Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 34


    "ఏమైనా అంటే ఇంకేమున్నాయి నాన్న మన దగ్గర" అన్నాడు రామారావు నిస్పృహగా.
    కాస్త తడబడుతూనే "మంగళసూత్రాలు....." అన్నాడు రంగనాధం.
    రామారావు, అరుణ కూడా మ్రాన్పడిపోయారు. అవి తాకట్టు పెట్టవలసిన వస్తువుగా వారికి తోచనేలేదు.
    అరుణ మెడలో నానుతాడు. మంగళసూత్రాలున్నాయి. ఇంతవరకూ వాటిని కదపవలసిన అవసరంలేదు. కదపాలనికూడా ఆ దంపతులు కూడా అనుకోలేదు. ఎందుకంటే రామారావు మరీ పేదవాడు కాదు. అతను చేస్తున్న ఉద్యోగం అవసరాలకు సరిపడ్డ జీతాలనిస్తూంటుంది. హఠాత్తుగా వందల్లో డబ్బు కావాల్సొస్తే తప్ప-పదికీ పరక్కీ అతను తడుముకోనవసరం లేదు.
    నాడుతాడు తాకట్టు పెడితే అయిదారువందలు దాకా రావచ్చు. మంగళసూత్రాలు కడపనవసరం లేదు. తండ్రి మంగళసూత్రాలు అనడంలో ఉద్దేశ్యమిదే అయుంటుందని రామారావు గ్రహించాడు. అంతేకాకుండా మంగళసూత్రాల కంటే కూడా ఆ రిస్టువాచీ ముఖ్యమైనదని తనకు ఆయన పరోక్షంగా సూచించినట్లు రామారావుకు తెలిసింది.
    ఫలితంగా అరుణ మెడలోకి పసుపుతాడు వచ్చింది. రామారావు చేతికి వాచీ తిరిగొచ్చింది. ఆశ్చర్యంగా బాబు ఆరోగ్యం కుదుటబడింది. నెలలు గడిచినా నానుతాడు విడిపించడం మాత్రం కుదరడం లేదు.

                                     2

    "పదకొండు గంటల యాభై రెండు నిమిషాల మూడు సెకన్లు....." అన్నాడు రామారావు.
    అంత కచ్చితంగా చెబుతున్నావ్. నీది రేడియో టైమా" అన్నాడు వీరభద్రం.
    "కొత్తగా చేరారు కాబట్టి తెలియదు మీకు. రామారావు గారి వాచీ సంవత్సరానికి ఒక సెకండు కూడా తప్పు తిరగదు. అప్పుడప్పుడు ఆలిండియా రేడియో వారు ట్రంక్ కాల్ చేసి ఈయనదగ్గర టైము తెలుసుకుని మార్చుకుంటూంటారు....." అంది లలిత.
    "సెకన్లతోసహా తెలుసుకోదగ్గవారే నన్ను టైమడుగుతారని నా అభిప్రాయం, నిముషాలు తెలుసుకునేందుకు దేశంలో చాలా వాచీలున్నాయిగదా" అన్నాడు రామారావు గర్వంగా.
    వీరభద్రం ముఖంలో రవంత అసూయ కనబడింది-"ఏ మేక్?" అన్నాడు.
    "ఈనాటిది కాదులెండి - ఇక్ష్వాకుల కాలం నాటిది. మా నాన్నగారు ఇరవయ్యోఏట కొన్నారిది....." అన్నాడు రామారావు.
    "ఏదీ చూడనివ్వండి...." అన్నాడు వీరభద్రం. రామారావు తన వాచీని వీరభద్రానికి అందించాడు. వీరభద్రం దాన్ని పరిశీలించి చూసి-"ఇంత పాతదంటే నమ్మడం కష్టమే వాచీ చాలా అందంగా వుంది కూడా...." అన్నాడు వీరభద్రం.
    రామారావు గర్వంగా నవ్వి-"నా చేతిని కట్టుకున్నప్పుడు యింకా అందంగా వుంటుంది-" అన్నాడు.
    "ఈ వాచీని నాకు అమ్మకూడదండీ...." అన్నాడు వీరభద్రం చటుక్కున.
    రామారావుతో పాటు ఆ ఆఫీసులో చాలామంది ఉలిక్కిపడ్డారు. ఆ వాచీకి రామారావుకీ వున్న సెంటిమెంట్ అనుబంధం అక్కడి చాలామందికి తెలుసు.
    "సారీ అండీ-అది అమ్మేవస్తువు కాదు" అన్నాడు రామారావు.
    "అలా అనేయకండి. మీరడిగిన దాని కంటే వందెక్కువిస్తాను" అన్నాడు వీరభద్రం.
    రామారావు వులిక్కిపడ్డాడు మళ్ళీ వందరూపాయలకు వాచీలున్నాయి బజార్లో తనడిగిందానికి వంద ఎక్కువిస్తానంటున్నాడు వీరభద్రం. అంటే తన వాచీకి ధర ఎంత పలుకుతుంది? వాచీకివున్న బంగారం రెండుమూడొందల విలువచేస్తుంది. ఆ పైన వాచీ!
    "చెప్పాను కదండీ-ఇది అమ్మేవస్తువు కాదని....." అన్నాడు రామారావు.
    "వెయ్యి రూపాయలక్కూడా అమ్మరా-" అన్నాడు వీరభద్రం.
    చాలామంది తెల్లపోయారు. బంగారు తీసేస్తే ఆ పాత వాచీకి అంత విలువేముంది. టైము కరెక్ట్ గానే చూపించవచ్చు. అంతమాత్రాన రెండుమూడువందల్లో బజార్లో దొరుకుతున్న మోడ్రన్ డిజైన్ లని వదులుకుని వెయ్యి రూపాయలకు ఈ పాతవాచీని కొనాలనుకునే వాడెవడైనా వుంటాడా?
    అయితే వీరభద్రం సంగతి చాలామందికి తెలుసు. అతను ట్రాన్సుఫర్ మీద ఈ ఆఫీసుకు వచ్చి నెలరోజులైంది. బాగా వున్నవాడని చెప్పుకుంటారు. అతనికి వడ్డీ వ్యాపారముంది. అతని ఇంట్లో అంతా చూడగానే డబ్బున్నవాళ్ళనిపించేలా వుంటారు. లంచాలు పట్టడంలో నేర్పరితనముందని కొందరూ. బాగా ఆస్తివుండి సరదాకుద్యోగం చేస్తున్నాడని కొందరూ చెప్పుకుంటూంటారు ఏది ఏమైనా వీరభద్రం చూడ్డానికి దర్జాగా వుంటాడు. డబ్బుకూడా బాగా ఖర్చుపెడతాడు అతనికి స్కూటర్ కూడా వుంది.
    రామారావు మాత్రం "నా ఎత్తు ధనంపోసినా అమ్మ నండీ" అన్నాడు. అతని మదిలో మంచం మీద జబ్బులో పడివున్న బాబు మెదుల్తున్నాడు. లేకపోతే వెయ్యి రూపాయలు అతనిలాంటి వాడికి సామాన్యమైన ఆఫర్ కాదు.
    "ఎత్తుధనం నేనూ ఇవ్వలేను. వెయ్యిరూపాయల దాకా మాత్రం యివ్వగలను. అంతే!" అన్నాడు వీరభద్రం నవ్వేసి.    
    రామారావు మాట్లాడకుండా తన ఫైలు చూసుకోవడం ప్రారంభించాడు.
    
                                                        3

    బిల్లు పన్నెండు రూపాయిలయింది. మోహనరావది అందుకునే లోగా వీరభద్రం తను చటుక్కున అందుకున్నాడు.
    "అబ్బే నేనిస్తాను" అన్నాడు మోహనరావు.
    "వయసులోనూ, అనుభవంలోనూ, సర్వీసులోనూ మీకు నేను సీనియర్ని. బిల్లు నేనివ్వడమే ధర్మం" అని నవ్వాడు వీరభద్రం. ఊరికే మొహమాటానికి అలా అన్నా మోహనరావా బిల్లు పేచేయలేడని వీరభద్రానికి తెలుసును. అతను వేరేపనిమీద మోహనరావుని బార్ కి ఆహ్వానించాడు.
    బిల్లు పేచేశాక "రామారావు మీకు స్నేహితుడా?" అన్నాడు వీరభద్రం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS