Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 35


    "ఆయన దైవ స్వరూపుడేం-దైవమే అనుకుందాము. ఆ దైవమే నాకీ యోచన పుట్టించాడు. నీకు నామీద ప్రేమ వుంటే నువ్వు నాకు సహకరిస్తావు-" అన్నాడు రవి.
    కాసేపు ఆలోచించి-"సరే!" అన్నది రమ.

                                      8

    "మీకోసం ఎవడో జగ్గయ్యట-వచ్చాడు-" అన్నాడు లక్ష్మీనారాయణ బావమరిది శంభునాదం.
    "జగ్గయ్యా-వాడెవడు?" అన్నాడు లక్ష్మీనారాయణ ఆవులిస్తూ. అప్పటికాయన నిద్రలేచి పదినిమిషాలయింది. కానీ ఇంకా నిదురమత్తు వదల్లేదు.
    "మనిషి చూడ్డానికి గూండాలా వున్నాడు-" అన్నాడు శంభునాదం.
    "డ్రాయింగు రూంలోకి పంపించు-" అన్నాడు లక్ష్మీనారాయణ. ఆయన తనూ డ్రాయింగు రూంలోకి వెళ్ళాడు. కాసేపటికి జగ్గయ్య వచ్చాడు.
    "నువ్వా?" అన్నాడు లక్ష్మీనారాయణ వాణ్ణి చూసి.
    "దండాలండి బాబయ్యా-తమరు చెప్పిన పని పూర్తి చేశానండి-" అన్నాడు జగ్గయ్య.
    లక్ష్మీనారాయణ చిత్రంగా వాడివంక చూసి-"నేను నీకేం పని చెప్పలేదే!" అన్నాడు.
    జగ్గయ్య ఆయనకు క్లుప్తంగా తననో మనిషి కలిసి అడ్వాన్సివ్వడం గురించి చెప్పాడు.
    లక్ష్మీనారాయణ కంగారుగా-"ఇది అబద్ధం. ఎవరో నా పేరు చెప్పి నిన్ను మోసంచేశారు. నేను చెప్పలేదు. డబ్బు పంపలేదు-" అన్నాడు.
    జగ్గయ్య అనుమానంగా లక్ష్మీనారాయణ వంక చూశాడు. ఆయన చెప్పిందే ఆ మనిషి తనకు వెయ్యి రూపాయలెందుకిస్తాడు? ఆయన పేరెందుకు చెబుతాడు? ఈ పెద్దవాళ్ళింతే....వ్యవహారం చౌకలో తేల్చేయాలని చూస్తారు. పనైపోయిందిగా-ఇంక మిగతా డబ్బు ఎగేయాలని చూస్తున్నాడేమో?
    "డబ్బు మీరే పంపారని నిర్దారణ చేసుకున్నాకనే నేనా పనికి ఒప్పుకున్నాను-..." అన్నాడు జగ్గయ్య కాస్త కఠినంగా.
    "ఎలా నిర్దారించావో కాస్త చెప్పు-" అన్నాడు లక్ష్మీనారాయణ.
    "మీరు డబ్బిచ్చేటప్పుడు నోట్లమీద మీ సంతకం పెడతారు. గుర్తుగా ఓ నోటు తెచ్చాను. మిగతావి వేరే చోట వున్నాయి. చూడండి-" అంటూ ఓ నోటు ఆయనకు అందించాడు.
    అది లక్ష్మీనారాయణ అసలు సంతకం కాదు. వ్యక్తి గతమైన ఖర్చులకు తనవద్దనున్న డబ్బుపయోగించేటప్పుడు గుర్తుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రెండక్షరాల సంతకం.
    ఆ డబ్బు తనదే-సందేహం లేదు. అయితే ఈ డబ్బు జగ్గయ్యకెలా వచ్చింది? ఆయనకు అసలు విషయం తెలియడానికెంతోసేపు పట్టలేదు. ఇంట్లోంచి ఇరవై వేల క్యాషు మాయమయింది-అల్లుడితోపాటు!
    అల్లుడే తన పేరు చెప్పి ఈ హత్య చేయించాడా?
    "చిదానందస్వామి చచ్చిపోయాడా?" అన్నాడు లక్ష్మీనారాయణ.
    "మీరు చెప్పడమూ-నేను చంపకపోవడమూనా? మిగతా డబ్బుకోసం వచ్చాను-"నేనిప్పుడు!" అన్నాడు జగ్గయ్య.
    ఈ సంభాషణ లక్ష్మీనారాయణకు సంబంధించినంత వరకూ-దురదృష్టకరంగానే పరిణమించింది. ఎందుకంటే జగ్గయ్యకు ఏదో బదులివ్వాలనుకుంటూ ఆలోచిస్తూ అటూ ఇటూ చూసిన ఆయనకు గుమ్మంలో ఇన్ స్పెక్టర్ చౌదరి కనిపించాడు. అతడీ సంభాషణ విన్నాడు.
    "రండి-ఇన్ స్పెక్టర్ గారూ! మా అల్లుడి ఆచూకీ తెలిసిందా?" అంటూ సాదరంగా చౌదరిని ఆహ్వానించినా లక్ష్మీనారాయణ తడబడ్డాడు.
    ఇన్ స్పెక్టర్ని చూడగానే జగ్గయ్యలో వణుకుపుట్టింది. వాడక్కన్నించి వెళ్ళిపోబోయాడు.
    "ఆగు-" అన్నాడు చౌదరి-"అనుకోకుండా లభించిన సాక్ష్యం అంత సులభంగా వదులుకుంటానా?"
    జగ్గయ్య ఆగిపోయి-"నాకేం తెలియదు. నేనేమీ చేయలేదు-" అన్నాడు.
    "కాసేపు నువ్వు నోరుమూసుకో-" అన్నాడు చౌదరి. తర్వాత లక్ష్మీనారాయణవైపు తిరిగి-"నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడగాలి-" అన్నాడు.
    "అడగండి-" అన్నాడు లక్ష్మీనారాయణ.
    చౌదరి చెప్పడం ప్రారంభించాడు.    
    నిన్న రాత్రి ఎనిమిదింటికి చౌదరికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ఎవరు చేసినదీ చెప్పలేదు. అతడు చిదానందస్వామి భక్తుడట. చిదానందస్వామికీ లక్ష్మీనారాయణకూ జరిగిన వాగ్వివాదం గురించీ చెప్పి-లక్ష్మీనారాయణ అన్నంత పనీ చేయగలడనీ చిదానందస్వామి ప్రాణాలు ప్రమాదంలో వున్నాయని ఆయనకు పోలీసు రక్షణ కావాలనీ కోరాడు. లక్ష్మీనారాయణ పరిచయస్థులు నలుగురు జరిగినదానికి సాక్ష్యం అని కూడా ఆ భక్తుడు చెప్పాడు.
    చౌదరి ఆ సాక్షుల్ని విచారించి భక్తుడు చెప్పింది నిజమేనని నిర్ధారించుకున్నాడు. అయితే ఆ సాక్షులు లక్ష్మీనారాయణ ఆవేశంలో అన్న మాటల్ని పట్టించుకొనవద్దని చెప్పారు. చౌదరి రాత్రి పదింటికి వెళ్ళి చిదానందస్వామిని కలిశాడు. చిదానందస్వామి తన ఆశ్రమంలో పోలీసుల ప్రమేయం సహించనన్నాడు. తనకు ప్రాణభయం లేదన్నాడు.
    "ప్రజల కష్టాలు, సమస్యలు తొలగించడానికి నా ఆయువును కరిగించి ఇస్తున్నాను. నాకు ప్రాణభ్యం మేమిటి? నన్నెవ్వరూ చంపలేరు-నా ఆయువు కరిగిపోతే తప్ప-" అన్నాడు చిదానందస్వామి.
    "వాడికి చాలా అహంకారం-" అన్నాడు లక్ష్మీనారాయణ.
    "ఆ సంగతి మనం తర్వాత మాట్లాడుకుందాం-" అంటూ చౌదరి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు.
    ఈ రోజు తెల్లవారుఝామున చౌదరికి మళ్ళీ ఫోన్ వచ్చింది.
    "అంతా అయిపోయింది ఇన్ స్పెక్టర్! మీరు ముందుగా చెప్పినా పట్టించుకోలేదు. మా అందరికీ దైవంలా వున్న స్వామి ఇంకలేడు. మీరు కనీసం ఆ నీచుడు లక్ష్మీనారాయణను అరెస్టుచేయండి-" అన్నాడా భక్తుడు.
    చౌదరి వెంటనే లక్ష్మీనారాయణతో మాట్లాడాలనుకున్నాడు. అక్కణ్ణించి ఆశ్రమానికి వెళ్ళాలనుకున్నాడు. అతడు వచ్చేసరికి చౌదరి జగ్గయ్యతో మాట్లాడుతున్నాడు. ఆ సంభాషణ చౌదరి విన్నాడు.
    "మా ఉద్యోగంలో ఇలాంటి అదృష్టం ఎక్కడో గానీ వుండదు. ముందు హంతకుల్ని కలుసుకుని-అప్పుడు వాళ్ళను వెంటబెట్టుకుని హత్యా ప్రదేశానికి వెడుతున్నాను-" అన్నాడు చౌదరి.
    "ఇన్ స్పెక్టర్-ఏమిటి మీరనేది?" అన్నాడు లక్ష్మీనారాయణ.
    "ముందు నాతో పదండి. హత్యా ప్రదేశానికి వెళ్ళేక మనం అన్నీ మాట్లాడుకొనవచ్చు-" అన్నాడు చౌదరి.
    జగ్గయ్య ఒక్క పరుగున వచ్చి చౌదరి కాళ్ళమీద పడి-బాబూ-బుద్ధి గడ్డితిని వెయ్యి రూపాయలకోసం చిన్న అబద్ధం చెప్పాను. నేనీ హత్య చెయ్యలేదు. నన్ననుమానించకండి-" అన్నాడు.
    చౌదరి వాణ్ణి లేపి - "నువ్వు అబద్దాలు చెబుతావన్న విషయం నాకు తెలుసు. నీ చేత నిజం యెలా చెప్పించాలో కూడా నాకు తెలుసు-" అన్నాడు.
    "నామాట కాస్త వినండి బాబూ!" అన్నాడు జగ్గయ్య.
    వాడు హత్యచేద్దామని ఆశ్రమానికి వెళ్ళాడట. కానీ అప్పటికే చిదానందస్వామి అక్కడ చచ్చిపడి వున్నాడట.
    చౌదరి నవ్వాడు. ఆ నవ్వు చూడగానే జగ్గయ్య గుండెలదిరాయి. తన మాటలు నమ్మలేదని వాడికి తెలిసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS