ఎక్కడ ......విమల్ .......జాడ లేదు.
* * * *
మహాబలిపురం ప్రశాంతంగా వుంది. బీచ్ కి దూరంగా ఏదో పాడుబడిన దేవాలయం.
శతాబ్దాల తరబడి సముద్రపు నీటి దాటికి కరుగుతూ , కరుగుతూ దేవాలయం ముందున్న రాతిరధం , నేడో, రేపో సముద్రంలో కలిసిపోడానికి సిద్దంగా వుంది.
ఆ రాతి రధం ప్రక్కనే నించుని సముద్రపు అలలవేపు చూస్తున్నాడు విమల్.
అప్పుడు సమయం సాయంత్రం నాలుగంటలైంది.
పడమర సూర్యుని కిరణాలు, నెమ్మది నెమ్మదిగా పల్చబడుతున్నాయి. అక్కడకు దూరంగా రోడ్డు పక్క చెట్టు కింద సిల్వర్ కలర్ 1000 మారుతీ కారు.
నిన్నరాత్రి సరిగ్గా తొమ్మిది గంటలకు ఆ ప్రాంతానికి వచ్చేసాడు విమల్.
అక్కడెండుకొచ్చాడో తెలీదు. అక్కడకు ఎలా వచ్చాడో తెలీదు.
సుజన్ మిత్ర, మాధురీల దగ్గర్నుంచి కోపంగా బయటికొచ్చిన విమల్ నేరుగా ఓ బార్లో కెళ్ళాడు.
ఓ నలబై నిమిషాల సేపు అక్కడ గడిపాడు. తర్వాత మళ్ళీ కారెక్కాడు.
తను ఎటు వెళుతూన్నాడో తెలీని స్థితిలో అక్కడకొచ్చాడు.
ఏకాంతంగా -----
సముద్రంలో మూడు గంటల సేపు ఈత కొట్టాడు.
బట్టలేసుకున్నాక, అక్కడ కూర్చున్నాడు.
ఇప్పుడతను సినిమా హీరో విమల్ లా లేడు.
రోడ్డు రోమియో లా , ఓ హిప్సిలా వున్నాడు.
అంతులేని ఆలోచనలు......ఆ ఆలోచనల మధ్య కృష్ణనందన .......
* * * *
కృష్ణ నందన , విమల్ నటించిన మొట్టమొదటి సినిమా రిలిజైంది. బ్రహ్మాండమైన సక్సెస్ -సూపర్ హిట్!
ఆ సక్సెస్ కు కారణం కృష్ణ నందనే!
ఆ సినిమాలో హీరో విమలే అయినప్పటికీ కదాపరంగా కృష్ణ నందన నటించిన సీన్లే ఎక్కువ -
లీడీ ఓరియంటెడ్ స్టోరీ ------
ఆ సినిమా వందరోజులు ఫంక్షన్ నాడు ---
ఆ ఫంక్షన్ ని చాలా వెరైటీగా , ఆర్గనైజ్ చేసారు నిర్మాతలు.
ఆ సినిమా మొట్టమొదటి షాట్ ని, తలకోనలో మొదట షూట్ చేసారు.
అదే ప్రాంతంలో ఫంక్షన్ ని కూడా ఏర్పాటు చేసారు.
ఫంక్షన్ అతిరధ మహారధుల సారధ్యంలో , అత్యద్భుతంగా జరిగింది.
ఆ ఫంక్షన్ అయిపోయాక -
నిర్మాత, దర్శకుడు తదితరులంతా అక్కడ నుంచి ప్రయాణమై పోయారు.
ఒక్క విమల్ తప్ప.
మొట్టమొదటిసారి షూటింగు కి వచ్చినప్పుడే , ఆ ప్రాంతం చాల ఆకర్షించించింది విమల్ ని.
అక్కడ ఓ రోజు రాత్రి, ఎప్పుడైనా గడపాలని విమల్ అనుకున్నాడు.
రాత్రి తొమ్మిది గంటలైంది.
నెరబైలు నుంచి అడవి వేపు వెళుతున్నాడు విమల్.
వెన్నెల .......
మల్లెపూల జల్లులా వుంది.
దూరంగా ఓ ఏరు, ఏటి మీద నుంచి వస్తున్న చల్లటి గాలి, అక్కడున్న విశాలమైన పచ్చిక ప్రదేశంలో కూలబడ్డాడు.
గాలి సవ్వడితో పాటు తనూ ఎలుగెత్తి అరిచాడు. ఆ అరుపు కొండ కోనల్లో సుడులు తిరిగి అతని దగ్గరికే రావడం, ఎంతో ఆనందంగా వుంది. నోటికొచ్చిన పాటలు పాడుతున్నాడు. ఆ ప్రకృతిలో , ఆ ఏకాంతంలో అక్కడలా కూర్చోవడం, అతనికి చనిపోయిన తల్లి దగ్గర కూర్చున్నట్టుగా వుంది.
తనని సిన్మా ఆర్టిస్ట్ లా చూడాలనుకుని, చివరి నిమిషం వరకూ అదే కోరికతోనే తపించి, తపించి వెళ్ళిపోయిన తల్లి.
తల్లి చనిపోవడం,తల్లి అనుభూతులు తల్లి లాలన, తల్లి ప్రేమ అంతా జ్ఞాపకం రావడంతో విమల్ కళ్ళంట కన్నీళ్లు బికాయి.
అతనిలో ఏదో తెలీని, ఉద్వేగం, మనసంతా నిండిపోయిన ఏదో అసంతృప్తి.
"అమ్మా......" గట్టిగా , గట్టిగా అరిచేసాడు. అది అరుపులా లేదు. ఏదో పిలుపులా వుంది.
ఆ మమత పిలుపును మోసుకుని ఏటి కెరటాలు నెమ్మదిగా అవతలి ఒడ్డుకి కదులుతున్నాయి.
వెన్నెల వెండి మెరుపులతో మెరుస్తున్న ఏటి వేపు అలా ఎంతసేపు కూర్చుని చూస్తున్నాడో తెలీదు.
ఏదో అడుగుల చప్పుడికి తలతిప్పి చూసాడు.
మసక, మసక వెన్నెల చీకటిలో అస్పష్టంగా ఓ ఆకారం.
"విమల్ మీరా."
అప్పుడక్కడ , అలా అకస్మాత్తుగా , అప్సరసలా, నిలిచిన కృష్ణనందనను చూసి ఆశ్చర్యపోయాడు విమల్.
"మీరు మద్రాసు వెళ్ళిపోలేదా" పక్కన కొంచెం దూరంలో కూర్చుంటూ అడిగింది కృష్ణ నందన.
"లేదు- ప్రశాంతంగా ఈ రాత్రి ఇక్కడ గడుపు దామని చెప్పి, మీరెందు కెళ్ళలేదు" ఎదురు ప్రశ్న వేసాడు విమల్.
"నా కారు చెడిపోయింది. అప్పటికే అందరూ వెళ్ళిపోయారు. ఆగిపోక తప్పింది కాదు. తెల్సిన వాళ్ళింట్లో సూట్ కేస్ పడేసి, ఇటువేపు వచ్చాను. దూరం నుంచి ఇక్కడెవరో ఉన్నట్టనిపించింది. మీరనుకోలేదు చెప్పింది కృష్ణ నందన.
"ఈ రాత్రికి మీరిక్కడ ఉంటానంటే నేనూ ఉండిపోయే దాన్ని - ముందు చెప్పేరు కాదేం" మళ్ళీ ప్రశ్నించింది కృష్ణ నందన.
