6


రక్తం ఎవరికీ మిగలడం లేదు.
బానిసల రక్తం మళ్ళీ పుంజుకుంటుంది.
బానిసలు కానివారిది ఒకటే తృప్తి....తాము బానిసలు కామని!
'గనేయ్య మనిషి కాదు. రాక్షసుడు.....' అన్నాడు వేదాంతం.
'ఇలాంటి రాక్షసులని దేశంలో పల్లెపల్లెలా వ్యాపించి ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వీరు మారడం లేదు. ప్రభుత్వమెన్ని, ప్రణాళికలు వేసినా ప్రజలగతి మారకపోవడానికి గనేయ్య వంటి వారే కారణం..."
"గనేయ్య గురించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదా?"
'పోలీసులా> ఈ ప్రాంతపు ఎమ్మెల్యే -- గనేయ్య అసరాతోనే మా ఊరి ఓట్లన్నీ సంపాదించాడు -" అన్నాడు సుబ్బారావు.
"ఈ ఊరు వదలి పోకూడదా?"అన్నాడు వేదాంతం.
"గనేయ్యలే ఊళ్ళో లేరు గనక ...." అన్నాడు సుబ్బారావు.
వేదాంతం మాట్లాడలేదు. గనేయ్య అంతం చూడాలని మాత్రం అతడనుకున్నాడు.
సుబ్బారావు తల్లి వారిని కన్నబిడ్డల్లా ఆదరించింది.
'ఆదరణకు ఎవరైనా స్త్రీ తర్వాతే -- " అనుకున్నాడు వేదాంతం.
ఆ రాత్రి మిత్రులిద్దరికీ అంత బాగా నిద్ర పట్టలేదు.
తెల్లవారు ఝామునే ఇద్దరూ లేచిపోయారు. త్వరగా కాలకృత్యాలు తీర్చుకున్నారు.
సుబ్బారావు తల్లి వారికి కాఫీలతో పాటు ఉప్మా కూడా చేసి పెట్టింది.
"క్షేమంగా వెళ్ళి లాభంగా రండి -' అని దీవించింది.
మిత్రులిద్దరూ బయల్దేరేటప్పుడామెకు పాదాభివందనం చేశారు.
కులభూషణ్ సుబ్బారావు తండ్రి నోసారి పరీక్షించి మరీ బయల్దేరాడు.
ఎవరూ అతణ్ణి సుబ్బారావు తండ్రి ఆరోగ్యం గురించి అడగలేదు.
ముగ్గురూ ఇంట్లోంచి బయల్దేరారు.
అప్పటి కూళ్ళో ఇంకా జనసంచారం ప్రారంభం కాలేదు.
ఓ యువతి మాత్రం వారికేదుదయింది.
వీరిని చూసి తల దించుకుందామె.
ముగ్గురూ ఆమెను దాటుకుని వెళ్ళారు.
"మా యింటికి నాలుగిళ్ళకవతల శేషయ్యున్నాడు. అయన కోడలీ అమ్మాయి. పెళ్ళయి ఆర్నెల్లయింది...." అన్నాడు సుబ్బారావు.
'ఆమె గురించి మనకెందుకు ?' అన్నాడు వేదాంతం.
"గనేయ్య ఇంటి నుంచి వస్తోందామె"-
మిత్రులిద్దరూ మ్రాన్పడిపోయారు.
"నీకెలా తెలుసు ?" అన్నాడు కులభూషణ్.
"గ్రామంలో ఘోషా ఎక్కువ. ఈ సమయంలో అయినింటి ఆడపడుచెవ్వతీ బయటకు రాదు. అది గనేయ్య ఇంటి నుంచయితే తప్ప! పరుల కంట పడకుండా గప్ చిప్ గా యింటికి పోవడానికిదే అనువైన సమయం. అయినా ఈ పిల్ల దురదృష్టం కొద్దీ మన కళ్ళబడనే పడింది."
మిత్రులిద్దరూ ఆగి వెనక్కు తిరిగారు.
ఆమె లేదక్కడ.
వేదాంతం నిట్టూర్చాడు. ముగ్గురూ మళ్ళీ నడక ప్రారంభించారు.
"ఇదే గనేయ్య ఇల్లు -' అన్నాడు సుబ్బారావు ఓ యింటి ముందాగి.
రెండంతస్తుల మేడ అది. ఆ యింటికి చేసిన చిలకాకుపచ్చ రంగు -- గనేయ్య అభిరుచికి అద్దం పడుతోంది.
మిత్రులక్కడ ఆగలేదు.
మరి నాలుగడుగులు ముందుకు వేసేసరికి ----వారికి మరో యువతి ఎదురయింది. వీరిని చూస్తూనే ఆమె తల దించుకుని వడివడిగా అడుగులు వేసుకుంటూ దాటిపోయింది.
"సీతన్న కూతురు -- లక్ష్మీ ఆమె పేరు. రెండ్రోజుల్లో పెళ్ళి ముహూర్తముంది. పాపం -- ఈరోజు తనవంతు వచ్చినట్లుంది -- గనేయ్యఇంటికి పోతోంది -- ' అన్నాడు సుబ్బారావు.
కులభూషణ్ పిడికిళ్ళు బిగిశాయి.
వేదాంతం తీవ్రాలోచనలో ఉన్నాడు.
సుబ్బారావు మాట్లాడడం ఆపేశాడు.
ముగ్గురూ ఊరు చివరకు చేరుకున్నారు. అక్కణ్ణింఛి అడవి ప్రాంతం.
సన్నని కాలి బాట....
చెట్లు, పొదలు మరీ ఎక్కువగా లేవు.
ముందు సుబ్బారావు...వెనక మిత్రులిద్దరూ...
దారి కొంతదూరం వెళ్ళాక నాలుగు దారులుగా చీలిపోయింది.
సుబ్బారావు అన్నీ తెలిసినవడిలా ఓ దారి ననుసరించాడు.
అలా వారు ముందుకు చొచ్చుకుని పోతున్నారు.
మధ్యలో దారి చీలిపోతోంది. మళ్ళీ కలుస్తోంది.
సుబ్బరావెక్కడా ఆగడం లేదు.
ఆ విధంగా వారు ఏడెనిమిది కిలోమీటర్లు దూరం నడిచారు.
"ఈ దారులన్నీ ఆటవికులేర్పరచినవి. కొత్త వారెవరైనా అయితే ఆ దారుల్లో పడి అక్కడక్కడే వలయాలు తిరుగుతుంటారు. మా ఊళ్ళో కూడా ఈ దారి చాలామందికి తెలియదు-" అన్నాడు సుబ్బారావు.
అప్పుడు వారో చెట్టు కింద ఆగారు.
'ఆహ్హోయ్--" అని పెద్దగా అరిచాడు సుబ్బారావు.
కులభూషణ్ అదేమిటని ప్రశ్నించాడు. తన భుజాన వున్న బరువును మాత్రం దింపుకున్నాడు.
అప్పుడొక వ్యక్తీ అక్కడికి పరుగున వచ్చాడు.
వాడు నల్లగా పొట్టిగా ఉన్నాడు. కనుగుడ్లు ఎర్రగా మెరుస్తున్నాయి. మొల చుట్టూ అడవి నారతో నేసిన బట్ట చుట్టుకున్నాడు. మనిషిని చూడగానే ఒక చేత్తో పదిమందికి బదులు చెప్పగలడనిపిస్తుంది.
అతణ్ణి చూస్తూనే -- "మదహోచిర మదహో చిర -" అన్నాడు వేదాంతం. అ మాట వినగానే వాడు వేదాంతానికి వంగి నమస్కరించాడు.
"నేనిక సెలవు తీసుకుంటాను --" అన్నాడు సుబ్బారావు.
'ధన్యవాదాలు -- ' అన్నారు మిత్రులిద్దరూ.
సుబ్బారావు వెళ్ళిపోయాడు.
'ఇతడు ఆటవికుడు, మనమితడితో బయల్దేరి వెళ్ళాలి --" అన్నాడు వేదాంతం.
"మదహోచిర అంటే ఏమిటి" అన్నాడు కులభూషణ్.
"నాకూ తెలియదు " అన్నాడు వేదాంతం.
"ఆ పదం నీకెలా తెలిసింది ?"
'అంతా భగవంతుడి దయ!"
కులభూషణ్ ఇంకేమీ ప్రశ్నించలేదు.
ఇద్దరూ అతవికుడితో బయల్దేరారు.
అంతవరకూ వారి కాలి దారి తెలిసింది. ఇప్పుడు తామెలా వెడుతున్నది కూడా వారికి తెలియడం లేదు.
సుమారు గంట సేపు ఏవేవో దారుల్లో వారు నడిచేక ఒక చోట ఆగారు.
అరణ్యం కాస్త దట్టంగానే ఉందక్కడ. ఎండ వారికి సోకడం లేదు.
వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంది.
అతవికుడొక చోట ఆగి -" "ఆహోహోహొహొహొహ్ య్" అని బిగ్గరగా కేకపెట్టాడు.
కొద్ది క్షణాల్లో ఇద్దరు ఆటవికులక్కడికి వచ్చారు.
వారిద్దరూ కాస్త పొడుగ్గా చామనచాయ రంగుతో ఉన్నారు.
మొదటి ఆటవికుడు వారితో ఏదో మాట్లాడాడు.
వారిద్దరూ మిత్రులిద్దరినీ చిత్రంగా చూశారు.
"జవనకం?" అనడిగాడు వారిలో ఒకడు వేదాంతాన్ని.
"మదరోచిర -' అన్నాడు వేదాంతం మళ్ళీ.
ఆటవికులు ముగ్గురూ తమలో తాము నవ్వుకున్నారు.
వారిలో ఒకడు వేదాంతాన్ని తీసుకుని ముందుకు వెళ్ళాడు.
ఇద్దరు కులభూషణ్ నక్కడే ఉండమని సైగ చేశారు.
కులభూషణ్ భుజాన బరువు దింపుకున్నాడు. అతడికి చిరాగ్గా ఉంది. కాసేపెదురు చూసి కింద కూర్చున్నాడు.
ఓ గంట తర్వాత వేదాంతం తిరిగి వచ్చాడు. అతడితో పాటు కాస్త లావుగా బలంగా వున్నా ఓ పొడవైన ఆటవికుడు వచ్చాడు. అతడి తలకు పూల కిరీటం ఉంది.
"ఇతడు ఆటవికుల నాయకుడు-" అన్నాడు వేదాంతం.
నాయకుడు, కులభూషణ్ పరస్పరం నమస్కరించుకున్నారు.
"నాయకుడు మనని అర్జెంటుగా వెనక్కు పొమ్మంటున్నాడు -" అన్నాడు వేదాంతం.
"ఎందుకు?"
"ఆటవికుల మాంత్రికుడు రెండు రోజులుగా పూజలో ఉన్నాడు. అయన పూజ పూర్తయ్యేసరికి -- నాగారికులేవరైనా ఇక్కడుంటే -- వారిని దేవతకు బలివ్వాలి. దేవత బలి కోరినప్పుడే నాగరికుల కిక్కడికి రావాలని బుద్ది పుడుతుందని వీరి నమ్మకం. రేపు ఉదయానికల్లా మాంత్రికుడు పూజ పూర్తవుతుంది. మనమింకోసారి రావడం మంచిదని నాయకుడంటున్నాడు-' అన్నాడు వేదాంతం.
