వినాయకరావుగారు: నిజమేనయ్యా త్యాగతీ! మనుష్యులలో ఉండే సంహారశక్తిని కాళికాస్వరూపిణి క్రింద వర్ణించాముకానీ, రక్తం కళ్ళ చూచేందుకు వెరవనిది మగవాడే! అంత కష్టం వస్తే స్త్రీ తన నాశనమే కోరుతుంది. కాని ఎదుటివాణ్ణి తన్ను అవమానపరచే పురుషుణ్ణయినా, స్త్రీ నాశనం కోరలేదు. ఎంతో అవసరం వచ్చినాగాని స్త్రీ కత్తికట్టలేదు. పూరాణాల్లోని సత్యభామ, ప్రమీల, కైక క్షణమాత్రం విక్రమం చూపించారు. వాళ్ళు పూజ్య చరిత్రలు. చరిత్రలో ఉండే ఝాన్సీలక్ష్మీబాయి, రుద్రమదేవి యుద్ధంకన్న శాంతమే యెక్కువ ఆశించారు.
కల్పమూర్తి : అవునండీ మామగారూ, అహల్యాబాయి యుద్దం లేకుండా ఎంత ప్రేమతో రాజ్యం పాలించింది?
హేమకుసుమ : నేను ఆడవాళ్ళు ప్రపంచశాంతి కోరారన్నాను. ఆ మాత్రానికే మీరు ఆడవాళ్ళని పిరికిపందల క్రింద జమకట్ట చూస్తున్నారు. మీ కెప్పుడూ మేము బానిసలుగా వుండాలేమి?
రాజ్యలక్ష్మమ్మగారు : ఓసి వెర్రితల్లీ! నీకెందుకమ్మా పౌరుషం? ప్రేమను కోరే ఆడవాళ్ళు బానిస లెట్లా అవుతారమ్మా!
హేమకుసుమ : ప్రేమ! తేమ! లోకంలో ప్రేమ వుందంటావా? ఓ వెర్రమ్మా! మనుష్యుడు అవసరం వచ్చినప్పుడు నాలుగు తీపి మాటలు మాట్లాడుతాడు. దానికి ప్రేమని ఓ చిచ్చు పేరు పెట్టాడు. మనం అంతా పశువులం. పశుధర్మం నిర్వర్తిస్తాం.
వినాయకరావుగారు : ఏమో! బొత్తిగా ఈ కాలం దానవై పోయావు. ఈ నాటి వాళ్ళ భావాలు మా ముసలవాళ్ళకేమీ అందవుగదా!
నేను : అవునండీ, వీళ్ళంతా నవజవానులు. చల్ చల్ రే నౌ జవాన్! కత్తిగట్టు నౌ జవాన్! గజ్జెకట్టు నౌ జవాన్.
హేమకుసుమ : దద్దమ్మలా పడుకోకు నౌ జవాన్.
కల్ప : యుద్ధం వచ్చి ధన మాన ప్రాణాలు రక్షించుకోవలసి వచ్చినప్పుడు తప్పక స్త్రీ కత్తి పట్టవలసిందే! రాష్యాలో స్త్రీలు యుద్దానికి సిద్దమట! కాని........
హేమ : కాని లేదు, అర్షణాలేదు. స్త్రీ యుద్ధం కోరదు. స్త్రీకి యుద్ధం అక్కరలేదు. కాని ఇంతవరకు స్త్రీని పురుషుడు అణగదొక్కి ఉంచాడు. పురుషుడు తన కామప్రీతితో ఏవో కొన్ని అధికారాలు దయచేశాడు. ఆయన మాకు ఇచ్చిన గ్రుహాధికారం ఆయన ఇచ్చిందేమిటి? మాకు ఇవ్వక అతనికి తప్పలేదు. పిల్లలను కనేవాళ్ళం, పెంచేవాళ్ళం. వంట చేసేవాళ్ళం. అందుకని గృహాధికారం లేకపోతే ఆ అధికారమూ పురుషుడే ఉంచుకొని ఉండును. ఎంతమంది పురుషులు స్త్రీలను అవమానాలు చేయలేదు? బట్టవిప్పించి దుర్యోధనుడు అవమానం చేస్తే,జూదంలో పందెంపెట్టి ధర్మరాజు అవమానం చేసాడు. అంతే మనుష్యులు. ఏ విషయంలోనైనా స్త్రీ పురుషులు సమానులే! మేమూ యుద్ధం చేస్తాం. దేహబలం అవసరంలేని సైన్సురోజు లివి.
నేను : అవును హేమా! నువ్వు చెప్పిందంతా నిజం. నేను కాదనను. ఒక సంగతి మాత్రం చెప్తాను. ఎవరి దోషం వారే అనుభవిస్తారు! మనం ఇంగ్లీషు వాళ్ళని అని ఎలా లాభంలేదో అల్లాగే స్త్రీలు పురుషులను అని లాభంలేదు. నీలో నీరసత్వం ఉంటే రోగాలు దాపురిస్తాయి. రోగాలు అందుకే వున్నాయి. అలాగే హిందూదేశం నీరసంగా ఉండడంవల్ల యవన, హూణ, మ్లేచ్ఛ, తురుష్క, ఫ్రెంచి, డచ్చి, ఆంగ్ల జాతులవారు వచ్చి చేసారు. నువ్వు వారిని తరలించేయి. ఎవరూ కాదనరు. నీలో జబ్బుల్ని కుదుర్చుకోవూ! అలాగే! ఆడవాళ్ళు నీరసులవడంవల్ల మగవాళ్ళు అధికారాలన్నీ వహించారు. వారితో యుద్ధం చేయి, వారి మనస్సులు కరిగించు వారితో సమానం అని పనిచేసి చూపు. నీ స్థానం నువ్వు ఆక్రమించుకో!
హేమ : అదే చేసి చూపెడతాం!
నేను : ఎక్కడి మాటలు, మీ పౌడర్లు మీరు వదలరు. మీ కులు కులు మీరు మానరు. మీ సొగసులు మీరు మరచిపోరు. మీ అలంకారాలు మీరు అవతల పారవేయరు.
తీర్థ : అలంకారాలు అడ్డం వస్తాయా?
నేను : రావు! రావు! అలంకారం అయ్యేవరకు అవసరాలు ఆగుతాయి కాలం నిలిచే ఉంటుంది!
ఈ హేమ ఆ రోజున హేమ బాలికగా అల్లా అంటూంటేనే మేము మా కౌగిలింత వదలినాము. నేను హేమనెత్తి ముద్దులు కురిపించాను.
'' అల్లరిపిల్లా! ఇంకో పది సంవత్సరాలు ఉండు. నీకు ఈ లాంటి కష్టాలు వస్తాయిలే'' అన్నాను.
హేమ : నేను పెళ్లి చేసుకోనుగా!
శకుంతల : వద్దే నాన్నా నీకు పెళ్లి! మీ బావవంటి మొగుడు నీకు దొరికితే ఈలాగే వేపుకు తింటాడు.
16
అందరి జీవితంలోనూ అంతే! మూలసూత్రం ఒకటే. నదులూ పర్వతాలు, సముద్రమూ జీవితయాత్రను తమ ఇచ్చివచ్చిన దారులకు తీసుకొని పోతవి. ఒక్కొక్క నది ఒక్కొక్క రీతిగా మనుష్యులను నడుపుతుంది. కృష్ణానది శిల్పులనది. గోదావరి కవులనది అన్నారు. పెన్నా తుంగ భద్రలు విక్రమజీవన మిస్తాయట. కావేరి గాంధర్వానకు అమృత జీరలు వరమిస్తుందట. గంగానది తపస్వినియట. యమున భక్తిమాల.
నేను కొల్లిపరకు అనతిదూరంలో కృష్ణానది ఒడ్డున శిల్పాశ్రమం నెలకొల్పాలని నిశ్చయించాను. అందు భూమి, ఆలయాలు, విహారాలు, మందిరాలు, గృహాలు నిర్మించడానికి లక్ష రూపాయలు అవుతాయనుకొన్నాను. అక్కడే మా మామగారి భూమి ఉన్నది. ఆ భూమి చక్కని తోట అవుతుంది. అలాటి ఆశ్రమం కలలు కంటున్నాను.
కాని ఆ కల లన్నిటికి కౌస్తుభమణి నా శకుంతల. నా శకుంతల ముందు కాళిదాస శకుంతల కామధేనువు ముందు నందినీ ధేనువే! గౌరీశంకర శృగం ముందు కాంచనగంగ మాత్రమే. శకుంతలకు పదహారు సంవత్సరాలు వచ్చాయి. అమృతంలో కడిగి తుడిచిన బంగారు కమలంగా వికసించిపోయింది. ఆమె బంగారు ఛాయలో పాలసముద్రం ఛాయ కలిసిపోయింది. ఆమె కన్నుల ఆకాశంలో స్వర్గధామాలు నృత్యాలు సల్ఫినవి. ఆమె పెదవుల మందారాలలో విష్ణుహస్తాలంకారలీలా పద్మమధువులు చేరుకొన్నవి. ఆమె గానసుధలో సరస్వతీదేవ్యంగుళీ సంతతవర్తితపల్ల కీశృతులు మేళవించాయి.
