వీరభద్రం మీద రామారావుతోపాటు చాలా మందికి కోపం వచ్చింది. అతగాడికి ఏదోవిధంగా బుద్ది చెప్పాలి-అని అందరూ రామారావుతో అన్నారు. తమలో తాము అనుకున్నారు.
"సుమారు ఆరొందలు ఖరీదుచేసే వాచీని నూటయాభై రూపాయలకు దక్కించుకున్నాడు. దానికీ మా కుటుంబానికీ ఉన్న సెంటిమెంటల్ ఎటాచ్ మెంట్ గురించి చెప్పినా లెక్క చేయలేదు. ఇతగాడికి సరియైన గుణపాఠం చెప్పి తీరాలి...." అన్నాడు రామారావు.
అప్పుడే మోహనరావు కలగజేసుకుని-"ఎవరికైనా ప్రాణ ప్రదమైన వస్తువుంటే దాన్ని వారినుంచి దూరం చేయడం వీరభద్రం హాబీ-" అంటూ తనకు తెలిసిన సత్యాన్ని వివరించాడు.
ఆ వివరాలు తెలియగానే చాలామంది హృదయాలు కుతకుతలాడిపోయాయి.
"ఈ రోజు రామారావు కయింది. రేపు మానకవుతుంది. ఈ వీరభద్రం చాలా ప్రమాదకరమైన మనిషి. ఇతఃగాడికి అర్జంటుగా బుద్దిచెప్పాలి....." అన్నాడో కొలీగ్.
"మరోలా మరోలా అతడికి బుద్దిరాదు. తను బాగున్నంతకాలం ఎదుటివారు సర్వ నాశనమైపోయినా ఫరవాలేదన్నాడతను. అందుకని అతన్నోసారి సర్వనాశనం చేయాలి...." అన్నాడు రామారావు.
"అదెల్లా?" అన్నాడు మోహనరావు.
"వీరభద్రానికి ఒక్కడే కొడుకు. హైదరాబాదునించి ట్రాన్సుఫర్ మీదకదా ఇక్కడికి వచ్చేడు. కొడుకుని చుట్టాలింట్లో ఉంచాడు. నలుగురాడపిల్లల తర్వాత పుట్టిన ఏకైక పుత్రుడు. వీరభద్రాని కతడే సర్వస్వం. సర్వనాశనమంటే అర్ధమయిందా?" అన్నాడు రామారావు.
6
"వీరభద్రంగారంటే అక్కడ-" అంటూ చూపించింది లలిత. పోస్టుమాన్ వీరభద్రాన్ని సమీపించి టెలిగ్రాం అందించాడు.
వణుకుతున్న చేతులతో టెలిగ్రాం అందుకుని చదివాడు వీరభద్రం. చదివేక అతనిముఖం పాలిపోయి కుప్పలా కుర్చీలో కూలబడ్డాడు.
సంతకం పెట్టించుకుని పోస్టుమాన్ వెళ్ళిపోయాడు. ఈలోగా కొలీగ్స్ ఒక్కొక్కరే వీరభద్రాన్ని సమీపించి "ఏమిటి విశేషం?" అనడిగారు.
వీరభద్రం మారు మాట్లాడకుండా టెలిగ్రాం వారి కందించాడు.
"లక్ష్మణ్ సీరియస్. స్టార్ట్ ఇమ్మీడియెట్లీ-" అని ఉన్నదందులో ఎవరో గోవర్ధనంగారిచ్చారు టెలిగ్రాం. హైదరాబాదునించి వచ్చిందది.
"గోవర్ధనంగారెవరు?" అనడిగింది లలిత.
"మా చిన్నాన్నగారు. మా అబ్బాయి వాళ్ళింట్లోనే ఉండి చదువుకుంటున్నాడు-" అన్నాడు వీరభద్రం.
"అలా దిగాలుపడి కూర్చుంటే ఎలా? వెంటనే ఇంటికెళ్ళి మీరు మీ ఆవిడా ప్రయాణాలవండి. ఇప్పటికిప్పుడు ప్రయాణమంటే రిజర్వేషన్ దొరుకుతుందో దొరకదో-" అన్నాడో కొలీగ్.
వీరభద్రం క్షణాల మీద సెలవు చీటీ రాసి లోనకువెళ్ళి ఆఫీసర్ గారికిచ్చి టెలిగ్రాం చూపించాడు. ఆయన తక్షణమే బయల్దేరి వెళ్ళమన్నాడు.
వీరభద్రం నిరుత్సాహంగానే అయినప్పటికీ హడావుడిగా ఇల్లుచేరాడు. భార్యకు క్లుప్తంగా విశేషాలు చెప్పి వెంటనే బయల్దేరదీశాడు. ఆలోచించే వ్యవధిలేదు. మెయిల్లో బెజవాడదాకా వెళ్ళి అక్కణ్ణించి టాక్సీ అందుకోవాలి.
వీరభద్రం భార్య శోకం పెట్టడానికి సిద్దంగావుంది. కానీ అందుక్కూడా వ్యవధిలేదు.
అతను ఇద్దరికీ ఫస్టుక్లాసు టికెట్లు తీశాడు. ఈలోగా అతని భార్య దేవుడికి అదేపనిగా దణ్ణాలు పెట్టేస్తోంది. ఇద్దరూ ట్రయినెక్కారు. ట్రయిన్లో ఇద్దరూ దిగులుగా మాటా మంతీ లేకుండా కూర్చున్నారు.
రాజమండ్రిలో వాళ్ళ కంపార్టుమెంటులో ఒక కాషాయాంబరధారి ఎక్కాడు.
కంపార్టుమెంటులో ఇంకెవ్వరూలేరు. కాషాయాంబర ధారి వీళ్ళిద్దర్నీ పలకరించి-"ఎక్కడికి?" అన్నాడు.
"హైదరాబాదు-" అన్నాడు వీరభద్రం.
"అరే ఇది మెయిలు. హైదరాబాదు వెళ్ళదు...." అన్నాడు కా.....ధారి.
"తెలుసు. బెజవాడనుంచి బస్సులో వెడతాం....."అన్నాడు వీరభద్రం.
"చాలా బాగుంది. నేనూ అలాగే చేయబోతున్నాను" అన్నాడు కా......ధారి.
"మీరూ హైదరాబాధేనా?" అన్నాడు వీరభద్రం యధాలాపంగా.
"అవును, భూత భవిష్యద్వర్తమానాలు చెప్పడంలో ఆరితేరిన నేను ఆహ్వానంపై ఏ నగరానికి పిలుపువస్తే అక్కడికి వెడుతూంటాను...." అన్నాడు కా......ధారి.
వీరభద్రం భార్య కా......ధారివంక అదోరకమైన ఆశగా చూసి-"మీరు జ్యోతిష్యులా?" అంది.
"అవును ముఖం చూసి అన్నీ చెప్పగలను....."అన్నాడు కా......ధారి.
వీరభద్రం అదోరకమైన చిరాకుతో-"అయితే నా ముఖం చూసి చెప్పండి....." అన్నాడు.
"చెబుతాను. కానీ అందుకు రేటుంది. నమ్మకం కుదరడానికి అయిదురూపాయలూ కుదిరేక-కావలసిన వివరాలనుబట్టి పాతికనుంచి నూటపదహార్లవరకూ-" అన్నాడు జ్యోతిష్కుడు.
"అయితే అయిదు రూపాయల జోస్యం చెప్పండి....." అన్నాడు వీరభద్రం.
"ఒక్కడే కొడుకు మీకు. అతని గురించిన కలవరపాటుతో ఈ ప్రయాణం చేస్తున్నారు....."అని ఆగి-"నేను సరిగ్గా చెప్పేనని తోస్తేనే అయిదురూపాయలూ ఇవ్వండి...." అన్నాడు జ్యోతిష్కుడు.
వీరభద్రం తెల్లబోయాడు. అతను అనుమానంగా చూశాడు జ్యోతిష్కుడివంక. ఎక్కడా చూసిన ముఖంలా లేదు. అయినా ఇప్పటికిప్పుడు ఈ వివరాలు తెలుసుకురావడం కష్టం. అందులోనూ ఇతను రాజమండ్రిలో ఎక్కాడు.
అప్రయత్నంగా అయిదురూపాయలుతీసి అతని కందిస్తూ-"ప్రస్తుతం నా దగ్గర డబ్బెక్కువగాలేదు. పాతికరూపాయలిచ్చుకోగలను. నా కొడుకు యోగ క్షేమాలు గురించి చెప్పండి....." అన్నాడు.
