Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 36

 

    నీవు ప్రస్తుతం దారి లేని పరిస్థితులలో స్మగ్లింగ్ కు అంగీకరించవలసి వచ్చిందని అబద్దం చెప్పు. కష్టమైనా పనులన్నీ అతని చేతనే చేయించు. అందమైన ఆడది , అందులోనూ పరాయిదనే సరికి ఎక్కడలేని మోజు పుట్టుకొస్తుంది మగవాడికి.
    నీకోసం ఒకసారి అక్కడికి రావాలని వుంది. అవకాశం దొరుకుతుందని ఆశిస్తాను.   
    విష్ యూ అల్ లక్.
    క్రింద వెంకట్రావు సంతకముంది.
    ఆనంద్ కు చాలా కోపం వచ్చింది. ఇదంతా కుసుమ వెంకట్రావు కలిసి ఆడిన నాటకమన్న మాట! తను వెర్రి వెంగళాయిలా ఇందులో చక్కగా ఇరుక్కున్నాడు. కుసుమ ఎంత వగలాడి! ఆమె అమాయకురాలని తను అనుకున్నాడు. చెప్పేవన్నీ నిజమే ననుకున్నాను.
    సరే, ఏమైతేనేం కుసుమ అసలు రంగు తన వద్ద ఎలా పెడుతుందో చూడాలి. ఆమె కున్న స్మగ్లింగ్ కంటాక్స్ ఎటువంటివో తెలుసుకోవాలి. ఆమె ఎత్తులకు పై ఎత్తులు వేయాలి.
    దగ్గరున్న పోస్టాఫీసు కి వెళ్ళి కవరు మళ్ళీ జాగ్రత్తగా అటించి కుసుమ ఇంట్లో ఆ వుత్తరాన్ని జారవిడిచి -- ఓ రెండు గంటలాగి అప్పుడామే ఇంటికి వెళ్ళాడు.
    కుసుమ అతన్ని ప్రేమగా ఆహ్వానించి తన గదిలోకి తీసుకు వెళ్ళింది. కాసేపు ప్రేమ కబుర్లు చెప్పింది. అతని ఉదార గుణాన్ని పొగిడింది.
    "నేనిప్పుడొక యిబ్బందిలో పడ్డాను ఆనంద్"_ అందామె.
    "చెప్పు--"
    "ఉద్యోగాన్వేషణ లో ఒక ఆఫీసుకు వెళ్ళాను. అక్కడ నన్ను చూస్తూనే స్టన్నింగ్ బ్యూటీ అని మెచ్చుకున్నాడతను. నా వల్లనే కొన్ని పనులు సులభంగా అవుతాయట. నెలకు వేయి రూపాయల జీతం మీద తక్షణమే ఉద్యోగంలోకి తీసుకుంటున్నామని అయిదొందలు అడ్వాన్సు గా యిచ్చాడు. నాకొక చిన్న పెట్టి ఇచ్చాడు. అది నా వానిటీ బ్యాగులో పట్టేటంత ఉంది. దాన్ని నేను ఒకచోట అందజేయాలట.
    ఈవేళ సాయంత్రం ఆరుగంటలకు అది జరగాలి. ఈ పని సక్రమంగా జరిగితే నా ఉద్యోగం వుంటుందిట. లేకపోతె ఊడుతుందిట. నేనేమైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తే నా ప్రాణాలే పోతాయట. నేను భయపడి ఉద్యోగం వద్దన్నాను. అప్పుడతను నవ్వి, అది నీ అందానికే అవమానం. ఈ పని నీవల్ల చాల సులభంగా అవుతుంది. ఎటొచ్చీ నిన్ను ప్రాణాదికంగా ప్రేమించే మగవాడిని నీకు రక్షణగా ఏర్పాటు చేసుకో. అలాంటి మగవాడు లేదనడం కూడా నీ అందానికి అవమానం.... అన్నాడు.
    అతనలాగనగానే నువ్వు గుర్తుకోచ్చావు . నీ గురించి నేను బ్రతుకుతాను. కోరినప్పుడల్లా నీ దాని నవుతాను. నాకీమాత్రం సాయం చేయగలవా? ఇబ్బంది పనులలో తోడుగా ఉండగలవా?' అనడిగింది కుసుమ.
    ఆనంద్ ముఖం గంబీరంగా అయిపొయింది. "కుసుమా నువ్వు చాలా అమాయకురాలివి. నువ్వు చేయబోయే పని ఎంత ప్రమాదకరమైనదో నీకర్ధం కాలేదు. పట్టుబడితే పోలీసులు నానా బాధలు పెడతారు. పదిమందిలో అవమానం. జైలు జీవితం...."
    "కానీ, నాకింకో దారి లేదు....' అంది కుసుమ.
    "ఎందుకు లేదు, ఉంది . నాతొ నా యింటికి వచ్చేయ్. రాజేశ్వరి కి నేను నచ్చ జేబుతాను. మనం ఈ ఊరు వదిలి పోదాం. నువ్వు రాజేశ్వరి చెల్లెలి వని నలుగురికీ పరిచయం చేస్తాను. లక్షణమైన వరుణ్ణి చూసి పెళ్ళి చేస్తాను. నీకు సంబంధించిన సర్వ బాధ్యతలు నేనే తీసుకుంటాను.... సరా?' అన్నాడు ఆనంద్.
    "నువ్వంత వాడివనీ నామీద నీకు విపరీత మైన ప్రేమనీ నాకు తెలుసు. కానీ ఏరోజూ ఈ శరీరం నీదయిందో అప్పట్నించీ మానసికంగా నువ్వే నాకు భర్త వయ్యవు. ఇంకో మగవాడ్ని నా భర్తగా నేను నూహించుకోలేను. ఈ జీవితానికి ఏ వివాహం అవసరం లేదు. అయిందేదో అయిపొయింది. నీపట్ల ఆకర్షణ నేను చంపుకోలేను. అది కట్టుకున్న భర్త ఎలాగూ సహించలేడు. ఈ ఇబ్బందులన్నీ ఎందుకు. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. ఆర్ధికంగా నీకు నేను భారం కాదల్చుకోలేదు. ఏదో అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మగతోడుగా నిలుస్తుంటే చాలు..."
    'నువ్వు నాకు భారం కాదు. పెళ్ళి ఇష్టం కాకపోతే మానేసేయ్. కానీఇలా ప్రమాదకరమైన వ్యవహారాల్లో మాత్రం తల దూర్చకు."
    "లాభం లేదు ఆనంద్. పరిస్థితులు చేయి దాటి పోయాయ్. ఈ ఫోటోలు చూడు" అంటూ మంచం మీద తలగడ క్రింద నుంచి రెండు ఫోటోలు తీసి ఆనంద్ కిచ్చింది కుసుమ.
    ఆ ఫోటోలు చూస్తూనే ఆనంద్ కళ్ళు పెద్దవయ్యాయి. అందులో తనూ, కుసుమ వున్నారు. దంపతులంత దగ్గరగా , దంపతులు ఏకాంతంలో వుండే విధంగా!
    "ఏ ఆడది ఇలాంటి ఫోటోలు పదిమందిలోకి వెళ్ళాలని కోరుకోదు. ఇవి చూపించి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడోకతను. నేను చెప్పిన ఆఫీసు వ్యవహారం అబద్దం అసలు సంగతి యిది. నేను వాళ్ళు చెప్పినట్లు విని తీరాల్సిందే."
    ఆనంద్ క్షణం అలోచించి "రాజేశ్వరి నాకు తాళి కట్టిన భార్య కాదు. ఆమెను వేరే దారి చూసుకోమని నేను నీ మెడలో తాళి కట్టేస్తాను. ఆ తర్వాత ఈ ఫోటోలు బహిర్గతం మైనా ఫరవాలేదు. నువ్వేం బెంగపడకు. అనవసరంగా తప్పటడుగు వేయకు" అన్నాడు.
    కుసుమ ఆశ్చర్యంగా "ఆనంద్, ఏమిటి నువ్వంటున్నది?" అంది.
    "అవును, నీడలేని ఒక ఆడది అలా ఆలా పతనమై పోకుండా ఉండడం కోసం ఏమైనా చేస్తాను నేను....' అని లేచాడు ఆనంద్.
    కుసుమ అతని వంక ఆరాధన భావంతో చూస్తూ వుండిపోయింది.

                                     14
    "రాజేశ్వరి , నీకు నా ప్రేమ మీద నమ్మకముందా?
    "అసలా సందేహ మెందుకు వచ్చింది?"
    "ఎందుకంటె , ఇప్పుడు మన ప్రేమకు పరీక్ష వచ్చింది!"
    రాజేశ్వరి ఆశ్చర్యంగా చూసి "ఏమిటా పరీక్ష!" అంది.
    "కుసుమ బ్రతికే వుంది తెలుసా?" అన్నాడు ఆనంద్.
    "అసలామే చచ్చిందని ఎవరన్నారు?"
    "నేనలాగానుకున్నాన్లే , ఆమె బ్రతికుండటమే గాక ఈ ఊళ్ళో నే వుంది."
    "నామీద ప్రేమతో ఈ విషయం దాచి పెట్టావా?' లేక ఈ విషయం నీకిప్పుడే తెలిసిందా?'
    "ఆనంద్ క్షణం అలోచించి, "చాలా రోజులయింది. ఆమె స్వయంగా నాకోసం కబురంపించింది. తన ఉనికిని ఎవ్వరికీ, ఆఖరికి నీక్కూడా తెలియ జేయవద్దని కోరింది. ఆమె ఉద్దేశ్యం తెలిసుకోవడం కోసం నేనామెను కలుసుకుంటూ వచ్చాను. ఇప్పుడామె ఆశ్రయం పూర్తిగా తెలిసిపోయింది. నన్నామే స్మగ్లర్ గా మార్చాలని చూస్తోంది. ఆమె ఏదో ముఠా కు సంబంధించిన వ్యక్తీ . వెంకట్రావు ఆమెకు భర్త కాడు. ఒక ముఠా వ్యక్తీ అంతే !" అన్నాడు.
    రాజేశ్వరి ముఖంలో ఆశ్చర్యం కనబడింది. "జీవితంలో ఎక్కడికి వెళ్ళినా నాకు స్మగ్లర్స్ బాధ తప్పడం లేదు. ఆఖరికి మన పొరుగున ఉండే కుసుమ కూడా స్మగ్లరే నన్నమాట. అయితే మనకెంటీ. నువ్వోప్పుకోకు...."
    "ఒప్పుకోక తప్పేలా లేదు. ఆమె చేతిలో చాలా మంది గుండాలున్నారు. బలవంతాన్నైనా నన్నోపించగదనుకుంటాను" అని, 'అంతేకాకుండా కుసుమ నా జీవితంలోకి ప్రవేశించాలను కుంటోంది. నిన్ను తప్పించాలను కుంటోంది. అది నేను సహించ లేను కానీ తప్పేలా లేదు' అన్నాడు ఆనంద్.
    "ఎందుకు తప్పవు?"
    "నువ్వు చాలా బాగుంటావుట! నీ చేత వ్యభిచారం చేయించి చాలా డబ్బు సంపాదించవచ్చునట. తను నాకు భార్య అవుతుందిట. నేను స్మగ్లింగూ, నువ్వు వ్యభిచారమూ చేయాలట. మనం ఒప్పుకోకపోయినా ఒప్పించే విధానాలామెకు తెలుసునట. దేశంలో ఎక్కడికి పారిపొయినా వెతికి పట్టుకోగలననీ పారిపోవడానికి ప్రయత్నించవద్దని గట్టిగా హెచ్చరించింది....'
    రాజేశ్వరి ముఖంలో భయం కనపడింది. "అయితే ఇప్పుడెం చేయాలి?"
    "ఇంకో మార్గం లేదు. కుసుమను చంపేయాలి...."
    ఉలిక్కిపడింది రాజేశ్వరి . "ఎలా?"
    "ఇలా?' అన్నాడు ఆనంద్. అతను జేబులోంచి ఒక ట్యూబు తీశాడు. ఏం చేయాలో చెప్పాడు. రాజేశ్వరి ఆశ్చర్యంగా విని, 'అయితే కుసుమ నెప్పుడు తీసుకు వస్తావ్?" అంది.
    "ఎల్లుండి!"
    'అంతవరకూ రంగారావు మనల్ని వదుల్తాడంటావా?"
    "రంగారావా ...." అన్నాడు ఆనంద్. అతనికి వళ్ళంతా చెమటలు పట్టింది.
    "రాజూ..... ఈసారి పొరపాటు జరక్కూడదు. నిలువెత్తు గోయి తీసి కుసుమ శవాన్నందులో పారేసి గోతిలో కప్పెట్టేయాలి" అన్నాడు ఆనంద్.
    "ఈసారి అంటే, ఇలాంటి ఇదివరకోసారి చేశావా?" అంది రాజేశ్వరి.
    ఆనంద్ తాదబడ్డాడు. కొద్దిసేపాగి "జీవితంలో నాకు చాలా దగ్గరగా వచ్చావు. నీ దగ్గిర నాకు రహస్యాలేమిటి? నేను రంగారావుని చంపేశాను. అది కేవలం నిన్ను దక్కించుకోవాలన్న ఆశతో. కానీ గోతిలో పారేశాను మన్ను వేయలేదు. అదే నేను చేసిన పొరపాటు ....' అన్నాడు.
    రాజేశ్వరి మ్రాన్పడి పోయినట్టు చూస్తోంది. ఆమె నోట మాట రాలేదు.
    "రాజూ భయపడకు. నేను మరీ దుర్మార్గుడిని కాదు. నీ ఆనందం నన్ను పిచ్చి వాడ్ని చేసింది. తెలివితేటలుపయోగించి నిన్నూ, సంపదనూ కూడా పొందగలిగాను. కానీ ఆతర్వాత నా బుద్ది పెడదారులు తొక్కలేదు. నిన్ను నా భార్యగా చేసుకుని, సామాన్య జీవితం గడుపుతున్నాను. అయితే ఇప్పుడు కుసుమ మళ్ళీ నా జీవిత పధాన్ని మళ్ళించడానికి ప్రయత్నిస్తోంది. అది నాకు నచ్చలేదు. వేరే దారి కనబడడం లేదు. మనమిద్దరం సుఖ జీవనం కొనసాగించడం కోసం కుసుమను చంపెయాడానికి నిర్ణయించుకున్నాను. ఇందుకు నీ సహాయం కావాలి..."
    రాజేశ్వరి అతని వంక అదోలా చూసింది. 'ఆనంద్ నీకు నామీద ఎంత ప్రేమ? నీకు నేను తప్పక సహకరించవలసిందే. కానీ రంగారావు మానని నీడలా వెన్నాడు తున్నాడు. అతన్ని తప్పించుకోవడానికి ఊరు వదిలి వెళ్ళిపోదాం." కుసుమ చిరునామా చెబితే నేనే వెళ్ళి ఆమెను తీసుకొస్తాను. కానీ ఈలోగా నువ్వీ ఊరు వదిలినట్లు నలుగురూ అనుకోవాలి. రాత్రిళ్ళు మనం కలుసుకుంటుందాం రహస్యంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS