Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 34

 

                                  
                                         50
    అరుణ అక్కడే ఉంది. అపరాధి లా తల వంచుకుని అమ్మను అనుసరించి వస్తున్న రఘును చూసింది. అతని వేషాన్నీ....పరిస్థితి ని గురించి విడిగా చెప్పవలసిన అవసరమేముంది? తొడుక్కున్న చొక్కాకు రెండు గుండీలు లేవు. భుజం మీద ఉన్న చినుగు చూడగానే అగుపడెంత పెద్దదిగా ఉంది; పది పదిహేను రోజుల వయస్సున్న గడ్డం, అసలు సంస్కారం లేని జుట్టు. తన బాధల్లో తల్లి వీటన్నింటినీ గమనించలేదు. ఒక్క చూపుతో అరుణ అన్నింటినీ ఆకళించుకుంది. ఆ అమ్మాయి కళ్ళు చెమ్మగిల్లాయి. రఘు కూడా అరుణను చూశాడు. చూచి ఏమనగలడు? కుశల ప్రశ్నలు వేసుకునే తరుణమా అది? అందుకని దీనంగా మళ్ళీ తల వంచాడు.
    ఏడవకూడని ప్రయత్నిస్తూ "ఏమండీ , యువరాజావారూ!' అంది అరుణ.
    "అరుణా!" అంటూ, ఆమె భుజం మీద వాలిపోయి దారి తప్పిన పాపలా ఏడ్చాడు రఘు.
    "కన్న తల్లిదండ్రుల కంటే నీకు దేశంలోని పేద సాదలు ముఖ్యులయ్యారా రఘూ . ఇప్పుడు? ఇప్పుడు నీవు చేసే ఉద్యోగం ఏమిటి? కనీసం రెండు పూటలా ఇంట్లో భోం చేసి వెళితే , నీకు కలిగే నష్ట మేముంది? నీవా పనే చేసి వుంటే, ఈ నాడు మామయ్య గారి గతి ఈ స్థితికి వచ్చేది కాదు. ఊరుకో....ఊరుకో ..."
    ఈలోగా డాక్టర్ మోహన సుందరం బైటికి వచ్చాడు. అందరి అశ్రు పూరిత నేత్రాలూ అతని మీద ఆధారపడి నిలిచాయి.
    "ఏం ఫరవాలేదు. సేతుపతి గారు ఆపద నించి బైట పడ్డారు" అన్నాడాయన. చాముండేశ్వరి వెయ్యి దేవుళ్ళ కు మొక్కి కృతజ్ఞత తెలుపుకుంది. అరుణ కన్నీరు తుడుచుకుంది. రఘు అక్కడే ఉన్న బెంచీ మీద కూలబడి పోయాడు.

                                                   *    *    *    *
    ఆ తరవాత సెలవు పెట్టి, ఒక వారం రోజుల పాటు అరుణ ఇక్కడే ఉండిపోయింది. ఆమె నంటి పెట్టుకుని రఘు కూడా ఇంటి పట్టునే ఉన్నాడు. సేతుపతి గారు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇల్లూ.... వాకిలీ.....తానూ....భార్యా ....కొడుకూ....కాబోయే కోడలూ..... వచ్చి పరామర్శించి పోయే అప్తులూ...మిత్రులూ ....అంతా కలకల లాదిపోతున్నట్టుంది సేతుపతి గారికీ! అప్పుడప్పుడే మోహన సుందరం వచ్చాడు.
    "ఎలా ఉన్నారండీ డాక్టర్ గారూ?"
`    మోహన సుందరం నవ్వారు. "భలే, ఆ ప్రశ్న నేను వెయ్యాలా?...... మీరు వెయ్యాలా?"
    "ఎలా అయినా ఒకటే కదండీ?"
    మోహన సుందరం అందరినీ వెళ్లి పొమ్మన్నాడు. తలుపులు వేసి, రక్తపు పోటు మొదలయిన వన్నీ పరీక్ష చేసి, మళ్ళీ తన యంత్రాల నన్నింటినీ సర్దు కుంటున్నాడు.
    "డాక్టర్ గారూ?"
    "యస్?"
    "ఇంకా ఎన్నాళ్ళు ఉందీ?"
    "నిజం చెప్ప మన్నారా?"
    "ప్లీజ్!"
    "మీ మీద ఆధారపడి ఉంటుంది. మొన్నటి లాటి మరొక స్ట్రోక్ వచ్చిందంటే , మీ రాగలేరు!"
    "థాంక్స్ . ఇక నేను ణా స్వవిషయాలన్నీ ఒకదారికి తెచ్చుకోడం మంచిది. థాంక్ యూ డాక్టర్!"
    డాక్టర్ వెళ్ళిపోయాడు. అతనికి తెలియ కుండానే అతణ్ణి వెంబడించి అరుణ అతణ్ణి పోర్టికో లో కారెక్క బోతుండగా ఆపింది.
    "యస్?"
    "మామయ్య గారేమడిగారు?"
    "నేనేన్నాళ్ళు బ్రతుకుతాను" అని అడిగారు."
    "మీరేమన్నారు?"
    "వెయ్యేళ్ళు చల్లగా వర్ధిల్లుతారు అన్నాను."
    "అది అబద్దం కదూ?"
    "నిజాన్ని డాక్టర్లు ఎప్పుడూ వెల్లడించరు."
    "నాతొ కూడానా?"
    "మీతో కూడా!"
    "థాంక్స్!"
    "డు నాట్ మెన్ షన్!" మోహన సుందరం వెళ్ళిపోయాడు!
    అరుణ ఎంతగానో ప్రయత్నించింది , డాక్టర్ ఆయనతో చెప్పిన విషయాన్ని సేతుపతి గారి నుండి గ్రహించాలని.
    "అసలు ఏమీ లేనిదే.... డాక్టర్ మాత్రం ఏది చేబుతడమ్మా? మొన్న జరిగిందేదో పొరపాటు. అనవసరంగా ఆవేశ పడ్డాను. ఇక మీదట ఆవేశ పడడం మానేస్తే ఏ గొడవా ఉండదు!"
    అరుణ ఎంతగానో ఆలోచించాక అంది: "మామయ్య గారూ, నేనీ వేళ వెళ్ళిపోతున్నాను."
    "అడిగితె , సెలవు దొరకదా అమ్మా?"
    "దొరకదని కాదు. అసలు వెళుతున్నానంటే నేనొక్క దాన్నే కాదు . రఘును కూడా వెంట తీసుకు వెళుతున్నా."
    "తల్లీ.....అరుణా....నా బంగారు కోడలా....." ఆవేశాన్ని ఆపుకోలేక పోతున్నాడాయన.    
    "ఆవేశ పడకండి మామయ్య గారూ!"
    "పడను లే . తీసుకు వెళ్ళు! సంతోషంగా తీసుకు వెళ్ళు...... చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ ను గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అమ్మా?"
    "అమ్మా, రంగయ్య చౌదరి గారూ అక్కడక్కడ విచారిస్తున్నారు."
    "కుర్రాళ్ళ కేమిటి లే తల్లీ.....ఎక్కడో ఒక చోట దొరుకుతారు. కట్నాలూ, కానుకలూ, ఖర్చులూ, ఈ గొడవలన్నీ....."
    "నన్ను కోడలుగా తెచ్చు కుంటా మంటూన్నారుగా? మరి మా అమ్మగారి దగ్గిర మీరేం కట్న మడుగు తారు?"
    సేతుపతి గారు హాయిగా నవ్వారు. అరుణతో మాట్లాడుతున్నంత సేపూ.....ప్రపంచ మంతటి లోనూ ఏ కోణం లో కూడా బాధ అన్నది లేదన్నంత హాయిగా ఉంటుంది సేతుపతి గారికి!
    "మొత్తం మీద మాటలు నేర్చావమ్మా! నేనానాడు చెప్పిన మాట విని, బి.టి. బదులు, బి.యల్ చదివి ఉంటె ఎంత బాగుండేది? ప్రతివాది తరపున పనిచేసే లాయరు నీ ధోరణి విని, దెబ్బకు చచ్చేవాడు!"
    "అందుకే నండీ...ఒకర్ని అనవసరంగా చంపడం ఇష్టం లేకనే నేను లాయర్ని కాలేదు!" సేతుపతి మళ్ళీ బ్రహ్మానందం అనుభవించాడు.
    "ఎప్పుడు బయలు దేరతారమ్మా?"
    "సాయంత్రం ట్రెయిను కు!"
    "ట్రెయిన్ కేందుకూ ఇంటి నిండా కార్లుంటే?"
    "కారులో అయితే ఇప్పుడే బయలు దేరతామండీ!"
    "అయితే రైల్లో నే వెళ్ళండి తల్లీ!" ఇద్దరూ నవ్వుకున్నారు.
    "నిజం చెబుతున్నాను ఆరూ. ఇంకా, నీ డబ్బు, ణా డబ్బు అని బాధ పడడం దేనికి? అవసరమైతే చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ కు......"
    "అవసర ముండదు మామయ్య గారూ. ఆ రంగయ్య చౌదరి గారు ఇప్పుడో పట్టు పట్టారు. "మా గురువు గారికి నే నేప్పుడయితే కర్మలు చేశానో, అప్పుడే నేను వారి కొడుకు నయ్యాను. అందుకని , సీత పెళ్లి నా చేతుల మీద జరగవలసిందే . ఇక సరస్వతి పెళ్లి అంటావా? నీ ఇష్టం . నీ దగ్గిరా డబ్బుందని అంటూన్నావుగా? అంతా ఖర్చు పెట్టాకే సేతుపతి గారి ఇంటికి వెళ్ళు, నీవు ఇక్కణ్ణించి ఒక్క పైసా అక్కడికి తీసుకు వెళ్ళడానికి వీల్లేదు" అంటున్నారు."
    "చౌదరి గారు మంచి వారు ఆరూ."
    "చాలా మంచి వారండీ."
    "కాదమ్మా! చాలా చాలా చాలా మంచి వారు!" అబ్బ, ఏమి ఆనందం అది! ఇద్దరూ అది అంతా తమ మధ్యనే పంచుకున్నారు.

                                      51
    "ఆరూ , నే వెళ్ళిపోతున్నా " అన్నాడు రఘు కొంత నిశ్చయానికి వచ్చిన వాడిలా , కొంత గోముగా!
    "అరె! నిన్న వచ్చి, ఈవేళ వెళ్లి పోవడ మేమిటీ? అత్తగారి ఇల్లు నచ్చలేదా?"
    "అబ్బ! నన్ను విసిగించకు. ఈ ఊరు నాకు నచ్చలేదు!"
    "ఊరుతో నీ కేమిటయ్యా సంబంధం? వచ్చింది అత్తగారింటి కి. 'అత్తగారింటి కి అల్లుడై వస్తే ముచ్చటగా ఉండేది మూడు నాళ్ళు" అన్నారు అనుభాజ్ఞులు. ఆ తరవాత అల్లుడు గారిని అంట్లు తోమ మంటారనుకో! పోనీ ఆ మూడు రోజులయినా ముచ్చటగా ఉండి వెళ్ళరాదు? పెళ్లి అయ్యాక అత్తగారిల్లు చూసే యోగం నీకేలాగూ లేదు."
    "నేనుండను. అసలు ఉండలేను."
    "ఏం? నిన్ను చూడకుండా అక్కడ ఓబులేసు, సుందరం, వడివేలూ , వాళ్ళ సంసారాలూ , వీధుల్లోని బిచ్చగాళ్ళూ , రోగిష్టు లు బెంగ పెట్టుకుంటారా?"
    "అవును."
    "అయితే దయ చెయ్యి! ఊ....వెళ్ళు. చార్జీలకు డబ్బు కావాలా?"
    'అంత కోప్పడితే ఎలా ఆరూ?"
    "కోప్పడక తల బద్దలు కొట్టు కొమంటావా? నువ్విక్కడుంటే, నాన్నగారికి కనీసం నీవు నా దగ్గిర ఉన్నావన్న తృప్తి....మనశ్శాంతి ఉంటాయి. అక్కడికి వెళ్ళావే అనుకో , ఇంటి దగ్గర ఉంటావా? ఉండవు! ఫలితం? నాన్నగారు నిన్ను గురించి బెంగ పెట్టుకోడం? అంతేనా?"
    "నేనిక్కడ ఉండలేను ఆరూ. ఊసుపోవడం లేదు!"
    "ఈ ప్రాంతాల్లో టొబా ఫ్యాక్రరీ ఒకటుంది! అక్కడికి వెళ్లి, ఒక సమ్మె లాటిది లేవదియ్యి. ఆ తరవాత బ్రహ్మాండంగా ఊసుపోతుంది"
    "నా కాదే పని అనుకుంటూన్నావా? నువ్వేమయినా అను. నేను వెళ్ళిపోతాను. చార్జీలకు నా దగ్గిర డబ్బు లున్నాయి లే!"
    "మరి, యువరాజు గారి దాన ధర్మాలకో? ఇదుగోండి . ఈ అయిదు వందలూ కూడా పట్టుకు వెళ్ళండి. పనికొస్తాయి. వెళ్ళాక కనీసం రెండు పూటలా ఇంటికి వెళ్లి నాన్నగారిని పలకరిస్తూ ఉండు. అది నీ ధర్మం."
    'అలాగే."
    "అయితే సెలవు మరి. నమస్కారం. నాకు స్కూలు కు టై మయింది ."
    "కోపమా అరుణా?"
    "కాన్వెంటు లో పడి ఉన్నవాడికి నీకు ఆ ఆ లు నేర్పింది నేను! ట్రాజడీ ఎక్కడా అంటే....నీకు ఆ చదువూ అబ్బలేదు; నా చదువూ అబ్బలేదు! అసలు నిన్ను బలవంతంగా ఇక్కడికి లాక్కురావడం నాదే పొరపాటు. మనసు చప్పగా పాడుచేసుకుని , నీవే వచ్చి ఉంటె, ఓ పది రోజుల పాటు ఉండి పోయేవాడివి. రా, నన్ను స్కూలు దాకా సాగనంపు. అగుపడ్డ ప్రతి వ్యక్తీ కి , "వీరు కాబోయే  మా వారు' అని పరిచయం చేస్తాను. అందరూ మెచ్చుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటా, పిచ్చి వాడి వైనా సరే! 'అబ్బే' అన్నట్టు అగుపడ్డారో........నీకూ నాకూ రాం రాం" అంటూ అరుణ నవ్వింది. రఘు కూడా నవ్వడానికి ప్రయత్నించాడు.
    నవ్వులాటకు ఎన్ని అన్నా .........అరుణ లోలోన చాలా తీవ్రంగా ఆలోచించింది. సేతుపతి గారిని రక్షించు కోడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది, సాధ్యమైనంత త్వరలో తన చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు సవ్యంగా చేసెయ్యడం.

                                     52
    కాలం కలిసి వచ్చినప్పుడు , కావలసిన శుభ కార్యాలు కాకుండా ఎంతకాలం ఆగుతాయి? సీతా మహాలక్ష్మీ కీ, సరస్వతీ కి సంబంధాలు నిశ్చయ మయినాయి. ఒక కుర్రాడు బి.యస్.సి పాసై, యూనివర్సిటీ కాలేజీ లో డిమాన్ స్ట్రేటర్ గా పని చేస్తున్నాడు. మరొకడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో గుమస్తా . కుర్రాళ్ళు ఇద్దరూ అందగాళ్ళే. అమ్మాయిలకు తగ్గవాళ్ళే. ఇక ఆలస్యం ఎందుకవుతుంది? ముహూర్తాలు పెట్టుకున్నారు.
    తీరా పెళ్లి నాటికి సేతుపతి గారు రాలేక పోయారు. చాముండేశ్వరి వచ్చింది, బోలెడన్ని కానుకల్ని మోసుకుని.
    "మామయ్య గారేరీ?"
    "డాక్టరు గారు ఆయన్ని ఎక్కడికీ కదల వద్దన్నారమ్మా."
    "మళ్ళీ....."
    "అబ్బే...లేదమ్మా! ఏదో ఈ మధ్య ఇంటి నిండు కూ వచ్చే లాయర్లూ, పోయే లాయర్లూ గా ఉన్నారు. ఏ వ్యాపారాలకు సంబంధించిన గొడవల్లో వారు వచ్చి పోతున్నారో ఏ దేవుడేరుగు? ఆయనకు ఇటువంటి విషయాల్ని ఇంటి వారితో చెప్పడం ఏనాడూ అలవాటు లేదుగా!"
    "రఘూ...."
    చాముండేశ్వరి కన్నీరు కార్చింది.
    "అత్తయ్యా........"
    "ఏం చెప్పమన్నావమ్మా? అయిదారు మాసాలుగా మా కేవ్వరికీ తెలియదు. 'కారెక్కడరా' అని నేనదిగినా , మీ మామయ్య గారడిగినా రీబోరింగ్ కు ఇచ్చాననేవాడు. తీరా మొన్న మొన్ననే తెలిసింది. దాన్ని అమ్మి, ఫ్యాక్టరీ మూసేసినన్నాళ్ళూ ఆ కూలీలకూ, వారి సంసారాలకూ తిండీ తిప్పలూ చూశాడట! ఆయనేం చేస్తారు? కోప్పడ్డారు. , పడ్డారు. మళ్ళీ డాక్టర్లు, పరీక్షలు , మందులు! మోహన సుందరం గారు గట్టిగా చెప్పారు. ఇక ఇటువంటి ఆవేశాల పాలయ్యారంటే , చాలా ప్రమాదమని! అరుణా, నీవు త్వరగా మా ఇంటికి వచ్చేసేయ్యి! నీవు అక్కడుంటే ఇంతింతలేసి గొడవలు జరగవు" అంటూ వలవల వాపోయింది చాముండేశ్వరి.
    "మరి మామయ్య గారిని వదిలి, మీరు ఎందుకు వచ్చారత్తయ్యా?"
    "వారే బలవంతం చేశారమ్మా! 'నేను వెళ్ళను! వెళ్ళకపోయినా , మన అరుణ అపార్ధం చేసుకోదు' అని ఎంత చెప్పినా వినలేదు."
    "సరిలెండి. ముహూర్తం సాయంత్రం ఏడు ముప్పై కెగా? తొమ్మిది గంటల బండికి మీరు వెళ్ళిపొండి అత్తయ్య గారూ. మీ అందరికీ ఇదే చాదస్తం! ఆయన్ని ఆ పరిస్థితుల్లో వదిలి మీరు రావడమేమిటి?...."
    "నేను నెత్తిన నోరు పెట్టుకుని మొర పెట్టుకున్నానే ఆరూ."
    "ఊరుకోండి అత్తయ్య గారూ. ఊరుకోండి. రండి. పెళ్లి కూతుళ్ళ నూ కుమారుళ్ళ నూ చూసి వద్దాం రండి" అంటూ అరుణ అత్తయ్య గారిని తన ఇంటి లోకి....తరవాత విడిది ఇంటికి తీసుకు వెళ్ళింది.
    పెళ్ళిళ్ళు మహదానందంగా జరిగిపోయాయి. ఏ నోటా చూచినా ........ అరుణే ఆనాడు! ఆ ఊరిలో అన్ని విషయాల నూ ఎరిగి ఉన్న అందరూ అరుణ కు చేతులెత్తి నమస్కరించారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS