కులభూషణ్ ఆశ్చర్యంగా --"ఇదంతా నిజమేనా ?" అన్నాడు.
"ఊ"
"నువ్వు విస్సీకి చెప్పలేదా?"
'చెప్పాను. బావ పట్టించుకోవడం లేదు. నా అనుమానం వేదాంతం బావనేదో చేసాడు...."
'అంటే ?"
"నీకు తెలుసు కదా -- వేదాంతం సబ్జక్టు సైకాలజీ అతడు బావను వశ పరచుకుని తను చెప్పినట్లల్లా అడిస్తున్నాడు. బావ నాతొ మాట్లాడుతున్నాడంటే అందుకు అత్తే కారణం. ఎందుకో బావ వేదాంతమంటే భయపడుతున్నాడు...."
'అలాగని నీతో చెప్పాడా ?"
"చెప్పలేదు. ప్రవర్తన బట్టి అర్ధమవుతోంది ...."
కులభూషణ్ ఆలోచనలో పడ్డాడు.
"వేదాంతమంటే భయమున్నా బావకు తన తల్లంటే విపరీతమైన గౌరవముంది. అతడు వేదాంతాన్నేదిరించడానికి కూడా సిద్దపడతాడు. -- అత్త తలచుకుంటే! అత్తను వేదాంతానికి వ్యతిరేకంగా తయారుచేయాలని నేననుకోవడం లేదు. ఈ ఇంట్లో నామూలంగా ఒకరి మధ్య ఒకరికి కలత లేర్పడడం నాకిష్టం లేదు. ఇప్పుడు మీరిద్దరూ వారం పదిరోజుల పాటు ఇక్కడుండరు. ఇది నాకు చాలా అనుకూల సమయం. అత్త సాయంతో బావను నాకు అనుకూలంగా మార్చుకుంటాను. వేదాంతం దూరంగా ఉంటె తప్ప బావలో పూర్తి మార్పు రాదు...."
"ఊ" అన్నాడు కులభూషణ్.
"భూషణ్ --- ఈ ప్రయాణంలో నువ్వు వేదాంతంలో మార్పు తీసుకుని రావాలి. "నాకూ విస్సీ బావకూ మధ్య తను అడ్డుగోడలా నిలవడం తప్పని చెప్పాలి. ఏ శక్తితో విస్సీ బావను సాధిస్తున్నాడో ఆ శక్తిని ఉపసంహరించుకోవాలని చెప్పాలి....అయితే నేను నీకు వేదాంతం గురించి చెప్పినట్లతనికి తెలియకూడదు...."
'అందువల్ల ప్రయోజనం?"
"వేదాంతం నాకు చాలా వరకూ నిజాలే చెప్పాడు. విస్సీ బావలో మార్పుకు తను కారణం కాదంటాడు. ఒకోసారి విస్సీ బావ మనిషే కాదంటాడు. ఏదో మానవాతీత శక్తి అంటాడు. తనూ అసహయుడినంటాడు. అతడు నిజమే చెబుతుంటే విస్సీ బావ నాకు దక్కడనే అర్ధం.....విస్సీ బావ నాకు దక్కకపోతే -- నేను వేదాంతాన్ని తప్ప ఇంకెవరినైనా పెళ్ళి చేసుకుంటాను. ఆ విషయం కూడా అతడికి చెప్పాను...."
కులభూషణ్ ఆశ్చర్యంగా -"విస్సీ నీకు దక్కకపోయినా నివ్వింకా పెళ్ళి గురింఛి ఆలోచిస్తావా? ఇదేనా వాడంటే నీకు ప్రేమ?" అన్నాడు.
ఉదయ అదోలా నవ్వి "నాది కాదనుకున్న జీవితం నాకు తిరిగి లభించింది. అందుకు కారణం నువ్వు కావచ్చు. విస్సీ బావపై నాకున్న నా ప్రేమ బలం కావచ్చు. కానీ దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే చావు బ్రతుకులు నిర్ణయించడానికి వేరే శక్తి ఏదో ఉంది. విస్సీబావ గురించి కాక మరెందుకు నాలో జీవం నింపుకుందో తెలుసుకుందుకైనా నేను జీవించి ఉండాలి కదా?" అంది.
'అయితే ఒక విషయం గుర్తుంచుంకో ? నిన్ను బ్రతికించినది మీ విస్సే బావ పై ఉన్న ప్రేమా కాదు. నాకు నీపై ఏర్పడిన ప్రేమా కాదు. వేదాంతం నిన్ను తనకోసం బ్రతికించుకున్నాడు ఇది వాస్తవం.....కల్పనా కాదు...." అన్నాడు కులభూషణ్.
మధ్యాహ్నం రెండు గంటలకు మిత్రులిద్దరూ ఇంట్లోంచి బయల్దేరారు. బయల్దేరే ముందు వేదాంతం విశ్వనాద్ ను ఏకాంతంలో "విస్సు అంతా గుర్తుంది కదూ! నేను తిరిగి వచ్చే సరికి రోజు కొక్కరు చొప్పున బయటపడాలి. అవినీతి పరుల గుండెల్లో మన ధనుష్టంకారం ప్రతి ధ్వనిస్తూ ఉండాలి" అన్నాడు.
విశ్వనాద్ బుద్దిగా తలూపాడు. సీతమ్మ కులభూషణ్ ని వేదాంతాన్ని ఆశీర్వదించి పంపింది.
ఇద్దరూ బస్టాండుకు వెళ్ళారు.
అక్కడి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరికి వారి ప్రయాణం.
వెంటనే వారికి బస్సు దొరికింది. అరగంటలో వారిని గ్రామం చేర్చింది.
ఇద్దరూ బస్సు దిగారు.
ఇద్దరి భుజాలకూ బరువైన బ్యాగ్సు న్నాయి.
అదనంగా ఇరువురి చేతుల్లోనూ బ్రీఫ్ కేసులున్నాయి.
వెడుతున్నది అడవి ప్రాంతం. అక్కడే చిన్న జంతువైన తమ నేదుర్కోవచ్చు, ఏ పామో కరవచ్చు. విష జ్వరం తగలవచ్చు.
కులభూషణ్ అన్నింటికీ ముందు జాగ్రత్త పడ్డాడు.
అతడి వద్ద సరంజామా అంతా ఉంది.
అది కాక అటవీకులనాకర్షించే వస్తువులు కొన్ని!
ఇద్దరూ బరువుగా అడుగులు వేసుకుంటూ గ్రామంలో ప్రవేశించారు.
గ్రామానికిటు బస్సు దారి. అటు అరణ్యం.
ఇద్దరూ అరణ్యంలో ప్రవేశించాల్సి ఉంది.
కులభూషణ్ కి మనసులో ఉత్సాహంగా ఉంది.
వేదాంతం గ్రామంలో ఒకింటి ముందు ఆగాడు.
అవి ఎత్తయినరుగుల పెంకుటిల్లు. అరుగు మీద నలుగురు పిల్లలాడుకుంటున్నారు. మిత్రులిద్దర్నీ చూసి వారిలో ఓ పిల్ల లోపలకు పరుగెత్తింది.
బయటకు పాతికేళ్ళ కుర్రాడు వచ్చాడు. అతడు వేదాంతాన్ని చూస్తూనే నమస్కరించాడు.
"బాగున్నావా-- సుబ్బారావ్!" అన్నాడు వేదాంతం.
"లోపలకు రండి -" అన్నాడు సుబ్బారావు.
మిత్రులిద్దరూ లోపలకు వెళ్ళారు.
మండువా ఇల్లు.
మిత్రులు బరువుని దింపుకున్నారు. సుబ్బారావు వాళ్ళకు మంచినీళ్ళు తెచ్చిచ్చాడు.
కులభూషణ్ చుట్టూ చూస్తున్నాడు.
ఇల్లు పాతదైనా డాబుగా ఉంది.
గోడలకు రవివర్మ తైలవర్ణ చిత్రాలున్నాయి.
"ఏమిటలా వచ్చారు?" అన్నాడు సుబ్బారావు.
'అడవిలో కెళ్ళాలి-"
"ఎందుకు?"
"నాయకుడితో పనుంది...."
'అక్కడ పరిస్థితి బాగోలేదు...." అన్నాడు సుబ్బారావు.
"ఏమయింది .."
"విష జ్వరాలు ...."
"ఊ" అన్నాడు వేదాంతం.
"ఒకరోజు పదిమంది చచ్చిపోయారు...."
'అయితే మేము తప్పక వెళ్ళాలి --" అన్నాడు కులభూషణ్.
'చాలా ప్రమాదం?" అటవీకులవి మూడ నమ్మకాలు. దేవత తమపై అలిగిందని వారి అనుమానం. నరబలి ఇవ్వాలను కుంటున్నారట..."
"నరబలా?" అన్నాడు వేదాంతం.
"అవును. సాధారణంగా వాళ్ళు తమలో ఒకడినే బాలి ఇస్తారు. అయితే బయటి వాళ్ళెవరైనా దొరికితే-- తమ వాళ్ళను వదిలి వాళ్ళను బలిస్తారు ...."
వేదాంతం ముఖం గంభీరంగా అయిపొయింది.
"ఇలాంటి సమయంలో నాగరికులక్కడికి వెళ్ళడం శ్రేయస్కరం కాదు" అన్నాడు సుబ్బారావు.
"నీకు భయమా?" అన్నాడు వేదాంతం.
"నేను నా గురించి కాదు. మీ గురించి చెబుతున్నాను.
"మా గురించి నాకు భయం లేదు. ...' అన్నాడు వేదాంతం.
సుబ్బారావుకా మాటలు నచ్చినట్లు లేదు-" మీకు ఆటవికుల సంగతి పూర్తిగా తెలియదు" అన్నాడు.
"నువ్వు మాతో వస్తానంటే చాలు. మా సంగతి మేము చూసుకుంటాం."
సుబ్బారావు సంకోచంగా -- "మీ ఇష్టం" అన్నాడు.
వేదాంతం జేబులోంచి అయిదు వంద నోట్లు తీసి సుబ్బారావు కిచ్చి "ఖర్చులకింట్లో ఇవ్వు" అన్నాడు.
సుబ్బారావు మొహమాటపడుతూ -- "దీనికింత డబ్బెందుకు ?" అన్నాడు.
"తీసుకో" అన్నాడు వేదాంతం.
"మా తాతగారి రోజుల్లో పదిమందికి పెట్టి బ్రతికాం. ఇప్పటికీ ఇల్లు తప్ప ఇంకేమీ మిగల్లేదు. ఆటవికులకూ, నాగరికులకూ మధ్య వారధిగా ఇలా జీవితం వెళ్ళబుచ్చుతున్నాం. మీవంటి వారివద్ద డబ్బు తీసుకుందుకు చిన్నతనంగా ఉంటుంది నాకు. అయినా తప్పదు'..." అంటూ ఆ డబ్బు తీసుకుని లోపలకు వెళ్ళాడు సుబ్బారావు.
మరి కాసేపట్లో ఓ వృద్దురాలా మండువా లోకి వచ్చింది.
ఆమె ఏడు గజాల నేత చీరలో, రూపాయి కాసంత కుంకుమ బొట్టుతో -- పచ్చని డబ్బపండు ఛాయతో -- సాక్షాత్తూ పార్వతీదేవిలా ఉంది.
మిత్రులిద్దరూ అప్రయత్నంగా ఆమెకు నమస్కరించారు.
"గొప్పవాళ్ళు, మీరు నాకు దణ్ణం పెట్టకూడదు" అందామె.
"మీలో నాకు పార్వతీదేవి కనపడింది." అన్నాడు వేదాంతం.
"ఏం పార్వతో -- పరమేశ్వరుడు చావు బతుకుల్లో ఉన్నాడు?" అని నిట్టూర్చిందామె.
"అంటే?" అన్నాడు వేదాంతం ఉలిక్కిపడి.
