Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 34


    "సరే-రేపు వచ్చి మిగతా వెయ్యి పట్టుకుపోతాను" అన్నాడు జగ్గయ్య. ఆ మనిషి వెళ్ళిపోయాడు. జగ్గయ్య తన చేతిలో వున్న డబ్బు లెక్క పెట్టుకున్నాడు. సరిగ్గా వెయ్యిరూపాయలుంది. ఆ డబ్బును గళ్ళలుంగీ రొంటిన దోపుకున్నాడు. తర్వాత గుడిసెలోకి వెళ్ళాడు.
    మంచంమీద తలగడ తీశాడు. దాని అడుగున ఒక కత్తి వున్నది. ఒకసారి దాన్ని పరీక్షగా చూసి-"మంచి పదునుమీద వుంది. ఒక్క వేటుకు తల తెగిపోతుంది-" అనుకున్నాడు.

                                       7

    "రమా!" అన్నాడు రవిబాబు.
    "ఊఁ" అన్నది రమ.
    "ఈ రోజుతో మన అజ్ఞాతవాసం ముగుస్తుంది కదా" అన్నాడు రవిబాబు.
    "ఊఁ" అన్నది రమ.
    "నాకు చాలా థ్రిల్లింగ్ గా వున్నది-" అన్నాడు రవిబాబు.
    "ఏమిటి?"
    "నీతో అనుభవం...."
    "ఛీ..." అంది రమ సిగ్గుపడుతూ.
    "అవును రమా! ప్రమీలను చూస్తే నాకు ఆడదనే అనిపించేదికాదు. నీలో బాహ్య సౌందర్యమేకాదు-ఆత్మ సౌందర్యం కూడా వున్నది-" అన్నాడు రవి బాబు.
    "స్వామివారి వుపాయం నీ కెలాగుంది?"
    "ఒక ఆశ్రమవాసిగా నీవిక్కడే వున్నావని వాళ్ళెవ్వరికీ తెలియదు. నీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు పోలీసులు-"అన్నది రమ.
    "కానీ నా మామగారికి అనుమానం రాధంటావా? ఆశ్రమంమీద దాడి జరగదంటావా?" అన్నాడు రవి బాబు అనుమానంగా.
    "ముందు నువ్వు ఆశ్రమానికి వచ్చావు. ఆ తర్వాత నువ్వు రాసిన ఉత్తరం పొరుగూరినుంచి పోస్టయింది. ఆ ఉత్తరం ఆధారంగా నువ్వీ ఊళ్ళో లేవని అనుకుంటారు. ఈ రాత్రి పన్నెండు గంటలకు మనం బస్సెక్కుతాం. నాలుగు గంటలు ప్రయాణం. అక్కణ్ణించి రైలు. పన్నెండుగంటల ప్రయాణం...."
    "ఉష్-మాట్లాడకు-గోడలకు చెవులుంటాయి...."
    "మన విషయం చిదానందస్వామికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు-" అన్నది రమ.
    రవిబాబు అదోలా రమవంక చూసి-"నాకో విషయం అనుమానంగా వుంది. చిదానందస్వామి మన కింతగా ఎందుకు సాయపడుతున్నాడు?" అన్నాడు.
    "కష్టాల్లో వున్నవారంటే ఆయనకు జాలి...."
    "నాకింకో అనుమానం వస్తున్నది...." అన్నాడు రవిబాబు.
    "ఏమిటది?"
    "చిదానందస్వామికి నీమీద మొహం ఉన్నదేమో నని..."
    "వుంటే మాత్రం ఏమయింది?"
    రవిబాబు నవ్వి-"ఆయన నిన్ను తాత్కాలికంగా వదిలిపెడుతున్నాడు. మనమెక్కడుండేదీ ఆయనకు తెలుస్తుంది. ఏదో ఓ రోజున నన్ను మాయచేసి మళ్ళీ నిన్ను లోబర్చుకుంటాడు-" అన్నాడు.
    "నేను నీ దాన్నయేక ఆయనకెందుకు లోబడతానూ?" అన్నది రమ.
    "రమా! నువ్వు నన్ను మోసంచేయవు కదూ-నిజం గానే నన్ను ప్రేమిస్తున్నావు కదూ-" అన్నాడు రవిబాబు.
    "ఈ విషయమై నీకు అనుమానమెందుకు వచ్చింది?" అన్నది రమ.
    "నిజం చెప్పమంటావా?" అన్నాడు రవిబాబు.
    "ఊఁ" అన్నది రమ.
    "నిన్న చిదానందస్వామి నిన్ను ముద్దుపెట్టుకుంటూండగా చూశాను-" అన్నాడు రవిబాబు తాపీగా.
    రమ ఉలిక్కిపడి-"ఎప్పుడు?" అన్నది.
    రవిబాబు టైము చెప్పాడు.
    రమ నిట్టూర్చి-"నీకోసం తాత్కాలికంగా ఆ మాత్రం త్యాగం చేయవలసి వచ్చింది-" అన్నది.
    "నాకలా అనిపించలేదు. నీ చేతులు వాటంతటవె ఆయన చుట్టూ బిగుసుకున్నాయి. నీ ముఖంలో, ఆనందం, కళ్ళలో ప్రోత్సాహం చూశాను నేను-"
    "అయితే నీకు నిజం చెప్పక తప్పదు...." అన్నది రమ.
    "నిజం పేరుతో అబద్ధం చెప్పవుకదూ!"
    రమ అతడివంక అదోలా చూసి-"పెళ్ళి కాకుండానే నాపైన అపనమ్మకం పెంచుకుంటున్నావా?" అన్నది.
    "అపనమ్మకం పెరిగినా నిన్ను నేను వదులుకోలేను. నువ్వు నన్ను మోసంచేస్తే నేను బ్రతికలేను-" అన్నాడు రవిబాబు.
    "ఎందుకని?" అన్నది రమ.
    "నాకు జీవితమంటే విరక్తి కలిగింది. నీ సాహచర్యం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నాకిప్పుడు బ్రతకాలనిపిస్తోంది-నీతో! నీ కారణంగానే నాకు బ్రతుకుమీద ఆశ బయల్దేరింది. ఇప్పుడు నీకోసం నేనెంతగానైనా తెగించగలను!" అన్నాడు రవిబాబు.
    "నీ ప్రేమ చాలా గొప్పది రవీ! నువ్వు నన్నెలా ప్రేమిస్తున్నావో నేనూ నిన్నలాగే ప్రేమిస్తున్నానంటే అందుకు నీ ప్రేమ గొప్పతనమే కారణం. అయితే నిన్న నీవు చూసినది వేరు-" అంది రమ.
    నిన్న చిదానందస్వామి ఆమెను పిలిపించాడు. రవితో ఆమెను పంపుతున్నందుకు తనకు కానుక ఏమైనా ఇమ్మన్నాడు. కానుక తీసుకోనిధే తానెవరికీ సాయపడకూడదని గుర్వాజ్ఞ అన్నాడు.
    "నన్ను తప్ప ఏమైనా అడగండి స్వామీ!" అన్నది రమ.
    "అభిమానంతో ఎవరైనా ఎవరికైనా ఇచ్చేదే నేను నిన్ను అడుగుతాను. కాదనకూడదు. నీ శీలాన్నపహరించే కోరిక మాత్రం కాదది-" అన్నాడు చిదానందస్వామి.
    రమ ఒప్పుకున్నది. ఆయన ముద్దు అడిగాడు. రమకు వేరేదారి లేకపోయింది-"ఈ ఒక్కసారికే-" అని మాత్రం చెప్పింది.
    ఆ ఒక్కసారే రవి చూశాడు.
    "నీ కార్యం నెరవేరిందనే అనుకో-" అన్నాడు చిదానందస్వామి తర్వాత. రమ ఆయన్ను పరపురుషుడిగా కాక భగవంతుడిగా భావించబట్టి ఆ పని చేయగలిగింది.
    "భగవంతుడినని భ్రమపెట్టి ఆయన నీ చేత ఇంకా ఏమైనా చేయించగలడు-" అన్నాడు రవిబాబు.
    "రవిబాబూ-భారత స్త్రీకి వివాహమైనాక భర్తయే దైవం. తన జోలికి వచ్చినందుకు మహావిష్ణువునే నల్ల రాతిగా మార్చిన జలంధర నాకు ఆదర్శం. ఇంకా ఏమైనా చెప్పాలా?" అన్నది రమ.
    "నేను నీ గురించి ఆలోచించడంలేదు. నీమీద నాకు అనుమానం, కోపం, ద్వేషం- ఏమీ కలుగవు-" అన్నాడు రవి-"నేను ఆ స్వామి గురించి ఆలోచిస్తున్నాను. ఆయన మహాపురుషుడు కాదు. కాముకుడు. సర్వసంగపరిత్యాగి కాదు. ఆశాపాతకుడు. ఆయన తప్పులను ఎన్నింటినైనా నేను క్షమించి వుండేవాణ్ణి. కానీ నిన్న ముద్దుపెట్టుకొనడంవల్ల ఆయన్ను నేను క్షమించలేకుండా వున్నాను. ఆయన్ను ఏమి చేయడానికైనా నాకు అవకాశం వున్నది. కొద్దిరోజులుగా నేనిక్కడ అజ్ఞాతవాసం చేస్తున్నాను. నా ఉనికి ఎవ్వరికీ తెలియదు. నన్నెవ్వరూ అనుమానించలేరు...."
    "అంటే?"
    "చిదానందస్వామి ఏం చెప్పాడు? ఈ రాత్రి ఒంటిగంటకు ఆశ్రమం నుంచి ఒక యువతి, యువకుడు బయటకు వెడతారు. వారినెవ్వరూ అభ్యంతర పెట్టవద్దు-అన్నాడు కదా!"
    "అంటే?"
    "నిన్ను ముద్దుపెట్టుకున్న ఆ స్వామి ముఖాన్ని పచ్చడి చేసి మరీ వెడతాను. అందుకు నాకు నీ సహకారం కావాలి-"
    "చిదానందస్వామిని నీవపార్ధం చేసుకుంటున్నావు. నా మాట విను. ఆయన దీవెనలతో మనం బయట పడదాం. ప్రజాక్షేమమే ఆయన ధ్యేయం. ఆయన ఏం చేసినా దాని వెనుక ఏదో అర్ధముంటుంది. ఆయన దైవస్వరూపుడు...." రమ అతడి మనసు మార్చడానికి ప్రయత్నిస్తోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS