"పోనీయండి ఉండిపోయారు కదా."
"కారు బాగు చేయించుకోస్తానని కారు డ్రైవర్ వెళ్ళాడు. ఓ మూడు గంటల్లో వచ్చేస్తాడు. " చెప్పింది కృష్ణ నందన.
అయిదు నిమిషాల సేపు ఎవరూ మాట్లాడుకోలేదు.
"వెన్నెల్లో ఇలా ఏటి ఒడ్డున కూర్చోవాలని, ఎన్నాళ్ళగానో అనుకుంటుండేదాన్ని. ఇవాళ ------ఆ కోరిక తీరింది. వెన్నెల ఇంత బాగుంటుందని ఇవాళే తెల్సింది. ఎంత బాగుందో కదూ, వెన్నెల " ఆకాశం వేపు చూస్తూ అంది కృష్ణనందన.
విమల్ మాట్లాడలేదు.
"వెన్నెల మీకే నచ్చలేదా....." కాసేపయ్యాక అడిగింది కృష్ణ నందన.
"వెన్నెల ఎందుకు నచ్చదు.....మీలాంటి అందమైన అమ్మాయి పక్కనున్నప్పుడు వెన్నెల ఇంకా బాగుంటుంది" నవ్వుతూ అన్నాడు విమల్.
ఆ మాటకు విమల్ ముఖంలోకి పరిశీలనగా చూసింది కృష్ణ నందన.
రివ్వు రివ్వున గాలివీస్తోంది.
"వర్షం పడుతుందేమో........" భయంగా అంది కృష్ణనందన.
"అటు వెన్నెల.....ఇటు వర్షం.......రెండూ ఒకేసారి బాగుంటాయి కదూ" అన్నాడు విమల్.
"అవునూ ఒకపక్క ఎండ, ఇంకోపక్క వర్షం వస్తే హరివిల్లు వస్తుంది కదా. ఇప్పుడు వెన్నెల, వర్షం ఒకేసారి వస్తే ఎమోస్తుంది?" ప్రశ్నించింది కృష్ణనందన.
"అబద్దం చెప్పమంటారా..........నిజం చెప్పమంటారా?"
"ఈ సమయంలో ఎవరూ అబద్దం చెప్పరు కదా"
"అయితే ....వినండి .....వెన్నెల, వర్షం రెండూ ఒకేసారి వస్తే అక్కడ ఓ అబ్బాయి, ఓ అమ్మాయి వుంటే ప్రేమ పుడుతుంది."
ఆ మాటకు నవ్వింది కృష్ణ నందన నందివర్ధనంలా.
"మీ ఇమాజినేషన్ బాగుంది. కానీ మనిద్దరం ఇప్పుడు ప్రేమించుకోవాలా....." మళ్ళీ నవ్వింది కృష్ణనందన.
గాలికి కృష్ణ నందన జలపాతం లాంటి జుత్తు ఎగురుతోంది. దానిని సర్దుకునే ప్రయత్నంలో ----
పైట ఎగిరి విమల్ వడిలో పడింది.
దానిని తీసి ఆమె చేతికి అందిచ్చే సమయంలో విమల్ మునివేళ్ళు కృష్ణ నందన వేళ్ళకు తగిలాయి.
సరిగ్గా ఆ సమయంలో ఆ వెళ్ళ మీద వెన్నెల్లో తడిసిన చినుకు చుక్క పడింది,
ఆ తర్వాత వరసగా చినుకులు ..........
' ఈ చినుకులు వర్షంగా మారితే ......" అటూ ఇటూ చూస్తూ అన్నాడు విమల్.
"పడనీయండి .......వెన్నెల వర్షంలో రోజూ తడవం కదా......' తమకంగా ఏటి వేపు చూస్తూ అంది కృష్ణ నందన.
* * * *
గలగల ఏవో నవ్వుల దొంతరల చప్పుడు వినబడటంతో తలతిప్పి చూసాడు విమల్.
దూరంగా అమ్మాయిలు-------కాలేజీ అమ్మాయిల్లా వున్నారు ---రోడ్డు పక్కన బూడిద రంగు మారుతీ వ్యాన్ ఆగి వుంది.
కృష్ణ నందన జ్ఞాపకాలలోంచి ఒక్కసాటి బయటికొచ్చాడు.
నీళ్ళల్లో అరికాలు పాదాలు ముంచుతూ, ఒడ్డు నున్న గవ్వల్ని ఏరుకుంటూ, నీళ్ళు విసురుకుంటూ అటూ ఇటూ పరిగెడుతున్న అమ్మాయిలు .
వాళ్ళు విమల్ కు ఇరవై అడుగుల దూరంలో కొచ్చారు.
సరిగ్గా -----
ఆ సమయంలో , ఆ అమ్మాయిల్లో ఓ అమ్మాయి విమల్ ని చూసి "హీరో విమల్ లా వున్నాడే" అంటూ పరుగు, పరుగున రాతిరధం దగ్గర కొచ్చి ,
"హలో ......విమల్ సాబ్......హౌ అర్యు.......' అని పలకరించింది.
ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది విమల్ కి.
జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.
"ఏం సార్ .....అలా చూస్తారు........మీ జ్ఞాపకశక్తి ఇంత తక్కువా? నిన్న మనం కలిశాం..గుర్తులేదా....."
ఇప్పుడు సడన్ గా విమల్ కి గుర్తుకొచ్చింది.
నిన్న సుజన్ మిత్ర పార్టీలో కల్సిన కాలేజీ అమ్మాయిల్లో , ఆ అమ్మాయి కూడా వుందని.
"జ్వలన కదూ' నెమ్మదిగా అన్నాడు విమల్.
ఆ మాటకి పొంగిపోయింది జ్వలన.
"ఏవిటలా ఇక్కడున్నారు, ముళ్ళగులాబిలో భగ్న ప్రేమికుడిగా ఎంత గొప్పగా యాక్టు చేసారు. అంత గొప్పగా యాక్టు చెయ్యడానికి మీ ఇన్సిరేషన్ ఏంటి సార్........చెప్పండి సార్......." జ్వలన విమల్ ని ఆపాద మస్తకం చూస్తూ, ఎక్సయింటింగ్ గా అంది.
"ఇన్ స్పిరేషన్ ఏంటి........సార్ ......లవ్ లో ఫెయిలై వుంటారు......అవునా సార్." పక్కనున్న ఇంకో అమ్మాయి చలాకీగా , హుషారుగా అంది.
"ఏం బేబీ......నువ్వు సినిమా జర్నలిస్టువా......" నవ్వుతూ అడిగాడు విమల్.
"స్టార్ సీక్రెట్ లైఫ్ రివీల్ చెయ్యడానికి ఇవాళా రేపు సినిమా జర్నలిస్టులే అక్కర్లేదు సర్. ఆ మాత్రం కామన్ సెన్స్ వున్న ప్రతివాళ్ళు చెప్పేయొచ్చు. ఇప్పటి స్టార్స్ లైఫ్ ఎవరికి తెలీద్సర్....అడతారల వెనక మగతారలు, మగతారలు వెనక అడ తారలు......." ఏదేదో చెప్పుకు పోతోంది ఇంకో అమ్మాయి.
"వద్దూ.....నువ్వపుతావా. విమల్ గారూ, మా పద్మినికి కాస్త సినిమా పిచ్చి ఎక్కువైంది. కనబడ్డ మాగజైన్ అంతా చదివేస్తుంది. వాళ్ళింటి నిండా , కాలేజీ పుస్తకాలకన్నా, సినిమా మాగజైన్ లే ఎక్కువ వుంటాయి. పోనీయండి సార్. మీ ఫాన్ గా మీమ్మల్నో ప్రశ్న అడుగుతాను సార్, అబద్దం ఆడకుండా నిజం చెప్తారా?"
రాతిమీద లేచి విమల్ కింద తడిమట్టిలో కూర్చున్నాడు. అతని కెదురుగా కూర్చుంటూ అంది జ్వలన.
