Previous Page Next Page 
శంఖారావం పేజి 35

 

    "అదంతా నీకుందుకులే బాబూ -- ఈరోజుకిక్కడే ఉండి భోజనం చేసి తెల్లవారుజామునే లేచి బయల్దేరి వెళ్ళండి. రాత్రి ప్రయాణం మంచిది కాదు. అందామె.
    "మేము అర్జంటుగా వెళ్ళాలి ----" అన్నాడు వేదాంతం.
    అర్జంటంటే నాతొ కుదరదు. మా ఇంట్లో అడుగు పెడ్తే భోజనం చేయకుండా వెళ్ళడానికి లేదు. ఇదేమో భోజనాల సమయం కాదు -- " అందామె.
    వేదాంతం ఏదో అనబోతుండగా కులభూషణ్ వారించి "ఒక్కసారి నేను పరమేశ్వరుడు గారిని చూస్తాను" అన్నాడు.
    "పరమేశ్వరుడు గారెవరు ?" అందామె.
    'అదే మీవారు --" అన్నాడు కులభూషణ్ నాలిక్కరుచుకుని.
    "ఎందుకు?"
    "మావాడు డాక్టరు...." అన్నాడు వేదాంతం.
    "డాక్టరా?" తెల్లబోయిందామే.
    'చాలా పెద్ద డాక్టరు ...."
    వృద్దురాలు భయంగా "వద్దు"  అంది.
    "ఒక్కసారి చూస్తాను....' అన్నాడు కులభూషణ్.
    "వద్దు...." అంది వృద్దురాలు మరింత భయంగా.
    ఆమె మాటలు వేదాంతానికి ఆశ్చర్యం కలిగించాయి --" ఒక్కసారి చూడ్డానికేం?" అన్నాడతను.
    "మా ఉళ్ళో ఓ వైద్యుడున్నాడు'. ఏ రోగానికైనా మందివ్వగలడు. ఆయనే మావారి పరిస్థితి చూసి తనవల్ల కాదని పట్నం డాక్టరు కొక్కసారి చూపించమని చెప్పాడు. వారిని కదిపే స్థితిలో లేరు. అందుకని డాక్టర్నిక్కడికి తీసుకుని వచ్చాం. అయన కార్లో వచ్చాడు. వారిని చూసాడు. ఏవో మందులు రాసిచ్చి నెల్లాళ్ళ తర్వాత మళ్ళీ వస్తానన్నాడు....' ఆమె ఆగింది.
    'ఆ మందులు పనిచేయలేదా?" అన్నాడు కులభూషణ్.
    "పని చేసాయి. వారిలో త్వరగా మార్పు వచ్చి కోలుకున్నారు, కానీ...."
    "ఊ" అన్నాడు వేదాంతం.
    ఆమె చెప్పడానికి తటపటయించింది.
    సరిగ్గా అప్పుడే సుబ్బారావు లోపల్నుంచి వస్తూ -- 'అమ్మ ఎలా చెబుతుంది లెండి?" అన్నాడు.
    "ఏం జరిగింది ?" అన్నాడు కులభూషణ్.
    "ఆ మందులకు ఎనిమిది వందల రూపాయలయింది. ఒక్కోసారి వచ్చి  చూసినందుకు డాక్టరుకు కారు ఖర్చుతో సహా అయిదు వందలయింది.... ఆ విషయమై చేసిన అప్పింకా తీరలేదు. అప్పట్నించి అమ్మకు -- పెద్ద డాక్టర్ని ఒక్కసారి పిలవాలన్నా భయమే!" అన్నాడతడు.
    వేదాంతం నిట్టూర్చాడు.
    కులభూషణ్ మాత్రం పేషెంటుని చూడాలని పట్టుబట్టాడు.
    "ఎందుకు మీకంత పట్టుదల? మీకిక్కడ ఫీజు దొరకదు ...." అన్నాడు సుబ్బారావు నిష్టూరంగా.
    "బాబూ....ఏదో పని మీద వచ్చారు. మీ పని మీరు చేసుకుని వెళ్ళండి. పోయే ప్రాణాన్నాపదానికి ఉన్న ప్రాణాలనిరుకున పెట్టలేము. ఒక్కగానొక్క నలుసు నాడికిద్దరు పిల్లలు. ఇంట్లో చిన్న మెత్తు బంగారం లేదు. ఉన్న ఇంటి మీద అప్పు. పూట గడవడమే కష్టంగా ఉంది. ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళం, కాయకష్టం చేయలేం. అడుక్కోలెం. మా యిబ్బందులోకరికి చెప్పుకోలెం. డాక్టరు దగ్గరికి వెళ్ళొచ్చు. డాక్టరు మందివ్వగలడు కానీ డబ్బివ్వ లేడు'. డాక్టరిచ్చే మందుకూ డబ్బు కావాలి. డాక్టరు దగ్గరకు వెళ్ళాడం వల్ల మా సమస్య తీరదు సరి కదా తగ్గే జబ్బును డబ్బు లేక ముదరబెట్టా మన్న బాధ , పోయే ప్రాణాన్ని డబ్బు లేక ఆపలేకపోయానున్న వ్యధ -- మమ్మల్ని వేధించటం మొదలెడుతాయి. డాక్టరు దగ్గరకు వెళ్ళకపోతే -- వెళ్ళలేదన్న బెంగ ఒక్కటే కలుగ్తుంది. దేవుడు కాపాడలేని ప్రాణాన్ని మనిషి కాపాదతాడా అని పరిపెట్టుకోవచ్చు.....
    "అమ్మా -- ఇక చాలు ...." అన్నాడు సుబ్బారావు.
    వృద్దురాలు తన ధోరణి ఆపి "రాత్రి భోం చేసి వెళ్ళండి బాబూ" అనేసి వెళ్ళిపోయింది లోపలికి.
    సుబ్బారావు మిత్రులిద్దరినీ సమీపించి -- 'మా అమ్మది చాదస్తం. ఒకసారి మొదలెడితే ధోరణి ఆగదు. ఏమీ అనుకోకండి -" అన్నాడు.
    "నేను మీ నాన్నగారిని చూడాలి -" అన్నాడు కులభూషణ్.
    "ఎందుకు?"
    "నేనో యింట్లో అడుగుపెట్టేక -- అ ఇంట్లో రోగి ఉంటె -- తప్పనిసరిగా చూసి తీరాలి . నేను డాక్టర్ని...."
    "కానీ..."
    "నేను డబ్బడగను. ఒక్కసారి రోగిని చూడనివ్వండి...."
    సుబ్బారావుతడిని ఓ గదిలోకి తీసుకుని వెళ్ళాడు.
    కుక్కి మంచం మీద పడుకుని ఉన్నాడో వృద్దుడు. మనిషి బాగా బక్కచిక్కి వున్నాడు.
    "ఎంత వయసుంటుంది మీ నాన్నగారికి ?"
    'అరవై వుంటాయేమో"
    'అరవై ఏళ్ళకిలాగై పోయారా ? డెబ్బై ఏళ్ళకు పరుగు పందాల్లో పాల్గొనే వారున్నారు తెలుసా?' అంటూ కులభూషణ్ అప్పటికప్పుడా వృద్దుడ్ని పరీక్షించాడు.
    వృద్దుడు స్పృహ లో లేడు. కులభూషణ్ పరీక్షిస్తుంటే మధ్యలో స్పృహ వచ్చి అప్రయత్నంగా చేతులు జోడించాడు.
    "తమరు పెద్దలు. నాకు నమస్కరించకూడదు " అన్నాడు కులభూషణ్.
    వృద్దుడు స్పష్టంగా ఏదో గొణిగాడు. కులభూషణ్ కర్ధం కాలేదు.
    అతడి పరీక్ష పూర్తీ కావడానికి ఇరవై నిమిషాలు పట్టింది.
    కులభూషణ్ సుబ్బారావును కొన్ని ప్రశ్నలు వేసి రోగి గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాడు.
    "మా నాన్న బ్రతుకుతాడా?" అన్నాడు సుబ్బారావు.
    కులభూషణ్ మాట్లాడలేదు.
    జవాబు గురించి సుబ్బారావు నొక్కించలేదు.
    కుల భూషణ్ అక్కణ్ణించి మండువాలోకి వచ్చాడు.
    "ఎలా ఉందాయన పరిస్థితి ?" అన్నాడు వేదాంతం.
    "మనమిప్పుడే బయల్దేరుదాం" అన్నాడు కులభూషణ్.
    "ఎక్కడికి?"
    "అడివిలోకి ...."
    "సుబ్బారావు - నువ్వు రెడీయేనా ?" అన్నాడు వేదాంతం.
    "నేను రెడీయే -- అమ్మ ఒప్పుకోదూ--"
    "ఒప్పించు"
    "అమ్మను ఒప్పించడం నాకు సాధ్యమైతే -- నాన్నను వ్రతికించుకోవడానికి నేను నన్ను కూడా అమ్ము కునేవాణ్ణి --" అన్నాడు సుబ్బారావు దీనంగా.
    "ఎంతో బలహీనంగా కనబడే స్త్రీ తల్లిగా -- అది బల మహాబలుల్ని కూడా శాసించగలదు" అనుకున్నాడు వేదాంతం.
    అప్పుడతడికి విశ్వనాద్ గుర్తుకు వచ్చాడు.
    తను మనవాతీతుడనుకున్న విశ్వనాద్ కూడా తల్లి అజ్ఞా కతీతుడు కాలేకపోయాడు.
    "లాభం లేదు భూషణ్! మన ప్రయాణం రేపుదయమే!" అన్నాడు వేదాంతం.
    కులభూషణ్ కి ఒప్పుకోక తప్పలేదు.
    ఆ రాత్రి వారాయింట బస చేసారు.
    సుబ్బారావు వారికి తన కుటుంబ గాధ చెప్పుకున్నాడు.
    తాత మంచితనం ఆస్తిని కరిగించింది. తండ్రి అమాయకత్వం ఉన్న కాస్తా పోగొట్టింది.
    ఆ ఊళ్ళో మకుటం లేని మహారాజు గనేయ్య.
    గనేయ్య ను కాదన్న వాళ్ళు మసైపోతారు. గనేయ్య కు విధేయులతడి బానిసలు. తన బానిసల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతున్నాడు గనేయ్య.
    సుబ్బారావు కుటుంబం గనేయ్యను కాదనలేదు కానీ అతడికింకా బానిసలు కాలేదు. అతడి బానిసలుగా మారితే ఇప్పుడున్న కష్టాలన్నీ తొలిగిపోతాయి. బానిసత్వం ప్రారంభమవుతుంది.
    "బానిసత్వమంటే?" అన్నాడు కులభూషణ్.
    "ఎక్కువ చెప్పను ఒకే ఒక్క ఉదాహరణ యిస్తాను - " అన్నాడు సుబ్బారావు. అప్పుడతడి శరీరం ఆవేశంతో వణికింది.
    వేదాంతం, కులభూషణ్ వినడానికి కుతూహలపడ్డారు.
    "రోజుకొక బానిస యింటి నుంచి -- ఒక స్త్రీ గనేయ్య ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళేం చెప్పినా చేసి రావాలి. పగలే కాదు-- రాత్రికి కూడా ఆమె అక్కడే ఉండిపోవాలి -"
    వేదాంతం కళ్ళర్రబడ్డాయి. "ఈ రోజుల్లో ఇంత దారుణమా?" అన్నాడతడు.
    "మేము ఆటవికుల కెంతో దూరంలో లేము ...." అన్నాడు సుబ్బారావు.
    కుల భూషణ్ కతడి మాటలు జీర్ణం కావడం లేదు.
    "ఇది గ్రామస్తులు సహిస్తున్నారా?' అన్నాడు వేదాంతం.
    "గనేయ్యకు బానిసలు కాని ఈ ఉళ్ళో పది కుటుంబాలున్నాయి. అంతా అష్టకష్టాలు పడుతున్నారు...."
    "మిగతా వాళ్ళు ?"
    "మా దురదృష్టం వారికీ గుణపాఠం!"
    "నాకిది నమ్మశక్యం కాకుండా ఉంది..." అన్నాడు వేదాంతం.
    'ఇందులో ఆశ్చర్యమేముంది? బానిసల సదుపాయాలూ బానిసలకున్నాయి-" అన్నాడు కులభూషణ్.
    అతడు చెప్పిన వివరాలు మిత్రులిద్దరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి.
    ఆ ఊరి ఆర్ధిక వ్యవస్థ గనేయ్య గుప్పుట్లో ఉంది.
    ఆ ఉళ్ళో కాకి అరవాలన్నా గనేయ్య అనుమతి కావాలి. కోయిల కూయలన్నా అతడి అనుమతి కావాలి. అందుకే కోయిలలా ఊరు వదలి వెళ్ళాయి. ఊరు వదలలేని కోయిలలు కూయడం మానేశాయి. కాకులు మాత్రం హాయిగా అరుస్తున్నాయి.
    అందరూ గనేయ్యకు బానిసలే! గనేయ్య వారిని బానిసలనడు. తనకు నమ్మకస్తులంటాడు. సదాచార పరాయణులంటాడు. ఉత్తము లంటాడు.
    ఉళ్ళో దుకాణాల్లో బానిసల కొకరేటు , కాని వారికొక రేటు    చాకలి బట్టలు వుతాకాలంటే బానిసల కోక రేటు, కాని వారికొక రేటు.
    ఎవరికైనా అప్పు కావాలంటే -- బానిసలకు వడ్డీ తక్కువ-- కానివారికి ఎక్కువ.
    ఉళ్ళో నేరాలు జరిగితే -- అందువల్ల బానిసలు నష్టపోతే గనేయ్య సాయపడతాడు. కాని వారింట దొంగతనం జరిగినా ఊరు పట్టించుకోదు.
    గనేయ్య బానిసల రక్తం పీలుస్తున్నాడు. వారిలో తిరిగి రక్తం పుంజుకునేందుకు పళ్ళు పాలు ఇస్తున్నాడు.
    బానిసలు కాని వారి రక్తం గనేయ్య పీల్చడం లేదు. అది దోమలకూ, జలగలకూ పోతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS