Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 35


                                    53
    విధి ఒక చెంప మనల్ని నవ్విస్తూనే ఒక వంక ఏడిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ప్రతి క్షణాన ఎందరో పుడుతుంటారు; ఎందరో చస్తూంటారు. మేళగాళ్లు ' వినతాసుత వాహనుడై వెడలెను శ్రీ కంచి వరదుడు" అన్న పాట వాయిస్తూ నూతన వధూవరులను ఊరేగింపు తీసుకు వెళుతుంటారు! మరొక మేళ గాళ్ల జట్టు అదే పాట వాయిస్తూ శవాన్ని కాటికి సాగ నంపు తుంటుంది.
    "ఇదంతా ఏమిటి?' అని ప్రశ్నించుకునేటంత ఆస్కారం , అవకాశం అవసరం , వ్యవదీ మానవ మాత్రుల కు మనకేవ్వరికీ ఉండరు. మహర్షి గారన్నట్టు "నేనవర్ని?" అని, మనల్ని మనం పరిశోధించు కునే ఉద్దేశమే మనకు కలగదు. ఎప్పుడో కాని. అప్పటికి సంసార సాగరంలో పడి, ఈది, మునిగి, తేలాక ఇక రెక్క లాడని స్థితి అయి ఉంటుంది మానవునిది. అప్పుడు ఏమనుకుంటే ఏం లాభం? చేతులు కాలిన తరవాత ఆకులూ పట్టుకోడమే అవుతుంది.
    అరుణ ఆదేశం ప్రకారం అవసరమున్నదాని కంటే ఒక్క నిమిషం కూడా జాగు చెయ్యక బయలుదేరింది చాముండేశ్వరి . రైలు స్టేషన్ కు సమయానికి వచ్చింది. మద్రాసు సమయానికి చేరుకుంది. కానీ....పాపం, సేతుపతి గారే, ఈమె ఒక్కర్తే కోసం ఆగలేక పోయారు!
    ఆశ్చర్య పడవలసిన విషయ మేమిటంటే కిందరి రాత్రి దాదాపు పన్నెండు గంటల దాకా రఘు తండ్రి వద్దనే కాలం గడిపాడు. రాత్రి తొమ్మిది గంటలకు ఆ గదిలో అడుగు పెట్టిన వాడు నిజంగా అంతసేపూ అక్కడే ఉన్నాడు.
    "ఏం బాబూ, రాక రాక వచ్చావు? మళ్ళీ చూడాలనుకున్నా....నేను దొరుకుతానో , దొరకనో అనా?"
    "అబ్బే......"
    "కూర్చో రఘూ!"
    రఘూ కూర్చున్నాడు. మాట్లాడాలనీ అసలు ఉన్న విషయాలన్నీ అంటే తన ఊహల్ని, ఉద్దేశాల్ని, ఆశల్ని, ఆశయాల్ని , ఆకాశ హర్మ్యాల్ని అన్నింటినీ ఆనాడు తండ్రికి నివేదించుకుందామన్న ప్రయత్నం మీదే వచ్చాడు రఘు. కానీ, నోట మాట రాలేదు. ఊరికే తటపటాయిస్తున్నాడు.
    "రఘూ, నేనొక విషయం చెబుతాను నమ్ముతావా?"
    "ఎందుకు నమ్మనండీ?"
    "నాకు నీమీద కోపమన్నది లేనే లేదు బాబూ. నిన్ను గురించి నేనేనేదో కలలు గన్నా! అవన్నీ కల్లలయినాయి! నేను కుడికి వెళితే నీవు ఎడమకు వెళ్లావు. ఇక మనం కలుసుకునే దెక్కడ? అయ్యో, ఎంతదూరం నడిచినా......ణా కొడుకును నేను కలుసు కోలేక పోతున్నానే అన్న నిరాశ వల్ల, నిస్పృహ వల్ల బైటికి కాస్త ముభావంగా ఉంటూ వచ్చాను. లోపల హృదయం నిండా నీకోసం ప్రేమనే నింపుకుని కూర్చున్నాను. నీవు తప్ప మాకెవరున్నారు నాయనా? మాట్లాడు! ఫ్యాక్టరీ లకూ....వ్యాపారాలకూ , నాకూ సంబంధం ఉన్నంత వరకూ నేను ఇండస్ట్రియలిస్టు ను! నీవు లేబర్ లీదరువు!క్ ఇప్పుడేముంది? నాకా ఉద్యోగమూ, హోదా లేవుగా? కాబట్టి , తండ్రీ కొడుకుల్లా మనం, ఎంత ముచ్చటగా నైనా ,మాట్లాడు కోవచ్చు"
    "నేను నా కారు అమ్మే శానండీ!"
    "తెలిసింది బాబూ. అమ్మినప్పుడే , నీవు నాతొ ఆ విషయం చెప్పి ఉంటె నేనింత బాధ పడేవాణ్ణి కాను. ఆ నోటా, ఈ నోటా ఇటువంటి విషయాల్ని విని నిన్ను గురించి నేనెందుకు సతమత మవ్వాలి?"
    "తప్పు నాదేనండి. నా పెరట కొన్నా.....డబ్బు మీది, కారు మీది! దాన్ని అమ్మడానికి నాకే అధికారమూ లేదు. పదమూడు వేల కమ్మాను. నిజంగా ఆ మొత్తం నేను మీకు ఋణపడి ఉన్నాను. ఏదో ఒక విధంగా.....శ్రమించి చెమట ఓడ్చి, సంపాదించి మీ అప్పు తీర్చుకుంటాను!"
    "వెరీ గుడ్ , అలాగే బాబూ! తీర్చుకో! అది చెప్పడాని కెనా ఇంత తికమక పడ్డావు? ఇప్పుడెం చేస్తున్నావు?"
    "చెయ్యడానికి ఏ ఉద్యోగమూ దొరకడం లేదండీ. అయినా ప్రయత్నిస్తూనే ఉన్నాను౧"
    "గుడ్! వెరీ గుడ్!" అలా అన్నారే గానీ......సేతుపతి గారి గుండె పైపైకి ప్రయాణం చేసి వచ్చి, గొంతులో కూర్చునే దానిలా ఉంది!
    "మీ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది నాన్నగారూ?"
    ఇక సేతుపతి గారు ఆగలేక పోయారు! గిలగిల లాడి పోవలసిన వాడే! వల్లమాలిన ప్రయత్నం చేసి, మామూలుగానే "బాగానే ఉంది రఘూ"అనగాలిగారాయన.
    "మరి నేను సెలవు తీసుకుంటానండి నాన్నగారూ. నాయర్ తో చెప్పి , హార్లిక్స్ గానీ, పాలు గానీ పంప మన్నారా?"
    "పంపించు తండ్రీ!"
    "వస్తాను నాన్నా! గుడ్ నైట్."
    "గుడ్ లక్! గుడ్ బై రఘూ" అన్నారు సేతుపతి, జరగనున్నది తెలిసిన వాడిలా. రఘు వెళ్ళిపోయాడు.
    ఇక ప్రారంభ మయింది సేతుపతి గారి జీవన్మరణ సమస్య. సమస్య కాదది, సమరం! యుద్ధం చేశారు! ఓడిపోయారు!
    హార్లిక్స్ కలుపుకుని వచ్చిన నాయర్ , కెవ్వున కేక వేశాడు. అందరూ ఆ గదిలో పోగయ్యారు. లబలబా మొత్తుకున్నారు. చాముండేశ్వరికి వైర్ ఇచ్చారు. రంగయ్య చౌదరికి ట్రంక్ కాల్ చేశారు.
    ఒక గంట , రెండు గంటల తేడాలో అందరూ ఆ ఇల్లు చేరుకున్నారు. రాత్రి జరిగిన దాన్నంతటిని రఘు ద్వారా విన్నారు. మద్రాసు నగరమంతా హాజరయింది సేతుపతి గారి అంత్యక్రియలకు. గవర్నరూ, ముఖ్యమంత్రి , మేయరూ, మొదలయిన వారందరూ స్వయంగా రఘూను చాముండేశ్వరి నీ సముదాయించి వెళ్ళారు. అంతటి గొప్పవాడు సేతుపతి. అయన హయాం అలా ముగిసింది.

                                     54
    జరగవలసిన కర్మలు సక్రమంగా చేయవలసింది రఘెగా? ఒక వైపు ప్రయత్నాలన్నీ బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయి. ఒక్కొక్క ప్రయత్నాన్నీ గమనించి నప్పుడల్లా , రఘుకు సుందరం తండ్రీ చావూ, ఆ తండ్రిని కాటికి సాగనంపడానికి సుందరం బిచ్చ మెత్తిన తీరూ గుర్తుకు వస్తున్నాయి. ఇందరు తన తండ్రిని గురించి ఇన్ని పాట్లు పడుతుంటే , జరిగే పనుల్లో ఏ ఒక్కటీ తన మనసుకు నచ్చక పోయినా రఘు మౌనంగానే ఉండిపోయాడు.
    గోదానం, భూదానం , స్వర్ణ దానం, సంతర్పణ లూ, సభావనలూ అందరూ "ఆహా" అంటే, ఓహో" అన్నారు. 'చావంటే అదీ చావు! ఎంత పుణ్యం చేసుకుని ఉంటె, అంత మంచి చావు లభిస్తుందీ మానవునికి? ఇంకేంతెంత పుణ్యం చేసుకుని ఉంటె కర్మలు శాస్త్రోక్తంగా అంత సక్రమంగా జరుగుతాయి?' అనుకున్నారు.
    అంతా అయిపొయింది. సేతుపతి గారు స్మృతి పధం లోనే నిలిచిపోయారు. ఒక్క రంగయ్య చౌదరి తప్ప, మిగిలిన అప్తులూ , బంధువులూ అందరూ ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు. అప్పుడు చెప్పాడు సంబంధం "అయ్యగారి లాయర్లు మీతో మాట్లాడాలని వచ్చారమ్మా!" అని.
    "రమ్మను నాయనా, పోయిన వారితో పోలేక పోవడం ణా దురదృష్టం!" అంది చాముండేశ్వరి. వారి తలపు వచ్చినప్పుడల్లా పాపం ఆమెకు దుఃఖం కలగక మానడం లేదు.
    "ఊరుకోండి అత్తయ్య గారూ, ఊరుకోండి."
    లాయర్లు వచ్చి సేతుపతిగారి వీలునామా చదివి వినిపించారు.మొదలు నరికిన చెట్టులా అరుణ కూలబడి పోయింది. రఘులో అసలు చలనం లేదు. చాముండేశ్వరి తన బాధ తాను పడుతుంది. రంగయ్య చౌదరి తన చెవుల్ని తానె నమ్మలేక పోయాడు. సేతుపతి గారు సమస్తాన్నీ అరుణ పేరిట వ్రాసి వెళ్ళిపోయారు. అరుణ ఆవేశాన్ని ఆపుకోలేక ఏడ్చింది.
    ఏడుస్తూనే "ఇదెక్కడి ప్రేమ? నేనెవర్ని? వారెవరు? ఇంతటి భారాన్ని నేను వహించి , సహించి, బతికి బాగుపడతానని అయన ఎలా అనుకున్నారు? నావల్ల కాదు. చౌదరి గారూ, అంతటినీ నేను రఘు కు వ్రాసి ఇస్తాను. ఆ పాత్రం వ్రాయించే ఏర్పాటు చెయ్యండి!" అంది.
    "అమ్మా! తమరికి కూడా సేతుపతి గారు ఒక ఉత్తరం వ్రాసి, ఉంచారు. దాన్ని మీరు తప్ప మరెవ్వరూ చదవరాదని ఆదేశించి పోయారు"-- అన్నాడు. సేతుపతి గారి లాయర్ల లో ఒకడు.
    సీటు వేసి ఉన్న ఆ కవరు అరుణ అందుకుంది. అందరి ఎదటా ఇప్పుడున్న పరిస్థితిలో అరుణ దాన్ని ఎలా చదువుకో గలదు? మేడ మీదికి పరుగు తీసింది అరుణ.
    సేతుపతిగారి గదిలో అడుగు పెట్టింది అరుణ. ఒక పెద్ద ఫోటో...... సేతుపతి గారిదే; సేతుపతి గారంతటిది కూడా. ఎదురుగా ఉంది. నిన్న, మొన్న వేసిన మాలల ఇంకా వాదిపోలేదు. పరిమళాల్ని వెదజల్లు తూనే ఉన్నాయి అవి. అగరువత్తుల పొగ గదిలో అంతటా వ్యాపించి ఉంది. అంతా మసక మసకగా ఉంది. అదో కలలా అగు పడుతుంది. అరుణకు. వెళ్లి సేతుపతి గారి పాదాలకు మొక్కింది.
    "మామయ్యగారూ, మీరు నాకింత అన్యాయాన్ని ఎందుకు చేశారు? లోకం ఏమను కుంటుంది? నేనీ భారాన్ని భరించలేను మామయ్య గారూ! మీ ఆశయాలు నాకు తెలుసు! కానీ, రఘును నాశనం చేసి నేను మీ ఆశయాల్ని నిలబెట్ట లేను' అనుకుంటూ , అసలు కవరు విప్పకుండానే వేయి విధాల వాపోయింది అరుణ.
    కవరు మీద "చిరంజీవి సౌభాగ్యవతి అరుణ కు" అని వ్రాసి ఉంది. అంత బాధలోనూ అరుణ కు సేతుపతి గారిని తలచుకొని నవ్వుకోవాలని పించింది.లేకపోతె"సౌభాగ్యవతి" ఏమిటి?
    'అవునులే , ఏనాడయినా ముద్దు ముద్దుగా సిగ్గుపడుతూ తొలుదొలుత ఆయన్ని "మామయ్యగారూ" అన్నానో....ఆనాడే నేనాయన గారి కోడలి నయ్యాను! ఆనాడే సౌభాగ్య వతినయి ఉంటాను అయన గారి దృష్టి లో" అనుకుంది . కవరు విప్పింది.
    "అమ్మా, అరుణా , పేదవారు రోగాల వల్ల చస్తారు. పెద్దవారు హృద్రోగాల వల్ల చస్తారు. నాకు నిజంగా భయం వేసింది. ఏ క్షణాన నేను పోతానో అని. నా కోసం కాదు! నీ కోసం! నా వంశం  కోసం! నీ వల్లనే నా వంశం నిలవాలి. రఘు చేతికి ఇంత డబ్బు ఒక్కసారి వస్తే, వాడేవరికి దక్కడు! చెయ్యదలుచుకున్న సత్కార్యాలన్నీ చేసి, చివరికి పిచ్చి పట్టి చస్తాడు!
    "డబ్బు మీద నాకూ మోజు లేదమ్మా! నేను దానధర్మాలు చెయ్యలేదా? దేనికయినా ఒక పద్దతి ఉంది. ఎస్.ఎస్.ఎల్.సి చదివాను. నెలకు ఇరవై అయిదు రూపాయల జీతం మీద గుమస్తా గా కుదిరాను. చండిని పెళ్ళాడాను. రఘు మాకు కలిగినప్పుడు నాకు నెలనెలా ముప్పై అయిదు రూపాయలు వచ్చేవి! ఈ అదృష్టం అంతా వాడిది. వాడి అదృష్టాన్ని అంతటినీ నే అనుభవించాను. నేను పోయాక, వాడికేం మిగులుతుంది?
    "అందుకని, నీవే వాడికి దిక్కు. నీవే వాణ్ణి కాపాడ గలవు. కాపాడు.
    "హృదయ పూర్వకంగా మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తున్నాను.

                                                                                       -- నీ మామయ్య."
    అరుణ అంతా చదివింది. మళ్ళీ మళ్ళీ చదివిందే చదివింది! సాక్షాత్కరించిన సర్వేశ్వరుణ్ణి భక్తుడు కళ్ళలో నిమ్పుకున్నట్టు ,అరుణ సేతుపతి గారి బొమ్మనే తదేకధ్యానంతో చూస్తూ అలాగే ఉండిపోయింది ఎంతోసేపు.
    'ఆరూ!"
    అరుణ ఇక్కడ ఉంటేగా? సేతుపతి గారి మనో భావాల్ని అర్ధం చేసుకోడమన్న తపస్సు లో నిమగ్ను రాలై , లీనమై పోయి ఉంది ఆ లలన. రఘు ఆమె భుజాన్ని తట్టి "ఆరూ! ఆరూ!" అంటూ మరీ మరీ హెచ్చించాడు.
    "ఆ?"
    "లాయర్లు వెళ్లి పోతామంతున్నారు ఆరూ!"
    "రఘూ , నాన్నగారూ వ్రాసి పోయిన వీలునామా చదవగా నీవూ విన్నావుగా?"
    "విన్నాను! చాలామంచి పని చేశారు ఆరూ. అయన మహా మేధావి! ఎంతో అలోచించి గానీ, ఏ పనీ చెయ్యరు. నిన్ను పెత్తన దారుగా వదిలి వెళ్ళారని నేను బాధ పడుతున్నాననే కదూ నీ సందేహం? నన్నా మాత్రం అర్ధం చేసుకోలేవా ఆరూ?"
    "ఎందు కర్ధం చేసుకోలేను రఘూ? నేనొకటి అడుగుతాను. నిజం చెప్పు. నాన్నగారి ఈ డబ్బంతా నీ చేతికే వచ్చిందనుకో! ఏం చేసేవాడివి?"    
    "డబ్బంటే ...లక్షా, రెండు లక్షలా ఆరూ? ఇంత డబ్బు! కాస్త అలోచించి గానీ చెప్పలేను. ఇంత డబ్బు నిజంగా నా చేతుల్లో ఉంటె ఏం చేసేవాడినో!"
    "సరే ఆలోచించే చెప్పు. ఈ డబ్బు మీద నాకే అధికారమూ లేదు. నీ ఇష్ట ప్రకారమే దీన్ని అంతటినీ ఖర్చుపెడదాం!సరేనా?"
    "ఖర్చు పెట్టేసి వెయ్యడమే మంచిది ఆరూ! ఈ డబ్బు మనం సంపాదించింది కాదు. కానప్పుడు , దాన్ని మనకోసం వినియోగించు కొడం ఆత్మ వంచన చేసుకోడమే అవుతుంది. మనకేం కాళ్ళూ, చేతులూ లేవా? సంపాదించుకునే శక్తి లేదా? నాన్నగారి ఈ డబ్బుతో అయన పేరు శాశ్వతంగా ఉండిపోయేలా ఏదైనా పెద్ద ప్రణాళిక వేసి అమలులో పెడితే మన జీవితాలు నిజంగా సార్ధక మవుతాయి ఆరూ!"
    "అలానే చేద్దాం రఘూ. నాన్నగారు ఇక్కడే ఉన్నారు. నమస్కరించు. ఇక ఈ గది నుండి బైట పడదాం."
    ఇద్దరూ సేతుపతి గారి చాయా చిత్రానికి సాగిలపడి మొక్కారు. లేచి బయలు దేరారు. పోతూన్న వాడు రఘు ఆగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS