ఆ కుర్రవాడు ఆనంద్ చేతిలో ఓ కవరు పెట్టి తుర్రున పారిపోయాడు. ఆనంద్ కా కుర్రవాడిని పట్టుకునే ఆలోచనే లేకపోయింది. అతను అప్రయత్నంగా కవరు తెరిచి లోపలున్న ఉత్తరం తీశాడు.
దస్తూరీ ఎవరిదో కానీ ముత్యాల కోవాలా వుంది. పైన తేదీ లేదు. క్రింద సంతకం లేదు.
"పాత స్నేహాన్ని పురస్కరించుకొని ఈ ఉత్తరం రాస్తున్నాను. నాకోసం మీరు ఈ కాగితం వెనుక వ్రాసిన చిరునామాకు రాగలరా?"
కాగితానికి ఒక వైపు రెండే రెండు వాక్యాలున్నాయి. రెండో వైపు చిరునామా వుంది. చాలా దూరమే. ఊరికి తానొక వైపున ఉంటె, ఇప్పుడు తను వెళ్ళవలసిన ఇల్లింకో వైపున వుంది.
ఆనంద్ కవరు నూ, కాగితాన్ని జేబులోకి తోసేసాడు.
ఈ వుత్తరం ఎవరు వ్రాసి వుంటారు? ఎవరో తనకు బాగా తెలిసినవారే అయుంటారు. కానీ ఉత్తరం చాలా తమాషాగా వుంది. వివరాలు చాలా తక్కువగా వున్నాయి. రాసిందెవరో తెలియదు. తను వాళ్ళ నెందుక్కలుసుకోవాలో తెలియదు. ఆఖరికి ఎప్పుడు కలుసుకోవాలో కూడా తెలియదు....
ఒక్కసారి వెళ్ళి వచ్చేస్తే చాలా ప్రశ్నలకు జవాబులు లభిస్తాయి. కానీ, ఈ సంగతి రాజేశ్వరికీ చెప్పాలా? వెళ్ళి చ్చేక ఏ ప్రమాదమూ లేదనుకుంటే ఆమెకు చెప్పవచ్చు. ఉన్న పక్షంలో ఈ విషయం రహస్యంగా ఉంచడమే మంచిది.
లోపలకు వెళ్ళి బట్టలు మార్చుకుని బయటకు వెళ్ళి వస్తానని భార్యకు చెప్పి అతను వీధిలోకి వచ్చాడు.
11
"నువ్వా?" అన్నాడు ఆనంద్. ఆశ్చర్యమూ, ఆనందమూ సమపాళ్ల లో కనపడుతున్నా యతని కళ్ళలో నిన్ను మళ్ళీ చూడగల ననుకోలేదు."
"నేనూ అనుకోలేదు. కానీ మనం మళ్ళీ కలుసుకోవాలనుంది కాబోలు , అందుకని ఇలా కలుసుకున్నాం." అంది కుసుమ.
"ఎమయిందసలు? నాకా ఉత్తర మెందుకు రాసావ్. మీ అయన నిన్నింట్లో నుంచి ఎందుకు తరిమేశాడు?"-- అన్నాడు ఆనంద్.
"అయన నన్నింట్లోంచి తరిమేయడమేమిటి?" అంది అర్ధం కానట్లు కుసుమ.
తనకు తెలిసినంత వరకూ కుసుమ విషయంలో జరిగినవన్నీ ఆమెకు చెప్పాడు ఆనంద్.
"ఎంత కాంక్ష మీకు నామీద ?" అంది ఆశ్చర్యంగా కుసుమ. "నా కోసం ఇక్కణ్ణించి కాకినాడ వెళ్ళారా? అందుకే కాబోలు దేవుడు నన్ను మీకోసం స్వర్గం నుంచి సరాసరి భూమ్మీదకు పంపేశాడు."
"నీకోసం కాకినాడ ఏం కర్మ, ఎక్కడికైనా వెళ్ళి వచ్చేస్తాను. నీ రూపం మగాడికి వరం లాంటిది " అన్నాడు ఆనంద్.
కుసుమ ముఖంలో అనంత గర్వం కనబడింది. 'ఆగి సరే, ఇంతకీ నేనేమయ్యాననుకున్నారు?"
"అబద్దమెందుకు? నిన్ను వెంకట్రావు చంపెశాడేమోనని అనుమానం కలిగింది. క్రమంగా ఆ అనుమానం భయంగా మారింది కూడా."
"ఆ అనుమాన మెందు కొచ్చింది."
"నువ్వు పుట్టింటికి వెడతానన్న మరుసటి రోజు మీ అయన మా ఇంటికి వచ్చి ట్రంకు పెట్టడిగాడు. ఆ తర్వాత ఆ పెట్టిన రంగు మార్పించి ఇచ్చేశాడు. అది నా అనుమానానికి కొంతవరకూ కారణం...."
"మీ అనుమానం అబద్దం కాదు. మా అయన నన్ను హత్య చేశాడు' అంది కుసుమ.
ఆనంద్ కుసుమ వంక ఆశ్చర్యంగా చూశాడు.
"అవును. అయన నాకు విష ప్రయోగం చేశాడు. మంచినీళ్ళు తాగి నేను పడిపోయాను. ఆ తర్వాత మెలకువ వచ్చేసరికి ఈ ఇంట్లో ఉన్నాను. ఈ ఇంట్లో ఆమె దగ్గర గ్రామంలో ఎవరో తెలిసిన వారింటి కెళ్ళి టాక్సీలో తిరిగి వస్తుండగా ఆవిడకి దారి పక్కన నేను కనిపించానట. వెంటనే టాక్సీ ఆపి నన్ను పరీక్షించిందిట. చాలా బలహీనంగా వుందట నాడి.
ఏమైతే నేం ఆవిడ నన్ను రక్షించింది. కాస్త తెలివి వచ్చేక నా వాళ్ళ గురించి అడిగింది. ఆవిడ చెప్పినది విన్నాక నామీద విష ప్రయోగం జరిగిందని గ్రహించాను. ఆ పరిస్థితిలో మా అయన గురించి చెప్పకూడదనుకున్నాను. బాగా అలోచించి ఆవిడ బాకీ మీ ద్వారా తీర్చేయదల్చుకున్నాను. మీకు నామీద గౌరవమున్నదనీ నాకోసం ఒకటి రెండు వేలు ఖర్చు చేయడానికి జంకరని నాకు తోచింది.
ఈ ఇంట్లోని డాక్టరు గారికి సుమారు వేయి రూపాయలు చార్జి అవుతుంది. ఆ తర్వాత నేను జీవితంలో సెటిల్ కావడానికి ఇంకో వెయ్యి రూపాయలు దాకా ఖర్చవుతుంది. ఆ తర్వాత ఇంకెవ్వరికీ భారం కాకుండా నా జీవితం నేను జీవించగలను. ప్రస్తుతానికి మీ ఋణం తీర్చుకోవడానికి మీరు కోరుకునే నా శరీర మొక్కటే నా దగ్గరుండి." అంది కుసుమ.
ఆనంద్ ఆలోచన లింకో విధంగా ఉన్నాయి. విష ప్రయోగం చేస్తే కుసుమ ఎలా బ్రతికింది? ఆమె చచ్చిందో బ్రతికిందో తెలియకుండా వెంకట్రావు రోడ్డు ప్రక్కన ఎలా పడసాడు?" ఏదో అనుమానం....
"ఈమధ్య విషాల్లో కూడా కల్తీ ఉంటోందట. అందువల్ల చావ్వలసిన వాళ్ళు చావకుండా బ్రతికేస్తున్నారుట. డాక్టరు చెప్పింది. నా భర్త బహుశా నన్ను పాతి పెడదామనుకుని ఉంటాడు. ఈలోగా అలికిడికి పారిపోయుంటాడు..." చెప్పసాగింది కుసుమ.
12
ఆనంద్ ఇంట్లోకి అడుగు పెట్టగానే , "ఎక్కడికి వెళ్ళావ్ నువ్వు. నువ్వలా బయటకు వెళ్ళగానే ఇలా రంగారావోచ్చాడు మనింటికి?" అంది రాజేశ్వరి.
"మనింటికే వచ్చాడా?' అన్నాడు ఆనంద్. "ఎందుకట?"
"ఏమో తెలియదు. కానీ నాకర్ధం కాని మాటలు చాలా మాట్లాడేడు....' అంది రాజేశ్వరి.
"ఏమన్నాడు?"
"నేను కుక్క ముట్టిన విస్తరినట. అందుకని నేను తన కింక అక్కర్లేదట. నా మీద తనకు పగ లేదట. నిన్ను స్నేహితుడని నమ్మాడట. కానీ నీ స్నేహంలో కల్తీ వుందని తెలుసుకోలేక పోయాడట. నీలాంటి కల్తీ స్నేహితుడి చేతి విషం మాత్రం కల్తీ లేకుండా ఎలాగుంటుందని అడగమన్నాడు. ఎంతలోతు గోతిలోంచయినా తను బయట పడగలనన్నాడు. ట్రంకు కు రంగు మార్చినా నేరం దాగదని చెప్పమన్నాడు. అయిదంటే అయిదు నిముషా లుండి వెళ్ళిపోయాడు. వెళ్ళేముందు నీకు రోజులు దగ్గర బద్దాయని చెప్పమన్నాడు...."
ఆనంద్ కు వళ్ళంతా చెమటలు పట్టాయి. రంగారావు నిజంగానే ఇంటికి వచ్చాడా? అతను గోతిలోంచి బ్రతికి బయటపడ్డాడా? పడితే ఎవరతన్ని రక్షించారు? తను ఉపయోగించినది నిజంగానే కల్తీ విషమా?
తను చేసిన పని ఇంకెవరికీ తెలియడానికి వీల్లేదు. ఆ రహస్యం తనకూ రంగారావు కి మధ్యనే వుండి తీరాలి. ఇప్పుడా వివరాలన్నీ రాజేశ్వరీ చెప్పగలుగుతోందంటే రంగారావు నిజంగానే బ్రతికి బయటపడి ఉండాలి. లేదా ఎవరో తను చేసిన పనులన్నీ గమనించి ఉండాలి.
ఇలా తోచగానే ఆనంద్ ఆపాదమస్తకం వణికిపోయాడు. తన్నేవరూ గమనించలేదని ఇంతకాలమూ చాలా ధైర్యంగా వున్నాడు. కానీ తననెవరో గమనించిన పక్షంలో ఏం చేయాలి? ఒకవేళ రంగారావు బ్రతికి వస్తే ఏం చేయాలి?"
రెండింటికీ అతను సిద్దపడి లేడు.
"{అదేమిటి అలాగై పోతున్నావ్. అసలింతకీ ఏం జరిగింది? రంగారావన్న మాటల కర్ధమేమిటి?' అంది రాజేశ్వరి.
"నిన్ను చంపాలని అతననుకున్నాడు. అతనికి విషానికి బదులు మత్తు మందిచ్చాను . కల్తీ స్నేహం కల్తీ విషం అన్న పదాల కర్ధమిదేనెమో . మరి గోతీ లోంచి బయటపడడమేమిటో నాకర్ధం కావడం లేదు....' అన్నాడు ఆనంద్.
రాజేశ్వరి తేలిగ్గా నిట్టూర్చి "అతని మాటల్ని బట్టి నాకేమనిపించిందో తెలుసా? నువ్వే రంగారావుకి విషం పెట్టి ఏ గోతిలో నైనా పారేశావేమో. అయినా అతను బ్రతికి వచ్చాడేమోనని అనిపించి వణికి పోయాను. ఇంత కాలం ఒక హంతకుడితో కాపురం చెస్తున్నానన్నఆలోచన నాకు భయంకరంగా తోచింది. నువ్వలాంటి వాడి వంటే నామనసోప్పుకోదనుకో . కానీ..." అని ఆగిపోయింది.
ఆనంద్ అనుమానంగా రాజేశ్వరి వంక చూశాడు. "ఈ ఊళ్ళో మనమెంతో కాలముండడానికి వీల్లేదు. రాజూ, ఎలాగో అలాగ రంగారావు బారి నుంచి తప్పించుకోవాలి. మాటలెం చెప్పినా నామీద కంటే నీమీదనే అతనికి పగ ఎక్కువగా ఉండవచ్చును. తనను కాదని మరో మగవాడితో వుండే ఆడదాన్ని నీ మగవాడూ సహించలేదు. నిన్ను నేను మళ్ళీ రక్షించాలి."
"నీతో బయల్దేరి వచ్చినప్పట్నించీ నేను మారిపోయాను. నేనిప్పు డేవరికీ భయపడను. నన్ను నేను రక్షించుకోగలను"అంది రాజేశ్వరి.
"మనకిప్పుడు లక్షల ఆస్తి వుంది. ఇంకా ఎంతకాలమిలా సామాన్య జీవితం గడుపుతాం? ఒక అందాల భవంతి కొనుక్కుని ఖరీదయిన జీవితం గడపాలి. అయితే అందు గురించి ఎవరూ అనుమానపడని విధంగా వుండాలి. అందుకని ముఖ్యంగా ఈ ఊరుని వదిలి పెట్టాలి."
"చూపుల్లోనూ, మాటల్లోనూ రంగారావు కు నీమీద చాలా పగ వున్నట్లు వ్యక్తమైంది. నువ్వు చాలా జాగ్రత్తగా వుండాలి. ఏ క్షణం లోనైనా నీమీద హత్యా ప్రయత్నం జరగవచ్చుననీ నా కనుమానంగా వుంది. దాన్నించి తప్పించుకోనేందు కేదైనా మంచి పధకం వేయాలి...." అంది రాజేశ్వరి.
13
ఆనంద్ తలుపు తట్టబోయే సమయానికి "సార్! ఈ ఉత్తరం లోప లిచ్చేస్తారా" అన్నమాట వినబడి వెనక్కు తిరిగాను. పోస్టు మాన్ అతనికో కవరందించి వెళ్ళి పోయాడు.
ఆనంద్ పరీక్షగా చూశాక కవరు మీద కుసుమ పేరు వుంది. ఫ్రం వెంకట్రావు. కాకినాడ అని కూడా రాసి వుంది.
ఒక్క క్షణం ఆనంద్ బుర్ర పనిచేయలేదు. వెంకట్రావు కు కుసుమ ఇక్కడుంటుందని తెలుసా? తెలిస్తే ఎలా తెలిసింది? ఈ ఉత్తరంలో ఏముంది. బెదిరింపా?
ఆనంద్ తలుపు తట్టకుండా వెను తిరిగాడు. దగ్గర్లో ఉన్న పార్కు లోకి వెళ్ళి జాగ్రత్తగా కవరు తెరిచాడు. లోపల తెల్ల కాగితం మీద కాస్త పెద్ద ఉత్తరమే వుంది.
"డియర్ కుసుమా!"
మన పధకం చాలా తెలివిగా రూపొందించావు నువ్వు. నీకోసం ఆనంద్ పిచ్చి వాడైనాడని అతని కాకినాడ వచ్చినపుడే అనుకున్నాను. ఇప్పటికీ నీగురించి మూడు వేలు ఖర్చు పెట్టాడంటే అతనికి బాగా డబ్బున్నదనే తోస్తోంది. నేను నిన్ను హత్య చేశాననీ అయినా అదృష్టం కొద్ది బ్రతికి బయట పడ్డావనీ నువ్వన్న మాటలు అతను నమ్మాడంటే నీ చాకచక్యానికి మురిసి పోతూనే --- -----ఇలాంటి ఫూల్ మనకు ముందు ముందు పనికి వస్తాడా అని ఆనుమానంగా కూడా వుంది. ఏది ఏమైనా నీ అసలు రంగు బయట పెట్టు. ఎత్తులతో, జిత్తు లతో అతన్ని చిత్తూ చెయ్యి. మన స్మగ్లింగ్ లోకి దించు.
