కవిత చాలాసేపు ఆ ఫోటోలవంకనే చూస్తూండిపోయింది.
ఇదా తన భర్త చరిత్ర! ఇది ఈ రోజే తనకెందుకు తెలిసింది?
ఆమెకు అంతా అర్ధమైనట్లే అనిపించింది.
మరొక్కసారి తను చదివిన ఆ కథకోసం వెతకాలనుకుంది. ఎంత వెదికినా ఆమెకా పుస్తకం కనబడలేదు. ఆఖరికి భర్త వ్యాపార వ్యవహారాల మధ్య ఆమెకు దొరికింది ఆ పుస్తకం.
ఆ పుస్తకం అక్కడెందుకుంది?
సందేహంలేదు. చలపతిరావు ఈ కథను చదివాడు. ఆ కథ అతడిపై చెప్పుకోదగ్గ ప్రభావమే చూపింది. అతడికి భార్యపై అనుమానం ప్రారంభమైంది. అందుకోసం తనూ నాటకం ప్రారంబించాడు.
ఈ ఫోటోలు నిజమా-ఆ నాటకంలోని భాగమా?
ఏదిఏమైనా కవిత ఒక నిర్ణయానికి వచ్చింది. భర్తకు తన రహస్యం చెప్పలన్నదే ఆ నిర్ణయం. అయితే తనకు తానై కాదు. ఆ బ్లాక్ మెయిలరునే ఆ విషయాలు చెప్పనిస్తుంది. భర్త తనను నిలదీసి అడిగితే ఆ శామ్యూల్ నే ఇక్కడకు రప్పించమంటుంది. మానసికంగా తనను హింసించిన ఆ శామ్యూల్ ని కసితీరా తిడుతుంది.
అప్పుడు భర్త తనను వదిలిపెట్టాలనుకుంటే.....
ఆత్మహత్య!
అతడు నెంబర్ డయల్ చేసి-"హలో!" అన్నాడు.
అవతలనుంచి-"నేను కవితను. మీరెవరు?" అన్నగొంతు వినిపించింది.
"నేను శామ్యూల్ స్నేహితుణ్ణి-"అన్నాడతడు.
"అయాం సారీ మిష్టర్! నేను మీకు డబ్బిచ్చుకో లేను. మీరేం చేయాలనుకుంటే అది చేసుకొనవచ్చును."
అవతల క్లిక్ మంది.
అతడి కళ్ళలో ఆశ్చర్యం కనబడింది. తనూ రిసీవర్ క్రెడిల్ చేశాడు. తర్వాత జేబులో చేతులు పెట్టుకుని లేచి నిలబడ్డాడు.
కొద్ది క్షణాల్లోనే అతడు రోడ్డుమీద వున్నాడు. మరికొద్ది క్షణాల్లో చలపతిరావు ఎదుట వున్నాడు.
"ఆమె డబ్బివ్వడానికి నిరాకరించింది" అన్నాడతడు.
చలపతిరావు కళ్ళు మెరిశాయి-"రియల్లీ!" అన్నాడు.
"అవును...."
"థాంక్యూ మైడియర్ ఫెండ్..." అన్నాడు చలపతిరావు.
"నేను మీ స్నేహితుణ్ణి కాదు. శామ్యూల్ స్నేహితున్ని!"
చలపతిరావు అతడికి, శామ్యూల్ కు మరోసారి తన కృతజ్ఞతలు తెలియజేశాడు. అతడు వెళ్ళిపోయాడు.
చలపతిరావు ఆలోచిస్తున్నాడు.
తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కవితను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు దూరమై బ్రతుకలేడు. అయితే పెళ్ళికి ముందు బలహీన క్షణాల్లో తానో చపలచిత్త అయిన యువతి వలలో పడ్డాడు. అది తాత్కాలికం మాత్రం. ఎప్పుడో ఆ వ్యవహారం కవితకు చెప్పి ఆమె క్షమను పొంధాలనుకున్నాడు. కానీ ఈలోగా వెంకటేశ్వర్లు, లక్ష్మిల ఆదర్శ దాంపత్యం కోర్టుకెక్కింది.
ఆడది భర్తని ఎంతగా ప్రేమించినా, భర్తచే ఎంతగా ప్రేమించబడుతున్నా-ఒకోసారి చిన్న చిన్న విషయాల్లో ఎంతైనా మూర్ఖంగా ప్రవర్తించి నూరేళ్ళ సంసార జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోగలదని లక్ష్మి ఋజువు చేసింది.
లక్ష్మి కేసు కోర్టులో నడుస్తూండగానే తనపైన బ్లాక్ మెయిల్ ఆరంభమయింది. చలపతిరావుకు కవితపై నమ్మకం పోయింది.
ఏం చేయాలి?
కవిత తన్ను చీదరించుకుంటే.....
మన దేశంలోని ఆడది మానసికంగా ఇంకా ఎదగలేదు. కవిత ఎలాంటి తప్పుచేసినా తఃను భరించడానికి సిద్దంగా వున్నాడు. కానీ ఆమె అలా వున్నదో, లేదో..
చలపతిరావుకు శామ్యూల్ గురించి చూచాయగా తెలుసు. అతడు కవితను పెళ్ళిచేసుకోవాలనుకున్నాడనీ..కవిత తండ్రి అందుకంగీకరించలేదనీ.....
అతడు శామ్యూల్ ను కలుసుకున్నాడు. తన పరిస్థితిని, లక్ష్మి గురించిన విశేషాలు చెప్పాడు.
"మిమ్మల్ని కవిత ప్రేమించినదీ లేనిదీ నాకు తెలియదు. ప్రేమించి ఉన్నప్పటికీ అది గతంలో మాత్రమేనని నాకు తెలుసు. నన్నామె సానుభూతితో అర్ధం చేసుకోవాలంటే మీరామెను బ్లాక్ మెయిల్ చేయడం మినహా మరోదారిలేదు. మీరామెనెలా బ్లాక్ మెయిల్ చేస్తారో కూడా నేను తెలుసుకొనదల్చలేదు. ఒకప్పుడామెను ప్రేమించిన వ్యక్తిగా ఈరోజామె సంసారం చక్కదిద్దండి...."
ముందు అంగీకరించకపోయినా చివరికి శామ్యూల్ అంగీకరించాడు. తన స్నేహితుడిని పంపాడు.
ఇప్పుడేం జరుగుతుంది? నిన్న రేఖ తనను బెదిరించింది. ఫోటోలామెకు అందజేస్తానని! అందజేశానని కూడా ఆ తర్వాత ఫోన్ చేసి చెప్పింది.
ఫోటోలామెకు అందాయా? అందితే ఆమె రియాక్షన్ ఏమిటి?
* * *
ఇంట్లో భర్తకోసం ఎదురుచూస్తూ కవిత ఆలోచిస్తోంది. బ్లాక్ మెయిలర్ భర్తకు అన్నీ చెప్పేశాడా? భర్త ఇప్పుడు తన గురించి ఏమనుకుంటున్నాడు? అతడు వచ్చి తనను నిలదీస్తే తను ఏం చేయాలి? ఈ ఫోటోలు చూపించాలా?
తనాశించినట్లుగానే ఆ సాయంత్రం భర్త రాగానే బ్లాక్ మెయిలర్ విషయం చెప్పాడు. అతడు శామ్యూల్ విషయం చెప్పి, కవిత ఉత్తరాలు, డైరీ చూపించినట్లు, తను వాటిని అతడి మొఖానే కొట్టి బాగా చీవాట్లువేసి పంపినట్లు, చెప్పాడు....
కవిత హృదయం తేలికపడింది. భర్త ఔన్నత్యానికి, అతడికి తనమీదున్న నమ్మకానికి, ప్రేమకి కరిగిపోయింది.
ఆ తర్వాత ఏళ్ళు గడిచాయి.
ఫోటోల గురించి కవిత భర్తను అడగనేలేదు.
వారి దాంపత్యంలోని అన్యోన్యత మాత్రం చెక్కుచెదరకుండా వున్నది.
-:అయిపోయింది:-
