'ఆహా , అదేం కాదు -- మన సరదాలకి ఇబ్బందిగా వుంటుందని మొహమ్మాట పడి వుంటారు. ఆ మాట అననే అన్నారుగా.' అంది కళ్యాణి ఈ మాలతే మిటి ఇలా లేనిపోని అర్ధాలు తీస్తుంది అని విస్తుపోతూ.
'నేనూ మొదట అలాగే అనుకున్నాను. -- తరువాత టిఫిన్ తిని వాష్ బేసిన్ లో చెయ్యి కడుక్కుంటుంటే గదిలో వాళ్ళు మెల్లిగా మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి. 'ఎంత చనువున్నా పరాయి మొగవాళ్ళతో వెళ్ళటం మర్యాదగా వుండదనీ చూసే వాళ్ళంతా ఏమైనా అనుకుంటారని ఏమేమిటో అంటోందావిడ. సరే నీ యిష్టం అంటూ ఆయనా వూరుకున్నారు -- పైకి ఎంతో సోషల్ గా ఫార్వార్డ్ గా కనిపించేవాళ్ళు మనస్సులో ఎంత సనాతనంగా ఆలోచిస్తారు. అనిపిస్తుంది నాకు.....' మాలతి చెప్తుంటే ముగ్గురూ మౌనంగా వింటూ వుండిపోయారు.....
'ఆ సంఘటన ఇప్పుడు ఎత్తి చూపి ఆనాటి శారద ప్రవర్తన ని మెచ్చుకుంటూ ఈయన దగ్గర నుంచి వచ్చిన విసురుకు అర్ధం ఏమిటి? పరువూ మర్యాదా మంచి అన్నీ వున్న పెద్ద వంశంలో పుట్టి నది కనుక శారద అంత దూరం ఆలోచించింది. నీలాంటి పుట్టుక పుట్టిన దానికి ఆ మంచి చెడ్డలన్నీ ఎలా తెలుస్తాయి. పిలిచినదే చాలు అన్నట్లు ఎవరి వెంటయినా సరే పడిపోతావు.' అన్న అర్ధంతో అన్నారా అనే వూహ ఆమె వంట్లో వున్న రక్తాన్నంతా నీరుగా మార్చేసి నట్లుంది.
'వారు లేకుండా ఇంకొక కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్లి వచ్చినందుకే నేను మంచీ మర్యాద లేని దాన్నయి పోయానా-- ఈ మాత్రానికే నా ప్రవర్తన నలుగురూ వేలెత్తి చూపించేది అయిపోయినదా? 'వాని ఉదాత్త మైన భావాలు, నలుగురు అతి సామాన్యంగా ఆలోచించే విధానంలో నేను ఆలోచించలేను. నలుగురూ నడిచే బాటే సరి అయినది, మరో క్రొత్త మార్గం వెంట నడవటం అంటే అది కొరివితో తలగోక్కున్నట్లే అని నేను -- నమ్మను.' అంటూ అనురాగంతో నన్ను అక్కున జేర్చుకున్నవారు ఇవాళ ఎందుకిలా ఆలోచిస్తున్నారు.' అని మధనపడి పోతూ----
చాలాసేపు అలా గడప వారే నిలిచిపోయి చివరికి మరి నిలబడటానికి కూడా శక్తి లేక మెల్లిగా గదిలోకి వెళ్ళింది కళ్యాణి. అప్పటికే మురళీ పెద్ద లైటు ఆర్పేసి తన మంచం మీద దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకున్నాడు-- అది నిద్ర అవునో కాదో ఆమెకి తెలియలేదు కాని, కొంచెం సేపటి క్రితం జరిగింది తలుచుకుంటూ అతన్ని చూస్తూ ఓ నిట్టుర్పు విడిచి వెళ్లి తన మంచం మీద వాలిపోయింది.
ఆ మధ్యాహ్నం ఒక మంచి నవల చదివాను. ఆ సాయంకాలం శాంతా వాళ్లతో సరదాగా ఒక మంచి సినిమా చూశాను అవే సంతోషం, ఆ అనుభూతి మచ్చుకైనా మిగలక పొగా బరువైన గుండెలతో కళ్ళు మూసుకుంది నిద్ర రాకపోయినా -- తెల్లవారింది.
మురళీ లో ఆవేశం చాలావరకు దిగజారి పోయింది. తను చేసిన పనికి అన్న మాట లకి పశ్చాత్తాపం కలగసాగింది-- కళ్యాణి మొహం చూడాలంటే నూ ఆమెని పలకరించా లంటే నూ ఏమిటో బిడియంగా వుంటోంది -- అందులోనూ కళ్యాణి కూడా చాలా ముభావంగా అంటీ ముట్టనట్లు వుండటం తో మురళీ కి ఆమెని పలకరించాలంటే నే ధైర్యం చాలలేదు-- అలాగే కాఫీ త్రాగి , స్నానం చేసి, భోజనం చేసి ఆఫీసుకి వెళ్ళాడు-- కాని అక్కడా ఏ పనీ చేయ బుద్ది కాలేదు. 'ఇంటికి వెళ్ళాలి , కళ్యాణి ని పలకరించి బ్రతిమిలాడు కోవాలి' అనే వూహ మనస్సుని నిలవనీయా కుండా చేస్తున్నా ఏదో అభిమానం మరేదో మొహమ్మాటం అడ్డు వచ్చి అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళిపోయే ఆలోచనకి కళ్ళెం వేశాయి.. అలాగే సాయంత్రం దాకా గడిపి ఇంటికి వచ్చాడు.
కళ్యాణి -- వడలిపోయిన మొహం, నలిగిన చీరా, రేగిన జుట్టూ-- వాడిపోయిన మల్లె చెండులా వుంది. లోపలికి వస్త్గూనే మురళీ చటుక్కున తన రెండు చేతుల తోనూ -- ఆమెని చుట్టేసి దగ్గరికి తీసుకుంటూ 'నిన్నటి నా మాటలేమీ మనస్సులో పెట్టుకోకు కళ్యాణి-- నా ప్రవర్తన కి నేనే సిగ్గు పడుతున్నాను' అన్నాడు.
కళ్యాణి ఏమీ మాట్లాడలేదు.
'నా మీద నీకు బాగా కోపంగా వుంది కదూ' గడ్డం పట్టుకుని ఆమె మొహం పైకెత్తి బిడియంగా చూస్తూ అన్నాడు.
కళ్యాణి ఉదాసీనంగా కళ్ళు వాల్చేసుకుంది. 'నాది కోపం కాదు-- నిన్నటి మీ ప్రవర్తనతో మాటలతో నా అంతరంగం ఎంతగా విలవిల్లాడి పోతోందో మీకు అర్ధం కాదు-- ఇవాళ మీరు నవ్వుతో పలకరించి నన్ను క్షమించు కళ్యాణి అన్నంత మాత్రాన నా వ్యధ అంతా ఒక్కసారి చేత్తో తీసి పారేసినట్లు పోతుందా, నా గుండెలలో ఏర్పడిన గాయం ఏదో మంత్రం వేసినట్లు మాయం అయిపోతుందా? ' అని అడగాలనిపించినా మౌనంగానే వుండిపోయంది.
'నిన్న నువ్వు ఏం చెప్పావో జ్ఞాపకం వుందా ? ఇవాళ నన్ను సినీమాకి తీసుకు వెడతా నన్నావు కదూ.
కల్యాణి సమాధానం చెప్పలేదు.
'త్వరగా తయారవు మరి....నేను కూడా సాయం చేస్తాను. నిన్నటిలా కాదులే' గంబీరంగా వున్న వాతావరణా న్ని చెదుర గొట్టాలని అతను నవ్వుతూ అంటుంటే --
'నాకివాళ ఎక్కడికీ రావాలని లేదు.' అంది కళ్యాణి పొడిగా.
'చూడు ఏ విషయమైనా ఎప్పటి కప్పుడు మరిచిపోవాలి కాని, అదే మనస్సులో పెట్టుకు కూర్చుంటే ఎలా-- దీర్ఘ కోపం కూడదు అంటారు మన పెద్దలు. వినలేదా? అందునా జరిగినదానికి నేను పశ్చాత్తాప పడుతున్నాను అని బ్రతిమాలు కుంటున్నప్పుడు కూడా....' అతని గొంతులో సుళ్ళు తిరిగుతున్న వ్యధ వ్యక్తం అవుతుంది.
'నాకు కోపం ఏమిటీ, ఇవాళ ఎక్కడికీ రావాలని పించటం లేదు అంతే.' అని మెల్లిగా అతని చేతులు విడిపించుకుని లోపలికి వెళ్ళిపోయింది.
14
నాలుగు రోజులు గడిచిపోయాయి. ఏ సంఘటనా ప్రభావం అయినా కాలం గడుస్తున్న కొద్దీ సన్నగిల్లి పోతుంది. వ్యక్తుల మీద ఆయా పరిస్థితులు కల్పించిన అనుభూతులు పల్చబడి పోతాయి. కళ్యాణి క్రమంగా మామూలు మనిషి అయింది.
సాయంకాలం మురళీ ఆఫీసు నుండి వస్తూ బజారు లో కొని తెచ్చిన చేమంతి పువ్వుల చెండు కళ్యాణి చేతికి అందిస్తూ, 'ఈ మధ్య నువ్వు పువ్వులు కొనుక్కోటం మానేశావెం?' అన్నాడు.
'ప్చ్ -- నాకేమిటో దేనిమీదా సరదా వుండటం లేదు. ' తెచ్చి పెట్టుకున్న గంబీర్యంతో అంది కళ్యాణి.
'ఇంక నేను అలాంటి మాటలు వినదలుచు కోలేదు-- ఇవాళ నువ్వు నాతో సినిమాకో, షికారు కో వచ్చి తీరాల్సిందే -- లేకపోతె-- ' కళ్యాణి ని మించిన గంబీర్యం నటించాడు మురళీ.
'ఊ , లేకపొతే ?' రాబోతున్న నవ్వుని పెదవుల మధ్యే బిగపట్టింది కళ్యాణి అతని మాటలని రెట్టిస్తూ.
'అమాంతంగా నిన్ను నా రెండు చేతులలో కి తీసుకుని, తిన్నగా ఏ పార్కు లోకో సినిమా హల్లోకో తీసుకెళ్ళి అక్కడ కూలేస్తాను.' మురళీ సరదాగా నవ్వేస్తుంటే కళ్యాణి శృతి కలిపింది -- కాస్సేపటి తరువాత ఇద్దరూ పార్కు లోకి వెళ్లి కూర్చున్నారు. ఆసరికే పార్కంతా పిల్లలతో, పెద్దలతో చాలా కోలాహలంగా వుంది. గుంపులు గానూ, జంటలు గానూ ఒక్కో దగ్గర ఒంటరి గానూ, పచ్చిక మీద సిమెంటు బెంచీల మీద కూర్చుని వున్నారు జనం -- బెలూన్లూ, చిప్స్, ఐస్ ప్రూట్ లు అమ్మే అబ్బాయిలు వాటిని చేతులలో పెట్టుకుని వాళ్ళందరి మధ్యా పచార్లు సాగిస్తున్నారు-- వాళ్ళకి కాస్త దూరంలో కూర్చున్న మురళీ కళ్యాణి కబుర్లు చెప్పుకుంటూ ఆ సందడి నంతా చూస్తున్నారు.
'మీరు ఇక్కడ ఉండి పోయారా -- ఇంత సేపూ చూడనే లేదు.' అన్నట్లు వో అబ్బాయి గబగబా వచ్చి 'చిప్సు ' అంటూ ఆ పొట్లాలు వాళ్ళ మొహాల ముందు వోసారి గలగల లాడించాడు.
'అక్ఖర్లేదు ' అంటూ చెయ్యి ఊపాడు మురళీ.
'ఏమిటి బాబూ-- పరధ్యానంగా వున్న వాళ్ళు ఉలిక్కిపడేలా అలా అరిచాడు?' అంది కళ్యాణి వెళ్ళిపోతున్న ఆ అబ్బాయి వంక చూస్తూ.
'నీ వులికి పాటుని గురించి ఏం చెప్తావు-- అక్కడ -- అటు-- పిల్లలతో వచ్చిన వాళ్ళ అవస్థ చూడు' అన్నాడు మురళీ.
'ఇంటి వాతావరణం లో విసిగిపోయి కాస్సేపు ప్రశాంతంగా కూర్చుందాం అని వచ్చిన వాళ్ళని అస్సలు స్థిమితంగా కూర్చో నీవ్వరు వీళ్ళు -- అక్కర్లేదని ఒకసారి చెప్పినా వినిపించుకోకుండా ఒకరి తరువాత ఒకరు అలా వస్తూనే వుంటారు -- ఎలాగో అలా బేరం చేసుకోవాలని వాళ్ళ ఆరాటం. మన విసుగు చిరాకు వాళ్ళెం పట్టించు కోరు మరి-- పెద్దవాళ్ళం అయితే మన ధోరణి లో మనం వుంటాం కాని పిల్లలు వూరు కోరుగా -- పెద్ద వాళ్ళని బ్రతి మాలుకునో, ఏడిచో , కోపగించు కునో తమ క్కావలసింది కొనిపించుకుంటారు. ఆ రహస్యం తెలిసే వీళ్ళు కూడా అలాంటి వారి చుట్టూ ప్రక్కలే తచ్చాడుతూ వుంటారు' అంది కళ్యాణి.
'చుట్టూ వున్నవాళ్ళు ఏమైనా అనుకుంటారే మోననే మొహమ్మాటం తోనూ, పదిమంది ఎదుటా పిల్లల్ని ఏడిపించటం ఇష్టం లేకనూ విధి లేనట్లు కొని పెడతారే కాని, కొంతమంది నిజంగా కావాలని ఇలాంటి ఖర్చు చెయ్యరు.....ఇంట్లో కొట్టినా తిట్టినా బయట ఏమీ అనరు కదా అనే ధైర్యంతో కొంత మంది పిల్లలు కూడా మంకు పట్టు పడతారు -- అది సరే ....అందరి పిల్లల్ని గురించి ఇచ్చి కబుర్లు చెప్పుకుంటున్నాం ...మరి రేపు మన అబ్బాయి ఏం చేస్తాడో చూడాలి ....' మురళీ కళ్ళల్లో చిలిపితనం చిందు లేస్తుంటే కళ్యాణి కళ్ళల్లో మొహంలో అదో విధమైన కాంతి మెరిసి పోయింది -- బిడియంగా తల తిప్పేసుకో బోతుంటే చటుక్కున ఆమె చేయి అందుకుని వేలికి వున్న మంచి ముత్యపు వుంగరంతో ఆడుకుంటున్నట్లు ఇటూ అటూ కదిలిస్తూ అన్నాడు.
'అన్ని దొంగ ఖబుర్లు -- చదువు కుంటాను. పరీక్షలు వ్రాస్తాను. డిగ్రీ తెచ్చుకుంటాను అని చెప్పి ...' మురళీ కళ్ళతోనే వెక్కిరిస్తుంటే కళ్యాణి మూతి ముడుచుకుంది.' 'అలా చూడకు మరి ....పోనీలే . మరేం దిగులు పడకు. ముందీ పరీక్ష లయిపోయాక అప్పుడా పరీక్ష లో ప్యాసు చేయించే పూచీ నాది' 'చూద్దాం.' జలతరంగిణి మ్రోగించినట్లు నవ్వింది కళ్యాణి -- ఇంతలో అటు ప్రక్క ఎవరో కాస్త గట్టిగా మాట్లాడటం వినిపించి ఇద్దరూ అటు తిరిగారు.
అక్కడ వో కుటుంబం -- ఒక ఆయనా ఆవిడ ముగ్గురు పిల్లలు కూర్చుని వున్నారు. బెలూన్లు, చిప్సు, పెకేట్లూ అవీ అమ్మే కుర్రాళ్ళు వాళ్ళ చుట్టూ మూగి వున్నారు.
.jpg)
'అక్కర్లేదని చెప్తుంటే మీక్కాదు ? వెళ్ళండి' అంటున్నాడాయన గట్టిగానే . ఊహూ , వాళ్ళు వింటేనా వోసారి కాస్త అటు ప్రక్కకి నాలుగడుగులు వేసినట్లే వెయ్యటం మళ్లీ రావటం మళ్లీ అయన కసురుకునే సరికి కాస్త వెనక్కి వెళ్ళటం అలా ఆ కుటుంబం చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే వున్నారు. ఇంతలో అందులో వో అబ్బాయికి హటాత్తుగా వో ఆలోచన వచ్చింది. ఆ పిల్లలకి మరీ దగ్గరిగా వెళ్లి వాళ్ళని వూరిస్తున్నట్లు చెయ్యి ముందుకు జాపి పొట్లాలు గలగల లాడిస్తూ 'చిప్సు అంటూ వో అరుపు అరిచాడు. ఆ మరుక్షణం లోనే ఆ ముగ్గురి పిల్లల చేతుల్లోనూ తలో పొట్లం వుంది, పెద్ద వాళ్ళు చూసి వారించే లోపునే వాళ్ళు ఆ వుల్లిపోర కాగితం సంచీ మూతి సర్రున చించేశారు.
