Previous Page Next Page 
మారిన విలువలు పేజి 35

 

    సుందరమ్మ కూతుర్ని చూసి చీవాట్లు పెట్టింది. తిట్టింది. ఏడిచింది. "నువ్వు పుట్టకపోయినా బాగుండు" నని విసుక్కుంది. "మీ నాన్నతో పాటు నేనూ చచ్చిపోయినా బాగుండి పోనూ . నా బతుకు తగలడ! ఎలాటి పిల్లల్ని కన్నాను" అని తనను తను నిందించుకోంది. శాంత పలకలేదు. ఉలకలేదు. కంటినీరు కట్టలేదు. మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. చావిట్లో కాలు పెట్టెక ఏ చోట్లో ఏ విధంగా కూర్చుందో అలాగే ఉండిపోయింది.
    క్షణాలను నిమిషాలను గంటలను తప్పించుకొంటూ కాలం ముందుకు పోయింది. వీళ్ళింట్లో ఏదో తమాషా జరుగుతున్నది, చూసి పోదామని ఎండ కిటికీ లోంచి పొడుచుకు వచ్చింది. గంట గడిచినా ఆ ఇంట ఏ గలాటా వినిపించనందున నిరాశ పొందిన ఇరుగుపొరుగు వాళ్ళు తమ నిత్యకృత్యాల్లో నిమగ్నులయిపోయేరు.
    సూటిగా ఎండ ముఖం మీద పడడంతో శాంత తల తిప్పి చూసింది. ప్రకాశం తలుపు తెరుచుకుని లోపలికి వచ్చేడు.
    "ఓహో! నువ్వు వచ్చేసేవన్న మాట! నీ స్నేహితుడేమయేడు? టికెట్టు కొని రైలెక్కించి, ఇంటికి దారి చెప్పేడా?" అన్నాడు ప్రకాశం శాంతను చూసి.
    "ఏమిటి, ప్రకాశం ఆ మాటలు? అసలే దిగులుతో కుళ్ళిపోతున్న పిల్లని పట్టుకొని?" కనకం మరిదిని మందలించింది.
    అప్పటివరకు ప్రకాశం కోసం ఎదురు చూస్తున్నది జానకి. ఆలోచనకైనా, అన్నగారి నెదిరించెందుకైనా , తనకు ప్రకాశం ఆసరా కావాలనుకోంది. అందుకే అసలు విషయం కదలకుండా అప్పటివరకు గడుపు కొచ్చింది.
    "శాంతా , జరిగిందేమిటో ఇప్పుడు చెప్పు" అన్నది.
    శాంత మనసును కూడదీసుకొని, కళ్ళు ఒత్తుకొని అక్క వైపు చూసింది. ఆమె ఆశించిన జాలి అక్క ముఖంలో కనిపించలేదు. అలాగని అసహ్యం, కోపం కూడా అందులో లేవు. ఆమె అర్ధం చేసుకోలేని ఇంకేదో భావం జానకి ముఖంలో తోక్కిసలాడుతున్నది.
    శాంత గొంతుక సవరించుకొని, "నేను మోసపోయాను అక్కా" అన్నది.
    "అది కనిపిస్తూనే ఉంది. వివరంగా చెప్పు" అన్నాడు ప్రకాశం. శాంత ప్రకాశం మాట వినిపించుకోలేదు. అతని వైపు చూడలేదు. తిరిగి చెప్పడం ప్రారంభించింది.
    "కొల్లలుగా డబ్బున్నదన్నాడు. తలితండ్రులు కొక్కడినే కొడుకు నన్నాడు. అమ్మకి చాందసం , పట్టింపులు ఎక్కువ. తిన్నగా ఇంటికి పొతే ఏమైనా అడ్డంకులు పెట్టచ్చు. తిరుపతిలో పెళ్ళి చేసుకొని ఇంటికి పోదాం. ఇంక చేసేది ఏమీ లేదని తెలిసేక , అమ్మ సంతోషంతో ఆశీర్వదిస్తుంది. అమ్మ మనసు చాలా మంచిది -- అన్నాడు.
    "అతను చెప్పినవన్నీ నమ్మేను. ఎందుకు నమ్మేనో ఎలా నమ్మేనో నాకిప్పుడు తెలిసి రావడం లేదు. అతను కళ్ళముందు కదిలించిన కమ్మని జీవితం తలుచు కొంటూ కళ్ళు మూసుకొని అతని వెంట బయలు దేరేను. కళ్ళు తెరిచి చూసేసరికి మోసపోయానని తెలిసొచ్చింది.
    "పరవళ్ళు తొక్కుతున్న సముద్రం; పట్టాలని ఆదరకోడుతూ పరుగులు పెడుతున్న రైళ్ళు. వెంటిలేటరు వేలాడుతున్న లావుపాటి తాడు - అన్నీ నా బాధని తీర్చే పరికరాలుగా కనిపించేయి. కాని, నాకు బ్రతికంటే ఎంత తీపో అప్పుడే తెలిసింది. నిండు ప్రాణాన్ని చేతులారా తీసుకోలేక పోయెను. మీరున్నారని.... నా క్షేమం కాంక్షించే మీరున్నారని తిరిగోచ్చేను." మాట పూర్తీ చేస్తూ సూర్యారావు వైపు చూసింది శాంత. ఏనాడూ లేనంత శాంతంగా, ఓర్పు గా ఆమె చెబుతున్నదంతా వింటున్నాడు. ఆలోచనలు అతని బుర్రలో తారట్లాడు తున్నాయన్నదానికి నిదర్శనంగా అతని నుదురు మాటిమాటికి ముడుచుకు పోతున్నది. పలచగా , అక్కడక్కడ పండు వెంట్రుకలు మెరుస్తున్న జుట్టులో అతని చేతి వేళ్ళు నాట్యం చేస్తున్నాయి.
    ఉదయం తను చూసిన అన్నయ్య, తను చెప్పింది విని. తాటి ప్రమాణం లేస్తాడనుకొన్న అన్నయ్య, అంత సానుభూతి గా తను చెప్పింది వింటూ ఉంటె, శాంత ధైర్యం కూడా గట్టుకొని అటు చూసింది.
    "అన్నయ్యా.... అన్నయ్యా.... నన్ను క్షమించన్నయ్యా! ఇంకెప్పుడూ ఇటువంటి పని చెయ్యనన్నయ్యా" అని అతని కాళ్ళు పట్టుకుని గోల్లుగోల్లున ఏడిచింది.
    ఆమె ఏడ్పుకి కాని, మాటకు గాని సూర్యారావు ముఖం లో ఏమీ మార్పు కనిపించలేదు. నెమ్మదిగా చెల్లెలి చెయ్యి పట్టుకొని, "లే శాంతా, ఏడవకు. జరిగి పోయినదానికి ఏడుస్తూ కూర్చుంటే ఫలితం లేదు. ముందు ఏం జరగాలా అన్న విషయం చూడాలి" అన్నాడు అనునయంగా.
    అతని మాటల తీరుకు , మనిషిలో వచ్చిన మార్పుకు ఇంట్లో అంతా ఆశ్చర్య పోయేరు.
    శాంత కళ్ళు తుడుచుకుంది.
    "శాంతా! నేను కోరేది మీ అందరి సుఖం, మీరందరూ బాగా బతికి ఇంటి పేరు, మంచి, మర్యాదా నింపాలని నా కోర్కె. నా బాధ మీరెవరూ అర్ధం చేసుకోకుండా అన్నయ్యాకి మేము బాగుపడడం ఇష్టం లేదనుకొంటారు.
    "ఒక దేశం కాని, సంఘం కాని ఇల్లు కాని బాగుపడాలంటే సమర్ధంగా నడవాలంటే , అందుకు సంబంధించిన వారు సామూహికమైన శ్రేయస్సు కోసం వ్యక్తీ గత సౌఖ్యాలని, కోర్కెలని కొంతవరకు త్యాగం చెయ్యవలసి ఉంటుంది.
    "ఒక వ్యక్తీ చేసిన మంచి, చెడ్డ పనుల బాధ్యాట న్యాయంగా ఆతడే అనుభవించవలసి ఉన్నా, వాటి ఫలితాలు అతన్ని అనుసరించి ఉన్నవారి బ్రతుకుల్లో ప్రతి ఫలించక పోవు. ఇప్పుడు నువ్వు, ప్రకాశం , జానకి మీకు మంచిదని తోచిన పనులు చేసేరు. అవి మీ వ్యక్తీ గత సమస్యలకి , జీవితానికి సంబంధించినవి. వాటితో నాకు ప్రమేయం ఉండనక్కరలేదు. కాని మన మందరం ఒక కుటుంబం సభ్యులం. ఒకరికి జరిగిన మేలు కాని, కీడు గాని మనందరి పేర్లతో జతచేసి చెప్పుకొంటారు. సూర్యారావు చెల్లెలు ఇలాగ, జానకి తమ్ముడు అలాగ అంటారు.
    "ముఖ్యంగా అపకీర్తి తెచ్చే మాటలని పెద్దవాళ్ళ పేర్లు మీదుగా చెప్పుకొంటారు -- పిల్లాల్ని తీర్చి దిద్దవలసిన పెద్దల ఆశక్తతే పిల్లల చెడు ప్రవర్తనకి కారణం అన్న అభిప్రాయంతో ." సూర్యారావు అంత వరకు చెప్పి క్షణకాలం శాంత వైపు చూసేడు.
    "ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు, అన్నయ్యా? చెప్పు. నువ్వేం చెయ్యమన్నా చేస్తాను" అన్నాది శాంత.
    "తప్పకుండా చేస్తావా?"
    తల ఊపి ఊరుకోన్నది శాంత.
    "వెంకన్న మామయ్యని పెళ్ళాడతావా?' సూర్యారావు శాంత భుజాల మీద చేతులు వేసి , ఆమె కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించేడు.
    "వెంకన్న మామయ్యానా?" అన్నారు అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా.
    "అవును. అంతకన్న గత్యంతరం లేదు. మనమిచ్చే కట్నాలకి, మన పిల్లకి వచ్చిన మచ్చకి , అంతకన్న మంచి సంబంధం రాదు" అన్నాడు సూర్యారావు నిదానంగా.
    "మంచి సంబంధం రాకపోతే, చదువుకొంటుంది. ఉద్యోగం చేసుకొంటుంది. అంతేకాని.... ' ఆవేశంతో ప్రకాశం అ పై మాటల్ని మింగేశాడు.
    సూర్యారావు తమ్ముడి మాటకు జవాబు చెప్పలేదు. శాంతను ఆ సంబంధానికి ఒప్పించే ప్రయత్నం లో ఉన్నాడు.
    "చూడు, శాంతా! నీ కొచ్చిన మచ్చ మాసిపోవాలంటే, నువ్వు వెంటనే పెళ్ళి చేసుకోవాలి. అత్తింట కాపురం చేసుకుంటున్న ఆడదాని ప్రవర్తన గురించి అట్టే మంది వ్యాఖ్యానించ సాహసించరు. ఎందుకొచ్చిన సోద? దాని కాపురం గంగ పాలైతే ఆ పాపం మనకి చుట్టూ కొంటుందని నెరుస్తారు.
    "ఈ నింద నీ ఒక్కతెతో పోయేది కాదు. నీ అన్నల సంసారాలకి , నీ అక్క జీవితాన్ని, అంతటా అలుముకొని మలినపరుస్తుంది. రేపు మీ వదినకి పిల్లలు పుడితే, వాళ్ళకి తగిన సంబంధాలు రావు. మన పిల్లని చేసుకొందికి , మనింట పిల్లనిచ్చిందికి కూడా అంతా నెరుస్తారు.
    "నా మాట విను. వెంకన్న మామయ్యకి నువ్వంటే ఎంతో అభిమానం. నిన్ను నెత్తిని పెట్టుకొని పూజిస్తాడు. కావలసినంత తిండి, బట్టా, నీ ముద్దు ముచ్చట్లు తీరుతాయి. చిన్నప్పుడు నీక్కూడా అతనంటే అభిమానమే ఉండేది. మనింటి కొచ్చినప్పుడల్లా అతని ఒళ్ళో కూర్చుని, మామయ్యా మీసాలతో జడ అల్లుతానని మెలిపెట్టే దానివి.
    "ఆ మధ్య నిన్నెక్కడో చూసేడుట. 'మా మూడో వాడి ఈడుదే కదూ , శాంత? ఎంత పెద్దదైపోయింది!" అన్నాడు. 'తిరిగి పెళ్ళి చేసుకునే అభిప్రాయం లేకపోయినా, పిల్లల కోసం నాకిది తప్పనట్లుందిరా" అన్నాడు.
    "శాంతనిస్తే చేసుకొంటానని పది రోజుల క్రిందట కబురు పెట్టేడు. ఈ జరిగింది అతని చెవిలో పడినా, నీ మీది అభిమానంతో కాదనడనుకొంటాను. ఏమంటావు? అడిగి చూడనా?" అన్నాడు ఆమె ముఖం పైకెత్తి చూస్తూ.
    రెండు చేతుల్లో ముఖం దాచుకొని బావురు మన్నది శాంత.
    "ఈ పెళ్ళి జరిగిందికి వీలులేదు, అన్నయ్యా" అన్నాడు ప్రకాశం, జానకి ఒక్కసారిగా.
    "అంతకన్న వాడెం చేయగలడే? ముద్దు ముచ్చట్లు తీరేపని చేసిందా నీ చెల్లెలు! ఆ మూడు ముళ్ళు పడి దాని మచ్చ మాసిపోతే చాలదూ?" అన్నది సుందరమ్మ.
    తన బిడ్డను, రెండో పెళ్ళి వాడికి, ఆరుగురు పిల్లల తండ్రికి ఇవ్వడానికి ఆ తల్లి మనసు తపించినా, నలుగురి లో పరువు, మర్యాద నిలవాలంటే , శాంత బతుకు బాగుపడాలంటే అంతకు మించి మార్గం లేదని సమాధాన పడింది.
    "వీల్లెదన్నయ్యా! ఈ పెళ్ళి జరగడం నా కెంత మాత్రం ఇష్టం లేదు. ఏనాడూ మనకు ఉపకరించని పరువు, మర్యాదల కోసం శాంతని అ ముసలాడి కంటగడతావా? మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పరువు మర్యాదలు మనల్ని అదుకోన్నాయ్యా? మనం తిండి లేక మాడినప్పుడు , నువ్వంటున్న నలుగురూ మనకేం చేసేరు? ఈనాడు తగుదునమ్మా అంటూ వస్తే , మన జీవితాల మీద తీర్పు చెప్పే అధికారం వాళ్ళ కెందుకివ్వాలి? ఎవరో ఏదో అంటారని, అనుకుంటారని మన శాంత బ్రతుకు నాశనం చెయ్యకు, అన్నయ్యా.
    "మనం ఎవరి కోసం ఏదీ చెయ్యద్దు. మనకి మంచిదని తోచింది చేద్దాం. ఈపెళ్ళి శాంతకి కాని, మనకి కాని ఏ విధంగాను మంచిని కలుగచెయ్యదు. ఇంక ఆ ఆలోచన వదిలేయి!" అన్నది జానకి ఉద్రేకంగా.
    "ఎవరేమనుకున్నా లక్ష్యం లేకుండా ప్రవర్తిచిందికి నేను మీలా వంటరి వాణ్ణి కాదు, జానకీ! నా భార్య బిడ్డల పరువు , ప్రతిష్టలు నిలిపే భారం నామీద ఉంది. నా ఇల్లు నిష్కళంకంగా ఉంటె కాని నా పిల్లలకి పెళ్ళిళ్ళు కావు. నా ఇంటికి బంధువులు రారు. నా కష్ట సుఖాలలో స్నేహితులు ఆదుకోరు వీరందరినీ ఎదిరించి నిలిచే శక్తి నాకు లేదు.
    "మీరు సంస్కారహృదయం కలవారు. దేనికీ నేరవని ధైర్య స్వభావులు. మీ చెల్లెలి జీవితం తీర్చి దిద్దండి. నా మాట విన్నారు కారనే బాధ నాకు లేదు. నా మాటకి ఏనాడూ మీరు తగిన విలువ ఇయ్యలేదు. మీరూ, నేనూ తూర్పు పడమర దిశలకి ప్రయాణిస్తున్నాం. మనం కలుసుకోడం అసాధ్యం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS