Previous Page Next Page 
తుపాన్ పేజి 35

    ఆమెను తేరి చూడజాలక నేను, ఆమె ఎదుట  మోకరించి నేను  ఆమెను  హృదయాన ధరించి  నేను, ఆమె జీవిత కిరీటాలంకృత సార్వభౌముణ్ణి నేను. ఆమెతో కృష్ణానదిలో నావపై  విహరించాను. ఆమె కోసం  చిన్న మొటారుకారు  తెప్పించాను. ఆ కారులో అమరావతి,  నాగార్జున కొండ, ఓరుగల్లు, ఔరంగాబాదు, ఎల్లోరా, అజంతాలు విహరించాను. ఆమె మెచ్చిన బొమ్మ  నాకు ఆశయము ఆమె ఆనందం  పొందిన పటాలు  నా హృదయ ఫలకాన, ఆమె ఆలపించిన రాగం  నా జీవిత విపంచిలో, ఆమె నడచిన నడక  నా ఆత్మపథాల.    

    శకుంతలాదేవీ! అందాలబాలా! ఆనందదేవీ! అమరకన్యా! ఆనాడు నీకు జ్వరము వచ్చిందా! మనం దేశాలు  తిరిగివచ్చిన నెలరోజులకేనా? నాకు నీ  దర్శనానందంలో శతాంశం అనుభవానికి రాలేదే!  నీ జన్మకాంతులు  నాపై సహస్రాంశం ప్రసరించలేదే? నీ ప్రేమామృతకలశాం  బోధిలో  ఒక్కకణము  నా జన్మలో  ప్రసరించలేదే? ఇంతలోనేనా నువ్వు జ్వరతల్పం అధివసించావు ? దేవీ! నీ భక్తునిపై,  నీ  సేవకునిపై, నీ స్నేహితునిపై, నీ భర్తపై, నీలోని భాగానిపై, అప్పుడే విరక్తి వచ్చిందా దేవీ! దేవీ! నా ఆత్మేశ్వరీ! నా ముక్తేశ్వరీ!         

    అది టైఫాయిడ్ జ్వరమట! ఎక్కడనుంచి వచ్చిందా జ్వరం? అది మృత్యుకీలగాని జ్వరం కాదట! ప్రపంచంలోని  వైద్యులందరూ నీకు వచ్చిన జ్వరాన్ని తగ్గించలేకపోయారా?  మదరాసు  వైద్యవృషబులు  పెదవులు విరిచారా? నువ్వు ఏమైపోయినావు?

    మా శకుంతల వెళ్ళిపోయింది. తపస్సు చేయగా ప్రత్యక్షమైన దేవి  వరమీయకుండానే అంతర్ధానం అయిపోయింది.

    ఏమి జరిగింది? మా యింట్లోలేదా? ఆమె పుట్టింటికే వెళ్ళలేదా? వైద్యాలు హుళక్కా? మంత్రాలు చచ్చుమాటలా? మొక్కుబళ్ళు  మొరకు తనాలా! దేవుళ్ళు రాళ్ళా? లోకంలో ధర్మంలేదా? నేను ఎవరికీ మాటలోనన్నా  కష్టం కలిగించి ఎరగనే! నాకున్నవి ఉత్తమ  ఉద్దేశాలే! నా దివ్యమూర్తి  ఏమయింది? చిన్ననాటినుంచీ నన్ను తన నీడలో పెంచుకున్న  నా తేజస్విని  ఏ దేశం  పోయింది? ఎందు  కీ  సూర్యుడు? సన్యాసి సూర్యుడు! ఎవరికి కావాలి ఎండ?

    ఇది నా  యిల్లా? ఈమె నా అమ్మా ?  వీ రెవరు? నా శకుంతల తండ్రే! అయ్యో మహాభాగా! నీ కడుపున  ఉద్భవించిన అమృతకలశాన్ని ఎవరు ఎత్తుకుపోయారు? గరుత్మంతుడా! రాక్షసుడా! పిశాచా నరహంతకుడా?  నేను తపస్సు చేసి  సంపాదించిన వరం ఏదీ ? ఎవరు తీసుకొన్నారు?  నా వరం నా కివ్వండి. నా వరం! నా జీవిత పరమావధి? నా సర్వం. నా.... నా....


                                                         *         *      *

    ఓ  హేమదేవీ! ఈ నా కథ నీకోసం రాస్తున్నా. నువ్వు చదివే రోజు వస్తుంది. నీతో సహవాసం చేస్తూ   నిన్ను గమనిస్తూ, రోజూ నా కథ రాస్తున్నాను. చివరిదాకా చదివిందాకా  నన్ను గురించి  అభిప్రాయాలేమీ నిర్మించుకోకు. ఆ రోజు రాగానే  నీ చేతికి  ఈ గాథ  వస్తుంది, అంతా చదివి నన్ను అర్ధంచేసుకో.

    నేను  శ్రీనాథమూర్తిని.  నేనే త్యాగతిని. త్యాగతి  పేరేమిటి? ఎందుకా పేరు నాకు వచ్చింది? ఎవరిచ్చారు? ఎందుకు నీతో మొదటి నుంచీ నా నిజకథ చెప్పలేదు? యివన్నీ నీకు మనవి చేసేరోజు ఇది. నువ్వు నా  శకుంతలకు చెల్లెలివి! నా శకుంతలా, నువ్వూ  ఏకగర్భజలు. ఎంత చిత్రము! నా  దుఃఖాన్ని నువ్వు ఊహించలేవు. నేను మాత్రం ఇప్పుడు ఊహించుకోగాలనా?

    నేను నాదేవి  వెళ్ళిపోయినా తర్వాత  పదకొండు రోజులు  స్పృహలేక జీవచ్ఛవంలా ఉన్నాను. ప్రాణం పోలేదు. నన్ను కారుమీద వేసుకొని  డాక్టరు ఆమంచర్ల చలపతిరావుగారు, గోవిందరాజుల సుబ్బారావుగారు తెనాలి చేర్చారు. అక్కడ ఒక మేడలో పెట్టారు. మా అమ్మనూ నాతో వైద్యానికి తీసుకువచ్చారు. ఆమెకు నాదేవి అంతర్ధానమైన  రోజునుంచే మూర్ఛపట్టుకుంది. ఆమెకు తిండిలేదు. సర్వకాలం కళ్ళవెంట నీళ్ళు. మా కిద్దరకూ పరిచర్యకు  మా అక్కగార్లిద్దరూ వచ్చారు. 
          
       
                                   విష్కంభము

    ఇంతవరకు ఆ వ్రాతపుస్తకం  చదివేటప్పటికి హేమకుసుమ వెక్కి వెక్కి ఏడుస్తూ  సిఫామీదనుంచి లేచింది. తూలుతూ వెళ్లి మంచం  మీద వాలిపోయింది. చిన్ననాడు  సంభవించిన అక్కగారి అకాల మరణ కథ అంతా కళ్ళకు కట్టిపోయినది. అక్కగారిని తానూ చిన్ననాడెంత ప్రేమించినది!

 ఆ   ప్రేమపరీమళాలు ఈ నాటివరకూ   తన జీవితపథాలన్నీ ఆక్రమించలేదా? ఆమె తన కెప్పుడూ  దేవబాలికలానే  మనఃపథాల ప్రత్యక్షమవుతూ ఉండేది. ఆమె దుఃఖము భరించలేకపోయింది. కన్నీళ్లు అఖండధారలైనవి. గుండె బరువెక్కినది. ''అబ్బా'' అని ఆమె  దుఃఖించింది. '' అక్కా యెక్కడికి పోయావే'' అని రోదించింది.

    ఈ భాద భరించలే  ననుకొంది. తన గదిలో ఉన్న  విద్యుత్ ఘంటికకు మీట  నొక్కినది. ఆ గంట  పరిచారిక గదిలో  మోగింది. ఆ అమ్మాయి  పరుగెత్తుకొని  వచ్చింది. తలుపు  ఎలాగో  తీసి  హేమకుసుమ  మళ్ళీ మంచం మీద వాలింది.

    '' ఏమిటండీ అమ్మా! ఎందుకు అలా ఉన్నారు?'' ఆ  కొల్లిపర నుంచి చిన్నతనములోనే   వీళ్ళతో మదరాసు వచ్చిన ఆ బాలిక  అడిగింది.

    '' త్వరగా....వెళ్లి....లోకాన్ని....తీసుకురా!''

    ఆ పనిగత్తె  వెళ్లి అయిదు నిమిషాలలో  లోకేస్వరుని  తీసుకువచ్చింది. లోకేశ్వరి రాగానే హేమ  ఆ బాలికను  గట్టిగా కౌగిలించుకొని  ఇనుపమడించిన దుఃఖంతో వణికిపోయింది.

    '' హేమ్! ఏమి  టా ఏడ్పు ? మతిపోయిందా?  మీ అక్క చనిపోయి  పదకొండు  ఏళ్లయింది.''

    ''............''

    '' నీ  స్థితికి  అర్ధం  ఉందా? ఇది హిస్టీరియాగాని ఇంకోటి  కాదు ?    ఇంత  నీరసురాలివయ్యా  వేమిటి? ఇంతకన్న అవమానం ఇంకోటి ఉందా? పుస్తకం చదువుతూ అంత ఏడుస్తారా ఎక్కడన్నా! లే, కళ్ళు తుడుచుకో. నేను  ఈ రాత్రి నీ దగ్గరే  పండుకుంటాను.''
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS