Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 34

 

    భానోజీరావు ఆశ్చర్యంగా మురళీధర్ ని చూసి, "మీది మామూలు ఆస్తి కాదు గదా, స్వంత ఇల్లు కూడా లేని స్థితి కెలా వచ్చావ్?" అన్నాడు.
    "నాన్నగారి అనారోగ్యం సమయంలో సహాయం పేరిట వచ్చాడు భూషయ్య, నాన్నగారు పోయాక మగదిక్కు పేరిట మరి కొన్ని రోజులున్నాడు. ఆయనిలా మోసం చేశాడో తెలియదు కానీ మేము దిక్కులేని వాళ్ళమై పోయాం."
    భానోజీరావు పిడికిళ్ళు బిగిశాయి. "ఓ కంప్లయింట్ రాసియ్యి. దర్యాప్తు చేస్తాను."
    మురళీధర్ విషాదంగా నవ్వి , "ఇది చాలా పాత కధ. ఇప్పుడు మనం చేయగలిగిన దేమీ లేదు. నువ్వు నిజంగానే ట్యూబు లైటువి. లేకుంటే నాకన్యాయం జరిగిన పదేళ్ళకు నా కళ్ళ ముందు ఇన్స్ పెక్తర్ల్ నిలబడుండేవాడివి కాదు" అన్నాడు.
    "అలాగనకు. రామారావు, నేనూ కలిశామంటే శవాల చేత కూడా మాట్లాడించగలం. నీకు జరిగిన అన్యాయాన్ని తొలగించడానికిప్పటికీ సమయం మించి పోలేదు"
    "నీ అభిమానానికి కృతజ్ఞుడ్ని కానీ, ఒక చిన్న సహాయం చేసి పెట్టు. నీ ఏరిక లోని ఎప్పుడైనా చిన్న ఇల్లు సుమారు పాతిక వేల ఖరీదులో దొరికేలా వుంటే నాకు చెప్పు. నాకు ఇల్లు కట్టించుకుందుకు , కొనుక్కోదానికి ఆ మేరకు మా ఆఫీసు వాళ్ళు సహాయం చేస్తారు" అన్నాడు మురళీధర్.
    భానోజీరావేదో అనబోతుండగా రాజు వచ్చి - "నాన్నా , మీకు టెలిఫోన్ వచ్చింది" అన్నాడు.
    భానోజీరావు ఆశ్చర్యపడుతూ , "మీఇంట్లో టెలిఫోన్ కూడా వుందా ?" అన్నాడు.
    "ఇంటి వాళ్ళ కుంది. చాలా మంచివాళ్ళు. నాకెప్పుడు ఫోన్ కాల్ వచ్చినా, మాకు తెలియదని పెట్టేయకుండా కబురు చేస్తారు" అంటూ మురళీధర్ లేచాడు.
    'అయితే ఇహనేం, మనం అస్తమాను ఫోన్ లో  కాంటాక్ట్ చేసుకుంటుండవచ్చు...."
    "ఎదుటి వాళ్ళ మంచితనాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. అత్యవసర పరిస్థితి యేర్పడినప్పుడు మాత్రమే, నువ్వు నన్ను కాంటాక్ట్ చేయడానికి ఫోన్ ఉపయోగించు" అంటూ మురళీధర్ ఫోన్ దగ్గరకు వెళ్ళాడు.

                                    5
    ఆఫీసులో ఏదో ఫైలు చేస్తున్నాడు మురళీధర్. ఫ్యూన్ వచ్చి "నీ కోసం ఎవరో పోలీసాఫీసర్ వచ్చాడండీ" అన్నాడు. "పంపించు" అన్నాడు మురళీధర్ సాలోచనగా.
    లోపలకు వచ్చాడు ఇన్ స్పెక్టర్ భానోజీరావు.
    "నువ్వా రా కూర్చో. పోలీసా ఫీసర్ వచ్చాడంటే ఎవరో అనుకున్నాను."
    "వెరీ గుడ్ న్యూస్ మురళీ." అంటూ కూర్చున్నాడు భానోజీరావు.
    "ఏమిటది?" అన్నాడు మురళీధర్.
    "ఒక ఇల్లు సరిగ్గా ఇరవై మూడు వేలు చిన్నదే కానీ చాలా మోడర్న్ గా ఉంటుంది. కేవలం నా ద్వారా రావడం కారణంగా ఇరవై మూడు వేలు. అసలు దాని ఖరీదు ముప్పై వేలకు పైగా చేస్తుంది. ఇంటాయన అనుకోని ఇబ్బంది వచ్చి ఇల్లు అమ్మేసు కుంటున్నాడు. ఒకకేసులో ఆయనకు నేను చాలా సహాయం చేశాను. కాబట్టి అది మనకే ఇస్తానని వాగ్దానం చేశాడు. లేకపోతె ఇంటికి చాలాపోటీ ఉంది...."
    మురళీధర్ కళ్ళలో మెరుపు కనబడింది. 'చాలా థాంక్స్ రా ఇల్లెక్కడుంది " ఈ ఊళ్ళో నేనా?" అనడిగాడు.
    "అవును డబ్బుంటే నేనే ఆ ఇల్లు కొనుక్కొని ఉండేవాడిని. అంత చూడముచ్చటగా ఉందా ఇల్లు. ఒకసారి చూశావంటే...."
    మురళీధర్ ఉత్సాహంగా లేచాడు. "నా గురించి నువ్వు తీసుకుంటున్న శ్రద్దకు చాలాసంతోషంరా. నీకభ్యంతరం లేకుంటే ఇప్పుడే ఒకసారి వెళ్ళి చూసొద్దాం."
    "మరీ అంత కంగారు పనికి రాదు. నేను పని మీద ఇలా వెడుతున్నాను కాబట్టి వార్త చెప్పిపోదామని వచ్చాను. సాయంత్రమైతే చెల్లాయీ, మేనల్లుడూ కూడా వస్తారు. అంతా కలిసి వెళ్ళొచ్చు. మీరంతా బయల్దేరి నేరుగా మా ఇంటికి కొచ్చేయండి. అక్కణ్ణించి కలిసి టాక్సీలో వెళ్ళి ఇల్లు చూసుకుని వద్దాం."
    "ఇంతకీ లొకేషన్ ఎక్కడ?"
    "రామనాధ పురం లో, కబురు నిన్న మధ్యాహ్నం తెలిసింది. ఇల్లు నిన్న రాత్రి చూశాను. నీకిప్పుడు చెప్పాను." అంటూ భానోజీరావు బూట్లు శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయాడు.
    మురళీధర్ మనస్సు ఆనందంతో నిండిపోయింది. అతను భానోజీరావు ని మనసులో పదేపదే అభినందించుకున్నాడు. తన చిరకాల వాంచితం ఈడేరబోతోంది.
    అతను తన సీటు దగ్గర్నుంచి కదిలి వెళ్ళి గుమాస్తాలు కూర్చునే హాల్లోకి వెళ్ళాడు. వేగంగా అడుగులు వేసుకుంటూ ఒక క్లర్కును సమీపించి "నా హౌస్ బిల్డింగ్ లోన్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది?' అనడిగాడు.
    తన స్వంత విషయాలు తెలుసుకొనడానికి మురళీధర్ స్వయంగా తనే జూనియర్స్ దగ్గరకు వెడతాడు. ఆఫీసు వ్యవహారాలకు మాత్రమే అతను వారిని తన గదిలోకి పిలుస్తాడు. ఆ ఆఫీసులో మురళీధర్ లా ప్రవర్తించే ఆఫీసర్స్  మరెవ్వరూ లేరు. అందుకే అతని జూనియర్స్ కతనంటే చాలా గౌరవం.
    సమాధానం తక్షణం వచ్చింది. "లాస్ట్ ఫేజ్ లో ఉంది సార్. నిన్ననే నా స్నేహితుడోకడు డిల్లీ నుంచి వచ్చాడు. అతన్ని మీ విషయం మన హేడ్డాఫీసులో కనుక్కోమని చెప్పాను. అతను చెప్పిన ప్రకారం నిన్నో, ఈ రోజో అ కాగితాలు డిస్పాచ్ అవుతాయి...."
    థాంక్స్ చెప్పి మురళీధర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఫైనల్ పేపర్స్ ఈరోజు డిల్లీ లో డిస్పాచ్ అయుంటే మరో మూడ్రోజుల్లో తన ఆఫీసు చేరుకుంటాయి. ఆఫీసులో ఫార్మాలిటీస్ పూర్తీ కావడానికి ఒకరోజు పడుతుంది. ఆ మర్నాడు చెక్కు తన చేతిలో ఉంటుంది.
    సరిగ్గా అయిదో రోజు నాటికి తన చేతికి డబ్బు వస్తుంది. అనుకోని అలస్యమేదైనా జరిగినా మరో రెండ్రోజుల కంటే జాప్యం కాదు.
    ఆఫీసు నుంచి అతను చాలా ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు. అతని ముఖంలో వెలుగును చూసి చాలా ఆశ్చర్య పోయింది ఉమ. విషయం విన్నాక ఆమె ముఖంలోనూ వెలుగు వచ్చింది.
    "రామనాధ పురం చాలా డీసెంట్  లోకాలిటీ అండీ. నిజంగా చాలా అదృష్టమే" అంది ఉమ.
    త్వరగా టిఫిన్ తిని రిక్షాలో భానోజీరావు ఇంటికి వెళ్ళారు మురళీధర్, ఉమ, రాజులు. అప్పటికే భానోజీరావు దంపతులు, ఇద్దరు కుర్రాళ్ళతో సహా సిద్దంగా ఉన్నారు. మురళీధర్ రాగానే "శాంతా టిఫిన్ తొందరగా సిద్దం చేయి" అన్నాడు భానోజీరావు.
    "మేము తినే వస్తున్నాం" అన్నాడు మురళీధర్ భయంగా.
    "మీ ఇంటికి నేను తినకుండా వచ్చేస్తున్నానుకున్నారా?" అన్నాడు భానోజీరావు.
    "తిని వచ్చినా భయం లేదు లెండి. కడుపు నిండిన వాళ్ళ క్కూడా ఆకలి పుట్టించేలా తయారు చేయగలను నేను పదార్ధాలను" అంది శాంత. ఒక్క క్షణం ఆగి, "అప్పుడప్పుడు ఆ పధర్మం గా నన్ను నేను పొగుడు కుంటుంటాను. ఏమీ అనుకోకండేం. ఐనా టిఫిన్ తింటే నా మాటల్లో అతిశయోక్తి లేదని మీరేగ్రహిస్తారు" అంది లోపలకు వెళ్ళి ప్లేట్ల లో పెసర పునుగులతో తిరిగి వచ్చింది.
    'అబ్బ! పెసరపునుగులు నాకు భలే యిష్టం"అన్నాడు రాజు అప్రయత్నంగా.
    భానోజీరావు తో సహా అందరూ వెంటనే నవ్వారు. నిజంగానే శాంత మాటల్లో అతిశయోక్తి లేదని పుణుకులు తింటూ అనుకున్నారు మురళీధర్, ఉమ.
    టిఫిన్ తిన్నాక అందరూ వీధిలోకి వచ్చారు. భానోజీరావు ఇంటి తలుపులు తాళం వేశాడు.
    అంతా టాక్సీలో రామనాధపురం వెళ్ళారు. టాక్సీ దిగాక భానోజీరావు ని మిగతా అందరూ అనుసరించారు. అతను వాళ్ళనొక చిన్న బంగళా ముందుకు తీసుకు వెళ్ళాడు.
    ఇంటి చుట్టూ కొద్దిగా ఆవరణ ఉంది. ఇల్లు చిన్నదే గానీ, బయటకు చాలా నీటుగా అనుతోంది.
    గేటు తీసుకుని అంతా ఇంటి ఆవరణలో ప్రవేశించారు. భానోజీరావు వెళ్ళి ఇంటి తలుపు తట్టాడు.
    ఇంటాయన కాబోలు తలుపు తీశాడు. "వచ్చేరా, రండి, రండి!" అన్నాడాయన.
    అందరూ ఇంట్లోకి వెళ్ళారు. ఇల్లు చూసుకునే కార్యక్రమం త్వరగానే ముగిసింది. అందరి ముఖాల్లోనూ అంతులేని తృప్తి కనబడుతోంది.
    ఇంటాయనని భానోజీరావు అందరికీ పరిచయం చేశాడు. అయన వయస్సు నలభై అయిదు సంవత్సరాలుంటుంది. పేరు లక్ష్మీ కాంతం. కేవలం వీళ్ళ కిల్లు చూపించడం కోసమే ఆయనిక్కడుంటూన్నాడు. అయన మకాం వేరే స్నేహితుడ్ ఇంట్లో, హైదరాబాద్ లో వ్యాపారస్తుడిగా సెటిల్ కాబోతున్నాడాయన. చాలా ఊళ్ళ లో ఇలా చిన్నచిన్న ప్రాపర్తీలున్నాయి  ఆయనకు. అవన్నీ క్లియరాఫ్ చేసి ఆ సొమ్మంతా వ్యాపారంలో పెట్టదల్చుకున్నాడాయన.    
    "ఈ ఊళ్ళో సరిగ్గా వారం రోజులుంటాను నేను. డబ్బు నాకు వారం రోజుల్లో అందజేయాల్సి వుంటుంది. నా ఇంటి గురించి చాలామంది అడుగుతున్నారు. ఇంతకూ మించి నేను చెప్పాల్సిందేమీ లేదు" అన్నాడు లక్ష్మీ కాంతం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS