Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 35


                           అడ్వెంచరస్ స్పిరిట్
                                                               ---వసుంధర

    థియేటర్లో సినిమా నడుస్తోంది, లోపల జనం పల్చగా ఉన్నారు. అందరికంటే బాగా వెనుక సీట్లలో కూర్చున్నారు చంప, ప్రవీణ్ వారికి ముందు, పక్కల ఎవ్వరూలేరు. అందుకే వాళ్ళు సినిమా చూడకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు.
    "చాలా థాంక్స్ చంపా! నీతో కలిసి సినిమాచూసే అవకాశమిచ్చావు-" అన్నాడు ప్రవీణ్.
    "కానీ నువ్వు సినిమా చూడ్డంలేదు....." అంది చంప.
    "అది థియేటర్ కానీ పూలతోటకానీ తాజ్ మహల్ కానీ నువ్వెక్కడున్నా నిన్నే చూడ్డం ఇష్టం నాకు-" అన్నాడు ప్రవీణ్.
    ఎర్రబడిన కారణంగా చీకట్లో చంప బుగ్గలు మెరిశాయి-"నీ కెందుకూ నేనంటే అంత యిష్టం!" అందామె.
    "మాటల్లో చెప్పలేను. కానీ నాకు నువ్వంటే ఇష్టం నువ్వంటేనే యిష్టం-" అన్నాడతడు.
    చంప నెమ్మదిగా-"నాకూ నువ్వంటే యిష్టమే!" అంది.
    "మెనీ మెనీ థాంక్స్!" అన్నాడు ప్రవీణ్.
    "అందుకేనేమో మన యిష్టం ప్రేమగా మారడానికి వీల్లేదు-" అంది చంప.
    "ఈ విషయం చాలాసార్లు చెప్పావు. నీ బాబయ్యకు నేనంటే యిష్టంలేదు. ఎందుకంటావ్?"
    "బాబయ్యకు నేనంటే చాలా యిష్టం. ఎందుకో తెలుసా?"
    అతడు తల అడ్డంగా ఊపాడు. చీకటికి అలవాటుపడ్డ కళ్ళా విశేషం చూశాయి.
    చంప చెబుతూంటే అతడు వింటున్నాడు.
    నారాయణరావు, మధుసూదన్ అన్నదమ్ములు, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఆ కారణంగా పెళ్ళిళ్ళయ్యాక కూడా విడిపోకుండా కలిసే ఉంటున్నారు. నారాయణరావు కూతురు చంప. చంపకు రెండేళ్ళవయస్సప్పుడు వారంతా తిరుపతి వెడుతూండగా ప్రమాదానికి గురయ్యారు. అందులో మిగిలినది చంప, మధుసూదన్ జరిగిందానికి మధుసూదన్ బాగా అప్సెట్టయ్యాడు.
    ఇన్సూరెన్స్ వల్ల అతడికి లక్షరూపాయలు వచ్చాయి. ఉన్న ఆస్తి అమ్మితే మరో లక్ష వచ్చింది. ఆ డబ్బును బ్యాంకులో వేసి చంపను కన్నకూతురిలా చూసుకోసాగేడతడు. ఆమెకైదు సంవత్సరాలొచ్చేవరకూ ఇంట్లోనే ఉండిపోవడం కోసం - అంతకాలం తను చేస్తున్న ఉద్యోగం వదులుకున్నాడు. ఆమెను స్కూల్లో వేశాక తను మళ్ళీ ఉద్యోగంలో చేరాడు. వచ్చే జీతం అంతంత మాత్రమైనా పట్టించుకోలేదు.
    మళ్ళీ పెళ్ళిచేసుకోమని ఎందరో అతణ్ణి బలవంతపెట్టారు. అతడిలో విరక్తిభావం ప్రవేశించడంవల్ల అందుకంగీకరించలేదు. క్రమంగా అతడికి చంప అంటే మమకారం ఏర్పడింది. చెప్పాలంటే ఆమె కోసమే అతడు జీవిస్తున్నాడు.
    "బాబాయి నన్ను కన్నతల్లికంటే మిన్నగా పద్దెనిమిదేళ్ళు పెంచాడు. నా కోసమే జీవిస్తున్నాడు. ఆయనకు నేనంటే యిష్టముండదూ?"
    అవునన్నట్లు తలూపాడతడు-"కానీ ఆయనకు నేనంటే ఎందుకిష్టంలేదు?"
    "నా పేరున రెండు లక్షలున్నాయి. ఇప్పుడు బాబాయికి ఉద్యోగంమీద వచ్చే ఆదాయంకూడా బాగా ఎక్కువ. ఆయనకు నేనుతప్ప ఎవ్వరూలేరు. అందువల్ల నన్నాయన చాలా పెద్దింట్లో యివ్వాలని అనుకుంటున్నాడు-" అంది చంప.
    "పెద్దింట్లో అంటే!"
    "నా ఆస్తి మీద ఆశపడకుండా-నా కంటే ఆస్తిలో గొప్పవాడై ఉండాలి-"
    "చంపా-నేను నిజం చెబుతున్నాను. నాకు నీ ఆస్తిమీద మోజులేదు....."
    "నేను నమ్ముతాను. కానీ బాబాయి నమ్మడు....."
    "ఎందుకని?"
    "ప్రస్తుతం నీ జీతం నెల కారువందలు. స్వంతిల్లు లేదు. పెళ్ళి చేసుకుంటే భార్య కోరికలు తీర్చలేవు. అసహాయత నీలో ఉక్రోషాన్ని రెచ్చగొడుతుంది నా ఆస్తిమీద ఆశను పుట్టిస్తుందా ఉక్రోషం. ముందు సణుగుడుతో ప్రారంభమై తర్వాత శాసించడం మొదలు పెడతావు. ఆ తర్వాత నా ఆస్తితో నీకు దురలవాట్లు నాకు దుర్భర కష్టాలు...."
    "చంపా-ఏమిటి నువ్వంటున్నది?"
    "నేనుకాదు-నా బాబాయంటున్నాడు....."
    "అంటే నువ్వు నమ్మావా?"
    "నేను నమ్మలేదు. కానీ ఏం ప్రయోజనం?"
    "చంపా-నువ్వుకూడా నీ బాబాయి మాటలు నమ్ముతున్నావు. లేకుంటే నిన్నంతగా ప్రేమించిన నీ బాబాయిని నమ్మించడం నీ కసాధ్యం కాదు...."
    "బాబాయి దగ్గర నేనేం మాట్లాడలేదు. ఆయన మాట నాకు వేదవాక్కు......"
    "అయితే మన ప్రేమ ఫలించదా?"
    "అలాగే కనబడుతోంది-"
    "చంపా-నా కోసం నువ్వేమీ చేయలేవా?"
    "నీ కోసం నేను నా బాబాయిని వదులుకుందుక్కూడా సిద్దమే! కానీ నువ్వే ఆలోచించు. పద్దెనిమిదేళ్ళపాటు నన్ను కంటికిరెప్పలా-కన్నతల్లికంటే మిన్నగా పెంచిన బాబాయిని కాదని నేనిల్లు వదలి పెడితే ఆయనేమైపోతాడు? ఆయన గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఎంతో కొంత నాకుంది కదా!"
    "నువ్వు చెప్పింది నిజం అయితే ఇంకే ఉపాయమూ లేదా?"
    "ఒక ఉపాయముంది. కానీ నీకు చెప్పడానికి సంకోచిస్తున్నాను-"
    "చెప్పు చంపా! నీ కోసం నేనేమైనా చేయగలను!"
    "ఏమైనా అంటే హత్య చేయగలవా?"
    తెల్లబోయాడు ప్రవీణ్-"హత్యా?"
    "అవును అందుకే నీకు చెప్పడంలేదు...."
    "అసలు హత్య ఎందుకు చేయాలి?"
    "అవన్నీ నీ కెందుకు?"
    ప్రవీణ్ క్షణం ఆలోచించి-"ఎందుకో తెలుసుకుంటే నేను హత్యయినా చేస్తానేమో!" అన్నాడు.
    "ఈ ఊళ్ళో శివరాజు తెలుసా నీకు?"
    "తెలియదు...."
    "శివరాజు పెద్దమనిషిగా చెలామణీ అవుతున్న సమాజ ద్రోహి-"
    "ఊఁ"
    "ఆ శివరాజును నువ్వు చంపేయాలి-"
    "ఎందుకు?"
    "శివరాజు బ్లాక్ మెయిలర్ ఆయన నా బాబాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు....."
    "ఏమని?" అన్నాడు ప్రవీణ్ ఆశ్చర్యంగా.    
    చంప నెమ్మదిగా-"బాబాయి తప్పుచేశాడు-" అంది.
    "తప్పంటే?"
    చంప చెప్పసాగింది.
    పెళ్ళయితే చేసుకోలేదుకానీ- వయసు రేపే కోర్కెల నణచుకోలేక మధుసూదక్ అప్పుడప్పుడు కాల్ గర్ల్స్ ని కలుస్తూండేవాడు. ఆయన వేశ్యావాటికకు వెళ్ళలేదు. ఏ యువతిని కలుసుకుంటే-ఆ యువతి ఇంటికే వెళ్ళేవాడు. అందుకాయన శివరాజు సాయం తీసుకున్నాడు. అయితే శివరాజు మోసం చేస్తాడని ఊహించలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS