Previous Page Next Page 
మారిన విలువలు పేజి 34

 

    "ముగ్గులకి కూడా ఒక రీతి, రోవాజులున్నాయి, సాంబూ! ఆయా సమయాల్లోనే పెట్టాలి" అనేది తను.
    "ఏ పనిముట్టు లేకుండా, రెండు వేళ్ళ కోసల నుండి ముగ్గు జారవిడుస్తూ ఇంత నేర్పూ చూపుతున్నారు. మీకు గాని రంగులు, కుంచె, కేన్వాసు ఇస్తే. ఎంత చక్కని బొమ్మలు గీయగలిగి ఉండేవారో!" అనేవాడు.
    "ఇటువంటి ముగ్గులు పల్లెటూరి లో పుట్టి పెరిగిన ప్రతి పిల్ల పెట్టగలిగుతుంది . ఇందులో ఏం గోప్పుంది" అనెది తను.
    వీధి లో కొందరి ఇళ్ళ ముందు గొబ్బెమ్మ లు ముగ్గుల మధ్యను గుమ్మడి , బంతి పూలతో చూడ ముచ్చటగా ఉండేవి. ఎన్నోసార్లు శాంతను గొబ్బెమ్మ లు పెట్టి పూజ చేయ్యమనేది తను.
    "ఛీ! పెడ ముద్దకి పూజేమిటి వదినా! అది ముట్టుకొందికే నాకసహ్యం " అనేది శాంత.
    శాంత మొగుడి కోసం గొబ్బెమ్మను ప్రార్ధించలేదు. తనంతట తనే సంపాదించుకొంది. ఆ కుర్రడెవరో శాంతను ఈపాటికి పెళ్ళి చేసుకొనే ఉంటాడు. కులం, మతం అంటూ అన్నగారు, తల్లి అడ్డంకులు పెడతారని ముందుగా తెలియజేసి ఉండదు. ఇంక ఎప్పుడో ఒకనాడు పసుపు బట్టలతో భర్తతో కలిసి దిగబడి , 'అన్నయ్యా! అమ్మా! మమ్మల్ని దీవించండి" అంటుంది.
    ప్రకాశం చెప్పినదాన్ని బట్టి , ఆ కుర్రాడు అందమైన వాడు, డబ్బున్న వాడు అనిపిస్తున్నది. అతడు మాత్రం పెళ్ళి చేసుకోకుండా కన్నె పిల్లను ఎంత కాలం వెంటేసుకు తిరుగుతాడు? అంతా మంచికే అయి ఉంటుంది. తాము మాత్రం శాంతకు అంతకన్న మంచి సంబంధం తేబోయారా? అనుకొంది కనకం.
    అప్పటికి ఆమె ముగ్గులు పూర్తయేయి. చుక్కల పులిగోరు దూరం నుండి చూస్తుంటే సూర్యరధం లాగే ఉంది. పరాకుగా సాంబు కోసం అరుగు వైపు చూసింది. అక్కడ సాంబు లేడు. అతని మాటలు మాత్రం ఆమెకు వినిపిస్తున్నాయి. "ఎంత చక్కగా పెట్టేరు , వదినా! ఎప్పుడూ ఈ ముగ్గే ఎందుకు పెట్టరు?"
    కనకం కళ్ళల్లో నీళ్ళు తిరిగి, కళ్ళు మసగబారేయి. పైట కొంగుతో తుడుచుకొని అరుగు వైపు భ్రాంతి గా చూసింది. అరుగు మూలకు ముడుచుకొని బుర్ర మీదుగా కొంగు కప్పుకొని కూర్చున్నారు ఎవరో? ముందు రోజు రాత్రి ప్రకాశం ఇంటికి రాలేదు. "అప్పన్న కి జ్వరంగా ఉంది. మాణిక్యం వచ్చేవరకూ నేను అప్పన్న దగ్గర ఉండాలి"అన్నాడు.
    మరి అలా మూలకు మూటలా ముడుచుకొని కూర్చున్న దేవరు? భయంతో కనకం కాళ్ళు గడగడ వణికేయి. అంత భయం దేనికో ఆమెకే తెలిసి రాలేదు. ఒక్క ఉదుటున తలుపు తోసుకొని చావిట్లోకి వచ్చింది.
    వదిన ఇంకా ఏమి చేస్తున్నదని చూసేందుకు వస్తున్న జానకి ముఖం మీదికి ధడేల్ మని తలుపు తెరుచుకొంది. చేతిలో ముగ్గు డొక్కు జారవిడిచి జానకిని కౌగలించుకుంది కనకం , బెదురుగా.
    "ఇదేమిటి , వదినా! ఏమైంది?"
    "అరుగు మీద మూలగా ఎవరో కూర్చున్నారు"
    "దానికింత గాభరా ఎందుకు? ఎవరో పరదేశీ అయ్యుంటాడు. లేక ఏ ముష్టి వాడో చలికి వేరిచి ఆ మూల కాస్త వెచ్చగా ఉంటుందని కూర్చొని ఉంటాడు."
    ఈ మాటలంటూనే జానకి వీధిలోకి నడిచింది. అప్పటి కింకా పూర్తిగా తెల్లవారక పోయినా, వెలుగు బాగానే వచ్చింది. దిగజారిన పంచ మూలాన ఆపక్క కాస్త చీకటి గానే ఉంది.
    "ఎవరది?" జానకి ప్రశ్నించింది.
    అటునుండి జవాబు లేదు.
    "మిమ్మల్నే? ఎవరని అడిగితె జవాబు చెప్పరేం?"
    ఈసారి జవాబు లేదు. కాని వెక్కి వెక్కి ఏడుస్తున్న ధ్వని వినిపించింది. అనుమానంతో జానకి అటు వైపు నడిచింది. ఆ వ్యక్తీ స్త్రీ . బుర్ర మీదుగా చీర కొంగు ముసుగు పెట్టుకుంది. అది...ఆ చీర....కనకం తో వంతు కట్టి ప్రకాశం చేత కొనిపించుకున్న గులాబీ రంగు నేత చీర.
    "శాంతా!" తలమీది ముసుగు లాగుతూ పిలిచింది జానకి.
    "అక్కా....అక్కా!' జానకి రెండు కాళ్ళూ కౌగలించుకొన్నది శాంత.
    వీళ్ళ మాటలు విని పైకి వచ్చిన కనకం, "ఎవరూ.... ఎవరు? మన శాంతే....మన శాంతే?" అన్నది సంతోషంగా.
    సుందరమ్మ, సూర్యారావు ముసుగులు దిగతన్ని పక్క మించి ఒక్క ఉదుటున లేచి వచ్చేరు. శాంత జానకి కాళ్ళను వదలకుండా ఏడుస్తున్నది. ఎవరి నోటంటా మాట పెగిలి రాలేదు. అంతలా ఏడుస్తున్న చెల్లెల్ని దండించాలో, ఓదార్చాలో జానకికి అర్ధం కాలేదు. చెయ్యి పట్టుకుని లేవనెత్తి, "లోపలికి రా, శాంతా!" అన్నది నెమ్మదిగా.
    ఇరుగు పొరుగు ల అందరూ పని పాటలకు లేచే వేళ నడి వీధిలో ఎవరే మాటన్నా బాగుండదనుకొంది. అక్క ఆసరా తో శాంత లేచి ముందుకు అడుగు వేసింది. అంతలోనే కాలుకు ముల్లు గుచ్సుకున్నట్లు కాలు వెనక్కు లాగి ఆగిపోయింది. జానకి ముఖం అటు తిప్పి చూసింది. ఎదురుగా గుమ్మంలో అన్నగారు. శాంత కాలును వెనక్కు తోసింది అతని ముఖాకృతి.
    "పద , శాంతా!' చెల్లెల్ని ముందుకు నెట్టింది జానకి.
    "అదేక్కడికి?' సూర్యారావు గుమ్మానికి అడ్డంగా చేతులు పెట్టేడు.
    "శాంతని లోపలికి రానీ, అన్నయ్యా! జరిగిన దేమిటో సావకాశంగా తెలుసుకున్న మీదట, నీ మనసు కేలా తోస్తే అలా చెయ్యి. ఇంట పుట్టిన పిల్లని ఇలా నడి వీధిలో నిలబెట్టి దండించడం నీకు ధర్మం కాదు." అన్నది జానకి అతన్ని బ్రతిమాలుతూ.
    'అది నా పరువు , ప్రతిష్టలని గంగలో కలిపి ఏనాడు గుమ్మం దాటిందో....."
    'అది ఆ పని చేసిందో లేదో కాని, ఇప్పుడు నువ్వు నీ గావు కేకలతో చేసుకొంటున్నావు. ఇరుగు పొరుగులు లేచి చుట్టుముట్టక ,ముందే శాంతని లోపలికి రానీ, అది చెప్పదలచుకున్నదేదో చెప్పనీ. ఆపైన ఏం చెయ్యాలో అంతా కలిసి ఆలోచిద్దాం. ఆ కుర్రాడి గురించి ఏ కొద్ది పాటైనా తెలిసినవాడు ప్రకాశం ఒక్కడే. అప్పటికి వాడు కూడా వస్తాడు.
    "మనిషి వివేకం తోనూ, శాంతం గానూ ఆలోచించవలసిన సమయం ఇది. మనం తీసుకోబోయే నిర్ణయాల పై ఒక పిల్ల భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని తెలిసినప్పుడు, ఆవేశంతో ఏదో అనడం చేయడం మంచిది కాదు, అన్నయ్యా" అన్నాది జానకి నిదానంగా.
    అప్పటికే వీరింటి గుమ్మంలో ఇంతమందిని చూసి, ఎదురిళ్ళ కిటికీ ల్లోంచి చిన్న, పెద్ద ముఖాలు తొంగి చూసేయి. తను వీధిలో నిలబడి ఏ మాట అన్నా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు వినేందుకు తయారవుతూన్నారని సూర్యారావు గ్రహించేడు. నలుగురి కళ్ళలో శాంత పడడం కూడా అతనికి సరిగాదని పించింది.
    "సరే, పదండి. అ ఏడుపేదో ఇంట్లోనే ఏడుద్దాం" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS