"స్నేహితుడు కాదు బాగా తెలిసిన వాడు" అన్నాడు మోహనరావు.
"అతను వాచీ ఎందుకమ్మాడో తెలియదా మీకు?"
"ఏదో సెంటిమెంటు. అది అచ్చొచ్చిన వాచీ అట...."
"ఎంత అచ్చొచ్చినా వెయ్యిరూపాయల కంటే ఎక్కువా?"
"ఎక్కువైనట్లే కనబడుతోంది కదండీ-" అన్నాడు మోహనరావు.
వీరభద్రం ఆలోచిస్తూ "ఆ వాచీని ఎలాగో అలా సంపాదించాలి....." అన్నాడు.
మోహనరావు ఆశ్చర్యంగా వీరభద్రాన్ని చూస్తూ-"అంతకంటే మంచి వాచీలు చాలా దొరుకుతాయి. ఎందుకండీ మీకు దానిమీద అంత మోజు" అన్నాడు.
వీరభద్రం స్వరాన్ని కాస్త తగ్గించి "నాది విచిత్ర మనస్తత్వమని మీరనుకుంటే అనుకోవచ్చు. కానీ ఎవరైనా ఏదైనా ఒక వస్తువుకోసం అమితంగా మోజు పడుతుంటే ఏదో విధంగా దాన్ని వారినుంచి వేరు చేయడం నాకు సరదా. సరదా ఏమిటి-అది నా హాబీ అనవచ్చు, బలహీనత అనికూడా అనవచ్చు-" అన్నాడు.
ఈ మాటలు వినగానే మోహనరావు కాస్త భయపడ్డాడు. వీరభద్రం హాబీ అంత మంచిదని అతనికి తోచలేదు సరిగదా వీరభద్రం ప్రమాదకరమైన వ్యక్తి అని కూడా అతని కనిపించింది.
"వాటం చూస్తూంటే రామారావుకా వాచీ ప్రాణంలా వుంది. ఎలాగో అలా అది నా స్వాధీనం చేసుకునేదాకా నాకు నిద్రపట్టదు...." అన్నాడు వీరభద్రం గొణుగుతున్నట్లు-"ఈ విషయంలో నాకు మీరేమైనా సాయపడగలరా?"
అడ్డంగా తల ఊపాలనిపించినా అలా చేయలేదు. మోహనరావు. అతని మొహం చూసిన వీరభద్రం మాత్రం "పెద్దగా నా కితడేమీ సాయపడలేడు-" అనుకున్నాడు. పైకిమాత్రం-"నేను మరీ ఎక్కువ డబ్బున్న వాణ్ణి కాదు. ఆ వాచీమీద మాత్రం నాకు చాలా మోజుగా ఉంది. మీ మిత్రుణ్ణి ఇన్ ఫ్లుయన్స్ చేయడానికి ప్రయత్నించండి....." అన్నాడు.
4
రామారావుకి ఆ ఊళ్ళోనే అనువైన స్థలంలో ఇళ్ళ స్థలం కేటాయించబడింది. అక్కడ ఇల్లు కట్టుకోడానికి అతనికి లోన్ కూడా శాంక్షనయింది. అయితే అందుకు సంబంధించిన కొన్ని కాగితాలు మాత్రం కదలడంలేదు. చూస్తూండగానే రోజులు గడిచిపోయాయి కానీ ఆ కాగితాలు ఓ గుమాస్తావద్ద ఆగిపోయాయి. ఆగిపోయి అలాగే ఉండిపోయాయి.
లోన్ గురించిన సమాచారంకోసం సుమారు రెండు నెలలు ఎదురుచూసేక-రామారావా ఆఫీసుకు వెళ్ళి ఎంక్వయిరీ చేశాడు- "టైము పడుతుందండీ-" అన్నాడా గుమాస్తా.
తల నెరిసిన వృద్దుడొకడు రామారావుని పక్కకు పిలిచి విషయమడిగి-"నీతోపాటు శాంక్షన్ వచ్చిన వాళ్ళందరూ అప్పుడే పునాదులు తీయించేశారు. నువ్వింకా మొదట్లోనే ఉన్నావు. ఇలా ఎదురుచూస్తూ కూర్చుంటే నీ డబ్బు రాదు సరిగదా-మళ్ళీ ఫ్రెష్ గా లోన్ కు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ గుమస్తాను సంతృప్తి పరచవలసి ఉంటుందన్న చిన్న విషయం నీకు తెలియదా?" అంటూ మందలించాడు.
"అదే- ఆయన్నడిగి చూశాను. లంచం తీసుకోనన్నాడు...." అన్నాడు రామారావు అమాయకంగా.
"లంచం తినేవాడెవ్వడూ తీసుకుంటాననడు. ఆయన రేటు నూటపదహార్లు అవి తీసుకుని మాట్లాడకుండా ఆయన చేతిలో పెట్టండి. నెలతిరక్కుండా మీకు చెక్కు చేతికొస్తుంది...." అంటూ సలహా పారేశాడు ముసలాయన.
రామారావు కాయన చెప్పింది నిజమేననిపించింది. అనుమాన నివృత్తికోసం అతను మరోసారి ఆ గుమస్తానుచేరి-"రేపు నూటపదార్లతో తమ దర్శనం చేసుకుంటాను...." అన్నాడు.
"మంచిది-" అన్నాడు గుమాస్తా. ఆ చూపులు ప్రసన్నంగా ఉన్నాయి.
రామారావు ఇంటికివెళ్ళి తండ్రితో విషయం చర్చించాడు. త్వరగా లోన్ శాంక్షన్ కావాల్సిన అవసరం ఎంతయినా ఉందని రంగనాధం కూడా అంగీకరించాడు. ఆ డబ్బుతో ఇల్లు కట్టడం అయిపోతే ప్రతినెలా ఇంటి అద్దె లోంచి బాకీ తీర్చేయవచ్చు. తీర్చడానికి సుమారు ఇరవై ఏళ్ల గడువుంది.
"అర్జంటుగా నూటపదహారు రూపాయలు కావాలి. రెండు నెలల్లో పునాదులు తీయకపోతే స్థలం మనకు దక్కదు. వేరే ఎవరికో అల్లాట్ అయిపోతుంది. మనమింకా నానుతాడు విడిపించుకోలేకపోయాం...." అన్నాడు రామారావు దిగులుగా. అతని దిగులుకు అర్ధంలేకపోలేదు చిన్న చిన్న చిల్లర అప్పులు తీర్చుకోలేని ఆర్ధిక పరిస్థితిలో-తామసలు ఇల్లు కట్టగలమా అని అతని బాధ!
"అలా భయపడకు. ఈ రోజుల్లో ఏ పనికైనా ధైర్యమూ, చొరవా ఉండాలి. నానుతాడు విడిపించుకోలేకపోయామని భయపడుతుననవు గానీ-స్థలం కొన్నామని మరిచిపోతున్నావు. మనకు అవసరం లేదనుకుంటే ఆ స్థలాన్నమ్మినా మనకు డబ్బు వస్తుంది- కానీ ఇల్లు కట్టుకునే అవకాశం వదులుకోకూడదు. స్వంతిల్లు ఎంతైనా అవసరం...." అన్నాడు రంగనాధం.
రామారావు బాగా ఆలోచించి ఆఫీసులో తన మిత్రులు నెవరినైనా అడిగి తీసుకుందా మనుకున్నాడు.
అయితే మర్నాడతనికి చుక్కే ఎదురయింది. ఆఫీసులో అంతా అతనిలాంటి వాళ్ళేం! ఒకతనుమాత్రం-"వీరభద్రాన్నెందు కడక్కూడదు?" అన్నాడు.
ఎందుకడక్కూడదో రామారావుకీ తెలియదు కానీ-ఈ సలహా అందగానే మాత్రం సంకోచించకుండా వీరభద్రం దగ్గరకు వెళ్ళాడు.
వీరభద్రం నవ్వి-"ఊరికే సాయంచేసే అలవాటు నాకు లేదు. మీ వాచీమీద నాకు చాలా మోజుగా ఉంది. అది తాకట్టుపెడితే ఓ వారం రోజులు నా సరదా తీర్తుంది. మీ అవసరమూ గడుస్తుంది-" అన్నాడు.
రామారావు క్షణం మాత్రమే ఆలోచించి- "సరే!" అన్నాడు.
వీరభద్రం క్షణం ఆగి-"బాగా ఆలోచించుకోండి. సరిగ్గా వారం రోజుల్లో వడ్డీతోసహా నా బాకీ తీర్చాలిమీరు. నూటయాభై ఇస్తాను మీకు వడ్డీ పాతిక రూపాయలు. వారం రోజుల్లో తీర్చలేని పక్షంలో వాచీ మీకింక తిరిగి రాదు-" అన్నాడు.
