Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 35

 

                               విలువైన క్షణాలు

                                                                          జొన్నల గడ్డ రామలక్ష్మీ

    ఆనందరావు చిరుద్యోగి. అతడింకా పెళ్ళి చేసుకోలేదు. సంబంధాలు చాలా వస్తున్నాయి. కానీ అతడే అంగీకరించడం లేదు. అలాగని అతడు పెళ్ళికి విముఖుడూ కాదు. వైవాహిక జీవితం గురించి అతడికేన్నో కలలున్నాయి. ఆ కలలన్నీ తీరాలంటే డబ్బు కావాలి. అ డబ్బు సంపాదించడం కోసం ఏమైనా చేయాలని అతడనుకుంటున్న సందర్భంలో శ్రీహరి పరిచయం జరిగింది.
    శ్రీహరికో అందమైన చెల్లెలుంది. ఆమె పేరు దీప్తి. ఆమె శ్రీహరికి ప్రాణం.
    శ్రీహరికి ఆనందరావుకీ బస్ స్టాపులో పరిచయమైంది. శ్రీహరి కూడా తనవంటి చిరుద్యోగేనని తెలిసేక ఆనందరావు కతడంటే మరింత ఆకర్షణ పెరిగింది.
    శ్రీహరికి చెల్లెలు తప్ప యెవ్వరూ లేరు. ఆమెకు పెళ్ళి చేశాక తను చేసుకోవాలను కుంటున్నాడు. సహృదయుడు . సంస్కరి అయిన యువకుడి కోసం శ్రీహరి వెతుకుతున్నాడు.... అతడికి ఆనందరావు నచ్చాడు.
    "నా చెల్లెల్ని పెళ్ళి చేసుకోకూడదు?" అన్నాడో రోజున శ్రీహరి.
    అప్పుడానందరావు పెళ్ళి గురించిన తన ఆశలూ, ఆశయాలు చెప్పాడు.
    శ్రీహరి నవ్వి - "షాపులో అద్దాల వెనుక నున్న మిఠాయిలను చూసి అవి తినని జన్మ వ్యర్ధమని భావించి ఇంట్లో పచ్చడి మెతుకులు తినలేక పోవడం దురదృష్టం. రోజూ మిఠాయిలు తినేవాడికి ఎప్పుడైనా తింటే పచ్చడి మెతుకులు అమృతంగా వుంటాయి. తినడానికి రుచికి మించి ప్రధాన మైనది ఆకలి. అలాగే బ్రతకడానికి సుఖ పడ్డానికి డబ్బోక్కటే ప్రధానం కాదు అవకాశం, అదృష్టం ఉండాలి" అన్నాడు.
    ఆనందరావు కి అర్ధం కాలేదు , శ్రీహరి వివరించాడు.
        ప్రతి మనిషికీ కనీసావసరాలు తిండి, బట్ట, నీడ, ఆకలి నుంచి రక్షించేటంత తిండి . మానాన్ని కాపాడ్డానికి సరిపడ బట్ట. ఎండవానల్నించి కాపాడగల యిల్లు వుంటే చాలు -- మిగతా జీవితం సుఖంగా బ్రతికేయొచ్చు .. జీవితంలో కనీసావసరాలను మించి అవసరమైనది ప్రేమ. ఇచ్చి పుచ్చుకోవడంలో ప్రేమను మించి ఏదీ తృప్తి నివ్వలేదు. డబ్బు యితర సుఖాల నెన్నిటినో యిస్తుంది కానీ అందుకు ప్రేమ గురించి వెచ్చించాల్సిన ముఖ్యమైన కాలం వెచ్చించాలి. డబ్బు సంపాదించేవాడికి ప్రేమించే సమయముండదు. ఉన్నదానితో సారో పెట్టుకునే వాడికే ఆ అవకాశం.
    'అటుపైన మంచి యిల్లాలు దొరకడం అదృష్టం. భర్తతో కలిసి తిరగడం లోనూ, అతడితో ఏకాంతం లోనూ ఆనందం పొందగల ఇల్లాలు భర్తకువరం. చాలామంది చీరలనో, నగలనో భర్తను వేధించటం తప్ప - సమక్ష మాధురి ననుభవించలేరు. నా చెల్లెలు నన్ను నగలడగదు. బట్టలాడగదు. అటువంటి వాటికి డబ్వు వృధా చెయ్యనివ్వదు. మనిషిని మనిషిగా అర్ధం చేసుకుని ప్రేమించడంలో మా యిరువురికీ సంతృప్తి వుంది. నీ వంటి అవకాశం వున్న యువకుడికి నా చెల్లెలు అరుదైన అదృష్టం కాగలదు...." అని చెప్పాడు శ్రీహరి.
    ఆనందరావు కు నిజమే ననిపించింది. అతడు దీప్తిని వివాహం చేసుకోవాలనే అనుకున్నాడు. మనసులు కలిసిన జంట కాలినడకన పోతున్నా అది విమానయానాంగా ఉంటుంది. పూరి గుడిసెలో వున్నా అది రమ్య హర్మ్యమవుతుంది. గంజి తిన్నా పాయసమవుతుంది.
    ఈ విధంగా అతడాలోచిస్తున్న సమయంలో శోధన్ పరిచయమయ్యాడు. శోధన్ దృష్టి శ్రీహరి దృష్టికి పూర్తిగా భిన్నం.
    శోధన్ కూడా కావాడానికి చిరుద్యోగి . కానీ బంగాళాలో వుంటున్నాడు. స్కూటర్ కొన్నాడు. ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఎందుకంటె పెళ్ళి అంటే యువకుడి జీవితాన్ని ఒకే యువతికి పరిమితం చేసేది. స్కూటరున్న బ్రహ్మచారులు కొన్నాళ్ళ పాటైనా రోజుకో అమ్మాయిని స్కూటరు వెనుక షికారు కు తీసుకెళ్ళ గలగాలి అందుకు కొంత ఖర్చవుతుంది. రోజంతా అందుకు శ్రమ పడితే -- ఆ తర్వాత లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు.
    "అన్నం రుచి తెలియాలంటే రోజంతా కష్టపడి పని చేయాలి. అప్పు డాకలి పుడుతుంది. పని చేయడం వల్ల నాలుగు డబ్బులూ దొరుకుతాయి. దాంతో సుఖంగా కావలసింది కొనుక్కొని తినొచ్చు. అలాగే డబ్బు విషయమూను. ఉన్న తీరుబడినంతా ప్రేమ కోసం ఖర్చు పెట్టె వాడికి కొన్నాళ్ళకు ప్రేమంటే వెగటు పుడుతుంది. ఆ తీరుబడిలో కొంత సమయాన్ని ధన సంపాదనకు వినియోగిస్తే ప్రేమంటే ఆకర్షణ పెరుగుతుంది. ఆ డబ్బుతో ప్రేమ క్కూడా విలువ పెరుగుతుంది ....' అన్నాడు శోధన్.
    'అంటే ఏమంటావ్ ?" అన్నాడు ఆనందరావు.
    "ఈ ప్రపంచంలో డబ్బుకు మించింది లేదు. డబ్బుతో ఏమైనా సాధించవచ్చు. అందువల్ల డబ్బు కోసం ఏమైనా చేయాలి ...." అన్నాడు శోధన్.
    "డబ్బు కోసం ఏమైనా చేయాలి!" ఇదే ఆనందరావు మనసులో చాలా కాలంగా వున్న అభిప్రాయం కూడా. అతడిలో యిప్పుడు కొత్త ఉత్సాహం పుట్టింది.
    "ఏమైనా చేయాలనే నేనూ అనుకున్నాను కానీ ఏం చేయాలో నాకు తోచడం లేదు ....' అన్నాడు ఆనందరావు.
    "నేనడిగిన సమాచారమిస్తే చాలు ...." అన్నాడు శోధన్.
    "ఏమిటది?"
    శ్రేహరి ఇన్ కంటాక్సు డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నాడు. దేశంలో డబ్బు సంపాదిస్తున్న వాళ్ళ జాతకాలు చాలావరకూ అతడి చేతిలో వున్నాయి. బ్లాక్ మనీని పట్టి పన్ను లేగేసే వాళ్ళ ప్రాణాలు తీయడానికి ఇన్ కంటాక్సు డిపార్ట్ మెంటు మెరుపు దాడులు జరుపుతూంటుంది. ఆ దాడులేప్పుడు జరుగుతాయో డిపార్ట్ మెంట్లో తెలిసినవాడు శ్రీహరి ఒక్కడే కోడ్ భాషలో అతడి నుంచి సమాచారమందగానే స్క్వాడ్స్ బయలుదేరతాయి.
    'దాడి జరుగబోవడానికి గంట ముందు తెలుస్తే చాలు. వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళుంటారు. అందుకు ప్రతి ఫలం యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఉంటుంది" అన్నాడు శోధన్.
    "లక్ష రూపాయలే ...." అన్నాడు ఆనంద రావాశ్చర్యంగా.
    'అవును....' అన్నాడు శోధన్.
    "అయితే నేనే ప్రయత్నిస్తాను ...." అన్నాడు ఆనందరావు.
    'అదంత సులభం కాదు. శ్రీహరి బాగా నిజాయితీ పరుడు. అతడు డబ్బుకి లొంగడం లేదు. లొంగితే నీవల్లనే లొంగాలి. నీకు తన చెల్లెల్నిచ్చి పెళ్ళి చేయాలను కుంటున్నాడు కదా ...." అన్నాడు శోధన్.
    "ఇదంతా నీకెలా తెలుసు?"
    'డబ్బు సంపాదించేవాడికి లక్ష మార్గాలుంటాయి . శ్రీహరి మీద బోలెడు నిఘా వుంది...."
    "లక్ష రూపాయలంటే అదే - జీవితమనుకుంటున్నావా? మేమిస్తామన్నది కేసుకు లక్ష రూపాయలు.... శ్రీహరి చాలా కేసులు వదులుకున్నాడు.
    ఆనందరావు కు గుండె ఆగినంత పనయింది.
    "శ్రీహరి ప్రమాదకరమైన మనిషి కూడా. తనవద్దకు రాయబారాలు పంపినవాడి గురించి పోలీసు రిపోర్టులు కూడా యిచ్చేవాడు. అందుకే అతడి నేవ్వరం డైరెక్టుగా కలుసుకోలేక పోతున్నాం ...." అన్నాడు శోధన్.
    ఆనందరావు అనుమానంగా -- 'అయినా యిందులో నీ ఆసక్తి ఏమిటి? నీకు మరీ ఇన్ కంటాక్స్ డిపార్టు మెంటు కి భయపడేటంత డబ్బెం లేదు కదా ....' అన్నాడు.
    "చూడు ....దేశంలో నీతికీ, అవినీతికి కూడా యెన్నో సంస్థలున్నాయి. ఓ పెద్ద సంస్థ లో నేనూ వున్నాను. మా సంస్థ కార్యక్రమాల్లో-- ఇన్ కంటాక్స్ రేయిడ్స్ గురించి డబ్బున్న వాళ్ళని ముందుగా హెచ్చరించడం ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. అందుకు మేము కమీషన్ తీసుకుంటాం. అందులో కొంత మీ కిస్తాం--" అన్నాడు శోధన్.
    ఆనందరావు ఆశ్చర్యపడి -- "ఇలాంటి సంస్థ లో స్థానం సంపాదించాలంటే ఏం చేయాలి ?" అన్నాడు.
    "లైఫ్ ఇన్సు రెన్సు లాగే ముందు కొంత బిజినెస్ చేసి చూపించాలి. సంస్థకు నీ కారణంగా పది లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందంటే నువ్వు నెల జీతం మీద సంస్థలో శాశ్వత సభ్యుడివి కావచ్చు ...." అన్నాడు శోధన్.
    శ్రీహరి బంగారు గుడ్లు పెట్టె బాతు -- అని అప్పటి కర్ధమైంది ఆనందరావు కి. అంతకాలం అతడి పరిచయాన్ని మాములుగా తీసుకుంటూ వచ్చాడతడు.
    "నేను శ్రీహరి ని లొంగదీస్తాను....' అన్నాడు ఆనందరావు.
    "నీ నిర్ణయానికి చాలా సంతోషం. కానీ అది నువ్వనుకున్నంత సులభం కాదు. శ్రీహరి మొండి మనిషి. అతడిని లొంగదీయాలంటే మోసగించాలి...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS