అంగీకార సూచకంగా తల ఊపాడు మురళీధర్. వారం రోజులంటే గడువు తక్కువేనని అతనికి తోచింది. అయినా ఇల్లు ఇలాంటిది మళ్ళీ తన చేతిలోనికి రాకపోవచ్చు. ఎలాగూ హౌస్ బిల్డింగ్ లోన్ అయిదారు రోజుల్లో తన చేతికి వస్తుంది.
మాటలకు సంబంధించినంతవరకూ వ్యవహారాన్నప్పటికి పూర్తీ చేశాక ; మురళీధర్ , భానోజీరావు తమ కుటుంబాలతో సహా అక్కణ్ణించి బయటపడ్డారు.
6
'అబ్బ! వెధవ ట్రైన్ గంట లేటుట" అతనేవారి భార్య దగ్గర విసుక్కున్నాడు.
"గంట కాదు, రెండు గంటలన్నా ఫరవాలేదు కానీండి , ఈ వెధవలిద్దర్నీ సముదాయించ లేక చస్తున్నాను. వీళ్ళు నిద్రకు పడితే బాగుండును" భర్త నుద్దేశించి విసుక్కుంది భార్య.
పిల్లలిద్దరిలో ఒకడు ఏడుస్తున్నాడు. రెండోవాడు వాణ్ణి డిపిస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి తల్లి నేడిపిస్తున్నారు . ట్రయిన్ తండ్రి నేడిపిస్తోంది.
"టైమెంత యింది సార్"
ఎవరో అతన్ని పలకరించారు. అతను విసుగ్గా వాచీ చూసుకుని "ట్రయిన్ రావడాని కింకా గంటం పావుందండీ"అన్నాడు.
'అయ్ సి, అయితే, మీరూ ఆ ట్రయిన్ కే నన్నమాట" అన్నాడు పలకరించి నతను. తన చేతి వాచీ తీసి కరెక్ట్ చేసుకుని, "మీది రేడియో టైమే కదండీ, రైల్వే టైము నాకు నచ్చదు" అన్నాడు.
పిల్లల తండ్రి అతనికి టైము చెప్పి, "మీరూ, ఈ ట్రయిన్ కే నన్నమాట, ఎంతవరకూ?" అనడిగాడు.
అతను చెప్పి, "మీరెంతవరకూ?" అనడిగేడు.
పిల్లల తండ్రి చెప్పాడు. "ట్రయిన్ లో పధ్నాలుగ్గంటలకీ ప్లాటు ఫారం మీద ఎక్స్ ట్రా గంటొకటి !" అని విసుక్కున్నాడు కూడా.
"ఎక్కడ పన్చేస్తున్నారు సార్ , సెలవు మీద ఇంటికి వెళుతున్నారనుకుంటున్నాను."
"పబ్లిక్ సెక్టార్లో , పిగ్ మెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించార్లెండి. అందులో పనిచేస్తున్నాను."
"అదా, దాంట్లోకి రిక్రూట్ మెంట్ జరిగి ఏడాది కాలేదింకా."
"అవునండీ, నేను కొత్తగా చేరానందులో..."
"ఆశ్చర్యంగా వుందే. ఈ ఊళ్ళో మీకు ఏడాది లోపులో ఫామిలితో వుండడాని కిల్లు దిరికిందా?"
"ఈ ఊళ్ళో ఇల్లు దొరకడం కష్టమే కానీ, మా కంపెనీ వాళ్ళు లీజ్ కి ప్లాట్సు తీసుకున్నారు. ఆఫీసర్స్ కని రిజర్వు చేసి వుంచుతారు."
"బాగానే వుందే, లేకపోతె కష్టం. అయితే మీ ఫ్యాక్టరీ వాళ్ళ ప్హ్లాట్లన్నీ ఒక ఏరియాలోనే వున్నాయా."
"అబ్బే నగరమంతా వున్నాయండీ , మాది కృష్ణారావు పేటలో వుంది."
"మీ పేరు సార్."
"నాపేరు సుబ్రహ్మణ్యం. మీ పేరు?"
"నా పేరు రామలింగం . నేను నిరుద్యోగిని. మీ ఎరికలో ఎప్పుడైనా ఏదైనా జాబ్ వస్తే నన్ను మర్చిపోకండి సార్. నా ఎడ్రస్ మీ కిస్తాను"అన్నాడతను.
సుబ్రహ్మణ్యం ఇబ్బందిగా ముఖంపెట్టి "అబ్బే, నా చేతుల్లో ఏమీ లేదండి. అయినా ఊర్నించి రావడానికి ఇంకా నెల పడుతుంది నాకు. అప్పుడో సారి కనిపించండి. వీలుంటే ప్రయత్నిస్తాను. ఇంతకీ మీ క్వాలిఫికేషన్"
"బీయస్సీ సెకండ్ క్లాసులో ప్యాసయ్యాను...."
ఇద్దరి మధ్యా చాలాసేపు సంభాషణ జరిగింది. ట్రయిన్ వచ్చేక, "వస్తాను సార్, మనిద్దరి క్లాసులు వేరు" అన్నాడు రామలింగం.
ఐతే రామలింగం ట్రాయినెక్కలేదు. అతను తిన్నగా తన గదికి వెళ్ళాడు.
రాత్రి పదకొండు గంటలు దాటేక అతను కృష్ణారావు పేట లో సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళాడు. ఎవరి కంటా పడకుండానే , చెప్పుకోదగ్గ శ్రమ లేకుండానే తాళం తీసి లోపల ప్రవేశించగలిగాడు. తాళం తీసేముందతను చేతికి గ్లవ్స్ తొడుక్కున్నాడు. క్రితం సారి చేసిన దొంగతనం సందర్భంలో పోలీసులకు అతని వ్రేలిముద్రలు దొరికాయి. ఆవ్యక్తి కోసం వారు అన్వేషణ లో వున్నారు. అందువల్ల ఈ పర్యాయం అతను కొత్త జాగ్రత్త తీసుకున్నాడు.
అతనికి చెప్పుకోదగ్గ వేమీ దొరకలేదు. నాలుగు పట్టుచీరలు, రెండు వెండి కంచాలు, రెండు వెండి చెంబులు దొరికాయి. అక్కడే వున్న ఒక ఎయిర్ బ్యాగులో వాటిని సర్దుకుని అక్కణ్ణించి బయటపడ్డాడు.
ఆ బ్యాగులోని వస్తువులు ఖరీదు సుమారు అయిదువేలు చేయవచ్చు. కానీ, మారు బేరం లో అతనికి రెండు వేలకు మించి దొరకదు. ఏం చేయడం, దొరికినదానితో తృప్తి పడాలి మరి.
రామలింగం తన గదిలోకి ఎయిర్ బ్యాగ్ తీసుకు వెళ్ళాడు. అక్కడ అందులోని వస్తువులన్నీ తీసి పెట్టేలలోకి సర్దేశాడు. తర్వాత మళ్ళీ ఎయిర్ బ్యాగు తీసుకుని ఊళ్ళోని నది వద్దకు వెళ్ళాడు. నదీమా తల్లికి ఒక నమస్కారం పారేసి ఎయిర్ బ్యాగు నందులోకి విసిరేశాడు.
ఇప్పుడు గ్లోవ్స్ చేతినించి తీసి జేబులోకి తోసేశాడతను. ఆ తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాడు. చటుక్కున బుర్రలో ఏదో స్పురించింది.
చకచకా అతని కాళ్ళు అలవాటైన ఆ ఇంటి వైపు దారి తీశాయి. ఆవరణలో అడుగు పెట్టి , చెట్లవాటు నించి నడుచుకుంటూ బాత్ రూమ్ వైపు వెళ్ళాడు.
బాత్ రూం లో లైటు వెలుగుతోంది. కానీ, వెంటిలేటరు తలుపు మూసి వుంది.
రామలింగం కసిగా పెదాలు కొరుక్కున్నాడు. "మిస్టర్ బాపిరాజు , ఎప్పుడో దొరక్కపోవు. నీ ఇంట్లోనే నా ఆఖరి దొంగతనం కావాలి" అనుకున్నాడు.
7
"కారణం తెలియదు సార్, ఇంతవరకూ మీ లోన్ కు సంబంధించిన ఫైనల్ పేపర్స్ డిల్లీ నుంచి రాలేదు" అన్నాడతను. మురళీధర్ నిరుత్సాహంగా ముఖం పెట్టి తన సీట్లో కి వెళ్ళిపోయాడు. అక్కణ్ణించి అతను భానోజీరావుకు ఫోన్ చేసి పరిస్థితి చెప్పాడు.
ఇల్లు చేయి దాటి పోనివ్వడం ఇష్టం లేదు. ఈరోజు కాకపొతే రేపయినా నాకు లోన్ రావచ్చును. కానీ. మానకింక మూడ్రోరోజులె టైముంది. ఈ మూడ్రోజుల్లోనూ అంత డబ్బు నాచేతి కందడం అనుమానమే. ఇంటాయన మనకు మరి కాస్త గడువివ్వగలడేమో చూడు"
"లాభం లేదురా. కేవలం నా కారణం గానే అయన నీకు వారం రోజులు గడువిచ్చాడు. లేకపోతే తక్షణం డబ్బు పోసి కొనడానికి కనీసం ఇద్దరు ముగ్గురు సిద్దంగా వున్నారు."
"ఏం చేయమంటావ్ చెప్పు?" అన్నాడు మురళీధర్ నీరసంగా.
"ఎక్కడైనా అప్పు చేయాలి."
"రమారమి పాతికవేలు కావాలి మనకి. మా ఇంట్లో నగా నట్రా కలిపి రెండు మూడు వేలు కూడా చేయవు. ఏమైనా హామీ లేందే ఎవరిస్తార్రా డబ్బు" అన్నాడు మురళీధర్.
"ఎవరైనా ఇచ్చే మాటయితే నేను నీకు హామీగా వుంటాను. బాధ్యత గల ప్రభుత్యోద్యోగిని కాబట్టి, నా హామీ మీద అప్పు పుట్టించ వచ్చును" అన్నాడు భానోజీరావు.
"వద్దురా వద్దు. నువ్వు పోలీసి ఇన్స్పెక్టర్ వి. నిన్ను హామీగా వుంచి పాతికవేలు తీసుకోవడం, నీ భవిష్యత్తుకు మంచిది కాదు."
భానోజీరావు ఒక్క క్షణం మౌనం వహించి, "పోనీ రామారావు ను కదిపి చూస్తె, తనకు చాలా ఖరీదైన క్లయింట్లు వున్నారు" అన్నాడు.
"అబ్బే! లాభం లేదురా. వాళ్ళ నాన్న చేసిన అప్పు లింకా వాడు పూర్తిగా తీర్చనే లేదు. లాయరుగా వాడు బాగానే సంపాదిస్తున్నాడు కానీ, తలకు మించిన బాధ్యతలు మోస్తున్నాడు. వాడు హమికి పనికిరాడు."
"మరేం చేద్దామనుకుంటున్నావు?"
"ఆ విషయంలో సలహా అడుగుదామనే ఫోన్ చేశా న్నీకు. కానీ, వ్యవహారమంతా సులువుగా తేలేలా లేదు. సరేలే మళ్ళీ అలోచించి చెబుతాను" అంటూ ఫోన్ పెట్టేశాడు.
అతను ఫోన్ క్రింద పెట్టగానే , అంతవరకూ వినయంగా చేతులు కట్టుకుని నిలబడి వున్న ఫ్యూన్, "రామయ్య గారు మీకోసం వచ్చారండి. లోపలకు పంపమంటారా?" అనడిగేడు.
"పంపించు" అన్నాడు ముక్తసరిగా మురళీధర్.
గ్లాస్కో పంచె, పెద్దాపురం లాల్చీలతో ఘుమఘుమ లాడుతూ రామయ్య ఆ గదిలో ప్రవేశించి, "నమస్కారమండీ" అన్నాడు.
"నమస్కారం" కూర్చోండి !"
రామయ్య కూర్చుని, బాధగా ముఖం పెట్టి , "ఇల్లు కొందామనుకుంటున్నారుట" అన్నాడు.
"అవునండీ, అనుకున్న లోన్ సమయానికి రాలేదు. అర్జంటుగా పాతిక వేల రూపాయలు కావాలి" అన్నాడు అప్రయత్నంగా మురళీధర్.
రామయ్య నర్మగర్భంగా నవ్వి, "అవసరాలు అందరికీ వస్తుంటాయండీ, మా అవసరాలు మీరు కని పెడుతుంటే, మీ అవసరాలు కనిపెట్టే వాళ్ళే వుండరంటారా, పాతిక వేలు మీకు అప్పుగా ఏం కర్మ..." అంటూ ఆగాడు.
