇదుగో కళ్యాణి ఇప్పుడే చెప్తున్నా మన కిద్దరు పిల్లలు చాలు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి . ఏం?' అంటూ కళ్యాణి బుగ్గ మీద చిటిక వేశాడు చిలిపిగా 'ఇద్దరూ అమ్మాయిలే అయితేనో?' అతన్ని వుడి కించటానికి పెంకిగా అడిగింది.
'అయినా మరేం ఫర్వాలేదు.....మామయ్యలా కొడుకు లేకపోతె వున్నా మన రకం తప్పదు అన్న నమ్మకం నాకేం లేదు-- అబ్బాయి కావాలి అని కూర్చుంటే వరస పెట్టి డజను మంది అమ్మాయిలూ పుట్టుకు రావచ్చు కాబట్టి అలాంటి డాన్సు రిస్కూ నేను తీసుకోదలుచు కోలేదు . అమ్మాయి లయినా సరే అబ్బాయిలయినా సరే..ఇద్దరు పిల్లలు చాలు.
* * * *
వీధి తలుపు చప్పుడయితే మురళీ లేచి వెళ్లాడు. 'ఎవరొచ్చారో ?' అనుకుంటూ అతని వెనకే కళ్యాణి కూడా లేచి వెళ్ళింది --
మురళీ తలుపు తీశాడు ఎదురుగా మణి నిలబడి వుంది, ఆ పిల్ల రెండు కళ్ళూ నీళ్ళతో నిండి వున్నాయి. ఏ క్షణం లో అయినా ఆ కన్నీళ్లు బుగ్గల మీదికి జారి పడతాయేమో ననిపిస్తుంది చూసేవాళ్ల కి. 'ఏమ్మా, ఏం కావాలి' అన్నాడు మురళీ జాలిగా ఆప్యాయంగా ఆ పిల్ల వంక చూస్తూ.
'అమ్మ....అమ్మకి జబ్బుగా వుంది. ప్రొద్దుటే ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు. అక్కడే వుండాలందిట డాక్టర్....ఇప్పుడు జబ్బు ఎక్కువగా వుందనీ ....' ఆ పైన ఆ పిల్ల గొంతు పెగల్లేదు రెండు బుగ్గల మీదికి జలజల కన్నీళ్లు రాలిపోతుంటే పరికిణీ కుచ్చెళ్ల తో తుడుచుకుంటూ వుండిపోయింది.
'అక్కయ్యకా? సుస్తీగా వుందా?ఎన్నాళ్ళ నుంచి? నాకు తెలియనే లేదే' ప్రొద్దుట ఆస్పత్రి కి తీసుకు వెళ్తున్నప్పుడైనా చెప్పక పోయావా?' ఆత్రంగా ఆదుర్దాగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ముందుకు వచ్చింది కళ్యాణి.
'ఎన్నాళ్ళ నుంచి బాగుండలేదో, అదేమో నాకు తెలియదు ప్రొద్దుట లేస్తూనే ఏడుస్తూ కూర్చుంది. నాన్న హడావిడిగా ఆస్పత్రికి తీసుకు వెళ్ళిపోయాడు.' ఇంత కన్న చెప్పటం నాకు చేత కాదు అన్నట్లు చూసింది.
అసరికి గోపాలరావు ఇంటికి తాళం పెట్టి చంటి వాడిని చేతులలో పట్టుకుని మిగిలిన పిల్లలందర్నీ వెంట బెట్టుకుని మెట్లు దిగి క్రిందికి వచ్చారు.
'ఏమయిందండీ?' మురళీ అడిగాడు ఖంగారుగా.
అపరాధిలా తల వంచుకుని అన్నాడు గోపాలరావు , 'అబార్షన్ కావటానికి ఏదో తిందిట. అది వికటించింది -- ప్రొద్దుట డాక్టరు కి చూపిస్తే నాలుగు చీవాట్లు పెట్టి ఆస్పత్రిలో చేర్చమని చెప్పింది -- మరేం ఫరవాలేదని ధైర్యం కూడా చెప్పింది-- మరి తరువాత ఏమయిందో పరిస్థితి కాస్త ఖంగారుగా వుందనీ శాంత పిల్లలందర్నీ చూడాలని కలవరిస్తోందని ఇప్పుడు ఆఫీసుకు ఫోను చేసింది....అఫీసులో పని ఎక్కువగా వుండటం వల్ల నేను శలవు పెట్టటానికి వీలులేక పోయింది -- ఇంకా ఇప్పుడు వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్దామను కుంటున్నాను. ఇంతలో ఫోను వచ్చింది....'
కళ్యాణి మురళీ మొహాలు చూసుకున్నారు. కాస్సేపటి క్రితం తాము మాట్లాడుకున్న విషయమే -- ఇప్పుడు వినవలసి రావటం వాళ్ళిద్దరికీ ఆశ్చర్యంగా మరో ప్రక్క నుంచి కంగారుగా వుంది.
ప్రక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుంటున్న గోపాలరావు ని వుద్దేశించి అన్నాడు మురళీ. 'అధైర్య పడకండి-- వదిన గారు క్షేమంగా యింటికి తిరిగి వస్తారు...పసివాళ్ళ ముందు మీరిలా అయిపోతుంటే వాళ్ళు మరీ బెంబేలు పడిపోరా...' ఒకనాడు అతని మీద కలిగిన అయిష్టత, చిరాకు చులకన భావం ఏవీ మచ్చుకైనా లేవు ఇప్పుడు మురళీ లో-- ఎదుటి మనిషి పరిస్థితి ని అర్ధం చేసుకో గల మంచి మనసూ, సానుభూతి అభిమానమూ వున్నాయి అతని మాటల్లో.
'మీరు వెళ్తూ వుండండి-- మేము వస్తాము' అని 'పద కళ్యాణి-- త్వరగా తలుపులు తాళాలు వేసేయి .' అన్నాడు కళ్యాణి వంక తిరిగి.
'అక్కయ్య కేలా వుంటుంది? తను మళ్లీ తిరిగి యింటికి వస్తుందా?' అన్న ఒక్క ఆలోచనతో భయంతో గుండెలు బిగాపట్టినట్లయి పోయిన కళ్యాణి మౌనం గానే ఎలాగో గబగబ తలుపులు వేసి తాళాలు వేసింది.
అంతా ఆస్పత్రికి వెళ్ళారు. శాంత పరిస్థితి ప్రమాద కరంగానే వుందని చెప్పింది డాక్టరు ఏవో కాంప్లికేషన్సు వచ్చాయిట. వాళ్ళు చెయ్యాల్సిన వైద్యానికి లోపము రానివ్వకుండా చేస్తున్నారు. మందులు, ఇంజక్షను లు అలా ఎడతెరిపి లేకుండా వాడుతూనే వున్నారు. 'మాశక్తి వంచన లేకుండా మా ప్రయత్నం మేం చేస్తాం -- ఆ పైన భగవంతుడి దే భారం' అన్నట్లుగా మాట్లాడింది లేడీ డాక్టరు గోపాలరావుతో. ఆవిడ్ని మరి కాస్త శ్రద్ధ తీసుకోమని మరోసారి చెప్పి శాంత గదిలోకి వచ్చాడు అతను. రెండు కళ్ళ నిండా నీళ్లు నింపుకుని బేలగా భర్త వంకా పిల్లల వంకా చూస్తూ వాళ్ళందర్నీ పలకరించి మాట్లాడింది శాంత.
ఏం మాట్లాడాలో తెలియని దానిలా గుడ్లు పెట్టుకుని భయంగా, జాలిగా మందలింపు గా, ధైర్యం చెప్తున్నట్లు గా అనేక భావాలని చూపులతోనే వ్యక్తం చేస్తూ నిలబడిపోయిన కళ్యాణి ని దగ్గరగా రమ్మని పిలిచి మృదువుగా ఆమె చెయ్యి నిమురుతూ.
'చెల్లాయ్, నీకు ఏడో నెల రాగానే పసుపు కుంకుమా ఇచ్చి సూడిదలు ఇద్దామను కున్నాను. ఆరోజు మిమ్మల్ని మా యింటికి భోజనానికి పిలిచి మీ కిష్టమైన వన్నీ చేసి విందు చేద్దామను కున్నాను..... కాని ఇంక ఏమీ చెయ్యలేక పోతానేమో....నువ్వు మాత్రం నా పిల్లల్ని కాస్త కనిపెట్టి చూడాలి....' శాంత గొంతు మరి పెగల్లేదు.
కనుకొసల నిలచిన నీటి బిందువులని ముని వేళ్ళతో అద్దేసు కుంటూ అంది కళ్యాణి గబగబా 'అలా అనకక్కయ్యా -- నీకేం భయం లేదు. నీ బిడ్డలకి వచ్చిన భయం అంతకన్నా లేదు....నువ్వు యింటికి తిరిగి రాగానే నేనే వచ్చి నాకు కావలసిన వన్నీ నీచేత చేయించుకు తింటాను , సరేనా.' అంది నవ్వు తెచ్చుకోటానికి ప్రయత్నిస్తూ.
ఎంత వెర్రి దానివి అన్నట్లు కళ్యాణి వంక చూసి 'పోనీ ,మీరయినా చెప్పండి మరిది గారూ...ఆడదిక్కు లేకుండా పోయిన మా కుటుంబాన్ని మీరిద్దరూ కూడ కాస్త కనిపెట్టి చూస్తారు కదూ? పిల్లలు బొత్తిగా చిన్నవాళ్ళు.....'
అప్పటికే నర్సు వచ్చి ఏడుస్తున్న పిల్లల్ని బయటికి తీసుకు వెళ్ళిపోయింది. గోపాలరావు రుమాలు నోటికి అడ్డం పెట్టుకుని ఏడుపు దిగమింగు తున్నాడు.
'ఇప్పుడు మీకు వచ్చిన భయం ఏమీ లేదు-- అయినా మీ పిల్లల కే లోటూ వుండదు. మీరు వాళ్ళ కోసం దిగులు పడకండి.' అన్నాడు మురళీ ఒకవేళ శాంత కి నిజంగానే ఏదయినా అయితే, ఆవిడ అడిగి నప్పుడు ఒక చల్లని మాట అయినా చెప్పలేక పోయానే అని తరువాత తను బాధ పడ కూడదనే వుద్దేశ్యంతో.
'నీకేం భయం లేదని డాక్టరు చెప్పింది . ప్రశాంతంగా కళ్ళు మూసుకు పడుకో వలసిన సమయంలో నువ్వు ఏదేదో అలోచించి హైరానా పడటం ఏమీ బాగుండలేదు-- నేను నీకిందా కనే చెప్పాను కదా, పిల్లల్ని నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. నీకూ వాళ్ళకీ కూడా ఎలాంటి అన్యాయమూ చెయ్యను. ఇదే కదూ నువ్వు నా దగ్గర నుంచి కావాలనుకున్న సమాధానం-- నేను వూరికే ఇప్పుడు నిన్ను సంతోష పెట్టటం కోసం ఈ మాట అనటం లేదు....భగవంతుడు అంత నిర్దయగా నిన్ను మాకు దూరం చేయటమే జరిగితే అందుకు నా బాధ్యత కూడా వుంది కనక మిగిలిన జీవితం అంతా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, నిన్ను తలుచుకుంటూ, మన పిల్లల్లో నీ ప్రతి బింబాన్ని చూసుకుంటూ బ్రతుకుతాను...' ఓ విధమైన ఉద్విగ్నత తో బాధతో గోపాలరావు చెప్తుంటే శాంత మొహంలో శాంతి తో కూడిన చిరునవ్వు తోణికిస లాడింది.
ఆ తరువాత మరికొంచెం సేపు అదీ ఇదీ మాట్లాడాక శాంత కి నిద్ర పట్టింది --
కాస్సేపు కూర్చుని మురళీ కళ్యాణి ఇంటికి వచ్చేశారు. ఆ తరువాత మరి కొంచెం సేపు వుండి గోపాలరావు పిల్లలూ కూడా వచ్చేశారు.
'సాయంకాలం చాలా ఖంగారు పడ్డారుట....ఇంక భయం లేదు అన్నట్లే చెప్పింది డాక్టరు.మరి మా అదృష్టం ఎలా వుందో' అన్నాడు గోపాలరావు యింటికి తిరిగి వచ్చాక మురళీ తో.
అతనికి కాస్త ధైర్యం చెప్పి 'ఇంక ఇప్పుడు వంట ప్రయత్నం ఏమీ చెయ్యకు మణి ....మీరంతా ఈ రెండు రోజులూ మా యింట్లో నే తిందురు గాని.' అన్నాడు మురళీ.
'ఎందుకండి -- ఆవిడకి శ్రమ, అందులోనూ ఈ స్థితిలో' అనేశాడు గోపాలరావు మొహమ్మాటంగా.
'ఎందుకు నాన్నా?-- ఇవాళ సాయంకాలం అయిదు గంటలకే వంట చేసేశాను గా-- రేపటి సంగతి చూసుకుందాం --అయినా నాకేం వంట చెయ్యడం చేత కాదు కనకనా.' అంది మణి -- తల్లికి ఏటా కాన్పు కావటంతో ఆ పిల్లకి వూహ తెలిసినప్పటి నుండి ఆ పని ఈపనీ చెయ్యటం అలవాటయింది.
ఆదరంగా ఆ పిల్ల తల మీద చెయ్యి వేసి నిమురుతూ 'సరే వస్తామండీ,' అని మురళీ కి చెప్పి-- పిల్లల్ని తీసుకుని మేడమీదికి వెళ్ళిపోయాడు గోపాలరావు.
'పోనీలెండి-- ప్రమాదం గడిచి పోయిందన్న మాట' అంది కళ్యాణి నిశ్చింతగా వూపిరి పీల్చుకుంటూ.
