Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 34


    "నాన్నగారూ!"
    "ఎక్కడకు పోయినారమ్మా?"
    "గుర్రపుస్వారీకి."
    "ఇంత ప్రొద్దుపోయిందాకా స్వారీ యేమిటి?"
    "వెళ్ళటమే ఆలస్యం అయింది నాన్నగారూ!"
    "నీతో ఒక సంగతి చెప్పాలి తల్లీ!"
    "ఏమిటది?" సరళమయిన స్వరంతో, తండ్రి నోటివెంట ఆ శుభవార్త వినాలన్న ఆశతో అడిగింది మల్లమ్మ.
    "నీకు కల్యాణఘడియలు వచ్చినాయి."
    ఆ మాటకు మల్లమ్మ తలవంచింది.
    "బొబ్బిలినించి గోపాలకృష్ణ రంగారావు కబురు పంపారు."
    "అమ్మ చెప్పింది" వినమ్రంగా నెమ్మది అయిన స్వరంతో అన్నది మల్లమ్మ.
    "సంపదలోనూ, పరాక్రమంలోనూ వారు మనకన్నా అధికులు."
    "మీరు కశింకోటకు ప్రభువులు కాదా?" అన్నది మల్లమ్మ.
    రామరాయుడు గుబురుమీసాల చాటున గుంభనంగా నవ్వుకున్నాడు. మల్లమ్మ పులిపిల్ల బెబ్బులిని పెళ్ళాడబోతున్నది.
    వారి దాంపత్యం చరిత్రాత్మకమే అవుతుందని ఆ క్షణంలో ఆ ధర్మ ప్రభువు హృదయంలో అనిపించింది.
    "ఈ పెళ్ళి నీకు యిష్టమే కదూ!" ఆయన నెమ్మదిగా అడిగారు.
    "ఇష్టమే నాన్నగారూ!" జగ్గమాంబ అక్కకన్నా ముందు తానే కల్పించుకుని తండ్రితోచెప్పింది. రామరాయుడు దంపతులు ఆ దుందుడుకు పిల్ల స్వభావంలో మెరిసిన యీ మెరుపుకి నవ్వుకున్నారు.
    "చెప్పవలసింది నువ్వు కాదేపెంకిపిల్లా" అని ముద్దుగా సవరించ బోయింది తల్లి.
    "అక్కే యిందాక నాకు అంతా చెప్పింది" జగ్గమాంబ జవాబు రవ్వంత సందు దొరికితే యిహ ఆమె నోరు మూతపడదు'
    "అంత తొందరగా వుంటే నువ్వే ముందు చేసుకో! యెలాగూ ఆయనకు ఒక తమ్ముడున్నారు- వెంగళరాయుడు. ఆయనని నువ్వు కట్టుకో బాధ తీరిపోతుంది" అంది తల్లి నవ్వుతూ.
    "ఆయన చేసుకుంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు. అక్కా, నేనూ హాయిగా ఒకేచోట వుండొచ్చు" అని సాగదీసింది జగ్గమాంబ.
    తల్లి కొంగుచాటు చేసుకుని గుక్కపట్టి నవ్వుతోంది. రామరాయుడు గుబురుమీసాల చాటునించి తప్పుకుని వెన్నెల కిరణం తెగిపడిందా అన్నట్లుగా ఒక దరహాసరేఖ దూకింది. చిన్నకూతురు మాటలు విని పరశించాడాయన.
    మల్లమ్మదేవి చెల్లెలి చమత్కారానికి సిగ్గు మర్చిపోయి పకాలున నవ్వింది.
    "నువ్వు నోరుముయ్యవే గడుగ్గాయి" అని తల్లి అదలించింది. అంతటితో జగ్గమాంబ నోరు మూతపడింది.
    "చెప్పు తల్లీ! యీ పెళ్ళి నీకు యిష్టమేనా?" అని మల్లమ్మ వంక చూచి అడిగాడు రామరాయుడు.
    "వారి మంచిచెడులు మీకేకదా తెలిశాయి" అంది మల్లమ్మ.
    "నాకు తెలిసినంతవరకూ వారితో వియ్యమందటం నా అదృష్టం అనుకుంటున్నాను" అని తండ్రి సమాధానం యిచ్చాడు.
    "వారు చాల దుందుడుకు వీరులని విన్నాను?" అని అడిగింది ఆమె.
    "అవునమ్మా! బొబ్బిలిలో అందరూ బెబ్బులులే" అని చెప్పాడు తండ్రి. ఆమె ప్రశ్న వెనుకవున్న అనుమానాల్ని తల్లికాని, తండ్రికాని పట్టించుకోలేదు.
    దుందుడుకు వీరులంటే ప్రమాదాలు తెచ్చిపెట్టుకునేవారనే కదా అర్ధం! ఆ అర్ధాన్ని వాచ్యం చెయ్యటానికి వీలుకాని సందర్భం అది. శుభకార్యం గురించి జరుగుతున్న సంభాషణ. కన్య కాబట్టి తాను యిక ఆ విషయాన్ని యెక్కువగా మాట్లాడకూడదు. అదీకాక మానవజీవితమే ప్రమాదాల పుట్ట. ప్రమాదం లేనిదీ యెక్కడ? అని ఆలోచించింది మల్లమ్మ.
    తల్లిదండ్రులు ఆమె మాటల వెనుక అర్ధాన్ని పట్టించుకోలేదు.
    "అటువంటి సాహసవంతులయిన ప్రజలకు పరిపాలకురాలు కావటం నా అదృష్టమే కదా నాన్నగారూ!" అని సమాధానం యిచ్చింది మల్లమ్మ.
    ఆ మాటకోసం యెదురుచూస్తున్న తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు జగ్గమాంబ అక్కను కావిలించుకుని ముద్దు పెట్టుకుంది వుత్సాహంతో.
    
                             9
    
    బొబ్బిలి రంగారావుగారితో మల్లమ్మదేవి పెళ్ళి నిశ్చయం అయింది. లగ్న నిశ్చయానికి దామెర్ల ధర్మారాయుడు, యినుగంటి నరసారాయుడు మహామంత్రి వచ్చారు. ధర్మారాయుడు గోపాలకృష్ణరంగారావుగారికి వరుసకు మామ అవుతాడు. యినుగంటి నరసారాయుడు కత్తి పట్టటం లోనూ, యీటె విసరటంలోనూ మొనగాడు. సేనాపతి, మహామంత్రి.
    ఆ యిద్దరూ వచ్చారు లగ్ననిశ్చయం చేసుకుపోవటానికి రామ రాయుడు వారిని సాదరపూర్వకంగా ఆహ్వానించి తీసుకువచ్చి అంతరంగిక కార్యాలయంలో కూర్చోపెట్టారు. రాచమర్యాదలు జరిగినాయి.
    "అన్నగారూ బొబ్బిలివీరులతో వియ్యమందే అవకాశం రావటం నా అదృష్టం. ఆడ సంతానం కలిగినందుకు నా జీవితం ధన్యమయింది అనుకుంటున్నాను" అన్నారు రామరాయుడు.
    "అన్నయ్యగారూ! మీకు ధర్మప్రభువు అనేపేరు సార్ధకమయింది బొబ్బిలివీర కిశోరాలు కశింకోట ప్రభువుల యింటి ఆడపడుచుల్ని పెళ్ళాడటం అపూర్వమయిన సంఘటన యేమీకాదు. మనసంతా వెంకటగిరి నించి తరలివచ్చిన పద్మనాయక సాంప్రదాయంలోని వాళ్ళమేగా" అన్నాడు ధర్మారాయుడు పాతచుట్టరికం తిరుగవేస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS