56
రఘు, సేతుపతి గారికి ఎంత పెద్ద సమస్యగా అగుపించాడో .....అరుణ కూ ఇప్పుడలానే అనిపించాడు. ఇన్నాళ్ళూ తన కొంగు పట్టుకుని తిరిగిన రఘు, ఈ ఇంటికి వచ్చిన తరవాత మారిపోయాడు. టిఫిన్ తీసుకుని, ప్రొద్దున్నే వెళ్లి పోయేవాడు. మళ్ళీ రాత్రి ఎనిమిదికో, తొమ్మిది కో దర్శనం ఇచ్చేవాడు.
"ఎక్కడికి వెళ్ళావు రఘూ, ప్రొద్దుటి నించీ?" -- అనేది అరుణ.
"నేనూ ఏదో ఒక ఉద్యోగం సంపాదించు కోవాలిగా? అందుకని, తిరుగుతున్నాను ఆరూ!"
"తిండీ ,తీర్ధమూ మానివేశా?"
డానికి సమాధానం ఇచ్చేవాడు కాదు రఘు.
ఒక్కోవారం పాతిక రూపాయలు తెచ్చి ఇచ్చేవాడు తన సంపాదన అని. ఒక్కోవారం పదే తెచ్చేవాడు. అది కూడా తేలేని వారం వచ్చిందంటే ....ఇక తహతహ లాడే పోయేవాడు. అరుణ గుండె కరిగి నీరై పోయేది, అతని బాధ చూచి.
"రఘూ, నీ మాటలన్నీ నేను విన్నానా లేదా?"
"విన్నావు."
"మరి, ణా మాట ఒక్కటి చెవిని పెట్టడం , నీకు ధర్మమా కాదా?"
"ధర్మమే. ఏం చెయ్యమంటావు , ఆరూ?"
"ఇలా బాధపడ్డం మాను. నా సంపాదన , నీ సంపాదన కాదా? వచ్చే రోజు వచ్చిందంటే , ఉద్యోగం దానంతట అదే వస్తుంది!"
"అలా అనుకుని, గోళ్ళు గిల్లుకుంటూ నేనింట్లో కూర్చోలేను ఆరూ."
"అయితే నీ ఇష్టం !" -- అని ఊరుకునేది అరుణ.
మళ్ళీ ఆమెను బుజ్జగించేవాడు; అరుణను మంచి ధోరణి లోకి తెచ్చుకోడానికి ప్రయత్నించేవాడు రఘు.
ఒకనాడు నూట రెండు, నూట మూడు డిగ్రీల జ్వరంతో తల్లడిల్లి పోతూ రాత్రి తొమ్మిది గంటలకు ఇల్లు చేరుకున్నాడు రఘు.
"రఘూ!"
"ఎందుకురా నాన్నా, అలా వణికి పోతున్నావు?" అంటూ చాముండేశ్వరి అతని నొసట చెయ్యి వేసింది.
"తల్లీ, అరుణా! పెనం మీది గింజలా పేలి పోతున్నాడే కుర్రాడు!" ఏడవకుండా ఉండలేక పోయింది ఆ తల్లి.
"అత్తయ్యా , ఏమీ ఫరవాలేదు. మీరూరు కొండి" అంటూ రఘును తీసుకు వెళ్లి, పడుకో బెట్టింది అరుణ.
"ఎక్కడికి వెళ్ళారూ పొద్దుటి నుంచీ?"
"..................."
"ఆ గుప్పిట్లో ఏమిటి?"
"కోప్పడకు ఆరూ! రెండు మూడు రోజుల నించీ ఏ పనీ చెయ్యలేదు . అందుకని విసుగేసింది. వండలూరు దగ్గర క్వారీలో కూలీలు కావాలంటే నేనూ వెళ్లాను. చిన్నతనం నించీ సుఖ పడ్డందుకు.....ఈ ఒక్క రోజూ కాయ కష్టం చేసేసరికి....చూశావా ఆరూ, ఎంత చేటు వచ్చిందో?"
"ఆ గుప్పిట్లో ఏమిటి?"
"కూలీ డబ్బులు........" అంటూ చూపించాడు.
రెండు ఒక్క రూపాయ నోట్లు రక్తంతో తడిసిపోయాయి. వేళ్ళ మధ్య నించీ రక్తం ఇంకా కారుతూనే ఉంది. చూడలేక అరుణ గోడు గోడుమని ఏడ్చింది.
"ఏమిటమ్మా అరుణా?"
"ఏమీ లేదు; మీరిక్కడే ఉండండి అత్తయ్య గారూ."
వేడినీళ్ళ లో కాస్త డెట్టాల్ కలిపి , గాయాల్ని కడుగుతూ -- "రఘూ, నామీదా.....మన పిల్లల మీదా ఒట్టు , ఇంకెప్పుడయినా ఇటువంటి కానిపని చేశావంటే! ఏ పిచ్చి కయినా, ఒక హద్దు, పద్దూ ఉంది. ఉండు, డాక్టర్ని తీసుకు వస్తాను" అంటూ అరుణ వెళ్ళిపోయింది.
డాక్టరు వచ్చాడు. పరీక్ష చేశాడు. ఏవో మందులూ, మాకులూ ఇచ్చాడు. రెండు -- మూడు రోజులు గడిచాక "టైఫాయిడ్" అన్నాడు. చేసేదేముంది? అప్పో సొప్పో చేసి, ఆ ఇరవై ఒక్క రోజులూ మండులిప్పించి , పద్యాలు పెట్టి, రఘుని మళ్ళీ మనిషిని చేసుకుంది అరుణ.
* * * *
రఘుకు ఇంకా పూర్తిగా స్వస్థత చిక్కలేదు . ఆనాడు తెల్లవారే సరికి ఇరవై, ముప్పై కార్లు వచ్చి, రఘు ఉంటూన్న బ్లాక్ ముందు ఆగాయి. అందరూ కూర్చోడానికి ఆ ఇంట కుర్చీలేవీ? అసలు చోటేది?
చాముండేశ్వరికి చేతులెత్తి మొక్కారు అందరూ. రఘును అమాంతంగా లేవదీసి, ఒకరి తరవాత ఒకరు కౌగలించు కొడం మొదలెట్టారు . రఘుకు ఏమీ అర్ధం కాలేదు.
"మరీ అంత అమాయికపు ముద్దలా అగుపడకయ్యా. కంగ్రాచ్యులేషన్స్! అమ్మా, మేమూ మొదట రఘును పిచ్చివాడనే అనుకున్నాం. రఘు గొప్పతనాన్ని ప్రపంచం వేలెత్తి చూపితే గానీ....మేమర్ధం చేసుకోలేక పోయాం. రఘూ, మీ నాన్నగారి తపస్సు ఫలించింది బాబూ!"
"అసలు ఏం జరిగిందండీ ? నాకేమీ అర్ధం కావడం లేదు!"
"భారత ప్రభుత్వం నీకు పద్మభూషణ్ బిరుదు ప్రసాదించిందయ్యా."
"అబద్దం ! ఇంపాజిబుల్!"
"చూడవయ్యా చిన్న దొరా!" అంటూ ఆవేళటి వార్తా పత్రిక చూపించారు.
'అత్తయ్యా!" అంటూ, అరుణ చాముండేశ్వరిని కౌగలించుకుని, ఆనందాతి రేకంతో అశ్రు దారాల్ని వర్షించింది.
"ఏం జరిగిందే ఆరూ?"
"జరగవలసిన మంచి అంతా జరిగిందండీ అత్తయ్య గారూ" అంటూ అరుణ ఏడుస్తూనే ఉంది.
హాల్లో.......రఘుకు అందరూ ఉద్యోగాలిచ్చేస్తున్నారు.
"నా కంపెనీ లో యాభై షేర్లూ , ఫ్రీగా ఇస్తానయ్యా! మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండడానికి ఒప్పుకో, కంపెనీ కారు, కంపెనీ బంగళా ...." ఇలా ఇరవై ఆఫర్లు వచ్చాయి రఘుకు. ఏదీ వద్దన్నాడు రఘు!
"నీకేదో ఒక ఉద్యోగం ఇవ్వనిదే ఇక్కణ్ణించి వెళ్ళం! ఇండస్ట్రియలిస్టు లం మేమంతా కలిసి సమ్మె చేస్తాం!"
"అయితే నా పాత ఉద్యోగం నా కిప్పించండి!"
"డన్ . నేను ఒప్పు కుంటున్నాను. ఇప్పుడు వ్రాసి ఇస్తాను అపాయింట్ మెంట్ ఆర్డర్"-- అన్నాడు రతన్ లాల్ సెట్.
అరుణ ఎలా సర్ది చేసిందో ....అందరికీ కాఫీలు తెచ్చింది.
"క్షమించండి . ఇంతమంది గొప్పవారు ఒక్క పెట్టున ఇలా వస్తే....మాలాంటి పేదవాళ్ళం ఏం మర్యాదలు చెయ్యగలం?"
"ఇక్కడికి రావడమే మాకు మర్యాద అమ్మా అరుణా. వేరు మర్యాదలు ప్రత్యేకంగా మాకేమీ చెయ్యక్కర్లేదు."
ఆనందాలు, అలా ఆ త్యాగ ధనుల జీవితాల్లో వెల్లి విరిశాయి.

57
ఆరునెలలు అలా గడిచాయి. పిల్లల అల్లరితో, అరుణ రఘులు ప్రేమలు ఒలక బోసుకోడంతో, చాముండేశ్వరి పొందుతున్న తృప్తితో ఆ ఇల్లే కాదు; ప్రపంచమంతా కూడా.....ఆనంద డోలికల్లో ఊయలలూగుతున్నట్టుంది ఆ కుటుంబానికి.
పండు వెన్నెలలను వెదజల్లుతున్న చందమామను కళ్ళ నింపుకుంటూ భార్య భర్తలు, మేడ పైని డాబా మీద పడుకుని ఉన్నారు. సేతుపతి , రఘు బొజ్జ మీద పడుకుని ఉన్నాడు; శంకర నారాయణ అరుణ ఎడ మీద అడ్డంగా పడుకుని నిద్ర పోతున్నాడు.
"ఆరూ........."
"ఊ."
"కడుపులో పాపాయి ఏమంటున్నాడు?"
"అంటున్నాడా? ఆశే పాపం!'నేను అమ్మాయినే అమ్మా, కట్నాలకూ కానుకలకూ ఇప్పటి నించే కూడబెట్టండి' అంటుంది!'
"........."
"రఘూ!"
"ఊ."
"జీవితంలో మానవుడు సంపాదించవలిసినదంతా ఒక రెండక్షరాల పదంలో ఇమిడి ఉంది . అదేమిటి?"
"ధనం."
"అబ్బే....."
"మరేమీటబ్బా? అయినా ఆరూ, పేదరికం రుచి చూచాక, ఇప్పుడు నా మనసు డబ్బు మీదికి మళ్ళు తుందేమిటి?"
"మంచిదేగా?"
"ఆ పదమేమిటి ఆరూ? నాకు తెలియలేదు. తెలియజేస్తే దాని కోసమే పాటు పడతా."
"తృప్తి."
"హుర్రే!"
మళ్ళీ మౌనంగానే ఒకరి భావాల్ని ఒకరు పంచుకుంటూ అలాగే పడుకున్నారు ఆ ఇద్దరూ.
"ఆరూ!"
"ఊ"
"జీవితంలో మనం ఏం సాధించాం?"
"సాధారణంగా మానవులు సాధించ లేనిదంతా మనం సాధించాం రఘూ."
"నీకు తృప్తిగా ఉందా?"
"సంపూర్ణంగా!"
"కార్లూ లేవనీ...నగలు లేవనీ......పట్టు చీరలు లేవనీ........"
"ఏ బాధ లేదు."
'ఆరూ!"
"ఊ?"
"నేను మన జీవిత చరిత్ర ఒక కధగా వ్రాస్తానే........."
"ఇదొక కొత్త పిచ్చా?"
"అవును. కధ వ్రాయగలను గానీ.....పేరెం పెట్టాలి -- అన్న సమస్యలో పడ్డాను."
"నే చెప్పనా?"
"ప్లీజ్!"
"రఘుపతి, సన్ ఆఫ్ సేతుపతి -- అని పెట్టండి."
"అబ్బే......."
"అంతకంటే మంచి టైటిల్ , మరేదైనా ఉందా మన కధకు?"
"ఉంది."
"ఏమిటది?"
"కరుణామయి అరుణ."
"శుభం!"
(సమాప్తం)
