Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 35


    'అయ్యో' అందావిడ ఇప్పుడేమిటి దారి అన్నట్లు. అయన మొహంలోనూ కళ్ళల్లో నూ కోప జీరలు పెరుకోవటం మొదలు పెట్టాయి. 'నేను వద్దూ అని చెప్తున్నా వాళ్ళకిచ్చావు కదూ.' అన్నాడు.
    'నేను ఇవ్వలేదు. వాళ్ళే తీసుకున్నారు.' ఆ అబ్బాయి ధైర్యంగానే సమాధానం చెప్పాడు. అతని తోటి వాళ్లు మాత్రం తెలతెల్ల బోతూ కాస్త దూరంగా తప్పుకున్నారు.
    'సరే -- ఏదయితే నాకేం -- ఇంక వెళ్ళు.' అన్నాడాయన -- ఆ మాటలు నిజంగా తీసుకోవాలో, హాస్యంగా తీసుకోవాలో అర్ధం కానట్లు చూస్తూ డబ్బుల కోసం చెయ్యి జాచాడా అబ్బాయి.
    'నేను వాళ్ళకి పొట్లాలు ఇమ్మని నీకు చెప్పానా-- నన్ను డబ్బు అడుగుతున్నావు-- ఒక్క పైసా కూడా ఇవ్వను-- వెళ్లు -- ఏం ? అతి తెలివిగా వ్యాపారం చేద్దామను కుంటున్నావా,' అన్నాడాయన కళ్ళెర్ర చేస్తూ.    
    ఆ అబ్బాయి బిక్క చచ్చిపోయాడు-- పోనీ ఆ పొట్లాలు మళ్లీ వెనక్కి తీసేసు కుందామా అన్నట్లు ఒకసారి వాళ్ళ కేసి చూశాడు-- మాయాబజారు సినీమా లో ఘటోత్కచుడిలా ఆ ముగ్గురూ అప్పటికే పొట్లాలు ఖాళీ చేసేయ్యటం కాకుండా ఆ ఖాళీ సంచీలని వుండ చుట్టి అంతదూరం విసిరేసి చేతులు దులిపెసు కున్నారు. ఆ తండ్రి వాలకం చూస్తుంటే 'నీ ఖర్మం నీది. నాకేం సంబంధం లేదు.' అన్నట్లుగా వుంది.
    'ఛ, ఎందుకిలా చేశాను. ఇవాళ ఉదయం నుండి తిరిగి తిరిగి అమ్మిన పొట్లాల మీద వచ్చే లాభం ఈ మూడింటి ఖరీదు తో సరిపోతుంది.' అనుకుంటుంటే ఆ అబ్బాయి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    'పొరపాటయి పోయింది. ఇంకెప్పుడు ఇలా చెయ్యను సార్. అన్నాడు తప్పు ఒప్పుకుంటూ.
    'ఈ డబ్బు మిగులుచుకుని నేనేదో పెద్దవాడినై పోవాలని, మీలాంటి వాళ్ళ పొట్ట కొట్టి నేను లాభం పొందాలని కాదు....బ్రతుకు తెరువు కోసం ఏదో వో పని చేసుకోవాలసిన వాడిని-- ఇలాంటి వెర్రి మొర్రి పధకాలు వేసి, పెద్ద వాళ్ళకే టోకరా ఇచ్చాను అని పొంగిపోవటం పైకి రావలసిన వాళ్ళ లక్షణం కాదు-- ఇంక మీద నుంచైనా జాగ్రత్తగా మసులుకో' అంటూ పర్సు తెరిచి డబ్బు ఇచ్చేశాడాయన.
    'ఇదో కొత్త అనుభవం.' అన్నాడు అప్పటిదాకా ఆటే చూస్తున్న మురళీ.
    'అబ్బాయి యివ్వగానే అలా తీసేసుకుని తినేయొచ్చా ? తప్పు కాదూ' అని మందలిస్తోందావిడ పిల్లల్ని.
    'ముందు నేను తీసుకోలేదు ఇదుగో వీడే ....ఆ -- నేనెక్కడ తీసుకున్నాను ముందుగా అక్క తీసుకుంది-- వెధవ అబద్దాలు చెప్పకు నువ్వు తీసుకుని మా మీద పెడతావెం ?' అంటూ అ అక్కా తమ్ముళ్ళు తగూలాడుకోటం మొదల పెట్టారు.
    'సరే వూరుకోండి -- ఈసారెప్పుడైనా మళ్లీ ఇల్లా చేశారంటే లెంపలు వాయి గొట్టేస్తాను-- వాడిచ్చినా అక్కర్లేదని చెప్పాలి' అని పిల్లల్ని కేకలేసి, 'అసలు ముందు తప్పు మునిసిపాలిటీ వాళ్ళది. ఈ హాకర్స్ ని ఇలా లోపలికి రావటానికి పర్మిషను ఇవ్వకూడదు. వాళ్లు గేటు బయటే వుండి అమ్ముతుంటే కావాల్సిన వాళ్ళెవరో కొని తెచ్చు కుంటారు అంతే కాని నలుగురు సరదాగా కూర్చుని కబుర్లుచేప్పు కుంటుంటే వాళ్ళ చుట్టూ ఈ హాకర్స్ పదిమంది పోగయి గొడవ చేస్తుంటే చిరాగ్గా వుండదూ ?' అన్నాడాయన.
    'నిజమే' అందావిడ.
    
                            *    *    *    *
    సాయంకాలం ఆరు గంటలు కావస్తోంది. సూర్యుడు పూర్తిగా అస్తమించక పోయినా ఆకాశం నిండా దట్టంగా మబ్బులు కమ్మివేయటం వల్ల కనుచీకటి పడినట్లు వుంది.
    మురళీ గదిలో లైటు స్విచ్ వేస్తూ , 'బసంత్ లోకి కొత్త సినీమా వచ్చింది -- వెళ్దామా-- వెంటనే బయలుదేరితే టిక్కట్లు దొరుకుతాయి' అన్నాడు.
    'ఇప్పుడెం సినిమా లెద్దురూ-- బయట చినుకులు కూడా పడుతున్నట్లున్నాయి. అయినా నాకిప్పు డెక్కడికి వెళ్లాలని లేదు-- కాస్సేపు కళ్ళు మూసుకుని పడుకుంటే బాగుండు ననిపిస్తోంది.' అంది తలగడ మీదికి వాలి కూర్చుంటూ.
    'ఇంట్లో పనీ అదీ చేసుకోటం నీకు అలసట అయిపోతోంది-- విశ్రాంతి తీసుకో అని ఎంత చెప్పినా వినవు-- సరే కాస్సేపు నిద్రపో...'
    'ఎటూ కాని వేళ ఇప్పుడు నిద్రేమిటి? ఎక్కడికీ రావాలని లేదన్నాను కాని....మీకు ఏమీ తోచటం లేదు కాబోలు-- నాతో కబుర్లు చెప్తూ కూర్చోండి కాలక్షేపం అయిపోతుంది-- ' అంది తన ప్రక్కగా చోటు చూపిస్తూ -- మురళీ దగ్గిరగా వచ్చి మంచం మీద కళ్యాణి ప్రక్కగా కూర్చుని మొదలు పెట్టారు.
    'సరే అయితే విను మరి -- రేపటి నుంచీ ఓ వంట మనిషి కోసం ప్రయత్నం చేస్తాను.....'
    'బాగుంది మాట్లాడటానికి మీకు మంచి టాస్కే దొరికింది -- ఇద్దరు మనుష్యులకి వండి పెట్టటానికి మరో మనిషి కావాలా....అయినా వంటమనిషి ని పెట్టుకుంటే మాత్రం మనం ఏమీ చూసుకో అక్కర్లేకుండా అయిపోతుందనుకున్నారా . వాళ్ళ వెంట వుండి అన్నీ చెప్పి చేయించుకునే బదులు ఆ కాస్త వంట నేనే చేసేసుకుంటే ప్రాణానికి హాయిగా వుంటుంది-- అదీ కాకుండా వాళ్ళు ఎంత దుబారా చేస్తారో తెలుసా -- మీ శారదక్కయ్య వాళ్ళ చుట్టాలింట్లో ఓ వంట మనిషి వుండేదిట-- ఆ యింటి ఇల్లాలికి ఏ పని చూసుకోటానికి శ్రద్ధ లేక పాలూ, మజ్జిగలూ కాఫీలు అన్నీ చూసుకోటం ఆ వంట మనిషి మీదే పెట్టేసేదిట-- ఇదీ బాగానే వుందను కుంది ఆవిడ -- బుద్ది పుట్టినప్పుడల్లా గ్లాసుడు గ్లాసుడు పాలు ఇంత పంచదార కలుపుకుని తాగేస్తూ వుండేదిట-- సాయంత్రం సరికి అలా నాలుగు గ్లాసుల పాలు తరిగిపోతే ఇంక ఖాళీ గిన్నె మిగిలితే అమ్మగారు ఏమనుకుంటారో నని తను గ్లాసుడు పాలు తీసుకున్నప్పుదల్లా వో గ్లాసుడు నీళ్ళు ఆ పాల గిన్నె లో పోసేస్తూ ఉండేదిట....'
    'ఫరవాలేదు ఆవిడెవరో బ్రతక నేర్చిన మనిషన్న మాట.'
    'నా మొహంలా గే వుంది...'
    'నీ మోహాని కేం -- ఏ మహాశిల్పో అహోరాత్రులు శ్రమించి అతి శ్రద్దగా మలచిన .....'
    'ఈ ధోరణి చాలు గాని, ఇంతకీ ఆ బ్రతక నేర్చిన వంటమనిషి సంగతి చెప్పనివ్వండి-- రోజూ ఆ పిల్లలు పెరుగు కోసం పేచీ పెట్టటం, ఇదుగో పట్టండి అంటూ ఈ వంటావిడ గరిట తో తీసి వాళ్ళ చేతుల్లో వేస్తుంటే నే ఉహు, ఉత్త నీళ్ళ మజ్జిగ మాకక్కర్లేదు అంటూ వాళ్ళు కంచాల ముందు నుంచి లేచిపోవటం -- నేనేం చేయ్యనమ్మా ఆ మాయదారి పాలవాడు కటిక నీళ్లు పోస్తున్నాడు అంటూ వంటావిడ సంజాయిషీ ఇవ్వటం ఇలా నాలుగు రోజులు గడిచాక ఆ యిల్లాలు అసలు సంగతి గ్రహించి అయిదో నాటి నుంచి పాల పెత్తనం హస్తగతం చేసుకుందిట -- దాంతో ఆ వంటావిడ కి పౌరుషం వచ్చి అసలు వాళ్ళింట్లో పనే మానిసిందిట-- ఆ ఇల్లాలి స్థితి మళ్లీ మొదటికి వచ్చింది.' నవ్వతూ అని, ' అందరూ అలాగే వుంటారని కాదను కొండి....'
    'అదంతా సరేలే...వాళ్ళ వెంట వుండి పనులు చేయించుకోటం అన్నీ చూసుకోటం నీ వల్ల కాదను కుంటే కారియరు తెప్పించుకుందాం. అంతే కాని నువ్వింకా ఇలా హైరానా పడటం నేను చూస్తూ వూరుకోలేను.' అన్నాడు మురళీ మధ్యలోనే అందుకుని.
    'ఇప్పటి నుంచీ ఇంత హడావిడి చేసేస్తున్నా రేమిటి-- అవసరం అయినప్పుడు ఆ హోటలు భోజనం చెయ్యక ఎలాగా తప్పదు-- అప్పుడే చూసుకోవచ్చు.'
    కిటికీ లో నుంచి వస్తున్న చల్లటి గాలికి కళ్యాణి ముంగురులు చెదిరి ఆమె మొహం మీద దోబూచు లాడుతుంటే సుతారంగా వాటిని వెనక్కి తీస్తూ అన్నాడు మురళీ. 'నీ కిష్టమని చేశాను కళ్యాణి అంటూ మీ శాంత అక్కయ్య ఏవేవో పచ్చళ్ళూ పులుసులూ పంపిస్తూండేదిగా -- అవి వుంటే నీ పని కాస్త తేలిక అయ్యేది, ఈ మధ్య బొత్తిగా ఏమీ ఇస్తున్నట్లు లేదేం--?' అన్నాడు. కళ్యాణి వేవిళ్ళ తో సతమత మవుతూ ఏదీ చేసుకునే ఓపిక లేక, ఎలాగో తంటాలు పడి చేసుకున్నది నోటికి హితవు లేక ఇదవుతున్న రోజుల్లో ఈ పచ్చడి నీ నోటికి రుచిగా వుంటుందేమో చూడు అంటూ ఏవేవో అధరవులు కళ్యాణి వద్దంటున్నా వినకుండా పంపిస్తుండేది శాంత....ఈ మధ్య అవి అంతగా రావటం లేదు. కారణం ఏమిటీ అన్నట్లు కళ్యాణి ని అడుగుతుండగానే మురళీ మనస్సులో ఓ సమాధానం మెదిలి అతని మొహం అదోలా అయిపొయింది. 'మూడు నెలల క్రిందట కళ్యాణి శాంతా వాళ్ళ కుటుంబంతో సినీమా కి వెళ్ళటం, ఆ రాత్రి ఆమె తిరిగి రాగానే తను పెద్ద రాద్దాంతం చెయ్యటం, అది మనస్సులో పెట్టుకుని కళ్యాణి వాళ్లతో స్నేహాన్ని తగ్గించేసు కుందా -- లేకపోతె ఈ గొడవంతా తెలిసి ఆవిడే మునుపటి లా చనువుగా వుండకుండా ముభావంగా వుంటోందా -- అయినా తమ యింట్లో గొడవ వాళ్ళ కేలా తెలుస్తుంది-- కళ్యాణి అలా చెప్పు కుంటుందా తమ విషయాలు ఇంకొక రితో....' ఒకదాని వెంట ఒకటిగా ఆలోచనలు అలా తరుముకు వస్తుంటే సిగ్గుపడుతున్న వాడిలా తలవంచుకుని దుప్పటీ కొసలు మెలిపెడుతూ కూర్చున్నాడు.
    కళ్యాణి కూడా సమాధానం ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్న దానిలా కొంచెం సేపు మౌనంగా ఎటో చూస్తూ వుండిపోయింది. ఆ తరువాత మెల్లిగా అంది.
    'నాకు కూరా నారా చేసి పంపించే వోపిక అక్కయ్య కి ఎక్కడ వుంది లెండిప్పుడు-- ఎవరైనా ఇంత చేసి పెడితే బాగుండును అన్నట్లుంది తన పరిస్థితి.'
    'అంటే?' అర్ధం ఆయీ కానట్లు వుంది అతనికి. 'చెల్లాయ్ మీ నలుగురి మొహం చూడాలంటే నే సిగ్గుతో ప్రాణం చచ్చిపోతోంది అంటూ చెప్పుకుని ఒక్కలా ఇదయి పోతోంది....తనకి మళ్లీ నెల తప్పింది...'
    'నిజం?'
    'నిజం కనకనే తనకంత బాధ....ఒంట్లో కాస్తయినా శక్తి లేదు. బలం లేదు-- ఈ కాన్పు ఎలా అవుతుందో -- ఆస్పత్రి లో ఆ బల్ల మీదే ఏదైనా అయోపోతానేమో మళ్లీ యింటికి తిరిగి రాలేనెమో అనిపిస్తోంది కళ్యాణి అంటూ కళ్ళంట నీళ్లు కూడా పెట్టుకుంది మొన్న. ...అలా అధైర్య పడ కక్కయ్యా. నీ కన్నా ఎక్కువ మంది బిడ్డల్ని కని పెంచిన వాళ్ళు లేరా-- అయినా ఈసారి మాత్రం అశ్రద్ధ చెయ్యకుండా ఆపరేషన్ చేయించేసుకో . మరి పిల్లలు పుట్టకుండా అని సలహా యిచ్చాను....' ఏమిటో కళ్యాణి మొన్నటి సారి ఆ లేడీ డాక్టర్ మరీ మరీ చెప్పింది. ఈవిడ ఆరోగ్యం ఏమీ బాగుండలేదు-- ఇంకా ఇంకా కాన్పులకి తట్టుకోగలిగే త్రాణలేదు, ఇప్పటికి వున్నవాళ్ళు చాలు. మీలో ఎవరో ఒకరు వెంటనే ఆపరేషన్ చేయించుకోండి అని ఆవిడ అన్ని విధాల సలహా ఇస్తే అలాగే అని తల ఆడించి వచ్చేశాం -- అపరేషనూ చేయించుకో లేదు, పోనీ అంటే అవసరం అయిన జాగ్రత్త లూ తీసుకోలేదు.... ఇప్పుడు మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఆ ఆస్పత్రికి వెళ్లి ఆ డాక్టరు కంట పడమంటావు? అసలు అంతదాకా రాకుండానే ఏదైనా మందు మింగి దీన్ని పోగొట్టు కుంటే బాగుండు ననిపిస్తోంది. ఆమాటే ఆయనతో చెప్తే నీ యిష్టం అనేశారు. ఇప్పుడు ఏ డాక్టరు దగ్గరకయినా వెళ్లి మంద ఇమ్మని అడిగితె ముందు జాగ్రత్త లేకుండా ప్రవర్తించి ఇప్పుడీ లాంటి వాటికి ఎగబడతారా అని చీవాట్లు వేస్తారేమో నని భయం వేస్తోంది. ఏమిటో ఈ బ్రతుకు' అంటూ ఒకటే చెప్పటం....అఆస్పత్రి కాకపొతే మరో ఆస్పత్రికి వేల్దువు గాని, ఈసారి ఎలాగో అలా ఆపరేషన్ చేయించు కుందువు గాని, అంతేకాని ఈలోగా ఏమీ హడావిడి పడకు అని సలహా యిచ్చాను నేను...' కళ్యాణి చెప్తుంటే మురళీ వింటూ వుండిపోయాడు.
    'ఏమిటి ఆలోచిస్తున్నారు.' అంది కళ్యాణే మళ్లీ.
    'ఆలోచించ టాని కేముంది. ఈ గోపాలరావు లాంటి ప్రబుద్దులు చాలామంది వున్నారు-- ఇంట్లో భార్య ఆరోగ్యమా అంతంత మాత్రం గానే వుంటుంది -- తమ సంపాదన చూద్దామా అంటే పట్టుమని పదిహేను రోజుల పాటు ఇంట్లో అందరికీ కడుపు నిండా తిండి పెట్టటానికి కూడా సరిపోదు-- అలా అనారోగ్యం తో అర్ధాకలితో బ్రతికేయాటానికయినా సిద్దపడతారు కాని కాస్త ముందు  జాగ్రత్త తీసుకోరు....ఈ రోజుల్లో అనేకమైన సదుపాయాలూ ప్రభుత్వ ఆస్పత్రులూ ప్రయివేటు డాక్టర్లూ కూడ సహాయం చెయ్యటానికి సిద్దంగా వున్నారు. వాళ్ళంతా తమ బాగు కోరే చెప్తున్నారు అని గ్రహించు కోకుండా నా బిడ్డలా బరువు మీరేం మోస్తున్నారు అని వాళ్ళ మీద విరుచుకు పడటం లో అర్ధం ఏమైనా వుందా ........'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS