"బొబ్బిలివారిని బంటుమానా అడగాలన్నా శ్రీకాకుళం రాజ ప్రతి నిధులకు గుండె చాలదని యెంతోకాలంగా వింటున్నాను. అదీ బొబ్బిలి కాదండీ- పులి గడ్డ. వెలమవారి కీర్తిపతాకమే బొబ్బిలి" అంటూ వర్ణించటం ప్రారంభించాడు రామరాయుడు.
"మేము కార్యార్దులమై వచ్చినవాళ్ళం" అంటూ హెచ్చరిక చేశాడు యినుగంటి నరసారాయుడు. ఆయన మేధావి.
అంతటితో మాటలు ఆపి రాజగురువును రావలసిందిగా వార్త పంపారు రామరాయుడు రాజగురువు వచ్చారు. ఆయనే పురోహితుడు కూడ. ఆయన గదిలో కాలు పెట్టగానే వెలమప్రభువులు లేచి నిలబడ్డారు.
"ఇందరు వెలమదొరల్ని ఒకచోట చూడటంనించి యీరోజు నాకు పండుగే అయింది. యిటువంటి అపూర్వమయిన కలయికల గురించి గురువుగారు చెప్తూ వుండేవారు యెంతో ఆసక్తిగా వినేవాళ్ళం. యిప్పుడు యీ సమావేశం చూడటానికి రెండు కళ్ళు చాలటల్లేదు" అన్నాడు పురోహితుడు తన కుర్చీలో కూర్చుంటూ.
అందరూ కూర్చున్నారు.
వెలమదొరలంతా ఒకరి ముఖాలొకరు చూచుకుని నవ్వుకున్నారు. నిండయిన ఆ నవ్వులతో ఆ గదిలోనే పున్నమి పొడిచిందా అన్నట్లుంది.
"రాచబిడ్డలకు వివాహం సంకల్పించాము. వధువు రామరాయుడు పెద్దకూతురు సౌభాగ్యవతి మల్లమ్మ. వరుడు బొబ్బిలి ప్రభువు గోపాల కృష్ణ రంగారావు. లగ్నం జరుపుకోవటానికి ముహూర్తం నిశ్చయించండి" అని సరసారాయుడు తీరయిన రీతితో తన అభ్యర్ధన వినిపించాడు.
"నా పెద్దకూతురు మల్లమ్మను బొబ్బిలి ప్రభువుకు యిచ్చి పెళ్ళి చేయాలి ముహూర్తం చెప్పండి" అంటూ సాంప్రదాయం నెరవేర్చుకున్నాడు రామరాయుడు.
ఇదంతా కేవలం తంతు కోసమే! రాచవారింట పెళ్ళి అనగానే పురోహితుడు పొంగిపోయినాడు. రాచకులానికి, రాచ కుటుంబానికి పురోహితుడే కదా శ్రేయః కామికూడ.
ఆయన పెళ్ళిముహూర్తం ముందుగానే చూచి వచ్చాడు. తిధి, వారమూ, నక్షత్రమూ, యోగమూ, కరణమూ గుణించాడు పంచాంగాలతో కాస్సేపు పల్లటీలు కొట్టి, కుస్తీ పట్టి చివరికి గణితం పూర్తిచేశాడాయన.
వసంతారంభంలో చైత్రపూర్ణిమకు ముందుగా (అయిదురోజులు) దశమినాడు మిధునలగ్నంలో ముహూర్తం కుదిరింది. వుదయకాలంలో ముహూర్తం "యీ లగ్నం తప్పితే యీ జాతకులకు మళ్ళీ ముహూర్తం కష్టమే!" అని వివరించాడు పురోహితుడు.
ఇనుగంటి నరసరాయుడు ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగలడు.
"ముహూర్తంలో యేపాటి చిన్నలోటు వున్నా ముందుగానే శెలవిప్పించండి" అంటూ పురోహితుల వారిముందు కుండ బ్రద్దలు కొట్టినట్టు అడిగాడు.
"ఖచ్చితమయిన ముహూర్తం కుదిరి శకకర్త శాలివాహనుడు పుట్టాలంటే- అటువంటి ముహూర్తాలు నూరు సంవత్సరాలకు ఒకటికూడా వుండవు. సర్దుకుపోవటం తప్పనిసరి. అన్నీ బాగానే వున్నాయికాని ఆ ముహూర్తానికి అభ్యంతరం కాదు కాని శుభలక్షణంకూడా కాదు. యీ ఒక్క చిన్నలోటు మినహాయించి చూస్తే యిటువంటి ముహూర్తం దొరకటం కష్టం. యీ ముహూర్తం దివ్యమయినది. శుభం" అంటూ తన వాదాన్ని ముగించాడు పురోహితుడు.
"జన్మశని యెన్నినాళ్ళుంటుంది?" అని ప్రశ్నించాడు యినుగంటి నరసారాయుడు.
"ఏడేళ్ళుంటుంది. యీ యేడు సంవత్సరాలలో యెప్పుడు వివాహం చెయ్యాలన్నా యీ అభ్యంతరం వుండేదే! కాబట్టి పెళ్ళి యిప్పుడు జరిపించటమే వుత్తమం. లేకపోతే శాంతికోసం సింహాసనం నృసింహస్వామికి పూజలు జరిపించండి. మరొక పనికూడా చేస్తే బాగుంటుంది. బొబ్బిలి కోటలో మల్లమ్మదేవి పేరుమీదుగా గోపాలస్వామి ఆలయం కట్టించండి. గోపాలస్వామి మల్లమ్మకు యిష్టదైవం ఆలయం కోటలోనే వుంటే అన్ని అశుభాలనించీ కుటుంబాన్ని కాపాడుతుంది"అని సలహా యిచ్చాడు పురోహితుడు.
ధర్మారాయుడు ఆలోచించాడు. పురోహితుడు చెప్పినట్లు యీ మాత్రం లోటులేకుండా ముహూర్తాలు దొరకవు. అసలు జన్మ శనికీ పెళ్ళి ముహూర్తానికి పొంతన పెట్టుకోకూడదు. జన్మ శని వ్యక్తిగత సమస్య. పెళ్ళికి సంబంధించినంతవరకే ముహూర్తం అన్వయిస్తుంది.
"నరసారాయుడుగారు! యీ ముహూర్తం వంటివి యింకా వున్నా యంటారా?" అని ధర్మారాయుడు అడిగాడు. అది పురోహితులవారిని అడగవలసిన ప్రశ్న. ఆప్రశ్న నరసారయుడు ముందుంచారంటే అందులో అర్ధముంది.
ఆ అర్ధాన్ని నరసారాయుడు యిట్టే గ్రహించగలడు.
"నిజమే! పురోహితులు చెప్పినట్టు ఖచ్చితమయిన ముహూర్తం దొరికి శక కర్త శాలివాహనుడు పుట్టాలంటే నూరు సంవత్సరాలకుకూడా అటువంటి ముహూర్తం దొరకదు కదా" అంటూ తన అభిప్రాయాన్ని తెలియచేశాడు.
ఆ సంభాషణని అర్ధం చేసుకున్న రామరాయుడు పొంగిపోయినాడు.
"మీరు ఆజ్ఞయిస్తే యీ ముహూర్తమే నిశ్చయం చేయిస్తాను" అంటూ పెద్దల ఆజ్ఞకోసం అర్ధించాడు రామరాయుడు.
పెద్దలిద్దరూ ఆజ్ఞ యిచ్చారు తాటి ఆకులకు పసుపు కావాల్సి వచ్చింది. తాటి ఆకులమీద గంటలతో లగ్నపత్రికలు వ్రాయాలంటే ముందుగా ఆకులకు పసుపు రాసి వాటిని పవిత్రం చెయ్యాలి.
"రవ్వంత పసుపు తెప్పించండి" అని అడిగాడు పురోహితుడు.
తలుపు చాటున పసుపుబరిణి పుచ్చుకుని సిద్దంగా వుంది జగ్గమాంబ పురోహితులవారి నోటివెంట మాట రావటం యేమిటి రివ్వున బరిణె తెచ్చి వాళ్ళముందు పెట్టింది.
అప్పటికి యింకా రామరాయుడు పసుపుకోసం కబురు పంపలేదు. పసుపు బరిణ రావటం ఆయనకీ ఆశ్చర్యమయింది. గుబురుమీసాల చాటునించి నవ్వుకున్నాడాయన. ఆడపిల్లలకు యిటువంటి సంగతులు యెవరూ నేర్పనక్కరలేదు. యెక్కడో చూస్తారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు.
