ఆ వ్యక్తీ పరుగు పరుగున మళ్ళీ అంబాసిడర్ కారు దగ్గర కొచ్చాడు.
"రాబర్ట్ ఆ అమ్మాయి ఎవరో, ఏమిటో కనుక్కొని రా" ఆజ్ఞాపించాడు సుజన్ మిత్ర.
మరుక్షణంలో కారు మద్రాసు రోడ్డు వేపు తిరిగంది.
"విమల్ కారుని కేచ్ చేయాలి స్పీడప్ ......."సుజన్ మిత్ర మాట వినగానే కారు వేగం పెరిగింది.
* * * *
నలభై నిమిషాలు గడిచాయి.
అప్పుడు సమయం ఏడుగంటలు కావస్తోంది.
విమల్ కారు మెయిన్ రోడ్డుమీద పరుగెడుతోంది. వెనక రద్దీగా వున్న కార్ల ప్రవాహంలో ఓ కారు. ఆ కారులో సుజన్ మిత్ర----
చాలా అలసిపోయినట్టుగా వుంది విమల్ కి,
అటూ ఇటూ చూసాడు.
దూరంగా ఓ హోటల్ కనిపించింది. ఆ హోటల్ వేపు పోనిచ్చాడు విమల్ తన కారుని.
పార్కింగ్ ప్లేస్ లో కారుని పార్కు చేసి నేరుగా బార్ లోకి నడిచాడు.
ఓ పావుగంట గడిచింది -
ఓ పెగ్ పూర్తీ చేసి, రెండో పెగ్ ఆర్డర్ చేసాడు. బేరర్ రెండో పెగ్ తీసుకురావడానికి లోనికెళ్ళాడు.
సరిగ్గా ఆ సమయంలో ----
"హలో........" అని వినిపిన్పించింది విమల్ కి.
ఆ పలకరింపు వచ్చిన వేపు చూసాడు విమల్. అక్కడ సుజన్ మిత్ర.
"ఏమిటి ......ఇక్కడ......మీరిలా ......." ఆశ్చర్యపోతూ అడిగాడు విమల్.
"ఆ ప్రశ్నే నేనూ వేస్తున్నాను. ఎదురుగా వచ్చి కూర్చుంటూ అడిగాడు సుజన్ మిత్ర.
బేరర్ ఒక పెగ్ తీసుకొచ్చి పెట్టాడు.
"బ్రింగ్ ఎనదర్ పెగ్ ప్లీజ్........." విమల్ ఆర్డర్ చేసాడు.
మరో రెండు రౌండ్లు పూర్తయ్యాయి.
అంతవరకూ సుజన్ మిత్ర, జోకులు వేసాడు. బిజినెస్ లో ఎదురయ్యే వింత వింత మనుషుల ప్రవర్తనల గురించి చెప్పాడు. తనకు తెల్సిన వివిధ దేశాలు, దేశాల్లోని మనుషులు, ముచ్చట్లు అంతా చెప్పాడు.
మరో అరగంట గడిచింది.
"చూడండి ....విమల్ , నిన్న చాలామంది ఫ్రెండ్స్ రావడం వల్ల మనం సరదాగా గడిపే అవకాశం రాలేదు. టుడే అయాం ఫ్రీ. మీకేం అభ్యంతరం లేకపోతే సరదాగా మా గెస్ట్ హౌస్ లో గడుపుదాం."
"మీకిక్కడ గెస్ట్ హౌస్ ఉందా......." ఆశ్చర్యంగా అడిగాడు.
"ప్రతి ఇంపార్టెంట్ మెట్రో పాలిటన్ సిటీస్ లో నాకు గెస్ట్ హౌస్ లున్నాయి.......కమాన్.'
తను లేస్తూ అన్నాడు సుజన్ మిత్ర.
మరో నలభై నిమిషాల ప్రయాణం తర్వాత, వూరు శివార్ల లో ఓ అందమైన , అధునాతనమైన బిల్డింగ్ లో ఇద్దరూ వున్నారు.
అక్కడ గంటసేపు ప్రశాంతంగా గడిచింది.
విమల్ ని అన్ని రకాలుగా పరిక్ష చేస్తున్నాడు సుజన్ మిత్ర.
విమల్ ప్రపంచమంతా మరిచిపోయాడు. ఏదో నిస్తాబ్ధతలో విమల్.
ఎదురుగా వున్నవాడు సుజన్ మిత్ర అన్న స్పృహ కూడా దాటే స్థితిలో వున్నాడు విమల్.
ఆ సమయంలో సుజన్ మిత్ర ----
"చూడండి విమల్, నేను కావాలనుకున్నది సాధించడంలో నేనెప్పుడూ ఓడిపోలేదు. పదేళ్ళ క్రితం , మిత్ర వేరు. ఇవాల్టి మిత్ర వేరు. బిజినెస్ లో దయా దాక్షిన్యాలుండవ్- మీకు తెల్సనుకుంటాను. నాకు అడ్డం వచ్చిన ఎవర్నైనా సరే, మరుక్షణంలో నా దారి నుండి పక్కకు తప్పించే తెలివితేటలు నాకున్నాయి ఉన్నాయంటారా."
అంతా నిషాలోనూ విమల్, సుజన్ మిత్ర ముఖంలో భావాల్ని పసికట్టదానికి ప్రయత్నం చేసాడు.
"ఉండే ఉంటాయి." సిగరెట్ వెలిగించాడు.
"లేకపోతే .......మీరు నెంబర్ వన్ బిజినెస్ మాన్ అయ్యేవారు కాదేమో."
"ఎస్ .......ఎస్....యూ గాట్ ది పాయింట్. సో.....ఫ్రాంక్ నెస్ నా హాబీ. అంచేత సీరియస్ గా ఒక ప్రశ్న వేస్తాను. దానికి జావాబు మీనుంచి కావాలి.'
చాలాసేపు తనను తాను కంట్రోల్ చేసుకున్న సుజన్ మిత్ర అప్పుడే బ్యాలెన్స్ తప్పుతున్నాడు.
"యూనో........మిస్టర్ విమల్, నా దృష్టిలో ప్రేమ, ప్రాపర్టీ లోంచే పుడుతుంది. ఎస్......ప్రాపర్టీ , దరిద్రం, దరిద్రం అంటే మానసికమైన దారిద్ర్యం, కొన్ని లక్షల కరెన్సీ నోట్లు, నా బెడ్ మీదున్నా, నా మనసు ఆలోచించలేనిదైనప్పుడు , నేనేవీ చెయ్యలేని స్థితిలో లేనపుడు, సబ్ కాన్షస్ అన్ కాన్షస్ గా ఉండే స్థితి - జీవితంలో మీకొచ్చిందో లేదో నాకు తీలీదు గానీ, అలాంటి స్థితి నాకెన్నో సార్లోచ్చింది. దానికి నేను పెట్టుకున్న చిత్రమైన పేరు మెంటల్ పాపర్టీ. ఆ పాపర్టీ లోంచే నాకు ప్రేమ విలువ తెల్సింది." తనూ సిగరెట్ వెలిగించుకున్నాడు సుజన్ మిత్ర ఒక్కసారి సూటిగా విమల్ ముఖం వేపు చూసాడు.
విమల్ ఒక్కసారిగా ఎలర్ట్ అయ్యాడు.
సుజన్ మిత్ర లవ్ గురించి మాట్లాడటం, విమల్ కి ఆశ్చర్యంగా వుంది.
అందులో -
ప్రేమ పుట్టుక గురించి మాట్లాడటం, మెంటల్ పాపర్టీ ఆ పదాన్ని కొత్తగా తొలిసారిగా వింటున్నాడు విమల్.
అతను చెప్పిన మాటలద్వారా సుజన్ మిత్ర లో ఏదో ఒక కొత్త దనాన్ని చూస్తున్నాడు విమల్.
