Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 34

 

    మోహన్ ఆమె కధ విన్నాడు. ఆమె పేరు సీత. ఆమె గీత దాటింది.
    అప్పుడతడు గమనించాడామే అందగత్తె అని. ఐనా మోసపోయిన స్త్రీలు చాలా అందంగా ఉంటారు.
    మోహన్ లో ఆమె పట్ల మళ్ళీ ఆకర్షణ బయలుదేరింది.
    జీవితంలో పురుషుడికి స్త్రీ తోడూ అవసరం. అప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది. మోహన్ కా విషయం అర్ధమయింది.
    గీత దాటినా సీత- ఇప్పుడు తనే రావణుడి పాలబడతానో అని భయపడుతోంది. మోహన్ ఆమెకు ధైర్యం చెప్పాడు.
    లీలకు తనంటే కృతజ్ఞత. ఆ కృతజ్ఞతతో ఆమె తన శరీరాన్నపించగలదు. కానీ తన్ను ప్రమాదం నుంచి రక్షించలేదు.
    సునందకు తనంటే యిష్టమే. అయితే ఆమె స్వార్ధాన్ని జయించలేదు. తాన ప్రాణాలకు మించి స్వార్ధమామెకు ప్రాణం. ఒక వజ్రాల హారం కోసం ఆమె తన్ను ప్రమాదంలో పారేసింది.
    సీత మధ్యతరగతి పిల్ల. ఇల్లు వదలకముందో బాబా యున్నాడు. ఇల్లు వదిలేక ఆమె కేవరూ లేనట్లే లెక్క. మాయలేడిలా ,మభ్యపెట్టి ప్రియుడు మధ్యలో మాయం కావడం వల్ల ఆమె ఆత్మహత్య గురించి కూడా ఆలోచిస్తుంది.
    మోహన్ ఆమెకు క్లుప్తంగా తన గురించి చెప్పుకుని "అసాధారణ యువతులతో జీవించడంలో యిబ్బంది ఉంది. నేను సామాన్యుడిని. నువ్వు నాతొ ఉంటానంటే మనం సామాన్య జీవితం గడపవచ్చు" అన్నాడు.
    అతడు తన్ను పెళ్ళి చేసుకుంటాననగానే సీత చాలా సంతోషించింది. అయితే తను మనసు చిక్క పెట్టుకు నెందుకామె కొంత వ్యవధిని కోరింది.
    మోహన్ అంగీకరించాడు.
    సీత నిర్ణయించిన గమ్యంలో దిగాడు మోహన్. కొత్త జీవితం గురించి కలలు కందామంటే -- లీల హెచ్చరిక అతణ్ణి కలవర పరుస్తుంది.
    రైల్వే ప్లాట్ ఫారం మీద అతడు, సీత....
    ఎక్కడి కి వెళ్ళాలా ఏం చేయాలా అని అతడాలోచిస్తుంటే .....
    "మా యింటి పక్క నా స్నేహితురాలుండేది . ఆమెకు వివాహమై రెండేళ్ళయింది. ఆమె యిక్కడే వుంటోంది. మేమిద్దరం ఉత్తరాలు రాసుకుంటుంటాం. ఆమె చిరునామా నాకు తెలుసు ....' అంది సీత.
    మోహన్ ఆ చిరునామా తీసుకున్నాడు.
    ఇద్దరూ ఆటోలో ఆ యింటికి వెళ్ళారు.
    ఇల్లు డాబుగా ఉంది. భయపడుతూనే సీత, మోహన్ ఆ యింట్లో అడుగు పెట్టారు.
    కాలింగ్ బెల్ వింటూనే ఓ నడి వయస్కుడు తలుపు తెరిచాడు.
    "నా పేరు సీత " అంది సీత.
    "కమిన్" అన్నాడా నడి వయస్కుడు.
    సీత వెనుకనే మోహన్ కూడా లోపల ప్రవేశించాడు.
    నడి వయస్కుడు తలుపులు వేసి - "వెల్ డన్ సీత ! మోహన్ ని తెలివిగా యిక్కడకు తీసుకొచ్చావు" అని అన్నాడు.
    మోహన్ ఉలిక్కిపడ్డాడు "ఎవర్నువ్వు?" అడిగాడా నడివయస్కుడిని.
    "లీల నిన్ను ప్రమాదం గురించి హెచ్చరించింది కదా -" ఆ ప్రమాదాన్ని నేనే!" అన్నాడతడు.
    "నాకేమీ అర్ధం కావడం లేదు."
    "నువ్వు లీల దగ్గిర్నించి ఏదో కాజేశావు. అందుకు నీకు శిక్ష పడాలి. నిన్ను సీత నా దగ్గిరకు చేర్చింది."
    మోహన్ సీత వంక చూశాడు. ఆమె నవ్వుతోంది.
    "మోసం.... అంతా మోసం ....ఆడదాని అందం మోసం.... ప్రేమ మోసం.... నవ్వు మోసం...." అంది మోహన్ మనసు.
    "ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకో - నీ శిక్ష కింకా టయముంది ."
    "ఏం చేస్తావ్ నన్ను !" అడిగాడు మోహన్.
    "నువ్వు చావటం ఖాయం. అందుకు హింసించాలా లేదా అన్న విషయం లీల చెబుతుంది " అన్నాడా నడి వయస్కుడు.
    "యెవ్కర్నువ్వు?"  అన్నాడు మోహన్.
    "లీల బాస్ కి సహచరుడ్ని ...." అతడు నవ్వాడు.
    మోహన్ చుట్టూ చూశాడు. ఈ విధంగా తాను శత్రువ్యుహంలో చిక్కుంటానని అతడనుకోలేదు.
    "నాకు తప్పించుకునే మార్గం లేదా?"
    "తప్పించుకునేందుకే యింటి తలుపు లెప్పుడూ నీ కోసం తెరిచే ఉంటాయి. తప్పించుకుందుకు ప్రయత్నిస్తే మాత్రం యమధర్మరాజుకు కూడా తెలియని చిత్రహింసలకు గురవుతావు. కాబట్టి బుద్దిగా ఉండు" అని అక్కణ్ణించి వెళ్ళిపోయాడు నడి వయస్కుడు.
    "నువ్వు అందగత్తేవు" అన్నాడు మోహన్ సీతతో.
    "నేను నా డ్యూటీ చేశాను " అంది సీత.
    "నీ డ్యూటీలో మోసముంది" అన్నాడు మోహన్.
    "మోహన్ డ్యూటీ కోసం నిన్ను మోసగించినా - ట్రయిన్ లో నీ కళ్ళలోని నిజాయితీ చూసి నిన్ను ప్రేమించాను. నేను నిన్ను మోసం చేయకపోయినా నువ్వు తప్పించుకోలేవు. నిన్ను రక్షించగల శక్తి నా ప్ర్రేమ బలానికే ఉంది. నా ప్రేమ బలమైనదయితే నువ్వు రక్షించబడతావు. నా మనసు నీ క్షేమాన్ని కోరుతోంది. నా కోర్కెలోని బలం మృత్యువుకీ నీకు మధ్య అడ్డు గోడలా నిలబడగలదు ...." అంది సీత.
    "నేను రక్షించబడాలంటే అవకాశమేమిటి?" అడిగాడు మోహన్ ఆశగా.
    "నాకు తెలిసి ఏ అవకాశము లేదు...."
    మోహన్ నిట్టూర్చాడు. ఒకసారి శత్రువు బలం తెలిసింది కాబట్టి అతడక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం కూడా చేయలేదు.
    అలా అతడా యింట్లో నాలుగు రోజులున్నాడు.
    నాలుగు రోజుల తర్వాతే అతడు మళ్ళీ నడి వయస్కుడిని చూశాడు.
    "నీ అంతటి అదృష్టవంతుడు ఉండడు. నీ ప్రాణాలు దక్కాయి" అన్నాడతడు.
    "ఏం జరిగింది?"
    నడి వయస్కుడు చెప్పింది విని మోహన్ ఆశ్చర్య పోయాడు.
    బాస్ కు లీల మీద  అనుమానం వచ్చింది. లీలకు చెప్పిన రహస్యాలు శత్రువులకు చేరుతున్నాయి. అదెలా జరుగుతుందో తెలియలేదు. మోహన్ కారణంగా ఆ రహస్యం బట్ట బయలయింది.
    లీలకు బహుమతిగా లభించిన వజ్రాల హారంలో ట్రాన్స్మిటర్లున్నాయి. వాటి ద్వారా బాస్ ఆమెతో మాట్లాడే మాటలన్నీ శత్రువులు వినగల్గుతున్నారు. ఇటీవల లీలకు అప్పగించబడిన ప్రతి విశేషమూ శత్రువులకు ముందుగా తెలిసింది. వజ్రాల హారం పోయాక - ఆ విశేషం తెలియలేదు. బాస్ అనుమానం ఆ వజ్రాల హారం మీదకు అంతవరకూ పోనేలేదు. ఇప్పుడు సునంద కప్పగించబడిన పనులు శత్రువుకు ముందుగా తెలిసిపోతున్నాయి. బాస్ సునంద నుంచి వజ్రాల హారం సంపాదించి ట్రాన్స్ మీటర్లు కనుగొన్నాడు.
    "అంటే సునంద, లీల - ఒకే బాస్ వద్ద పనిచేస్తున్నారా?" అన్నాడు మోహన్ ఆశ్చర్యంగా.
    'అవును కానీ ఆ విషయం వజ్రాల హారం గురించి బైటపడే దాకా వాళ్ళకే తెలియదు. ఇప్పుడు బాస్ -- ఆ వజ్రాల హారం బహుమతిగా యిచ్చిన వాడి వేటలో పడ్డాడు. నిన్ను క్షమించి వదిలి పెట్టడమే కాకుండా నువ్వేం కోరినా యివ్వదల్చుకున్నాడు...." అన్నాడు నడి వయస్కుడు.
    "అంటే?" అన్నాడు మోహన్.
    "నీ కారణంగా సునంద అనుమానం నించి తప్పించు కుంది. లీలకు బాస్ చేతిలో చావు తప్పింది. వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు. వాళ్ళలో ఎవరినైనా నువ్వు కోరుకోవచ్చు...." అన్నాడు నడి వయస్కుడు.
    సునంద, లీల -- భయంకర విషవలయంలో ఉన్నారు. వారిలో ఎవరిని కోరినా వారితో పాటు తానూ ఆ విష వలయంలో చిక్కుకుని పోతాడు. అందులోంచి తప్పించుకుని హాయిగా బ్రతకాలంటే ....
    అప్పుడు మోహన్ సీతను చూశాడు.
    సీత కూడా భయంకర విషవలయం లోనే వుంది. కానీ ప్రేమ బలం పేరు చెప్పిందామె. ఆమె నమ్మకం నిజమయింది.
    'ఆలోచించుకోవాలా?" అన్నాడు నడి వయస్కుడు.
    'అవసరం లేదు. నాకు సీత కావాలి "_ అన్నాడు మోహన్.
    నడి వయస్కుడు సీత వంక చూశాడు. ఆమె ముఖంలో ఆశ్చర్యం లేదు.

                                        ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS