Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 36


    ధర్మారాయుడు, నరసారాయుడు తలయెత్తి జగ్గమ్మవంక చూచారు. ఆమె నవ్వుతూ నిలబడింది ఆమె రాకతో ఆ గడికే అందం వచ్చింది.
    పురోహితులవారు కావలసిన సామగ్రి అంతా తెచ్చుకుంటారు. కాని లగ్న నిశ్చయ సమయంలో ఆ యింటి పసుపునే వాడాలన్నది కట్టడి ఆచారం.
    ఇనుగంటి నరసారాయుడు, దామెర్ల ధర్మారాయుడు వంక చూచాడు.
    "అమ్మా, నీ పేరేమిటి?" అని అడిగాడు ధర్మారాయుడు.
    "జగ్గమాంబ మీరు నాకు బాబయ్యగారు అవుతారు కదూ! అవునా నాన్నగారూ!" అంటూ తండ్రివంక చూచింది జగ్గమాంబ.
    "అవునమ్మా, నరసారాయుడుగారుకూడా నీకు బాబయ్యే అవుతాడు" అంటూ వివరించాడు రామరాయుడు.
    జగ్గమాంబ యిద్దరికీ పాదాలు తాకి నమస్కారం చేసింది. తలుపు అవతలనించి యిదంతా చూస్తున్న తల్లి ముసి ముసిగా నవ్వుకుంది. చిన్న కూతురు చిలిపిచేష్టల గురించి వెంకమాంబ యెంతో అబ్బురంగా అనుకుంటుంది.
    "అమ్మా యీటె విసరటం నేర్చావా?" సరసారాయుడు అడిగాడు.
    "ఓ, మా అక్కకుకూడా వచ్చు" అంది జగ్గమాంబ.
    "కత్తిపట్టటంకూడా వచ్చునా?"
    "అందులో నాకన్నా అక్కయ్యే నేర్పరి."
    "గుర్రపుస్వారీ-?"
    "అక్కయ్యకు గుర్రాన్ని పరుగెత్తించటం వచ్చుకాని యెప్పుడూ చిన్నగా పోవాలంటుంది" అంటూ వివరించింది జగ్గమాంబ.
    "నేను అడిగేది మీ అక్కగారి సంగతికాదు. నీ సంగతి" నరసారాయుడు నవ్వుతూ చెప్పారు. ధర్మారాయుడూ నవ్వుతున్నారు.
    "అన్నిటికన్నా గుర్రపుస్వారీ అంటేనే నాకు యెక్కువ యిష్టం" అని చెప్పింది జగ్గమాంబ. ధర్మారాయుడికి ఆమె చలాకీతనం నచ్చింది పుత్రికా వాత్సల్యం కలిగింది ఆమెమీద.
    "నేను యిటీవల పిఠాపురం వెళ్ళినప్పుడు నీలాద్రిరాయణింగారి తండ్రి నాతో యీమె ప్రస్థావన తెచ్చారు. నీలాద్రిరాయణింగారు సామర్లకోటలో వున్నారట. జగ్గమాంబకు అతడే సరి అయిన జోడీ కాగలడు" ధర్మారాయుడు, రామరాయుడికి వివరించాడు.
    రామరాయుడు దృష్టిలో పిఠాపురం రాజకుటుంబాన్ని గురించిన ఆలోచన యిదివరకే వుంది. వాళ్ళు అంది రారన్న భయమూ వుంది. యేమో యీమె అదృష్టం యెలా వుందో? బొబ్బిలి ప్రభువులు యిప్పుడు అంది రాలేదా? అలాగే ఆ క్షణం వస్తే పిఠాపురంవారూ అంది రావచ్చు కదా! అని ఆలోచిస్తున్నాడాయన. యెవరి అదృష్టం యెలా వుందో.
    అదే నిశ్చయమైతే తన ఆర్ధిక చిక్కులు కూతుళ్ళ భవిష్యత్తు మీద పడకుండా కాపాడినట్లు అవుతుంది. ఆ తర్వాత తన ఆర్ధిక చిక్కులు తాను చూచుకోవచ్చు అని ఆలోచిస్తున్నాడా ధర్మప్రభువు రామరాయుడు.
    అక్క పెళ్ళి విషయం వదిలిపెట్టి తన పెళ్ళి విషయం యెత్తగానే జగ్గమాంబకు సిగ్గు ముంచుకొచ్చింది. తల వంచుకుని నెమ్మదిగా అక్కడనించి నిష్క్రమించింది. తల్లి వెనుక చేరి ఆ గదిలో జరుగుతున్న తతంగాన్ని గమనిస్తోంది.
    పురోహితుడు తాళపత్రాలమీద పెళ్ళి వివరమూ, లగ్న నిశ్చయమూ వ్రాశాడు. మంత్రాలు చదివి చెరొక లగ్నపత్రికా యిచ్చాడు.
    వాళ్ళచేత ప్రతిజ్ఞలు చేయిస్తూ లగ్నపత్రికలు మార్పించాడు. ధర్మా రాయుడు లగ్నపత్రిక వ్రాసిన తాటాకును తలపాగాలో దాచివేశాడు. రామ రాయుడు కిచ్చిన లగ్నపత్రిక వెండిపళ్ళెంలో పెట్టుకుని అంతఃపురంలోకి తీసుకు వచ్చారు పనివాళ్ళు. వాళ్ళు గడపదాటి లోపల కాలు పెట్టగానే చెంగున ముందుకి దూకి ఆ పత్రిక అందుకుని గడ గడా పెద్దగా చదివేసింది జగ్గమాంబ.
    తల్లి ఆమె బుగ్గలు నొక్కి "అవతల వింటారు" అన్నట్లు సైగ చేసింది.
    జగ్గమాంబ నోరు మూసుకుని తల్లి వెంట నడిచింది.
    నరసారాయుడూ, ధర్మారాయుడూ యిహ బొబ్బిలికి ప్రయాణం అయినారు. వారికి విందు ఏర్పాట్లు చేసే సందర్భంకాక పోయినందుకు యెంతో నొచ్చుకున్నాడు రామరాయుడు. ఆ మాట పదిసార్లు అన్నాడు. వందసార్లు అనుకున్నాడు.
    "తమ్మయ్యగారూ! మేము వచ్చిన పని పూర్తి అయింది యిహ మల్లమ్మను చూడటం ఒక్కటే మిగిలింది" అన్నాడు ధర్మారాయుడు.
    రామరాయుడు అన్నలిద్దర్నీ వెంటపెట్టుక్కుని లోపలి గదుల్లోకి వచ్చాడు. అవే అంతఃపురలుగా పిలువబడుతాయి. వారుండే ఒకసారి పెద్ద యిళ్ళే కోటలపేరుతో పిలుస్తారు.
    భారతదేశం పెద్ద పెద్ద రాజ్యాలుగా వున్నప్పుడు కోటలన్నా, గిరి దర్గాలన్నా భారీ నిర్మాణాలుగా వుండేవి. రాజ్యం విభాజ్యం అయిపోయింది. చిన్ని చిన్ని సంస్థానాలు అయినాయి. అవికూడా ముక్కలు అయినాయి యిక భారీ నిర్మాణాలు యెలా సాధ్యపడుతుంది? వున్నవాటినే ఆ పేర్లతో పిలుచుకుంటారు.
    మల్లమ్మదేవి ఒక నెమలినీ, పావురాయినీ పెంచుతోంది. జగ్గమాంబ ఒక చిలుకను పెంచుతోంది. జగ్గమాంబ పెంచే చిలక వుత్త వాగుడుగాయి.
    "అయ్యా ప్రణామాలు  ప్రణామాలు" అంది ఆ ముగ్గురూ అంతఃపురద్వారం దాటుతూ వుండగా తలలు త్రిప్పి చూచారు. అది చిలుక.
    "అది మీ జగ్గమాంబ పెంచుతున్న చిలుక. దానిలాగే యిదీ పెద్ద వాగుడుగాయి" నవ్వుతూ చెప్పాడు రామరాయుడు.
    "అక్క ఆ గదిలో వుంది" అన్నది జగ్గమాంబ వస్తూనే!
    "మేము మీ అక్కను చూచేందుకు వచ్చామని నీకెలా తెలుసు" నరసారాయుడు అడిగాడు.
    "అమ్మ చెప్పింది బాబయ్యగారూ!" అంది జగ్గమాంబ.
    రాణి ప్రస్థావన రాగానే ఆ ముగ్గురిలో యెవరూ మాట్లాడలేదు. మౌనం వహించి ముందుకి నడిచారు.
    "అదుగో ఆ గదిలోనే అక్కయ్యకు అమ్మ ఆలంకారాలు చేస్తోంది" అంటూ ఆ గదివంక వ్రేలుపెట్టి చూపుతోంది జగ్గమాంబ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS