మిగతా వాళ్ళు కూడా చుట్టూ కూర్చున్నారు.
"అడుగు చెప్తాను."
"ఇప్పటివరకూ మీరేవర్ని ప్రేమించలేదా.....అబద్దం చెప్పకూడదు. నిజమే చెప్పాలి. అలాగే ప్రేమకు మీరిచ్చే డేఫినేషన్ ఏమిటి?" సీరియస్ గా అడిగింది జ్వలన. ఆ సీరియస్ నెస్ ని అర్ధం చేసుకున్నాడు విమల్. జ్వలన వయస్సు, ఆ వయస్సులో ఉత్సాహం, ఆ ప్రశ్న ద్వారా తనపట్ల వున్న ఆరాధన అంతా ఒక్క క్షణంలో అర్ధం చేసుకున్నాడు.
"నేనూ మనిషినేగా......నాకు హృదయం వుంటుంది కదా.......అంచేత ......నేనూ ప్రేమించాను...కానీ ఎవర్నని మాత్రం అడగొద్దు.....' నవ్వుతూ అని ----
ఇక ప్రేమకు డెఫినెషన్ అడిగారు .......చెప్తాను వినండి.....
Love is not a Single act, but a climate in which we live, a life time venture in which we are always leaving, discoverning , growing it is not destroyed by a single failure, or won by single Caress, love is climates a climate of the heart "
ఒక స్లోగన్ లా సీరియస్ గా ఆ నిర్వచనం చెప్పగానే , వరసగా అమ్మాయిలు చప్పట్లు కొట్టారు.
"వండ్రఫుల్ సార్. సర్ మరొక్కసారి చెప్పండి సార్...." ఓ అమ్మాయి పెన్నూ, కాగితం తీసుకుంది.
మళ్ళీ చెప్పాడు విమల్.
"మీరు కవా సర్....."జ్వలన అడిగింది.
"కవి అని ప్రత్యేకంగా ఎవరూ వుండరు......హృదయంలో వుండే తన ఫీలింగ్ ని తను స్వయంగా తెల్సుకున్న ప్రతివాడూ కవే. కానీ కొంతమంది పేపరు మీద పెడతారు. కొంతమంది పెట్టరు . అంతే....."
తర్వాత ----
రకరకాల ప్రశ్నలు అమ్మాయిలు తనని వదిలేట్టు లేరని అక్కడ నుంచి బయటపడాలని నిర్ణయించుకొన్నాడు విమల్.
"సార్ ఒక్క ఫోటో సార్......." ఓ అమ్మాయి రిక్వెస్ట్ చేసింది. రకరకాల ఫోజుల్లో అందరూ విమల్ తో ఫోటోలు తీసుకున్నారు ఒక్క జ్వలన తప్ప.
"రావే......నిన్నూ విమల్ గారిని ఫోటో తీస్తాను........'
"వద్దులే.......నాకు ఎవరి పక్కనా నిలబడి ఫోటోలు తీసుకోవడం ఇష్టం లేదు.....' సీరియస్ గా అంది జ్వలన.
తనంటే ఇష్టమన్న అమ్మాయి తన పక్కన నిలబడి ఫోటో తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడటం లేదో అర్ధం కాలేదు. విమల్ కి. అప్పుడే విమల్ కి జ్వలనలో ఏదో ప్రత్యేకత ఉందన్న విషయం అర్ధమైంది.
"ఓ.కే. సీయూ.....యంగ్ గర్ల్స్......." కాసేపయ్యాక .....ఇసుక లోంచి లేస్తూ అన్నాడు విమల్.
"మళ్ళీ ఎప్పుడు సార్......" సరదాగా అడిగిందో అమ్మాయి.
"తెరమీద ......" నవ్వుతూ చెప్పి. గబగబా ముందుకి కదిలాడు విమల్.
కారు డోర్ తెరిచి, మరోసారి వాళ్ళందరి వేపూ చూసాడు.
ఆగమన్నట్లు చేయ్యుపుతూ పరుగు పరుగున వచ్చింది జ్వలన.
ఏం జ్వలన.......మీతో పాటు కార్లో మీ పక్కన ఒక్క అయిదు నిమిషాల సేపు."
ఇంతేకదా ......కమాన్." వెన్వెంటనే సీట్లో కూర్చుంది జ్వలన.
కారు ముందుకు కదిలింది.
నిశ్శబ్దంగా కారు బీచ్ రోడ్ లో వెళుతోంది.
జ్వలన ముఖం వేపు చూసాడు విమల్.
"అందరూ నా పక్కన నిలబడి ఫోటో తీయుంచుకున్నారు. నువ్వెందుకు తీయించుకోలేదు."
అప్పటికి వాళ్ళిద్దరూ రెండు కిలోమీటర్ల దూరం వచ్చేసారు.
"నిజం చెప్పమంటారా.......అబద్దం చెప్పమంటారా." అంది నవ్వుతూ.
"నిజమే చెప్పు."
"నేను అమితంగా ఇష్టపడే వాళ్ళతో నేనెప్పుడూ ఫోటో దిగను సార్. మీతో నా ఫోటో ఉందనుకోండి. మీరు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వెంటనే మీ ఫోటో చూడాలనిపిస్తుంది. అదే ఫోటో లేదనుకోండి మిమ్మల్ని ఊహించుకోవడమో , జ్ఞాపకం చేసుకోవడమో జరుగుతుంది.
అలా ఊహించుకోవడం జ్ఞాపకం చేసుకోవడంలో వున్న "థ్రిల్లు' ఫొటో చూస్తున్నప్పుడు ఉండదు కదా."
ఆ మాటతో , జ్వలనలో ఇంకా ఏదో ప్రత్యేకత కన్పించింది విమల్ కి.
అక్కడ రెండు దారులున్నాయి- ఒకదారి మద్రాసు వేపు వెళుతుంది.
"థాంక్యూ సర్. నన్నిక్కడ డ్రాప్ చేసెయ్యండి."
"మళ్ళీ వెనక్కి నడిచేల్తావా."
"లేదు సార్.మా వాన్ లో మా కోతి మూక వస్తోంది చూడండి" దూరంగా వస్తున్న వాన్ వేపు చేయి చూపిస్తూ అంది జ్వలన.
కారాగింది. కార్ డోర్ తీసుకుని జ్వలన నిలబడింది.
"సి .....యూ. " గేరు మారుస్తూ అన్నాడు విమల్.
నవ్వుతూ చేయి వూపింది జ్వలన.
మద్రాసు వెళ్ళే దారివేపు కారు మలుపు తిరిగింది.
సరిగ్గా ఆ మలుపులో వున్న తెల్లటి అంబాసిడర్ కారుని అటు విమల్ గాని, ఇటు జ్వలన గానీ ఎవరూ చూడలేదు. ఆ కారులో వున్న ఇద్దరు వ్యక్తుల్లో ఓ వ్యక్తీ, వాళ్ళిద్దరి వేపే చూస్తున్న విషయం కూడా విమల్ కి తెలీదు.
"ఎవరా అమ్మాయి" అంబాసిడర్ కార్లో వెనక పక్క, నల్లటి కళ్ళద్దాల్ని సవరించుకుంటూ అడిగాడు సుజన్ మిత్ర.
"తెలీద్సార్"
"తెలీదు కాదు....తెల్సుకో" సుజన్ మిత్ర తాలూకి మనిషి గబగబా జ్వలన నిలబడిన చోటుకి పరుగు పరుగున వెళుతున్న సమయంలో -
దూరం నుంచి వ్యాన్ వచ్చి ఆగడం, అందులోకి జ్వలన ఎక్కేయ్యడం, వ్యాన్ జోరుగా టర్న్ కొట్టి మహాబలిపురం రోడ్డు వేపు వెళ్ళి పోవడం జరిగిపోయాయి.
