Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 36


    "ఆరూ!"
    "ఏం రఘూ?"
    "నాన్నగారికి నేను పదమూడు వేల రూపాయలు బాకీ ఉన్నాను ఆరూ."
    "కారు బాబతా?"
    'అవును."
    "తీర్చుకుందాం లే రఘూ. నేనూ సాయపదతాను. నాకా అధికారమూ హక్కూ ఉన్నాయి గా నీ మీద?"
    "సంపూర్ణంగా!"
    :థాంక్స్."
    "డబ్బు అన్నది చాలా చెడ్డది ఆరూ! ఈ డబ్బంతా నిన్ను పాడు చేసేస్తుందనుకున్నాను."
    "నన్నామాత్రం అర్ధం చేసుకోలేదా రఘూ?"
    "ఇప్పుడర్ధం  చేసుకున్నాను ఆరూ. నా అంతటి అదృష్ట వంతుడు ఈ ప్రపంచం లో లేడు!"
    "వెళదామా రఘూ?"
    "ఆరూ, నా ఆరూ!" -- ఆవేశాన్ని ఆపుకోలేక, అరుణ ను బిగి కౌగిట చేర్చాడు రఘు.
    "రఘు , మొద్దబ్బాయీ ...వదిలెయ్యి!"
    "నీవు కూడా నన్నో పిచ్చి వాడి కింద జమ కడతావనుకున్నాను ఆరూ. నీవు కూడా నా చెయ్యి వదులుతావను కున్నాను! నన్ను వెలివేస్తావనుకున్నాను!"
    "నీవు పిచ్చి వాడివి కావు రఘూ! హిమ పర్వతమంతటి మంచి మనసు కలవాడివి! అంత మంచితనం ఉన్నవాడికి కష్టాలే నొసట వ్రాసి ఉంటాయి రఘూ. మానవుడు పుట్టిందెందుకూ? జీవితంతో హోరా హోరీ గా యుద్ధం చెయ్యడానికేగా? అదృష్టం ఎక్కడా అంటే...కలిసి పోరాడడానికి నీకోసం నన్నూ .........నాకోసం నిన్నూ విధాత సృష్టించాడు!"
    "ఆ పేరు కలవాడు ఉన్నాడో లేడో కానీ ఒకవేళ ఉంటె ఆయనకివే నా కృతజ్ఞభి వందనాలు!"
    "మొద్దబ్బాయీ!"
    "పిచ్చి ఆరూ!"
    మళ్ళీ ఇద్దరూ ఒకరి ఎదలోని భావాలు మరొకరి ఎద పై ని ముద్రించుకు పోయేంత ఇదిగా బిగి కౌగిలి లో ముడి పడ్డారు. చిత్రం లో సేతుపతి అంతటి నీ చూస్తూ కూడా, ఉలకలేదు, పలకలేదు.

                                                              55
    రఘుపతి అలోచించి , తండ్రి సంపాదించిన లక్షల నన్నింటి నీ సద్వినియోగం చెయ్యవలసిన పద్ధతుల్ని గురించిన నిర్ణయాలకు వచ్చి, ఆ నిర్ణయాలన్నీ కార్యరూపం దాల్చి, ఫలితం జనం అనుభవించే నాటికి ఏడు సంవత్సరాలు గడిచాయి.
    రఘూ కు, అరుణ కూ ఇప్పుడు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సేతుపతి, చిన్నవాడు శంకర నారాయణ. అయిదు, మూడు సంవత్సరాల వయస్సు చిరంజీవులది!
    తొలుదొలుత ఎందరెందరో ఇంజనీర్లు, ఉద్యోగస్తులు , పెద్ద మనుషులూ తమ ఇంటికి తీర్ధ ప్రబగా రావటం చూచి చాముండేశ్వరి అడిగింది :
    "అరుణా, ఎందుకమ్మా ఇందరు వచ్చి పోతున్నారు? ఆయన బ్రతికి ఉండగా అంటుండేవారు , ఉన్న డబ్బు నంతటి నీ వినియోగించి అయిదారు బంగాళా లు కట్టించి, అద్దెల కిచ్చేస్తే ఏ గొడవా ఉండదని, అటువంటి దేమైనా చేస్తున్నారా?"    
    "లేదండీ అత్తయ్య గారూ. మామగారు ఎంత మంచివారు! ఎంత గొప్ప వారు! ఎంత పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించు కున్న వారు! అందుకని, అయన గారి పేరు చిర స్థాయిగా ఉండి పోడానికి, ఏదైనా సత్కార్యం చెడ్డా మను కుంటున్నాం."
    కన్నీరు కారుస్తూ -- "నా బంగారు తల్లీ, చేయించవే . వారు ఎంత అలోచించి ఆస్తి అంతా నీ పేర వ్రాశారో మరి! నీవే లేకపోతె , ఈపాటికి ఈ ఇల్లు గుల్లయిపోయేదమ్మా ఆరూ!" అంది చాముండేశ్వరి.
    అరుణ తనలో తాను విపరీతంగా బాధపడింది. అంతటికి ఎంత ఖర్చు అవుతుందని ఆమె అడిగితె, తాను చెప్పగల సమాధాన మేమిటి? సమస్తమూ పోతుందనా?
    కానీ చాముండేశ్వరి ఆ ప్రశ్న వెయ్యలేదు. అరుణ ఉందిగా? ఎంత తెలివి గలది? ఏమీ ఫరవాలేదు! ఆ పిల్లకు అన్నీ తెలుసు!' అదీ ఆమె ధీమా.
    స్కెచెస్ వచ్చాయి. బ్లూ ప్రింట్లు వచ్చాయి; అంచనాలు వచ్చాయి; ఒకటి కాదు; రెండు కాదు ఎన్నెన్నో! తేవాం పేటలోని 'స్లం' ఏరియా లో దాదాపు ఇరవై రెండు ఎకరాల్ని దానం చెయ్యడానికి కార్పోరేషన్ అంగీకరించింది. అక్కడ సేతుపతి గారి పేర బ్రహ్మాండ మైన ఒక వర్కర్స్ కాలనీ కట్టించారు. పెద్ద పార్కు నొకదాన్ని ఏర్పాటు చేశారు. దాని మద్యని , ఒకప్పుడు రఘు కలగన్నట్టు, ఒక పెద్ద భవంతి నిర్మించి, ఉన్నత పాథశాల కింద దాన్ని కేటాయించారు. ఒక్క మద్రాసు నగరంలోనే వర్కర్ల కాలనీలున్న చోట అయిదు ప్రసూతి కేంద్రాల్ని స్థాపించారు. ఆరోగ్య పరంలో ఒక పెద్ద బ్లాక్ నిర్మించి దానం చేశారు.
    ఇచ్చే దాత ఉండాలే గానీ.....ఆ దానం అవసరం లేని సంస్థ లెక్కడ ఉన్నాయి? ఎందరో వచ్చారు. అందరూ సేతుపతి గారి పేర ఏదో ఒకటి చేస్తామన్నారు. అందరి తోటీ సహకరించారు రఘు, అరుణ లు.
    సంవత్సరాలు గడిచే కొద్ది....ఈ పుణ్య దంపతుల ఫోటోలు ఇంట పెట్టుకొని, అందరు దేవతలతో పాటు వీరిని పూజించే పేదవారి సంఖ్యా ఎక్కువయింది.
    అంతా పోయింది. మెర్సిడేజ్ అమ్మేశారు. హిందూ స్తాన్ కారు అమ్మేశారు.
    "ఇదేం పిచ్చే అరుణా?" -- అంది చాముండేశ్వరి ఏమీ పాలుపోక.
    "పోనీలెండి అత్తయ్య గారూ. ,మనమేమన్నా వెంట బెట్టుకు వచ్చామా? వెంట బెట్టుకు పోతామా? ఉన్నదంతా మన ఇంటిలోనే ఉండి పోయి ఉంటె మీరూ, నేనూ, మీ అబ్బాయి గారూ, మా పిల్లలూ ఏదో అనుభవించే వాళ్ళం౧ అనుభవించడమంటే ఏమిటి? 'లక్షాధి కారైన లవణమన్నమె కాని, మెరుగు బంగారం తో మ్రింగ బోడు?' అన్నారు యోగీశ్వరులు. అదెంతటి సత్యం! ఇప్పుడు చూడండి; ఎన్ని వేల మంది మామయ్య గారి పేరు చెప్పు కుంటున్నారో! మేమేది చేసినా మామయ్య గారి ఆత్మ శాంతి కోసమే చేశాం."
    "అది నిజమేనే! రేపు పొద్దున్న పిల్లలెం బాముకుంటారు?"
    "నేనూ, మీ అబ్బాయి గారూ లేమా అత్తయ్యా, వాళ్ళ బాగోగులు చూడడానికి?"
    "ఎడిసినట్టే ఉంది. అది కాదే ఆరూ! నీకిదేం పిచ్చి? అయినా తప్పు నీది కాదులే! వాడిది! తియ్యతియ్యని కబుర్లు చెప్పి, బుట్టలో వేసుకుని వాడాడిస్తున్నాడు నిన్ను!"
    "దాని వల్ల వారికేం లాభం అత్తయ్యా?"
    "బిచ్చమెత్తుకొడం!"
    "ఆ అవసరం ఉండదు లెండి అత్తయ్యగారూ. మామయ్యగారూ నాకు చెప్పించిన చదువుంది. మీ అబ్బాయి గారు కూడా అసమర్ధుడెం కారు!"
    "అయన ఇన్నేళ్ళూ పాటుపడి ఇంత సంపాదించి పెట్టి పోయింది, కోడలు ఉద్యోగం చేసీ, కొడుకు చాకిరీ చేసీ వాళ్ళను వాళ్ళు పోషించు కోవాలనేనేమే?"
    "మానవులు శరీరాన్ని సోమరితనం పాలు చెయ్య రాదత్తయ్యా. కష్టపడి సంపాదించి , తమ బ్రతుకులు తాము బ్రతకడం లో ఉన్న తృప్తి , పెద్దలు సంపాదించినదాన్ని ఖర్చు పెడుతూ....ఖర్చులు చేస్తూ కాలం గడపడం లో ఉండదు."
    "అయ్యో, రామచంద్రా! జగద్రాక్షకా! ఈ వేదాంత మంతా మా ఒక్క కొంపలోనే కలగ జేశావెందుకు భగవంతుడా?"
    "మనం అందరి కంటే కాస్త ముందుగా మేకుకున్నానుండీ అత్తయ్య గారూ. అంతే!"
    "ఏమో తల్లీ, నాకేమీ అర్ధం కావడం లేదు. మీరు చేసినదంతా చెడు అనడానికి నోరు రావడం లేదు. మంచి అనడానికీ మనసొప్పడం లేదు!" -- అంతటితో ఆగిపోయింది ఆ అత్తాకోడళ్ళ సంవాదం.
    ఆంధ్ర మహిళా సభ వారు, సేతుపతి గారి పేర అనాధులకు ఆశ్రయం కల్పిస్తామంటే , ఆ ఇంటిని కూడా ఆ సంస్థ కు వ్రాసి ఇచ్చేశారు రఘు, అరుణలు.
    ఇక వారందరూ ఆ ఇల్లు వదిలి వెళ్ళే నాడు చూడండి! ఇంటి చుట్టూ తీర్ధ ప్రజ అయ్యారు. సేతుపతి గారిని , చముద్నేశ్వరి ని , రఘుని అరుణను..... వేనోళ్ళ పొగిడారు.
    చాముండేశ్వరి బావురుమని ఏడ్చింది. ఆ తల్లి హృదయం లో ఆరాటాన్ని అందరూ అర్ధం చేసుకున్నారు. ఎందరో ఆమె పాదాల మీద పడ్డారు. ఎన్ని నోములు నోచి ఆ తల్లి అంతటి సుపుత్రుడ్నీ కన్నదో అని.

                                *    *    *    *
    అన్ని వార్తా పత్రికలూ ఈ అబ్బురాన్ని గురించి వ్రాశాయి. అబ్బురం కాదా మరి?
    మన దగ్గిర ఉన్న ఒక్క కానీ దానం చెయ్యడానికి, మనలో ఎందరికో గాని మనసొప్పదు. ఈ ఇద్దరూ ....ఈ వయస్సులో ...ఇన్ని లక్షలు తమవయినా , ఎన్నో సుఖాల్నీ , భోగాల్నీ తరగని విధంగా తమని చేసుకోగలిగినా అన్నింటినీ త్యాగం చెయ్యడ మంటే , మాటలా మరి!
    త్యాగం చేసి, సన్యాసం పుచ్చుకున్నారా? లేదు, స్వశక్తి తో , జీవితమనే సంగ్రామం లో జయాన్ని సాధించడానికి కంకణం కట్టుకున్నారు.
    అరుణకు వారు కట్టించిన హైస్కూల్లో నే ఉపాధ్యాయిని ఉద్యోగం వచ్చింది. వెయ్యి కుటుంబాలు ఉండడానికి వీలుగా వారు కట్టించిన క్వార్టర్స్ లోనే ఆశ్రయం దొరికింది. అందులోకే అందరితో పాటు వెళ్ళారు. అక్కడే ఉన్నారు.
    తోలు దొలుత చాముండేశ్వరి కి ఆ చిన్న ఇంటిలో ఉండడమూ , ఆ లేని వారందరి మధ్య తామూ బ్రతకడమూ ....కంటక ప్రాయంగా ఉండేది . చెప్పుకోడానికి ఎవ్వరూ ఉండేవారు కాదు.
    అరుణ స్కూలుకు వెళ్ళేది . రఘు, ఉద్యోగమేమీ లేకపోవడం మూలాన్ని, ఎక్కడికి వెళ్లేవాడో మరి, వెళ్ళేవాడు. సేతుపతి కాన్వెంటు కి వెళ్ళేవాడు. శంకర నారాయణ మరీ పసివాడు. "తాతా....తంతా...." తెలుగు భాషలోని ఆ రెండు పదాలే వాడికి వచ్చు. అటువంటి వాడితో చాముండేశ్వరీ ఏమని మొర పెట్టుకుంటుంది? ఏమన్నా......."తాతా" అనేవాడు; లేకుంటే "తంతా " అనేవాడు! అందుకని తానె ఏవేవో ఆలోచనల్లో పడేది.
    "మన పెళ్లి జరిగిన నాటి నా స్థితి ఏమిటి? పాతిక రూపాయలు తెచ్చుకునే గుమస్తాను. నీ స్థితి ఏమిటి? నీ తలిదండ్రుల స్థితి ఏమిటి? ఆ తాటాకు పాక .......ఆ రెండు గేదెలూ.....ఆరు కోళ్ళూ"....సేతుపతి గారన్న ఆ మాటలన్నీ గుర్తుకు వచ్చేవి! చాముండేశ్వరి కన్నీరు తుడుచుకుని సేతుపతి గారి ఫొటోకు నమస్కారం పెట్టి, "కృష్ణా రామా" అంటూ ఉండిపోయేది. క్రమంగా ఆమె అసలు బాధపడడ,మె మానేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS